శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

తెలుగులో సైన్స్ సాహిత్యం.

Posted by నాగప్రసాద్ Wednesday, May 6, 2009
నేటి ప్రపంచంలో మనిషికి ఉండాల్సిన అత్యంత విలువైన లక్షణాలు...కలువ కళ్లు, బొమవిళ్లు, కోటేరేసిన ముక్కులు, గుండెని పిండే దృక్కులు, మోకాళ్లని, మడమల్ని, మహిని తాకే చేతులు, - ఇవేవీ కావు. నేటి ప్రపంచాన్ని నడిపిస్తున్న అగ్రరాజ్యాల ప్రాబల్యం వెనుక, మహాసంస్థల ప్రభావం వెనుక, మేటి నేతల నేతృత్వం వెనుక, విశేష వ్యక్తుల విజయాల వెనుక ఒకే ఒక శక్తి ఆధారభూతంగా ఉండడం కనిపిస్తుంది. తక్కిన ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా అవన్నీ కూడా చివరికి ఈ ఒక్క సత్తాలోనే నాటుకుని ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ శక్తి పేరు...పరిజ్ఞానం.

నేటి ప్రపంచాన్ని, సమాజాన్ని, సమస్త జీవన వైనాన్ని, సారాన్ని ఒక్క మాటలో వర్ణించాలంటే 'సంక్లిష్టత' అన్న మాటే ప్రధానంగా మనసుకి స్ఫురిస్తోంది. నేటి వ్యవస్థలో ఏ పని చెయ్యాలన్నా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అత్యంత నిర్దిష్టమైన, సునిశ్చయమైన సమాచారం అవసరమవుతోంది. ఆ సమాచారం నిపుణుల సొత్తు. ఒక పరుగు పందేనికి వెళ్లాలంటే ఎంతో సువిస్తారమైన పరిజ్ఞానాన్ని అందించే నిపుణుల ప్రమేయం తప్పనిసరి అవుతోంది. అలాగే డబ్బు ఆదా చెయ్యడం అంటే ఊరికే బ్యాంకులో దాచుకోవడం కాదు. డబ్బుకి ఇప్పుడు శతకోటి రూపాలు ఉన్నాయి. వాటిని శాసించడానికి శతకోటి ఉపాయాలు ఉంటాయి. అవి నిపుణుడికే తెలుస్తాయి. జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలో నేర్పిస్తాడో నిపుణుడు. ఏ స్కూలు కెళ్లాలో, ఏ ఉద్యోగం చెయ్యాలో, ఏ ఉద్యోగానికి మారాలో, ఎప్పుడు, ఎలా రిటయిరవ్వాలో, చావాలో(?) దీనికీ ఉన్నారు నిపుణులు. నలుగురిలో ఎలా మాట్లాడాలో, మసలుకోవాలో, ఎలా నవ్వాలో, తినాలో... నిపుణుల నైపుణ్యం లేకుండా శ్వాస కూడా తీసుకోలేని రోజులివి.

'మామూలుగా', పరిపాటిగా పనులు చేసే యుగం కాదిది. ప్రతీ పనిని, వ్యవహారాన్ని శాసించే పరిజ్ఞానాన్ని సమగ్రంగా సంపాదించి, లేదా అది ఉన్నవారిని సంప్రదించి తీరుగా చేసిన పనే నిలుస్తోంది. సార్థకమవుతోంది. సామర్థ్యానికి మూలం పరిజ్ఞానం. మన ఆశయాలకి, వాటి సిద్ధికి మధ్య నిలిచిన బలమైన, బారైన సోపానమే పరిజ్ఞానం. "కర్మలలో కౌశలం"లోని మూల రహస్యం అదే. పరిజ్ఞానం, నైపుణ్యం, సమాచారం నేటి జీవితాల్ని అదిలిస్తున్న అధిదేవతలు.

అయితే నిపుణులతో వ్యవహారం అంటే కాస్త వ్యయంతో కూడుకున్న పని. అందుచేత వాళ్లు అందరికీ అందుబాటులో ఉండరు. ఇక మనకు మిగిలినవి సమాచార మాధ్యమాలు. టీవీ, ఇంటర్నెట్, పత్రికలు, పుస్తకాలు. వీటిలో మళ్లీ అన్నీ పెద్ద నగరాల్లో తప్ప, చిన్న ఊళ్లలో, పల్లెల్లో ఉండవు. చిన్న ఊళ్లలో పరిజ్ఞానం అంటే అది టీవీ ద్వారానో, పత్రికల, పుస్తకాల ద్వారానో, వీటన్నిటి కన్నా మించి నోటి మాట ద్వారానో, సాంప్రదాయ బద్ధంగానో రావాల్సిందే. ఇందులో మళ్లీ టీవీలో, పత్రికల్లో వచ్చే సమాచారం అల్పాయుష్షు కలదై ఉంటుంది. సందర్భోచితంగా పనికొస్తుందేమో గాని ఎక్కువ కాలం నిలవదు. నాలుగు కాలాల పాటు నిలిచే సమాచార ప్రచారానికి వీలైన మాధ్యమం పుస్తకం.

పుస్తకం అనగానే దృష్టి సాహిత్యం వైపు మరల్చక తప్పదు. సాహిత్యం అంటే మన సాహిత్యం, అంటే తెలుగు సాహిత్యం అన్నమాట. తెలుగు సాహిత్యం ఎంతో గొప్పది. కాదనం. కాని దాని వృద్ధిలో ఒక విధమైన ఏకపక్ష వైఖరి కనిపిస్తోంది. సాహిత్యాన్ని కల్పితం (fiction), అకల్పితం (non-fiction) అని విభాగిస్తే, తెలుగులో అకల్పిత సాహిత్యం చాలా చాలా తక్కువ అని చెప్పుకోవాల్సివస్తుంది. ఇక్కడ మళ్లీ నా ఉద్దేశ్యంలో పాఠ్య పుస్తకాలు అకల్పిత సాహిత్యం కిందకి రావు. మన దేశంలో చదువులు పరీక్షల కోసం, ఉద్యోగాల కోసం మొక్కుబడిగా చేసే కర్మకాండలు అని అందరికీ తెలిసిందే. కనుక పాఠ్యపుస్తకాల మాట పక్కన పెడితే శాస్త్రీయ పుస్తకాలు అరుదే. శాస్త్రం అంటే కేవలం సైన్సు మాత్రమే కాదు. వాణిజ్య శాస్త్రం, మానవ వనరుల శాస్త్రం ఇలా జీవితంలో ఏ అంశం మీద అయినా, దానికి ఆధారభూతంగా ఉండే కొన్ని సత్యాలని, వాస్తవాలని పొందుపరిచి, వాటి మీద తగిన పరిభాషతో చేసే వ్యాఖ్యానమే శాస్త్రం అవుతుంది. కనుక లెక్కల్లో ఒక పుస్తకం, రసాయన శాస్త్రం మీద ఒకటిన్నర, ఖగోళ శాస్త్రం మీద అర, జన్యు శాస్త్రం మీద ముప్పావు - ఇలా ఏదో మొక్కుబడిగా, లాంచన ప్రాయంగా చూపించే నిదర్శనాలు, ప్రభుత్వ రంగాల్లో క్రింద ఉద్యోగులు, పై అధికారులకి ఒప్పజెప్పే లెక్కల్లా బాగానే ఉంటాయేమోగాని, విశాలమైన సామాజిక అవసరాల దృష్ట్యా ఏ మూలకీ రావు. క్రిప్టాలజీ దగ్గర్నుండి ట్రైబాలజీ దాక, క్వాంటం కంప్యూటింగ్ దగ్గర్నుండి కెయాస్ సిద్ధాంతం దాక, బయోటెక్నాలజీ దగ్గర్నుండి, నానో టెక్నాలజీ దాక - ఒక్కటేమిటి ఏదీ వదలకుండా ఆధునిక విజ్ఞానార్ణవాన్ని బొట్టు బొట్టుగా మన మనసులనే దొన్నెలతో ఆత్రంగా తోడి, తెలుగు పుస్తక తటాకాలని అంచుల దాక పూరించాలి. తెలుగులో శాస్త్రీయ రచనని ఓ ఉద్యమంలా తీసుకుని ఇటు తెలుగు భాషా జ్ఞానం, అటు శాస్త్ర పరిచయం ఉన్న ఔత్సాహికులంతా నడుం కట్టి కనీసం ఓ రెండు దశాబ్దాలు గట్టి కృషి చేస్తే గాని తెలుగులో అకల్పిత సాహిత్యంలో ఉన్న ఈ అగాధమైన వెలితిని పూడ్చలేమని నాకనిపిస్తుంది.

తెలుగులో అకాల్పనిక సాహిత్యాన్ని బలపరిచి తెలుగు సాహిత్యాన్ని పునర్నవీకరించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.

రచయిత: వి. శ్రీనివాస చక్రవర్తి.

5 comments

  1. అవును

     
  2. మీ బ్లాగు చాలా బాగుందండి! మీ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను!

     
  3. చాలా మంచి యత్నం. అభినందనలు.

     
  4. Anonymous Says:
  5. You can use google knol to develop articles in Telugu.

    http://knol.google.com/k/narayana-rao-kvss/telugu-knol-authors-and-visitors/2utb2lsm2k7a/1179#view

     
  6. చక్రవర్తి గారు జన విజ్ఞాన వేదిక సభ్యులు కావడం కూడా సంతోషం కలిగించే విషయం.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts