తోకచుక్కలో అధికభాగం
మంచుతో నిండి ఉంటుంది – అందులో కొంత భాగం నీటి (H2O)
మంచు, మరి కొంత మీథేన్ (Ch4) మంచు, ఇంకొంత అమోనియా
(NH4) మంచు. పృథ్వీ వాతావరణాన్ని
భేదిస్తున్న ఆ ఉల్కా శకలం రాపిడి వల్ల ఓ పెద్ద అగ్నిగోళంలా
మారుతుంది. దాని లోంచి
ఓ బ్రహ్మాండమైన ఘాతతరంగం
పుడుతుంది. అది చెట్లని
దగ్ధం చేస్తుంది, అడవులని నేలమట్టం
చేస్తుంది. ఆ శబ్దం
ప్రపంచం అంతా వినిపిస్తుంది. వాతావరణంలోకి ప్రవేశిస్తుంటేనే మంచు అంతా కరిగిపోతుంది. కాని దాని వల్ల భూమిలో పెద్ద రంధ్రమేమీ పడకపోవచ్చు. గాల్లోకి ప్రవేశిస్తున్నప్పుడే మంచులో చాలా భాగం కరిగిపోవచ్చు. ఉల్కలో చాలా భాగం ఆచూకీ లేకుండా గాల్లో కలిసిపోవచ్చు. మంచు లేని కేంద్రభాగానికి చెందిన కొన్ని కణికలు మాత్రం మిగలొచ్చు. ఇటీవలి కాలంలో
ఈ. సోబొటోవిచ్
అనే సోవియెట్ శాస్త్రవేత్త తుంగుష్కా ఘటనా స్థలం చుట్టూ చిన్న చిన్న వజ్రాలు విసిరేసినట్టు ఉన్నాయని కనుక్కున్నాడు. అలాంటి వజ్రాలు ఉల్కలలో ఉంటాయన్న విషయం మనకి ముందే తెలుసు. కాబట్టి ఆ
వజ్రాలు ఉల్కల నుండి వచ్చి ఉంటాయి.
ఆకాశం నిర్మలంగా
ఉన్న చీకటి రాత్రులలో ఆకాశం వైపు ఓపిగ్గా చూస్తూ ఉంటే ఉన్నట్లుండి అప్పుడప్పుడు ఓ ఒంటరి ఉల్క
తటాలున మెరుస్తుంది. కొన్ని రాత్రులలో ఉల్కా వర్షం కనిపిస్తుంది. ప్రతీ ఏటా ఆ ప్రత్యేక దినాలలోనే
ఆ వర్షం కనిపిస్తుంది. వినవీధుల్లో వినోదం అది, దివిసీమలో
దీపావళి వైభవం.
ఈ ఉల్కలలో సన్నని ధూళికణాలు ఉంటాయి. ఆవగింజల కనా
చిన్నవి. కొంతమంది వాటిని
రాలే తారలు అంటారు గాని అవి నిజానికవి పతనమయ్యే పీచు అనుకోవాలి. భూమి వాతావరణంలో
క్షణకాలం జిగేలుమంటాయి. నేలకి 100 కిమీల ఎత్తులో గాలితో తగాదా పడి వేడెక్కి రగిలిపోతాయి. ఉల్కలు నిజానికి తోకచుక్కల అవశేషాలు.[1] పురాతనమైన తోకచుక్కలు పదే పదే సూర్యుడి సమీపం నుండి ప్రయాణించి, పగిలి, ఆవిరై, తుత్తునియలు
అవుతాయి. అలా ఏర్పడ్డ
వ్యర్థ పదార్థం ఆ తోకచుక్క యొక్క
కక్ష్య మొత్తం విస్తరిస్తాయి. భూమి కక్ష్య ఆ తోకచుక్క కక్ష్యని కలుసుకున్న చోట, మెరిసే ఉల్కాపాతం మన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఓ ఉల్కాపాతంలో
కొంత భాగం ఎప్పుడూ భూమి కక్ష్యలో ఒక ప్రత్యేక ప్రదేశంలోనే జరుగుతుంది. అందుకే ఉల్కాపాతాలు ఎప్పుడూ ఏడాదిలో ఒకే సమయంలో జరుగుతాయి. 1908 జూన్ 20 నాడు బీటా టౌరిడ్ ఉల్కాపాతం కురిసే సమయం. ఆ ఉల్కాపాతం
ఎన్కే (Encke) అనే తోకచుక్క యొక్క కక్ష్యకి సంబంధించినది. ఆ ఎన్కే తోకచుక్క
నుండి విడివడ్డ శకలమే తుంగుష్కా ఘటనకి కారణం అయ్యుంటుంది. ఉల్కాపాతాలలో కనిపించే మెరిసే ధూళి కణాల కన్నా మరి ఆ శకలం చాలా
పెద్దది అని చెప్పకనే తెలుస్తోంది.
తోకచుక్కలు ఎందుచేతనో
మనుషుల మనసుల్లో భయవిస్మయాలని కలిగించాయి. వాటి చుట్టూ ఎన్నో మూఢనమ్మకాలు పేరుకున్నాయి. దివ్యపరిపాలనలో కుదురుగా నడుస్తున్నట్టు కనిపించే దివిసీమలలో తటాలున
ఎక్కణ్ణుంచో ఊడిపడుతూ ఇబ్బంది పెడుతుంటాయి తోకచుక్కలు. తెల్లని పాల వెలుగుతో, తారలతోపాటు ఉదయిస్తూ, అస్తమించే ఆ కుచ్చుతోకల అతిధి
ఆగమనానికి ఏదో కారణం ఉండే ఉంటుందని మనుషులు అనుమానించేవారు. వాటి రాక ఏదో దుశ్శకునాన్ని సూచిస్తోంది అనుకునేవారు. కాబట్టి తోకచుక్కలు రాబోయే ఉపద్రవాలకి సంకేతాలు, దైవాగ్రహానికి చిహ్నాలు
అనుకునేవారు. అవి కనిపిస్తే రాజుల రాతలు మారుతాయి, రాజ్యాలు కూలుతాయి. బాబిలోనియన్లు తోకచుక్కలని గెడ్డాలతో పోల్చుకునేవారు. గ్రీకులకి అవి నెరిసే, మెరిసే కురులని
తలపించేవి. అరబ్బులకి అందులో
కరవాలాల తళతళలు కనిపించేవి. టోలెమీ కాలంలో ఓ తోకచుక్కలని “దూలాలు,” “నగారాలు,” “జాడీలు” ఇలా రకరకాలుగా
కవితాధోరణిలో పోల్చుకునేవారు. తోకచుక్కలు యుద్ధాలని, వేడెక్కిన వాతావరణాన్ని, “అస్థిర పరిస్థితులని” తీసుకొస్తాయని టోలెమీ అభిప్రాయపడేవాడు. కొన్ని మధ్యయుగపు వర్ణనలలో తోకచుక్కలని ఎగిరే శిలువలుగా చిత్రీకరించేవారు. మాగ్డెబర్గ్ కి చెందిన ఆంద్రియాస్ సెలిచియస్ అనే లూథరన్ బిషప్ 1578 లో “కొత్త
తోకచుక్కకి దైవిక జ్ఞాపిక” (Theological Reminder of the New
Comet) అని ఓ పుస్తకాన్ని ప్రచురించాడు. “మనుషుల పాపాల నల్లని పొగలు అనుక్షణం, అనునిముషం, అనుదినం
భగవంతుడి నిర్మల వదనపు సమక్షంలో, ఈ లోకం
లోంచి గాల్లోకి పైకి లేస్తూ, అక్కడ క్రమంగా
దట్టంగా పేరుకుని తోకచుక్కగా మారగా, మెలికలు తిరిగే
దాని భయంకరమైన జటాజూటాలు పరలోకపు న్యాయమూర్తి యొక్క ఆగ్రహానలాలతో ప్రజ్వలిస్తాయి.” కాని తోకచుక్కలు నిజంగానే దట్టమైన పాపపు పొగలతో నిండి వుంటే, ఆకాశం నిరంతరం
తోకచుక్కలతోనే నిండి వుండాలి కదా? అని
వ్యతిరేకించినవారు కూడా ఉన్నారు.
హాలీ తోకచుక్కకి
చెందిన అత్యంత ప్రాచీనమైన ఆధారాలు మనకి చైనాకి చెందిన హువాయ్ నాన్ రాజ గ్రంథం లో కనిపిస్తుంది. మహారాజు వూ తన ప్రత్యర్థి అయిన ఝౌ యిన్ మీద దండయాత్ర చేసిన సందర్భం అది. అది
జరిగిన సంవత్సరం క్రీ.పూ.
1057. తదనంతరం క్రీ.శ.
66 లో హాలీ తోజచుక్క కనిపించిన ఆధారాలు ఉన్నాయి.
ఆ ఏడాది మొత్తం జెరూసెలేమ్ నగరం ఆపద గుప్పెట్లో ఎలా వున్నదీ జోసెఫస్ వర్ణిస్తాడు. క్రీ.శ.
1066 లో బ్రిటన్ లోని నార్మన్ వంశస్థులు హాలీ తోకచుక్కని చూసిన ఆధారాలు ఉన్నాయి. తోకచుక్క ఆగమనం
ఏదో ఒక రాజ్యపతనాన్ని సూచిస్తుంది కనుక, ఆ సందర్భంలో
మాహారాజు విలియమ్ విజేత (William the Conqueror) ఇంగ్లండ్ మీద దందయాత్ర చేశాడు. ఒక విధంగా
తోకచుక్కే ఆ దండయాత్రని పురికొల్పింది
అంటారు. తోకచుక్క కనిపించిన
సంగతి ఆ సమయంలో బాయో
టాపెస్ట్రీ (Bayeux Tapestry) అనే
వార్తా పత్రికలో కూడా వచ్చింది. క్రీ.శ. 1301 లో వాస్తవిక
చిత్రకళా సాంప్రదాయానికి మూలపురుషుడైన గియోటో (Gioto) హాలీ తోకచుక్కని చూసి ఆ చిత్రాన్ని ఓ
వర్ణచిత్రంలో పొందుపరిచాడు. కీ.శ.
1466 లో కనిపించిన మహత్తర తోకచుక్క (The Great Comet) (అదొ నిజానికి హాలీ తోకచుక్కే) యూరప్ లో
క్రైస్తవ రాజ్యాలని భయభ్రాంతులకి గురి చేసింది. అప్పటికి కొంత
కాలం క్రితమే కాంస్టాంటినోపుల్ నగరాన్ని టర్కులు ఆక్రమించారు. తోకచుక్కలని పంపించే దేవుడు ఈ సారి టర్కుల
పక్షంలో నిలిచాడేమోనన్న భయం క్రైస్తవ ప్రాంతాలలో వ్యాపించింది.
పదహారవ, పదిహేడవ శాతాబ్దాలకి చెందిన మేటి ఖగోళవేత్తలని తోకచుక్కలు ఎంతో ఆకర్షించాయి. వాటి న్యూటన్ కన్ను కూడా పడింది. “సముద్రంలో చేపల్లా” తోకచుక్కలు అంతరిక్షంలో అటు ఇటు మసలుతుంటాయని కెప్లర్ వర్ణించాడు. సూర్య కాంతి వాటిని విచ్ఛిన్నం చేస్తూ రావడం వల్ల వాటి తోకలు ఎప్పుడూ సూర్యుడికి అభిముఖంగానే ఉంటాయని కూడా కెప్లర్ గుర్తించాడు. సామాన్యంగా కఠోర హేతువాడి అయిన డేవిడ్ హ్యూమ్ తోకచుక్కల విషయంలో మాత్రం కొన్ని విచిత్రమైన భావాలని మనసులో పెట్టుకున్నాడు. తోకచుక్కలు గ్రహకూటమిలో పునరుత్పత్తికి చెందిన కణాల (శుక్రకణాలు గాని, అండ కణాలు గాని) వంటివి అనుకున్నాడు హ్యూమ్. తోకచుక్కలని ఇచ్చిపుచ్చుకుంటూ గ్రహాలు సంగమిస్తాయని, ఆ సంగమం లోంచి బుల్లి గ్రహాలు పుట్టుకొస్తాయని ఊహించుకున్నాడు. కాలేజి రోజుల్లో, తన పరావర్తన టెలిస్కోప్ ని నిర్మించక ముందు, కుర్రాడైన న్యూటన్ కూడా చీకటి ఆకాశం అంతా తోకచుక్కల కోసం గాలిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. ఆ వ్యాపకం ఒక దశలో శ్రుతి మించి అనారోగ్యానికి కూడా దారి తీసింది.
తోకచుక్కల గురించి అరిస్టాటిల్ వంటి ప్రాచీనులు అవి మన వాతావరణంలోనే కదులుతుంటాయని అనుకుని పొరబడ్డారు. కాని తదనంతర కాలంలో కెప్లర్, టైకో వంటి వారి లాగానే, న్యూటన్ కూడా అవి వాతావరణంలో లేవని, అంతరిక్షంలో కదులుతుంటాయని, చందమామ కన్నా దూరంలో ఉన్నాయని, అయితే సాటర్న్ వంటి గ్రహాల కన్నా దూరం కావని న్యూటన్ గుర్తించాడు. గ్రహాల లాగానే సూర్యకాంతిని ప్రతిబింబించడం వల్ల తోకచుక్కలు మెరుస్తాయి. “తోకచుక్కలు దూరంగా స్థిర తారల సమీపంలో ఉన్నాయనుకోవడం పొరబాటే. ఎందుకంటే అలా అనుకుంటే ఎలాగైతే గ్రహాల మీద తారా కాంతి పెద్దగా పడదో, తోకచుక్కల మీద కూడా సూర్య కాంతి పడదని అనుకోవాల్సి ఉంటుంది. తోకచుక్కలు కూడా గ్రహాలకి మల్లె దీర్ఘవృత్తాకార కక్ష్యలలో తిరుగుతుంటాయని నిరూపించాడు న్యూటన్. “తోకచుక్కలు కూడా గ్రహాల లాగానే సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి గాని వాటి కక్ష్యలు బాగా దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి.” ఇలాంటి విశ్లేషణతో తోకచుక్కలకి కూడా స్థిరమైన ‘సంవత్సర కాలం’ ఉంటుందని, ఒక ప్రత్యేక ఆవర్తక కాలంలో మళ్లీ మళ్లీ వస్తుంటాయని న్యూటన్ తేల్చి చెప్పాడు. న్యూటన్ సూచనల అనుసారం అతడి మిత్రుడు ఎడ్మండ్ హాలీ 1707 లో హాలీ తోకచుక్క గురించి కొన్ని లెక్కలు చేశాడు. గతంలో అది కనిపించిన సంవత్సరాల (1531, 1607, 1682 మొ॥) వివరాల బట్టి, ఆ సంవత్సరాల్లో కనిపించింది ఒకే తోకచుక్క అని, అది 76 ఏళ్లకి ఒకసారి వస్తుందని, కాబట్టి మళ్లీ 1758 లో కనిపిస్తుందని నిర్ణయించి చెప్పాడు. అనుకున్నట్టుగానే ఆ ఏడాది మళ్లీ ఆ తోకచుక్క కనిపించింది. దాని రాకని నిర్ణయించినందుకు హాలీ గౌరవార్థం ఆ తోకచుక్కకి హాలీ తోకచుక్క అని పేరు పెట్టారు. మానవ చరిత్రలో హాలీ తోకచుక్క విశేషమైన పాత్ర పోషించింది. తోకచుక్క లక్ష్యంగా 1986 లో పంపించబోయే మొట్టమొదటి అంతరిక్ష నౌక యొక్క గమ్యం కూడా హాలీ తోకచుక్కే కావచ్చు.
(ఇంకా వుంది)
[1] ఉల్కలకి, తోకచుక్కలని సంబంధం వుందని మొట్టమొదట
ప్రతిపాదించినవాడు అలెగ్జాండర్ ఫాన్ హంబోల్ట్. కాస్మాస్ అనే పుస్తకంలో అతడు సైన్స్
లో గొప్ప వైవిధ్యం గల అంశాల గురించి రాశాడు. ఆ పుస్తకంలోని భాగాలు 1845 కి 1862 కి
మధ్య అచ్చయ్యాయి. హంబోల్ట్ పుస్తకాల నుండి స్ఫూర్తి గొన్న చార్లెస్ డార్విన్ భౌగోళిక
అన్వేషణని, జీవశాస్త్ర పరిశోధనని కలుపుతూ ఓ మహాయాత్రని తలపెట్టాడు. కొంత కాలం తరువాత
అతడు హెచ్.ఎమ్.ఎస్. బీగిల్ అనే ఊడలో ప్రకృతి శాస్త్రవేత్తగా నియామకం అయ్యాడు. ఆ నౌకాయాత్ర
వల్లనే The Origin of Species గ్రంథరచనకి దారితీసింది.