పందొమ్మిదవ శతాబ్దంలో
పరిణామ సిద్ధాంతం పట్ల వకాలతా పుచ్చుకుని, ఆ సిద్ధాంతాన్ని విస్తృతంగా
ప్రచారం చేసినవారిలో ముఖ్యుడు టి.హెచ్. హక్స్లే. డార్విన్, వాలెస్
ల పరిణామ సిద్ధాంతం
గురించి అతడు ఇలా అంటాడు – “అదొక కాంతిప్రభంజనం… చీకట్లో దారి తప్పిన వ్యక్తికి అది ఉన్నట్లుండి దారి చూపిస్తుంది. ఆ దారి ఆ
వ్యక్తిని ఇంటి దాకా తీసుకుపోయినా లేకున్నా, కనీసం ఆ
దిశలో తీసుకుపోతుంది…. ‘జీవావిర్భావం’ (The Origin of Species) లోని మూల భావనని ఆకళింపు చేసుకుని, దాని గురించి
ధ్యానిస్తున్నప్పుడు - ‘ఎంత
మూర్ఖుణ్ణి కాకపోతే నాకే ఆ ఆలోచన ఎందుకు
తట్టలేదబ్బా?’ అన్న ఆలోచన నాలో మెదిలింది. కొలంబస్ అనుయాయులకి
కూడా సరిగ్గా అలాంటి ఆలోచనలే కలిగాయేమో… జీవ వైవిధ్యం, మనుగడ కోసం ప్రయాస, పరిసరాల అనుసారం
పరివర్తన చెందడం మొదలైన భావనలన్నీ బాగా తెలిసిన విషయాలే. కాని ఆ
భావాల ద్వారానే జీవం యొక్క జన్మరహస్యం వద్దకి తీసుకుపోయే మార్గం ప్రయాణిస్తుందని డార్విన్, వాలెస్ లు
తమ సిద్ధాంతాలతో చీకట్లు పారద్రోలినంత వరకు తెలిసి రాలేదు.”
పరిణామం, ప్రకృతి
ఎంపిక మొదలైన భావనలని చూసి ఏవగించుకున్నవారు లేకపోలేరు. అలాంటి వారు
ఇప్పటికీ ఉన్నారు. మన పూర్వీకులు
భూమి మీద జీవకళ చూసి అబ్బురపడ్డారు. జీవరాశుల క్రియలకి వాటి శరీర నిర్మాణానికి మధ్య అందమైన పొందిక చూసి ఆశ్చర్యపోయారు. సృష్టికర్త ఉన్నాడనడానికి
అవన్నీ ఋజువులు అన్నారు. అత్యంత అధునాతనమైన
పాకెట్ వాచీ కన్నా అత్యంత ప్రాథమికమైన ఏకకణజీవి మరింత సంక్లిష్టంగా ఉంటుంది. ఆ పోలిక
అక్కడితో ఆగదు. పాకెట్ వాచీ
దానికది తయారు కాదు. మరొకరు పూనుకుని
దాన్ని కూర్చాలి. పాకెట్ వాచీలు
వాటంతకవి క్రమక్రమంగా, దశలుదశలుగా వికాసం చెందవు. తాతల నాటి
గోడగడియారాల నుండి అధునాతన గడియారాలు పరిణామం చేత వాటంతకవి పుట్టుకురావు. వాటిని
ఎవరో చెయ్యాలి. గడియారాన్ని నిర్మించడానికి
ఒక గడియారకారుడు ఉండాలి. భూమి మీద
అణువణువునా తారసిల్లే అద్భుత సంక్లిష్టతతో, అతిసూక్ష్మ యంత్రాంగంతో కూడుకున్న జీవరాశులలోని అణువులు, పరమాణువులు వాటంతకవి
ఒక దగ్గరికి జేరి అలాంటి అలాంటి జీవరాశులుగా ఎలా ఏర్పడతాయో ఊహించుకోవడం కష్టం. కాబట్టి ప్రతీ
జీవరాశిని ప్రత్యేకంగా ఎవడో సృష్టి కర్త సృష్టించి ఉండాలి. జీవరాశులు ఒక
దాని నుండి మరొకటి వికాసం చెందలేవు. జీవచరిత్ర గురించి
పరిమిత అవగాహన గల మన పూర్వీకులకి ఇలాంటి ఆలోచనా పంథా చాలా సహజంగా తోచింది.
సృష్టి చేస్తున్న సృష్టి కర్త (ఊహాచిత్రం :-)
జీవప్రపంచంలో ప్రతీ
రాశిని ఒక మహత్తర సృష్టి కర్త ప్రత్యేక శ్రద్ధతో వేరువేరుగా సృష్టించాడన్న భావన వల్ల ప్రకృతికి ఒక కొత్త ప్రత్యేకత అలవడింది. విశ్వంలో మనిషికి
ఒక ప్రత్యేక స్థానం ఉన్నట్టు అనిపించింది. విశ్వంలో ఓ సుస్థిర స్థానం
కోసం పరితపించే మానవ మేధకి అలాంటి చింతన ఎంతో నచ్చింది. జీవ ప్రపంచం
యొక్క ఆవిర్భావ రహస్యం ఏమిటి? అన్న సమస్యకి ‘సృష్టికర్త’ అనే సమాధానం చాలా సహజంగా, సముచితంగా, ఎంతో
మానవీయంగా తోచింది. కాని డార్విన్, వాలెస్ లు ఓ కొత్త దారి
చూపించారు. అది కూడా
మానవీయమైనదే. పైగా అంతకన్నా మరెంతో నమ్మశక్యమైనది. ఆ సిద్ధాంతపు వీనులతో
వింటే యుగయుగాలుగా వినిపిస్తున్న జీవనసంగీతం సుమధురంగా, సుశ్రావ్యంగా వినిపిస్తుంది.
శిలాజాలు చెప్పే
సాక్ష్యాలు కూడా కొంతవరకు సృష్టికర్త అనే భావనని సమర్ధిస్తున్నట్టుగా ఉన్నాయి. బహుశా సృష్టికర్తకి
నచ్చకపోవడం వల్ల కొన్ని జీవరాశులు నాశనమై ఉండొచ్చు. వాటి స్థానంలో
కొత్త జీవాలు ప్రతిష్ఠించబడి ఉండొచ్చు. కాని ఈ
భావన కొంచెం ఇబ్బందికరంగా తోచుతుంది. ప్రతీ మొక్క, మెకం ప్రత్యేకంగా రూపొందించబడింది. మరి
ఆ సృష్టికర్త అసమాన
సమర్ధత గలవాడే అయితే మొదటి సారే దోషం లేని, అద్భుత వైవిధ్యంతో
కూడిన సృష్టి చేసి వుండొచ్చు కదా? కాని
శిలాజాల సాక్ష్యాలు పరిశీలిస్తే ‘చేసి చూద్దాం, దోషం ఉంటే
వచ్చేసారి సరిదిద్దుకుందాం’ అనే ధోరణే కనిపిస్తుంది. భవిష్యత్తుని ఊహించలేని అశక్తత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సర్వజ్ఞుడైన, సర్వశక్తిమంతుడైన సృష్టికర్తకి భవిష్యత్తు తెలియకపోవడం ఏమిటి? భావి అవసరాలకి
తగ్గట్టుగా సమర్ధవంతమైన సృష్టి చెయ్యలేకపోవడం ఏమిటి?
1950ల తొలిదశలలో నేను
బి.యస్.సి చదువుకునే రోజుల్లో హెచ్. జె.
ముల్లర్ యొక్క ప్రయోగశాలలో పనిచేసే అదృష్టం కలిగింది. ఈ ముల్లర్
సాటిలేని జన్యుశాస్త్రవేత్త. వికిరణాల వల్ల ఉత్పరివర్తనలు కలుగుతాయని కనుక్కున్నవాడు. కృత్రిమ ఎంపికకి ఉదాహరణగా హైకీ పీతల కథ గురించి నేను మొట్టమొదట ముల్లర్ నుండే తెలుసుకున్నాను. జన్యుశాస్త్రంలో ఆచరణాత్మక అంశాల గురించి నేర్చుకోవాలని మొదట డ్రోసోఫైలా మెలనోగాస్టర్ అనే ఒక రకం ఈగతో పని చెయ్యడం మొదలెట్టాను. రెండు రెక్కలు, ఇంతేసి కళ్లు
ఉండే చిన్న నల్లని జీవాలివి. చిన్న ఖాళీ
పాలసీసాలలో వాటిని భద్రపరిచేవాళ్ళం. రెండు రకాల ఈగల మధ్య సంపర్కం జరిపించి, జనక జన్యువుల
మిశ్రమం వల్ల ఎలాంటి కొత్త లక్షణాలు పుడతాయో చూడడం మా పని. సీసాలలో
ఉంచబడ్డ ఒక రకమైన బెల్లపు గడ్డల మీద ఆడ ఈగలు గుడ్లు పెట్టేవి. రెండు వారాలు
ఆగితే ఫలదీకృత గుడ్లు లార్వా లుగా మారుతాయి. లార్వేలు ప్యూపేలుగా
మారుతాయు.
ప్యూపేల
నుండి కొత్త ఈగలు పుట్టుకొచ్చి గాల్లోకి ఎగురుతాయి.
(ఇంకా వుంది)
0 comments