ఆగస్ట్ 20, 1977 నాడు
లాంచ్ చెయ్యబడ్డ వాయేజర్ 1 వంపు తిరిగిన కక్ష్య వెంట ప్రయాణిస్తూ మార్స్ గ్రహాన్ని దాటి, గ్రహశకల వలయాన్ని
భద్రంగా దాటుకుని, జూపిటర్ ని
సమీపించి, దాని చందమామల్లో
పదునాలుగు చందమామలని దాటుకుని ఇంకా ముందుకి సాగింది. జూపిటర్ సమామగం
వల్ల వేగం పుంజుకున్న ఆ నౌక సాటర్న్
దిశగా పయనమయ్యింది. సాటర్న్ గురుత్వం దాన్ని యురేనస్ దిక్కుగా ముందుకు తోస్తుంది. యురేనస్ ని
దాటాక నెప్ట్యూన్ దిశగా పోతుంది. ఇక అప్పటి
నుండి అది తారాంతర యానాన్ని ఆరంభిస్తుంది. ఇక అప్పటి నుండి తారల మధ్య విస్తరించిన అంతులేని వ్యోమసాగరం మీద శాశ్వతంగా సంచరిస్తుంది.
ఈ అన్వేషణా
యాత్రలు, ఈ ఆవిష్కరణ
యాత్రలు మనకి కొత్తేమీ కావు. మానవ చరిత్రలో
ఆది నుండి కూడా ఈ అన్వేషణా యాత్రలే
ఎంతో ప్రగతికి కారకమయ్యాయి. పదిహేను, పదహారవ శతాబ్దాలలో
స్పెయిన్ నుండి అజోరెస్ కి కొన్ని రోజుల్లో ప్రయాణించగలిగేవాళ్లు. నేడు అంతే సమయంలో భూమి నుండి చందమామని చేరుకోగలుగుతున్నాం. ఆ రోజుల్లో యూరప్
నుండి బయల్దేరి అట్లాంటిక్ సముద్రాన్ని దాటి నవప్రపంచం అని పిలువబడే అమెరికా ఖండాన్ని చేరుకోడానికి కొన్ని నెలలు పట్టేది. ప్రస్తుతం కొన్ని
నెలల వ్యవధిలో అంతర సౌరమండలపు నిశీధిని దాటుకుని మార్స్ నో, వీనస్
నో చేరుకోగలుగుతున్నాము. నేటి నేపథ్యంలో చూస్తే మార్స్, వీనస్ గ్రహాలు
నిజంగానే నవప్రపంచాలు అనుకోవాలి. పదిహేడవ, పద్దెనిమిదవ
శతాబ్దాలలో హోలాండ్ నుండి చైనాకి ఒకటి రెండేళ్లలో చేరుకునేవాళ్లు. అదే సమయంలో వాయేజర్ నౌక భూమిని వదిలి జూపిటర్ ని చేరుకుంది. అప్పటితో పోల్చితే
ఇప్పుడు ఈ యాత్రలకి అయ్యే
వార్షిక వ్యయం ఎక్కువే. కాని మొత్తం
Gross National Product తో పోల్చితే అప్పుడు, ఇప్పుడు కూడా
ఈ యాత్రల ఖర్చు
సుమారు 1 శాతం మాత్రమే. మన ప్రస్తుత
అంతరిక్ష నౌకలు, అందులో ప్రయాణించే
రోబో సిబ్బంది, భావి మానవ
అన్వేషణా యాత్రలకి పూర్వప్రయత్నాలు. ఇలాంటి యాత్రలు గతంలో ఎన్నో తలపెట్టాం.
పదిహేను, పదిహేడు
శతాబ్దాల మధ్యలో మన మానవ చరిత్ర కొత్త మలుపు తిరిగింది. సాహసిస్తే మన
గ్రహం మీద ఎక్కడికైనా చేరుకోగలం అన్న ధైర్యం మనుషుల మనసుల్లో ఏర్పడింది. యూరప్ లోని
అరడజను దేశాలకి చెందిన తెగువ గల నౌకాదళాలు ప్రపంచపు నలుమూలలకి పయనించాయి. ఆ యాత్రలకి
కారణాలు కోకొల్లలు. విజయేచ్ఛ, ధనాశ, జాతీయతా భావం, మత మౌఢ్య, కారాగార విముక్తి, వైజ్ఞానిక స్ఫూర్తి, సాహసం పట్ల మక్కువ, ఇక చివరిగా (పోర్చుగల్ లో ఒక ప్రాంతం అయిన) ఎస్ట్రేమడురాలో తగినన్ని ఉద్యోగావకాశాలు
లేకపోవడం. ఈ యాత్రల
వల్ల ఎంత మేలు జరిగిందో, అంత కీడు
కూడా జరిగింది. కాని ఆ
యాత్రల వల్ల ఒక ముఖ్యమైన ఫలితం మాత్రం భూమి మీద పలు ప్రాంతాలని ఒక్కటిగా చెయ్యడం. ప్రాంతీయతా భావాన్ని
శమింపజేయడం, మానవ జాతి మొత్తాన్ని ఒక దరికి చేర్చడం, మన గురించి, మన గ్రహం గురించి ఉన్న పరిజ్ఞానాన్ని అద్భుతంగా పురోగమింపజేయడం.
పదిహేడవ శతాబ్దంలో
యూరప్ కి చెందిన రాజ్యాలలో సాహసోపేతమైన సముద్ర యాత్రలని తలపెట్టిన రాజ్యాలలోకెల్లా డచ్ గణతంత్ర రాజ్యం చేసిన ప్రయాస విప్లవాత్మకమైనది అని చెప్పుకోవాలి. అప్పుడే అత్యంతశక్తివంతమైన స్పానిష్ సామ్రాజ్యం నుండి స్వాతంత్రం సాధించిన డచ్ రాజ్యం, యూరప్ లో
మరే ఇతర రాజ్యం కన్నా కూడా అప్పుడే ఆ ఖండంలో ఆవిర్భవిస్తున్న
మనోవికాసోద్యమాన్ని సంపూర్ణంగా ఆహ్వానించింది. డచ్ సమాజం హేతుబద్ధమైన, క్రమబద్ధమైన, సృజనాత్మకమైన సమాజం. స్పెయిన్ తో
తెగతెంపులు చేసుకున్నాక, డచ్ నౌకా వాణిజ్యానికి స్పెయిన్ రేవులు మూతబడ్డాయి. ఇక మనుగడ కోసం ఆ చిన్ని గణతంత్ర
రాజ్యం గొప్ప, సమర్థవంతమైన నౌకాదళాన్ని
నిర్మించి, సుదీర్ఘసముద్ర యాత్రల
మీద పంపవలసిన అవసరం ఏర్పడింది.
అలాంటి పరిస్థితుల్లో
డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ జన్మించింది. ప్రపంచపు నలుమూలలకి వెళ్లి అక్కడ విలువైన సరుకులు కొని, వాటిని యూరప్
కి తరలించి, అక్కడ అధిక
ధరలకి లాభాలు చేసుకోవడం ఆ కంపెనీ ఉద్దేశం. ఆ సముద్ర యాత్రలే
ఆ దేశపు జీవనానికి
ఊపిరి అయ్యాయి. సముద్ర యాత్రల
పటాలు రాజ్యరహస్యాలుగా పరిగణించబడేవి. యుద్ధనౌకలకి మల్లె సీలు చేసిన ఆదేశాలతో ఆ వాణిజ్య నౌకలు బయల్దేరేవి. ఉన్నట్లుండి ప్రపంచం నలుమూలలా డచ్ వారే ప్రత్యక్షమయ్యారు. ఆర్కిటిక్ మహాసముద్రంలోని బేరెంట్స్ సముద్రానికి, ఆస్ట్రేలియాలోని టస్మానియా ప్రాంతానికి డచ్ నౌకా కెప్టెన్ల పేర్లే పెట్టారు. ఈ యాత్రలు
కేవలం వాణిజ్య యాత్రలు కావు. అవి గొప్ప
వైజ్ఞానిక సాహస యాత్రలు కూడా. కొత్త భూముల, కొత్త వృక్షజాతుల, కొత్త జంతువుల, కొత్త మనుషుల
ఆవిష్కరణ ఆ యాత్రల ముఖ్యోద్దేశాలలో
ఒకటి.
మతాలకి అతీతమై, హేదువాదానికి పెద్ద పీట వేసి, ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడే పదిహేడవ
శతాబ్దపు హోలాండ్ సమాజానికి ఆమ్స్టెర్డామ్ టౌన్ హాల్ అద్దం పడుతుంది. పలు నౌకలు
మోసుకొచ్చిన పాలరాతితో ఆ భవనాన్ని నిర్మించారు. ఆ కాలానికి చెందిన
కాంస్టాంటిన్ హైగెన్స్ అనే కవి, దౌత్యాధికారి
ఆ టౌన్ హాలు “గోథిక్ కాలపు కుళ్లు కంపు”ని పారద్రోలింది అని
వ్యాఖ్యానించాడు. ఆ టౌన్ హాల్
లో ఇప్పటికి కూడా గ్రీకు వీరుడు అట్లాస్ తారారాశులచేత అలంకృతమైన దివిని ఎత్తి పట్టుకున్నట్టు ఉండే శిల్పకళాఖండం ఒకటి వుంది. దాని కిందనే
ఒక చేత సువర్ణ కరవాలాన్ని, మరో చేతిలో బంగరు త్రాసుని పట్టి, అటు చావుకి
ఇటు శిక్షకి మధ్యన నిలిచి ఉంటుంది. ఆమె పాదాల
కింద వర్తకుల దేవతలైన లోభం, ఈర్ష్యలు నలుగుతూ
ఉంటారు.
డచ్ ఆర్థిక వ్యవస్థ ఒక పక్క వ్యక్తిగత లాభసాధన మీద ఆధారపడినదే అయినా, అడ్డుఅదుపు లేని
లాభాపేక్ష వారి దేశపు అంతరాత్మ మీద దెబ్బ కొడుతుందని మాత్రం బాగా అర్థం చేసుకున్నారు.
(ఇంకా వుంది)