హైకే పీతల
విషయంలో గాని, పెంపుడు కుక్క, పాడియావు,
పొడవాటి
జొన్నపొత్తుల విషయంలో గాని, కృత్రిమ ఎంపికలోని
మూల రహస్యం ఇది – భౌతిక లక్షణాలేకాక, ప్రవృత్తికి చెందిన ఎన్నో లక్షణాలు కూడా మొక్కలలోను, జంతువులలోను తదుపరి తరాలకి సంక్రమిస్తాయి. కారణం ఏదైతేనేం, కొన్ని జాతుల
పునరుత్పత్తిని మనుషులు సమర్ధిస్తారు, కొన్నిటిని సమర్ధించరు. మనం ఎంపిక చేసిన లక్షణం ప్రత్యేకంగా పునరుత్పత్తి చెంది, వృద్ధి చెందుతుంది. ఏ లక్షణాన్నయితే ఎంపిక
చేసుకోమో అది క్రమంగా క్షీణించి అంతరించిపోతుంది.
మరి మనుషులే
కొత్త వృక్ష, జంతు జాతులని
సృష్టించగలిగినప్పుడు ఆ మహత్యం ఏదో
ప్రకృతి కూడా సాధించలేదా? ఆ ప్రక్రియనే సహజ
ఎంపిక అంటారు. మనుషులు భూమి
మీద నడిచిన స్వల్ప కాలంలోనే వచ్చిన మార్పుల బట్టి, శిలాజాల సాక్ష్యాధారాల
బట్టి భూమి మీద జీవన స్థితులు యుగయుగాలుగా గణనీయంగా మారుతూ వచ్చాయని స్పష్టంగా తెలుస్తోంది. ఒకప్పుడు అధిక సంఖ్యలో పుడమి మీద పెచ్చరిల్లిన జాతులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని శిలాజాలు సాక్ష్యం చెబుతున్నాయి.[1] ఇప్పుడు భూమి మీద మిగిలిన జాతుల కన్నా నాశనమైన జాతుల సంఖ్యే ఎక్కువ. పరిణామం చేసిన
దుడుకు ప్రయోగాలకి అవి ఆహుతి అయిపోయాయి.
సాంసారీకరణ (domestication, పెంపకం అనే
ప్రక్రియ) వల్ల ఏర్పడ్డ
జన్యు మార్పులు చాలా వేగంగా జరిగిపోయాయి. మధ్య యుగాల నాటి వరకు కుందేళ్ల పెంపకం ఆరంభం కాలేదు. (వాటిని ఫ్రెంచ్ క్రైస్తవ సాధువులు సాకేవారు. దాని వెనుక
ఒక విచిత్రమైన మతవిశ్వాసం వుంది. అప్పుడే పుట్టిన
కుందేటి కూనలు నిజానికి చేపలకి మారురూపాలని, మిగతా రకాల మాంసాహారంలో ఉండే నిషేధం ఆ కూనల ఆరంగిపులో
ఉండదని, ముఖ్యంగా కొన్ని
ప్రత్యేక పర్వదినాలలో వాటిని నిస్సంకోచంగా విందులో కలుపుకోవచ్చని వాళ్లు నమ్మేవాళ్లు.) అలాగే కాఫీ గింజల పెంపకం పదిహేనవ శతాబ్దంలో మొదలయ్యింది. చక్కెర దుంపల (sugar beet) పెంపకం
పందొమ్మిదవ శతాబ్దంలో మొదలయ్యింది. ఇక మింక్ జంతువు ఇప్పటికీ దాని ప్రప్రథమ సాంసారీకరణ దశలోనే వుంది. సాంసారీకరణ ప్రభావం
వల్ల కేవలం పదివేల ఏళ్ల కన్నా తక్కువ కాలంలోనే ఒక గొర్రె నుండి వచ్చే ఉన్ని మోతాదు ఒక కిలో కరకు జుట్టు నుండి ఇరవై కిలోల మెత్తని, వెచ్చని బొచ్చు
స్థాయికి పెరిగింది. అలాగే ఆవులు
ఇచ్చే పాల మోతాదు కొన్ని వందల ఘన సెంటీమీటర్ల నుండి కొన్ని మిలియన్ల ఘన సెంటీమీటర్ల స్థాయికి పెరిగింది. కృత్రిమ ఎంపిక
వల్లనే అంత తక్కువ కాలంలో అన్ని మార్పులు సాధ్యమైనప్పుడు, కొన్ని బిలియన్ల సంవత్సరాల పాటు పాటుపడ్డ ప్రకృతి ఎంపిక వల్ల మరెన్ని పరిణామాలు సాధ్యమవుతాయో? జీవప్రపంచంలో నేడు సర్వత్ర మనకి దర్శనమిచ్చే అలౌకిక సౌందర్యం, వైవిధ్యం – ఇవే
అందుకు అద్భుత నిదర్శనాలు. పరిణామం పచ్చి వాస్తవం, వట్టి వేదంతం
కాదు.
సహజ ఎంపికే
పరిణామ యంత్రాంగాన్ని నడిపిస్తోంది అనే మహత్తర సిద్ధాంతానికి ఇద్దరు మహనీయుల పేర్లు జోడిస్తారు. వాళ్లు చార్లెస్ డార్విన్, ఆల్ఫ్రెడ్ రసెల్
వాలెస్.
శతాబ్ద కాలం
క్రితమే వాళ్లు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ప్రకృతి గొప్ప సృజనాత్మక శక్తి గలదని, అతులిత వైవిధ్యం
గల వృక్ష జంతు జాతుల సృజన ఆమె ప్రవృత్తి అని, అయితే
సృజించబడ్డ జీవాల కన్నా సమసిపోయే జీవాల సంఖ్య ఎక్కువని, కాబట్టి పరిసరాలకి
తట్టుకోగల జీవాలే యాదృచ్ఛికంగా ఎంపిక అవుతాయని, అవే మన్నుతాయని
ఆ సిద్ధాంతం చెప్తుంది. ఉత్పరివర్తనల (mutations) వల్ల అనువంశికతలో ఆకస్మిక మార్పులు వస్తాయి. ఆ మార్పులే
తరువాతి తరాలకి సంక్రమిస్తాయి. అలా ఏర్పడ్డ వైవిధ్యమే పరిణామానికి ముడిసరుకు అవుతుంది. మనుగడకి పనికొచ్చే
ఉత్పరివర్తనలని మాత్రం పరిసరాలు ఎంపిక చేస్తాయి. పనికిరాని ఉత్తుత్తి
పరివర్తనలని త్రోసిపుచ్చుతాయి. ఆ విధంగా అతినెమ్మదిగా
ఒక జీవరాశి మరో జీవరాశిగా పరిణతి చెందుతుంది[2]. జీవావిర్భావం జరుగుతుంది.
జీవావిర్భావం (The Origin of Species) అనే
గ్రంథంలో స్వయంగా డార్విన్ మాటలనే విందాం:
“వైవిధ్యాన్ని సృష్టించేది మనిషి
కాదు. అతడు కేవలం
అనాలోచితంగా కొత్త జీవనపరిస్థితులలోకి జంతువులని ప్రవేశపెడతాడు. అప్పుడు ఆ జీవాల నిర్మాణ
కార్యాన్ని ప్రకృతే చేపట్టి వాటిలో వైవిధ్యాన్ని కలుగజేస్తుంది. కాని ప్రకృతి తనకి అందించిన వైవిధ్యం నుండి మనిషి తనకి నచ్చినవి ఎంపిక చేసుకోగలడు, చేసుకుంటాడు కూడా. అలా ఎంచుకున్న
లక్షణాలని తనకి నచ్చిన తీరులో పోగుచేసుకోగలడు. ఆ విధంగా జంతువులని, మొక్కలని తన స్వలాభానికి, సుఖానికి తగినట్టుగా మలచుకుంటాడు. ఈ మార్పుని అతడు
శాస్త్రోక్తంగా సాధించవచ్చు. లేదా జీవలక్షణాలు మార్చాలనే ఉద్దేశం ప్రత్యేకించి లేకపోయినా, ఆ సమయంలో
తనకి అనువైన లక్షణాలని పదిలపరచుకునే ప్రయత్నంలో అనాలోచితంగా కూడా అలాంటి మార్పులు సాధించవచ్చు. సాంసారీకరణ వల్ల జీవరాశులు ఎలా మారుతాయో తెలిపే ధర్మాలు, ప్రకృతిలో సహజంగా
జరిగే మార్పులని కూడా వర్ణించగలవని అనుకోడానికి అభ్యంతరం ఏమీ లేదు… మనగల జీవాల
కన్నా మరిన్ని జీవాలు పుడతాయి… ఏ యుగంలోనైనా, ఏ ఋతువులో నైనా
ఒక జీవంలో, అది పోటీపడే
ఇతర జీవాల కన్నా మంచి, సత్ప్రయోజనం కలిగించే
లక్షణామేదైనా ఉంటే,
ఆ లక్షణం బాహ్యపరిసరాలకి మరింత సులభంగా, సమర్ధవంతంగా ఆ జీవం అలవాటుపడగలిగేలా
చేస్తే, పరిణామపు త్రాసు
ఆ జీవం వైపే
మొగ్గు చూపుతుంది.
(ఇంకా వుంది)
[1] అయితే పాశ్చాత్య ప్రపంచంలో మతపరమైన అభిప్రాయాలు
అందుకు భిన్నంగా ఉన్నాయి. ఉదాహరణకి 1770 లో జాన్ వెల్సీ ఏవంటున్నాడో చూద్దాం – “అత్యల్పమైన
జీవజాతులని కూడా పూర్తిగా నాశనం చేసే హక్కు చావుకి లేదు.”
[2] మాయన్ల పవిత్ర గ్రంథమైన పోపోల్ వూహ్
(Popol Vuh) ప్రకటించబడ్డ భావన ఆసక్తికరంగా ఉంటుంది. ప్రయోగాత్మక బుద్ధి గల దేవతలు,
మనుషులని తయారు చెయ్యబోయి, ఆ ప్రయత్నంలో విఫలమై, తక్కిన జీవజాతులని తయారు చేశారు అంటుందా
పుస్తకం. తొలి ప్రయత్నాలు లక్ష్యానికి మరీ దూరంగా పోవడం వల్ల కింది జాతి జంతువులు ఏర్పడ్డాయి.
ఆఖరు ప్రయత్నానికి ముందు ప్రయత్నం కొద్దిగా తప్పింది. అలా కోతులు పుట్టాయి. ఒక చైనీజ్
పురాణ కథ ప్రకారం పా’ న్ కు అనే దేవత ఒంటి మీద పేల లోంచి మనిషి పుట్టాడు. పద్దెమినిదవ
శతాబ్దంలో ద బఫన్ అనే శాస్త్రవేత్త మత గ్రంథాలలో చెప్పిన దాని కన్నా భూమి చాలా పురాతనమైనదని
ప్రతిపాదించాడు. కొన్ని లక్షల సంవత్సరాలుగా జీవజాతులు మారుతూ వస్తున్నాయన్నాడు. కాని
నరుడి నుండి వానరులు పుట్టాయన్నాడు. ఈ భావనలు డార్విన్, వాలస్ లు వర్ణించిన పరిణామ
ప్రక్రియకి కచ్చితంగా అద్దం పట్టకపోయినా, ఆ దిశనే సూచిస్తున్నాయి. డెమాక్రిటస్, ఎంపిడోకిలిస్
తదితర అయోనియన్ శాస్త్రవేత్తల భావాలు కూడా ఆ దిశలోనే ఉన్నాయి. ఆ సంగతులన్నీ అధ్యాయం
7 లో చర్చిద్దాం.
0 comments