రచయిత: వి. శ్రీనివాస చక్రవర్తి.
ఆ విధంగా భూమి గురించి, సూర్య చంద్రుల గురించి వెర్రి మొర్రి ఆలోచనలు చలామణి అవుతున్న దశలో ఓ గ్రీకు తాత్వికుడు ఈ విషయం గురించి లోతుగా ఆలోచించసాగాడు. అతడే అనాక్సీమాండర్.
అదుగో ఏతెన్స్ నగర వీధుల వెంట ఇటే ఏతెంచి వస్తున్నాడు. అయ్యో, అదేంటి! నక్షత్రాలు లెక్కెడుతూ రోడ్డుకి అడ్డుగా ఆ నడకేంటి సార్?
మొదటివాడు - అయ్యా అనాక్సీమాండరూ! తమరా? పట్టపగలు రోడ్డు మధ్యలో ఆకాశం కేసి చూస్తూ ఏంటా నడక? ఇంతకీ పైన ఏం కనిపిస్తోందని?
అనాక్సీమాండర్ - చుక్కలు కనిపిస్తాయేమోనని...
రెండోవాడు - నెత్తి బొప్పి కట్టి ఇప్పుడు కనిపిస్తున్నాయా చుక్కలు!
అనాక్సీమాండర్ - అబ్బా!(పైకి లేవబోతూ బాధగా మూలుగుతాడు. ఇంతలో అతని శిష్యుడు ఎక్కణ్ణించో పరుగెత్తుకుంటూ వస్తాడు.)
శిష్య - గురూగారూ! మళ్లీ పడ్డారా? (గురువుగార్ని లేవనెత్తి ఆయన చెయ్యి తన భుజం మీద వేసుకుని నడిపిస్తూ తీసుకెళ్తాడు.)
అనాక్సీమాండర్ - ఇప్పుడు అర్థమయ్యిందిరా ఢింభా!
శిష్య - ఏంటి రోడ్డుకి అడ్డంగా నడవకూడదనా?
అనాక్సీమాండర్ - కాదు.
శిష్య - పోనీ నడిచినా నక్షత్రాల్ని లెక్కెడుతూ నడవకూడదనా?
అనాక్సీమాండర్ - అబ్బా కాదు.
శిష్య - మరేంటి స్వామి అర్థమయ్యింది?
అనాక్సీమాండర్ - విశ్వరహస్యం! (ఆయన ముఖంలో ఏదో లోకోత్తర తేజం తాండవిస్తోంది.)
(ఆ ముందు రాత్రి ఏం జరిగిందో శిష్యుడికి ఏకరువు పెట్టుకు వస్తాడు అనాక్సీమాండర్).
అనాక్సీమాండర్ - నిన్న రాత్రి కూడా ఎప్పట్లాగే ఇంట్లో అందరూ పడుకున్నాక గోడ దూకి వెళ్లి నీ మిత్రుడు ఆ శుంఠ డెమియోస్ తో బాటు వెళ్లి బీచికి వెళ్ళా. తారల కేసి తదేకంగా చూస్తూ కూర్చున్నా...
(చిన్న ఫ్లాష్ బ్యాక్...)
అనాక్సీమాండర్ - రాశావా?
శిష్య2 (వీడు మరొకడు) - ఊ!
అనాక్సీమాండర్ - ఏం రాశావ్?
శిష్య 2 - సాయంకాలం 7:11 నిముషాలకు ఉదయించిన సప్తర్షి మండలం ప్రస్తుతం అంటే రాత్రి మూడవ జాము ఆరంభం లో 111 డిగ్రీల 37 నిముషాల దగ్గరికి వచ్చింది.
అనాక్సీమాండర్ - గుడ్. మరిప్పుడు స్వాతి ఎక్కడుంది?
శిష్య2 - 8 గంటల దాకా నాకోసం కాలేజిలోనే వెయిట్ చేస్తానంది. ఇవాళ కూడా 8 లోపల రాకపోతే ఇక జన్మలో ముఖం చూపించనంది. ఎక్కడుందో ఏమో పాపం! (కుర్రాడికి ఇక ఏడుపు ఒక్కటే తక్కువ).
అనాక్సీమాండర్ - ఆ స్వాతి కాదు (విసుగ్గా) ఆ స్వాతి (ఆకాశం కేసి చూపిస్తూ).
శిష్య2 - ఓ అదా? ఇవాళ 7 గంటల 59 నిముషాలకే అస్తమించిందండి (వాచీ చూసుకుని ఓ సారి ముక్కు ఎగబీలుస్తూ). మరిప్పుడు లేదు.
అనాక్సీమాండర్ - దీన్ని బట్టి నీకేమర్థమవుతోంది?
శిష్య 2 - ఏముందండి? నా గ్రహస్థితి బాగోలేదనండి.
అనాక్సీమాండర్ - ముందుగా ఉదయించిన తారలు ముందే అస్తమిస్తున్నాయి. ఆలస్యంగా ఉదయించిన తారలు ఆలస్యంగా అస్తమిస్తున్నాయి. సరిగ్గా ఎన్ని నిముషాలు ముందొస్తే అన్ని నిముషాలు ముందు అస్తమిస్తున్నాయి. అంటే తారలన్నీ ఊకుమ్మడిగా కదుల్తున్నాయన్నమాట.
శిష్య2 - (ఏదో అర్థమైనట్టు తలాడించాడు).
అనాక్సీమాండర్ - ఇప్పుడు తారల సంగతి అటుంచు. రోజూ సూర్యుడు తూర్పులో ఉదయించి పడమట్లో అస్తమిస్తాడు అవునా?
శిష్య2 - మీరు మరీ అంత ఇదిగా చెబుతున్నారు కనుక అంతే అయ్యుంటుందండి.
అనాక్సీమాండర్ - మరి చంద్రుడి సంగతేంటి?
శిష్య2 - అదీ అంతే కాబోసండి.
అనాక్సీమాండర్ - సూర్య చంద్రుల్లాగే తారలు కూడా ఒకే విధంగా ఉదయిస్తూ అస్తమిస్తూ ఉన్నాయన్నమాట. అంటే నీకేమనిపిస్తోంది?
శిష్య2 - నాకా అండి? (ఓ సారి ఆకాశంలో తారలన్నిటికేసి కలయ జూస్తూ) కళ్ళు తిరుగుతున్నాయండి.
అనాక్సీమాండర్ - కరెక్టుగా చెప్పావు. అన్నీ ఓ చక్రం మీద ఎక్కించి తిప్పినట్టు కలిసికట్టుగా కదలడం లేదూ? నువ్వెప్పుడైనా రంగుల రాట్నం ఎక్కావా?
శిష్య2 - ఈ కాలేజిలో చేరాక ఎక్కినట్టు గుర్తులేదండి.
అనాక్సీమాండర్ - రంగుల రాట్నంలో ఎక్కిన వాళ్లందరూ కదుల్తున్నా, వాళ్ల మధ్య దూరాలు మారవు. పైగా కేంద్రానికి దూరంగా ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద చక్ర గతుల్లో తిరుగుతారు. కాస్త దగ్గరగా ఉన్నవాళ్ళు చిన్న చిన్న చక్రగతుల్లో తిరుగుతారు. ఇక కేంద్రంలో ఉన్న స్తంభం అసలు కదలదు. అలాగే తారలు కూడా కొన్ని పెద్ద పెద్ద చక్రాల్లో, కొన్ని చిన్న చిన్న చక్రాల్లో కదుల్తాయి. ఇక ఆ చక్రాల మధ్యలో ఉన్న ఓ ఒంటరి నక్షత్రం కదలకుండా స్థిరంగా ఉంది. అదే ధృవతార. అంటే...అంటే... (అనాక్సీమాండర్ ముఖం గంభీరంగా మారిపోతుంది. ఏదో మహాసత్యం చాటుతున్న వాడిలా చెప్పుకుపోతుంటాడు).
విశ్వం అనే ఓ పెద్ద రంగుల రాట్నంలో, ఈ ఖగోళంలో సూర్యచంద్రులు, నక్షత్రాలూ అన్నీ ఎక్కి కలిసికట్టుగా తిరుగుతున్నాయన్నమాట. తారలన్నీ వేరువేరుగా కదలడం లేదు. అసలు తారలు కదలడం లేదు. అవన్నీ ఓ పెద్ద గోళంలో వజ్రాలు పొదిగినట్టు పొదగబడి ఉన్నాయి. కదుల్తున్నది, పరిభ్రమిస్తున్నది కేవలం ఈ గోళమే. ఆ గోళానికి ఓ అక్షం ఉంది. ఆ అక్షం మీదుగా ఉంది కనుకనే ధృవతార కదలడం లేదు. అంచేత ఈ విశ్వం ఒక గోళం...(గట్టిగా అరుస్తూ) ఈ విశ్వం ఓ పేఏఏఏద్ద గోళం...
శిష్య2 - (ఇంతలో ఓ చిన్న కునుకు తీసిన వాడు కాస్తా ఆ కేకకి మేలుకుని) నా చదువు గందరగోళం. (అని మనసులో తిట్టుకుంటూ, బయటికి చక్కగా నవ్వుతూ) అంటే ఇన్నాళ్లుగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్య తీరిపోయినట్టేగా?
అనాక్సీమాండర్ - అవున్రా అబ్బీ. ఇన్నేళ్లుగా అర్థం కాని రహస్యం ఇవాళ అర్థమయ్యింది. గొప్ప సంతోషంగా ఉంది. పద ఇంటికి పోదాం.
శిష్య2 - అయితే మాష్టారు ఇవాళ్టికి మన పరిశోధన పూర్తయినట్టేనా?
అనాక్సీమాండర్ - ఆ, అయిపోయినట్టే. (అని బయటికి నడవబోతూ...) ఓ చిన్న విషయం. ఇవాళ నువ్వు తీసుకున్న డేటా అంతా రేపుపొద్దున కల్లా చక్కగా చార్టులు గీసి చూపించేం?
(శిష్యుడు జుట్టు పీక్కోబోతుంటే బయటికి పోబోతున్న వాడల్లా అనాక్సీమాండర్ మరోసారి ఆగి)
అనాక్సీమాండర్ - రేపు నేను అఫీస్ లో లేకపోతే రిపోర్ట్ నా డోర్ కింద స్లిప్ చేసేయేం!
(శిష్యుడు జుట్టు పీక్కోవడంలో నిమగ్నుడవుతాడు. ).
ఫ్లాష్ బ్యాక్ సమాప్తం.
అనాక్సీమాండర్ - అదీ జరిగింది.
శిష్య - అంటే గురూగారూ! ఈ విశ్వం ఓ పరిభ్రమించే నల్లని గోళం, అందులో చమ్కీల్లా అంటించిన తారలు దాంతో పాటు తిరుగుతూ ఉంటాయంటారు?
అనాక్సీమాండర్ - అవును.
శిష్య - అయితే నాకో సందేహం. ఇప్పుడు సూర్యుడు ఓ గోళం.
అనాక్సీమాండర్ - ఓ అగ్ని గోళం.
శిష్య - విశ్వమూ గోళమే.
అనాక్సీమాండర్ - అవును.
శిష్య - మరి చంద్రుడి మాటేమిటి? కొన్ని సార్లు గోళంలా కనిపించినా మరి కొన్ని సార్లు అర్థ చంద్రాకారంలో కనిపిస్తాడే?
అనాక్సీమాండర్ - నిజమే. అలా కనిపిస్తాడంతే. కాని నిజానికి చంద్రుడూ గోళమే.
శిష్య - అదెలా?
అనాక్సీమాండర్ - చంద్రుడికి తన స్వంత కాంతి లేదు. సూర్యకాంతి మీద పడితే మెరిసి మనని మురిపిస్తుంటాడు. సూర్యకాంతి ఏ దిశనుండి చంద్రుడు మీద పడుతోంది, మనం ఎట్నుంచి చంద్రుణ్ణి చూస్తున్నాం అన్న దాన్ని బట్టి చంద్రుడు కొన్ని సార్లు గుండ్రంగాను, కొన్ని సార్లు సన్నని కాంతి రేఖ లాగాను కనిపిస్తుంటాడు. కొన్ని సార్లు అసలు కనిపించనే కనిపించడు.
(భూమి సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉన్నప్పుడు, చంద్రుడు మనకి నిండు చందమామలా కనిపిస్తాడు. దాన్నే పున్నమి అంటాం. మనకి సూర్యుడు ఉన్న వైపే చంద్రుడు కూడా ఉన్నప్పుడు, రాత్రి పూట చంద్రుడు కనిపించడు. అదే అమావాస్య. ఈ మధ్య కాలంలో చంద్రుడు ఒక్కో దశలో ఒక్కో రూపంలో కనిపిస్తాడు.)
ఆ విధంగా అనాక్సీమాండర్ సూర్యచంద్రులు గోళాలని అర్థం చేసుకున్నాడు. మొత్తం విశ్వమంతా మరో పెద్ద గోళంగా ఊహించుకున్నాడు. కాని భూమి విషయంలో మాత్రం అది గోళమా కాదా అన్న విషయంలో ఎటూ తేల్చుకోలేకపోయాడు.
భూమిని గోళంగా భావించడమే కాక ఆ గోళం యొక్క చుట్టుకొలత కూడా ఓ చక్కని ప్రయోగం చేసి ఖచ్చితంగా కనుక్కున్న మరో ఘనుడు ఉన్నాడు. అతడే ఎరొటోస్తినీస్. పెళ్ళీ పెటాకులు లేనివాడు కనుక ఇలాంటి ప్రయోగాలతో జీవితం వెళ్ళబుచ్చుతుంటాడు.
మరికొంత వచ్చే టపాలో...
చాలా బాగుందండీ. ఇప్పుడే రెండు భాగాలూ చదివాను. మంచి ప్రయత్నం, కొనసాగించండి. ఒక్క ఉచిత సలహా. వ్రాసేది శాస్త్ర సంబంధమైన విషయాలమీద కాబట్టి ఎక్కువ కామెంట్లు రాకపోయినా నిరాశ చెందకండి. వ్యాఖ్యానించకపోయినా ఇలాంటి విషయాలమీద ఆసక్తి చూపే నాలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు.
కొంతమంది నా లాగా చదివి కామెంట్స్ రాయని వాళ్ళు కూడా వుంటారు.. సో Carry on with your efforts..
Well written....
బావుంది. పైన మీరు రాసిన డ్రామాలో కొంచెం అయినా నిజముందా లేక ఆసక్తికరంగా అనిపించేందుకు అలా వ్రాసారా?
అద్బుతంగా వ్రాస్తున్నారు. కంటిన్యూ చెయ్యండి.
నాలాగా చదివి కామెంట్స్ రాయని వాళ్ళు వుంటారు.. Carry on sir
ee naaTakaM asimOv raasina pustakaM lOni vRuttAMtAnni aadharaMgA chEsukuni rAsiMdi. vRuttAMtaM vAstavamE kAni saMghaTanalannI kalpitAlu.
UrikE cinnappillalaki saradAgA uMTuMdani alA rAyaDaM jarigiMdi.
nATakaM dvArA cinnapillalalO sainsunu sulabhaMgA pracAraM ceyyoccani oka nammakaM. vIluMTE marikonni sainsu nATakAlu rAyalani uddEshaM uMdi.
-chakravarti
అనాక్సిమాండర్ నుంచి గెలీలియో వరకు పూర్వపు సైటిస్టులందరూ సంప్రదాయ విశ్వాసాలకి భిన్నంగా ఆలోచించడం వల్ల మన విజ్ఞానం ఈ స్థాయికి వృద్ధి చెందింది.