1589 లో
కెప్లర్ మాల్ బ్రాన్ వదిలి ట్యూబింగెన్ నగరానికి వెళ్లాడు. అంతేవాసిగా శిక్షణ
పొందడానికి అక్కడ ఉన్న ఓ పేరుమోసిన విశ్వవిద్యాలయంలో
విద్యార్థిగా చేరాడు. ఆ విశ్వవిద్యాలయంలో
గొప్ప మేధోసంపత్తి గల ఆచార్యులు పని చేసేవారు. కెప్లర్ ప్రతిభని
అక్కడి గురువులు త్వరలోనే గుర్తించారు. వారిలో ఒకరు కెప్లర్ కి కోపర్నికస్ బోధనలలోని మూల రహస్యాలన్నీ పరిచయం చేశాడు. కెప్లర్ నమ్మిన
మూల అధ్యాత్మిక భావాలకి, ఇప్పుడు కొత్తగా
నేర్చుకున్న సూర్యసిద్ధాంతానికి మధ్య చక్కగా పొత్తు కుదిరింది. అతడి దృష్టిలో
సూర్యుడు భగవంతుడి ప్రతిరూపం. కాబట్టి విశ్వమంతా
సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. అంతేవాసిగా కెప్లర్ శిక్షణ
పూర్తయ్యింది. తీరా చర్చిలో ప్రవచకుడిగా ఉద్యోగంలో చేరే చివరి క్షణంలో, పూర్తిగా ఐహిక
ప్రపంచానికి సంబంధించిన మరో ఉద్యోగం చేతికి చిక్కింది. జీవితాంతం అర్చక
వృత్తి తనకి కుదరదని అనుకున్నాడో ఏమో. ఆస్ట్రియాలోని
గ్రాజ్ నగరంలో ఒక బళ్లో లెక్కల టీచరుగా చేరాడు. ఖగోళ పట్టికలు
తయారు చెయ్యడంతో పాటు, జాతక చక్రాలు
వేస్తూ పొట్టపోసుకోవడం మొదలెట్టాడు. దాని గురించే ఒక చోట ఇలా రాసుకున్నాడు. “దేవుడు ప్రతి ఒక్కడికి భుక్తి కోసం ఏదో ఏర్పాటు చేస్తాడు. ఖగోళశాస్త్రవేత్తలు జోస్యం చెప్పుకు
బతకాలని ఆయన ఉద్దేశం.”
కెప్లర్
గొప్ప మేధావి, మహా రచయిత
అనడంలో సందేహం లేదు. కాని బళ్లో
పాఠం చెప్పడంలో మాత్రం ఘోరంగా విఫలం అయ్యేవాడు. పాఠం చెప్పమంటే
నీళ్లు నమిలేవాడు. చెప్పాల్సిన పాఠం
చెప్పక మధ్యలో ఏదో తత్వాలు బోధించేవాడు. ఏం చెయ్యాలో తోచక “దీని భావమేమి?” అని బాలలు తలలు పట్టుకునేవారు. అసలు గ్రాజ్ లోని మొదటి సంవత్సరమే కెప్లర్ పాఠం చెప్పిన తరగతులు కాస్త పలచగా ఉండేవి. రెండవ సంవత్సరానికే
క్లాసులు ఖాళీ అయ్యాయి. దానికి కారణం
ఒక పక్క పాఠం నడుస్తున్నా మనసు తరగతి గదిలో ఉండదు. ఏ అనామక
వినువీధుల్లోనో హద్దుల్లేకుండా విహరిస్తూ ఉంటుంది. తారల గతుల
తీరుతెన్నులు శోధిస్తుంటుంది. అలాగే ఓ రోజు ఎప్పట్లాగే
పలచని తరగతిలో గొంతు తడారిపోయేలా ఉపన్యసిస్తూ ఉంటే మదిలో ఏదో తళుక్కుమంది. ఓ
అద్భుత భావన ఉదయభానుడిలా ఎద కనుమల మీద కాంతులు కురిపించింది. నోట్లోని పాఠం నోట్లోనే నిలిచిపోయిందేమో. ఎప్పుడు ఇంటికి పోదామా అని ఎదురుచూసే శిష్యగణం సమయం మించేలోగా సంచులు సర్దుకుని చకచకా బయటికి నడిచి వుంటారు. కెప్లర్ మనసులో
ఆ క్షణం మెదిలిన
ఆలోచన ఖగోళశాస్త్ర చరిత్రలోనే ఓ మైలు రాయి
అని ఆ శిష్యులకి తెలియలేదు
పాపం.
కెప్లర్
కాలంలో తెలిసిన గ్రహాలు ఆరే – మెర్క్యురీ, వీనస్, భూమి, మార్స్, జూపిటర్, సాటర్న్. గ్రహాలు ఆరే
ఎందుకు ఉండాలి? అని ఆలోచించాడు
కెప్లర్. ఇరవై ఉండొచ్చుగా? నూరు అయితేనో? లోగడ కోపర్నికస్
గణించిన విధంగా గ్రహాల కక్ష్యల మధ్య అలాంటి దూరాలు ఎందుకు ఉన్నాయి? అంతవరకు ‘ఎంత?’ అని అడిగినవారే గాని, ‘ఎందుకు?’ అని అడిగినవారు లేరు. జ్యామితిలో “ప్లాటోనిక్” ఘనాలు (Platonic solids) అని
ఐదు వస్తువులు ఉన్నాయి. అవి బహుముఖులు
(polyhedra). వాటి
ముఖాలు సమ బహుభుజులు (regular polygons). పైథాగొరాస్ కాలం నుండి ప్రాచీన గ్రీకు గణితవేత్తలకి ఈ బహుభుజుల గురించి
తెలిసి ఉండేది. సౌరమండలంలో ఆరు
గ్రహాలు ఉండడానికి, ప్లాటోనిక్ ఘనాలు
ఐదే ఉండడానికి మధ్య సంబంధం ఉందనుకున్నాడు కెప్లర్. ఈ ప్లాటోనిక్
ఘనాలని ఒక దాంట్లో ఒకటి పట్టేలా ఏర్పాటు చేస్తే, వాటి పరిమాణాలకి, గ్రహ కక్ష్యల వ్యాసార్థాలకి మధ్య అద్భుతమైన సంబంధం వుందని కెప్లర్ గుర్తించాడు. ఈ దోషం లేని
జ్యామితిక ఆకృతులలో గ్రహాలని భరించే అదృశ్య గోళాలని తెలిపే సాక్ష్యాధారాలు కనిపించాయి. ఈ భావనకి అతడు ‘విశ్వరహస్యం’ అని పేరు పెట్టాడు. పైథాగొరాస్ గుర్తించిన
ఈ ఘనాలకి, గ్రహాల ఏర్పాటుకి మధ్య సంబంధం ఉండడానికి కారణం ఒకటే ననిపించింది – భగవంతుడు జ్యామితికారుడు.
పతితుడైన
తాను ఇంత గొప్ప దైవానుగ్రహానికి పాత్రుడు కావడం, ఇంత గొప్ప
సత్యాన్ని కనుక్కోగలగడం అతడి నమ్మశక్యం కాలేదు. ప్లాటోనిక్ ఘనాలు
ఒకదాంట్లో ఒకటి ఇమిడి ఉండే వాస్తవాన్ని నలుగురికీ తెలిపేలా ఒక భౌతిక నమూనా తయారు చెయ్యాలనుకున్నాడు. వూర్టెంబర్గ్ కి చెందిన డ్యూక్ ని కలుసుకుని ధనసహాయం చెయ్యమని అర్థించాడు. ఆ నమూనాని వెండితో
నిర్మించి అందులో రత్నాలు పొదగాలని సూచించాడు. అలాంటి నిర్మాణాన్ని
ఒక పవిత్ర కలశంలా ప్రార్థనాలయాలలో వాడుకోవచ్చని కూడా సూచించాడు. కెప్లర్ విన్నపం
డ్యూక్ శ్రద్ధగా విన్నాడు.
ముందు కాస్త చవకైన నిర్మాణం కాగితంతో చేసి చూపిస్తే చాలని, వెండిబంగారాల సంగతి తరువాత చూసుకోవచ్చని మర్యాదగా సూచించాడు. కెప్లర్ పన్లోకి
దిగాడు. “ఈ ఆవిష్కరణ నాకు
ఇచ్చిన పరమానందాన్ని మాటల్లో వర్ణించలేను… ఎంత కష్టమైన గణనాలైనా జంకులేకుండా పూర్తిచేశాను. ఈ లెక్కల మీద
రాత్రింబవళ్లు పని చేసి కోపర్నికస్ చేసిన గ్రహ కక్ష్యల అంచనాలు నా ప్రతిపాదనతో సరిపోతున్నాయా లేక నా ఊహలన్నీ గాల్లో కలిసిపోతున్నాయో సరిచూసుకోవడానికి విశ్వప్రయత్నం చేశాను.” కాని అతడు ఎంత శ్రమ పడినా ప్లాటోనిక్ ఘనాలకి, గ్రహకక్షలకి మధ్య
పొత్తు కుదరలేదు. కాని తన
సిద్ధాంతంలోని పదును, ప్రతిభ అతడి
మనసును మార్చలేకపోయాయి. అసలు గ్రహకక్ష్యల పరిశీలనలలోనే దోషం ఉందని అనుకుని ఊరుకున్నాడు. సిద్ధాంతానికి పరిశీలనలకి మధ్య తేడా వస్తే పరిశీలనల లోనే దోషం వుందని నిట్టూర్చిన సైద్ధాంతికులు సైన్స్ చరిత్రలో వేలకివేలు. ఆ కాలంలో
మొత్తం ప్రపంచంలోనే అత్యంత నిర్దుష్టమైన గ్రహపరిశిలనా వివరాలు ఉన్న వ్యక్తి ఒకడు ఉన్నాడు. పవిత్ర రోమన్
చక్రవర్తి రడోల్ఫ్-II
వద్ద
ఆస్థాన గణితవేత్తగా పని చేస్తూ ఉండేవాడు అతడు. డేనిష్ సమాజంలో
ధనిక వర్గానికి చెందిన అతడి పేరు టైకో బ్రాహే. అప్పటికే గణితవేత్తగా
కెప్లర్ పరపతి యూరప్ అంతా పాకుతోంది. కెప్లర్ తో
పొత్తు కుదుర్చుకోవడం రాజసభకే వన్నె తెస్తుందని భావించాడు చక్రవర్తి రడల్ఫ్. కెప్లర్ ని
ప్రాగ్ నగరానికి ఆహ్వానించమని టైకో బ్రాహేకి సూచించాడు.
లోకం
దృష్టిలో కెప్లర్ అప్పటికి ఓ సాధారణ లెక్కల
మాస్టరు. కొద్ది మంది
గణితవేత్తలకి తప్ప అతడి గురించి ఎవరికీ తెలియదు. శాస్త్రలోకంలో ప్రముఖుడైన
టైకో బ్రాహే నుండి వచ్చిన ఆహ్వానం అతణ్ణి కలవరపెట్టింది. ఏం చెయ్యాలో పాలుపోక సతమతమవుతుంటే పరిస్థితులే అతడి తరపున నిర్ణయం తీసుకున్నాయి. పదిహేడవ శతాబ్దపు తొలి దశల్లో మూడు దశాబ్దాల పాటు యూరప్ ని అతలాకుతలం చేసిన ముప్ఫై ఏళ్ల యుద్దం యొక్క తొలి కంపనలు
1598 లోనే
వినిపించాయి. వాటి చెడు ప్రభావం కెప్లర్ జీవితం మీద పడింది. మత ఛాందసత్వం
కరుడు కట్టిన స్థానిక కాథొలిక్ ఆర్క్ డ్యూక్ తన ప్రత్యర్థులని ఎలాగైనా మట్టికరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. “దేశాన్ని ఎడారిగా మార్చడానికికైనా సిద్ధమే గాని, మతవ్యతిరేకులని క్షమించేదే లేదని” ప్రతిజ్ఞ చేశాడు.[1] దాంతో కాథొలిక్ వర్గానికి వ్యతిరేకులైన ప్రొటెస్టంట్ లకి రాజకీయ, ఆర్థిక బలంలో
భాగం పంచుకునే అవకాశం లేకుండా పోయింది. కెప్లర్ పని
చేసే బడి మూతబడింది. మతబోధనలకి విరుద్ధంగా
అనిపించిన ప్రార్థనలు, పుస్తకాలు, భజనలు మొదలైన వన్నీ నిషేధించబడ్డాయి. ఊరి పౌరులని ఒక్కొక్కరినీ పిలిపించి మతానికి చెందిన వివిధ అంశాల మీద వారికి పరీక్ష పెట్టేవారు. రోమన్ కాథొలిక్ సాంప్రదాయాన్ని స్వీకరించని వారికి వారి ఆదాయంలో పదవ వంతు జరిమానా. అటుపై నగర
బహిష్కరణ, లేదంటే మరణ
దండన. కెప్లర్ గ్రాజ్
నగరాన్ని వదిలి పోవాలనే నిశ్చయించుకున్నాడు. “ఆత్మవంచన నాకు ససేమిరా తెలీదు.
మత విశ్వాసాన్ని గౌరవిస్తాను. దాంతో ఆటలాడే ఉద్దేశం లేదు.”
కెప్లర్
తన భార్య, పెంపుడు కూతురితో
గ్రాజ్ నగరానికి విడిచిపెట్టాడు. దారి పొడవునా ఎన్నో సవాళ్లు ఎదుర్కుంటూ ప్రాగ్ నగరం దారి పట్టారు.
కెప్లర్
సంసారం అంత ఆనందంగా సాగలేదనే చెప్పాలి. భార్య ఎప్పుడూ
ఏదో అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. అప్పటికి కొంత
కాలం క్రితమే ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. “”మూర్ఖురాలు, అతిగా అలిగే ప్రవృత్తి కలది, ఒంటరి, శోకగ్రస్థ” అని ఆమె వర్ణించబడింది. జన్మతః పల్లె పడచు అయిన ఆమె తన భర్త ప్రతిభ గుర్తించలేకపోయింది. దమ్మిడీ
ఆదాయం లేని భర్తకి ఆ అమ్మడు దృష్టిలో
పూచిక పుల్ల అంత విలువ కూడా లేకపోయింది. ఆమె వాలకం చూసి కెప్లర్ ఎన్నో సార్లు చిరాకు పడుతూ ఉండేవాడు. కొన్ని సార్లు
ఇక చేసేది లేక నిస్సహాయంగా నిట్టూర్చేవాడు. “నా అధ్యయనాలలో మునిగిపోవడం వల్ల ఎన్నో సార్లు తన విషయం పట్టించుకునేవాణ్ణి కాదు. కాని నెమ్మదిగా
నా తప్పు నేను తెలుసుకున్నాను. ఆమె పట్ల మరింత ఓర్పు వహించడం నేర్చుకున్నాను. నేను ఏదైనా పరుషంగా మాట్లాడితే ఆ మాటలు ఆమె
మనసుని గాయపరుస్తున్నాయని గుర్తించాను. ఆమె మనసుని అలా బాధపెట్టే కన్నా నా వేలు నేను కొరికేసుకోవడం మేలని అనిపిస్తుంది.” ఏదేమైనా
కెప్లర్ తన పరిశోధనల్లోనే మునిగి తేలుతూ ఉండేవాడు.
(ఇంకా వుంది)
[1] మధ్యయుగపు యూరప్ లో అలాంటి తీవ్రమైన ప్రకటనలు
కొత్తేమీ కాదు. విశ్వాసపూరితులకి, మతవ్యతిరేకులకి మధ్య తేడా ఎలా తెలుసుకోవాలి అని ఎవరో
అడిగితే, అధిక వర్గం ఆల్బిగెన్సియన్లు గల ఓ పట్టణాన్ని ఆక్రమించే ప్రయత్నంలో ఉన్న డామింగో
ద గజ్మన్ అనే సేనాపతి (ఇతడే తదనంతరం సెయింట్ డొమినిక్ గా మారాడు) ఇలా సమాధానం చెప్పాడు
– “అందరినీ చంపేసేయ్. ఎవరు తనవాళ్లో దేవుడే చూస్కుంటాడు.’’