శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

భూమి గుండ్రంగా ఉంది-3

Posted by నాగప్రసాద్ Friday, May 8, 2009
రచయిత: వి. శ్రీనివాస చక్రవర్తి.

భూమిని గోళంగా భావించడమే కాక ఆ గోళం యొక్క చుట్టుకొలత కూడా ఓ చక్కని ప్రయోగం చేసి ఖచ్చితంగా కనుక్కున్న మరో ఘనుడు ఉన్నాడు. అతడే ఎరొటోస్తినీస్. పెళ్ళీ పెటాకులు లేనివాడు కనుక ఇలాంటి ప్రయోగాలతో జీవితం వెళ్ళబుచ్చుతుంటాడు.


(ఎరొటొస్తినీస్ ఇంట్లో)
ఎరొటొస్తినీస్ - ఒరేయ్!
పనివాడు - అయ్యా, వస్తున్నా!
ఎరొటొస్తినీస్ - చిన్న పని చేసి పెట్టాల్రా చేస్తావా?
పనివాడు - చేస్తానండయ్యా, కాని...(భయంగా ఎరొటొస్తినీస్ చేతిలో ఉన్న టేపు కేసి చూస్తూ) కిందటి సారి ఇలాగే చిన్న పని అని చెప్పి అలెగ్జాండ్రియా చుట్టుకొలత అదుగో ఆ టేపుతోనే కొలుచుకు రమ్మన్నారు. ఎండదెబ్బ తగిలి వారం రోజులు మంచమెక్కా.
ఎరొటొస్తినీస్ - అబ్బా. అలాంటిదేం లేదురా. చాలా సింపుల్. ఈ కర్ర పాతాలి అంతే.
పనివాడు - ఏంటయ్యగారూ? ఏదైనా పందిరి వేయాలా? ఇప్పటికైనా పెళ్లి మీదకి గాలి గాని మళ్లిందా?
ఎరొటొస్తినీస్ - (కాస్త సిగ్గు పడుతూ) ఛఛ! భలే వాడివే! అలాంటిదేం లేదు.
ఎరొటొస్తినీస్ - పోనీ ఏదైనా జెండా ఎగరేయాలా?
ఎరొటొస్తినీస్ - ఒరేయ్ చెప్పిన పని చేస్తావా, కర్రకి బదులు నిన్ను పాతమంటావా?
పనివాడు - ఏదో తెలుసుకోవాలని అడిగానయ్యా. మీరే కదా అంటారు. ప్రతీ విషయాన్ని అదేంటబ్బా... "ప్రశ్నించి, అర్థం చేసుకుని చెయ్యాలి, గుడ్డిగా చెయ్యకూడదు" అంటారు.
ఎరొటొస్తినీస్ - ఏడ్చావులేపో.
పనివాడు - ఇదుగో పోతున్నా.
ఎరొటొస్తినీస్ - ఎక్కడికి?
పనివాడు - పెరట్లో కర్ర పాతడానికి. పోని ముంగిట్లో పాతమంటారా? మళ్లీ ఎప్పుడైనా పందిరికి పనికొస్తుంది. (వెకిలి నవ్వు నవ్వుతూ)
ఎరొటొస్తినీస్ - అదేమరి. చెప్పేది పూర్తిగా విను. కర్ర పాతాల్సింది ఇక్కడ కాదు.
పనివాడు - మరెక్కడ?
ఎరొటొస్తినీస్ - సీన్ లో.
పనివాడు - ఏ సీన్ లో? మొదటి సీన్ లోనా, ఆఖరు సీన్ లోనా?
ఎరొటొస్తినీస్ - సీన్ నగరంలో!
పనివాడు - ఏంటీ సీన్ నగరంలోనా? అయ్యా! సీన్ నగరం ఇక్కణ్ణుంచి 500 మైళ్లు ఉంటుంది. అంత దూరం వెళ్ళి ఈ చిన్న కర్ర పాతి పరుగెత్తు కొచ్చేయమంటారా? ఇంతకీ ఈ మహత్కార్యం ఎందుకు తలపెట్టారో తెలుసుకోవచ్చా మహాప్రభో?
ఎరొటొస్తినీస్ - ఓ చిన్న ప్రయోగం చేయాల్రా. దాంతో భూమి గుండ్రంగా ఉందో లేదో తేలిపోతుంది. నువ్వు చెప్పు. భూమి గుండ్రంగా ఉందా, చదునుగా ఉందా?
పనివాడు - ఎదురుగా కనిపిస్తుంటే చిత్రంగా వాదిస్తారేంటయ్యా? చదునుగానే ఉంది.
ఎరొటొస్తినీస్ - అదేంటో చూద్దాం. భూమి బల్ల పరుపుగా ఉంటే ఒకే సమయంలో ఒకే ఎత్తున్న వస్తువుల నీడలు ఒకే పొడవు ఉంటాయి. అలా లేకపోతే భూమి వంపు తిరిగి ఉందన్నమాట.
పనివాడు - ఏమోనయ్యా! మీరు చెప్పింది బాగానే ఉంది. ఇంతకీ ఏం చెయ్యాలో చెప్పండి.
ఎరొటొస్తినీస్ - వెంటనే సీన్ కి బయలుదేరు. బుధవారానికల్లా చేరుకుంటావు. గురువారం మధ్యాహ్నం సరిగ్గా 12గంటలకి ఈ కర్ర పాతి దాని నీడ పొడవు కొలుచుకురా.

ఒకే పొడవు ఉన్న రెండు కర్రలని 500 మైళ్ల ఎడంలో నేలలో పాతాం అనుకుందాం. ఒక సమయంలో సూర్యుడు ఆ రెండు కర్రలలో ఒక దాని నడి నెత్తి మీద ఉన్నాడు అనుకుందాం. దానికి అసలు నీడ పడదు. కాని రెండవ కర్రకి చిన్న నీడ పడుతుంది. ఆ నీడ పొడవు బట్టి భూమి వ్యాసం కొలవొచ్చు. అలా కొలిచి భూమి వ్యాసం 8000 మైళ్లని అంచనా వేశాడు ఎరొటొస్తినీస్. ఆధునిక అంచనాలను బట్టి ఆ విలువ 7,900 మైళ్లు.

భూమి ఎలా ఉంటుంది అన్న విషయం మీద కవితలు రాయటం, కొలతలు తీయటం ఇవన్నీ ఒక ఎత్తు. భూమి గుండ్రంగా ఉంది అన్న నమ్మకం మీద ప్రాణాలొడ్డి ఏవో అజ్ఞాత సముద్రాల మీద ధ్వజం ఎత్తటం ఒక ఎత్తు. అలా ధ్వజమెత్తిన ఓ ధీరుడి పేరే కొలంబస్.

మరికొంత వచ్చే టపాలో...

7 comments

  1. భూమి గుండ్రంగా ఉందని మొదట ఊహించినది పథాగొరస్ శిష్యులు అని చదివాను. గ్రహణం సమయంలో భూమి నీడ చంద్రుని మీద eliptical shape (గోళాకారం) లో పడుతుంది కాబట్టి భూమి గుండ్రంగా ఉంటుందని పైథాగొరస్ శిష్యులు ఊహించారు కానీ అప్పట్లో వాళ్ళ మాటలు ఎవరూ నమ్మలేదు. అదే సమయంలో భారతీయ శాస్త్రవేత్త ఆర్యభట్టు కూడా భూమి నీడ చంద్రుని మీద పడడం వల్లే గ్రహణాలు ఏర్పడతాయని, రాహుకేతువులు లేవని వాదించాడు. అతని మాటలు కూడా ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు కూడా జ్యోతిషులు గ్రహణాలు చూడకూడదంటారు. మా ఇంట్లో కూడా గ్రహణం పూట భోజనం చెయ్యరు. నేను ఒక్కడినే ఆ టైమ్ లో తింటాను.

     
  2. ధ్రువ నక్షత్రం గ్రీస్ లొ చూసినప్పుడు ఆకాశంలో కొంత ఎత్తులో కనబడటం అదే భూమధ్య రేఖా ప్రాంతంలో నేల వారుగా కనబడటం బట్టి భూమి గుండ్రంగా వుందని, దాని వ్యాసం ఇంత అని అరిస్టాటిల్ ప్రతిపాదించినట్లు చెబుతారు. ఇక పడవలు వాటి పొగగొట్టాలు సరేసరి. బహుశా ఒకేసమయంలో అందరూ ఇదే పనిలో ఉండుంటారు.

    మీ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అబినందిస్తూ... అరుణ్.

     
  3. ప్రవీణ్ గారు...

    గ్రహణాస్నానాలు, ఉపవాసాలు మరీ అహేతుకాలే కానీ (సరైన ఉపకరణలు లేకుండా)గ్రహణాలను చూడొద్దని చెప్పటం కాదనుకుంటా. మామూలు సమయాల్లో ఎలాగూ చూడలేము కాబట్టి ఫర్వాలేదు కానీ వెలుతురు తక్కువగాఉండి సూర్యుణ్ణీ నేరుగా చూడగల ఆసమయాల్లో అతినీలలోహిత కాంతి ప్రభావానికి లోనై దృష్టిదోషాలు తలెత్తుతాయని ఇప్పుడు శాస్త్రీయంగా వివరణ ఇస్తునారు.

     
  4. సన్ గ్లాసెస్ పెట్టుకుని ఎవరైనా గ్రహణాలు చూడొచ్చు. జ్యోతిషులు చెప్పే విషయాలలో అనేక పొంతన లేని విషయాలు ఉంటాయి. నేను ఇన్ని సార్లు గ్రహణ సమయంలో భోజనం చేశాను. నాకు ఏమీ కాలేదు. కేవలం పొట్ట కూటి కోసం జాతకాలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మి ఉపవాసం ఎందుకు ఉండాలి?

     
  5. ఆసక్తికరంగా వుంది పైన మీరు చెప్పిన కథ. చిన్నప్పుడు చదివిన తెలుగు సైన్స్ సాహిత్యం గుర్తుకువస్తోంది.

     
  6. కర్రల కొలతలు వేసి భూమి గుండ్రంగా ఉందని నిరూపించడం చాలా కష్టం. చిన్నప్పుడు ఇంకో కథ చదివాను "ఎత్తైన కొండ మీదకి ఎక్కి చూస్తే భూమి కొంచెం వంకరగా కనిపిస్తుంది, ఆ రకంగా కూడా భూమి గుండ్రంగా ఉంటుందని ఊహించారు" అని. ఆ రకంగా కూడా భూమి గుండ్రంగా ఉందని నిరూపించడం కష్టమే. భూమికి 300 కి.మి. ఎత్తుకు వెళ్తే భూమి పూర్తి గోళాకారంలో కనిపిస్తుంది. మా జిల్లాలో కొండలు తక్కువ. అందులోనూ కిలో మీటర్ కంటే ఎక్కువ ఎత్తైన కొండలు తక్కువ. ఎప్పుడో టెంత్ క్లాస్ చదివే రోజుల్లో మా అమ్మమ్మ గారి ఊరు పక్కన ఉన్న కొండ ఎక్కాను. ఆ కొండ ఎత్తు 500 మీటర్లు లేదా అంత కంటే ఎక్కువ ఉండొచ్చు. ఎప్పుడైనా టైమ్ దొరికితే మరీ ఎత్తైన కొండ ఎక్కి పరిశీలిస్తాను.

     
  7. స్పందించిన అందరికీ నెనర్లు. ప్రస్తుతానికి ఇక్కడ నేను పోస్టుతున్నది మా కాలేజీలో వేసిన "హాస్య భరిత సైన్సు నాటిక". మా కాలేజీలోని ఫ్రొఫెసర్ శ్రీనివాస చక్రవర్తి గారు సైన్సును తెలుగులోకి అనువదిస్తుంటారు. అది కూడా పాఠ్యపుస్తకాల్లాగా కాకుండా ఒక నవల చదువుతున్నట్లుగా ఉండాలనే ఉద్దేశ్యంతో అతను ఇప్పటికే కొన్ని పుస్తకాలను అనువదించాడు. ఆ పుస్తకాలు "జన విఙ్ఞాన వేదిక" లో లభిస్తాయి. వెల 15 రూపాయల దాకా ఉంటుంది. లేదా ఈ క్రింది లింకు నుండి ఈ-పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చును. http://vidyaonline.org/arvindgupta/earthisroundtelegu.pdf

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts