ఈ పద్ధతితో కండరాల సంకోచానికి కావలసిన శక్తికి మూలం గ్లైకోజెన్ యే నన్న మునుపటి వాదనని వమ్ముచెయ్యడానికి సుబ్బారావుకి సాధ్యం అయ్యింది. ఈ వాదనే 1922 లో హిల్, మెయెరోఫ్ లకి వైద్య, జీవక్రియా శాస్త్రాలలో నోబెల్ బహుమతిని తెచ్చి పెట్టింది. కండరాల సంకోచమే కాదు సమస్త జీవక్రియలకి శక్తి మూలం ఆడెనొసిన్ ట్రైఫాస్ఫేట్ అనే అణువు అని సుబ్బారావు కనుక్కున్నాడు. అంటే విశ్రాంత స్థితిలో ఉన్న కండరం కన్నా, అలసిన స్థితిలో కండరంలో ఏ.టీ.పీ. సాంద్రత తక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఆవిష్కరణలన్నీ ఏప్రిల్ 1927 నాటి సంచికలో ప్రఖ్యాత ’సైన్స్’ పత్రికలో అచ్చయ్యాయి. ఈ పరిశోధనే అతడికి డాక్టరేట్ పట్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ పరిణామంతో వైజ్ఞానిక సంఘంలో సుబ్బారావు గౌరవం అమాంతంగా పెరిగింది. అది చూసి రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ అతడికి ఫెలోషిప్ కూడా ఇచ్చి ఆదరించంది.
ఆ తరువాత సుబ్బారావు భయంకరమైన ఎనీమియా వ్యాధి మీద ధ్వజం ఎత్తాడు. పంది కాలేయం నుంచి విటమిన్ బి 12 వెలికి తీసి, అది ఎనీమియా కి విరుగుడుగా పనిచేస్తుందని నిరూపించాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా విటమిన్ల వేట మొదలయ్యింది. ఆ ప్రయత్నంలో ఎన్నో కొత్త విటమిన్లు కనుక్కోబడ్డాయి.
విశ్వవిద్యాలయాలలో కన్నా పెద్ద పెద్ద ఫార్మసూటికల్ కంపెనీలలో అయితే పరిశోధనకి మరింత మెరుగైన సౌకర్యాలు ఉంటాయని అనిపించింది సుబ్బారావుకి. కనుక 1940 లో పేరు మోసిన లీడర్లే లాబరేటరీలలో చేరాడు. ఈ కొత్త ఉద్యోగంలో చేరాక ఎంతో కాలం పగలనక్ రాత్రనక కృషి చేసి ఫోలిక్ ఆసిడ్ ని సంయోజించ గలిగాడు. గత యాభై సంవత్సరాలలోను విటమిన్ బి 12 తో పాటు ఈ ఫోలిక్ ఆసిడ్ కూడా ఎనీమియాకి మందుగా పని చేసి మానవజాతికి ఎంతో మేలు చేసింది.
అక్కడితో ఆగక సుబ్బారావు, అతడి వైజ్ఞానిక బృందం ఎన్నో ఇతర వ్యాధుల మీద యుద్ధం ప్రకటించారు. ఈ పరిశోధనలలో ఆయన రెండు పడవల మీద ప్రయాణిం సాగించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన జీవ అణువులని అణువణువూ తెలిసిన రసాయన శాస్త్రవేత్త మాత్రమే కాదు, మానవయాతనని ఎలాగైన ఉపశమింపజేయడానికి కంకణం కట్టుకున్న దయామయుడైన వైద్యుడు కూడా. తనలోని ఈ రెండు సామర్థ్యాలు – మనుషుల పట్ల కరుణ, రసాయన శాస్త్రంలో అనుపమాన ప్రజ్ఞ – తన బృందాకి కూడా నిరంతరం స్ఫూర్తిదాయకంగా ఉండేవి.
1928 లో అలెక్సాండర్ ఫ్లెమింగ్ సూక్ష్మక్రిముల పాలిటి బ్రహ్మాస్త్రం లాంటి ఓ కొత్త శక్తివంతమైన మందుని కనుక్కున్నాడు. దాని పేరే పెన్సిలిన్. పెన్సిలిన్ రాకతో వైద్యచరిత్రలో ఆంటీబయాటిక్ యుగం మొదలయ్యింది. ఆ కొత్త రకం మందుల ప్రాముఖ్య్తత సుబ్బారావు మొదట్లోనే పసిగట్టాడు. ఓ వృక్షశాస్త్రవేత్తని తన బృందంలో చేరుకుని ప్రపంచం నలుమూలల నుండి తెప్పిచ్చిన మట్టి నుండి వెలికి తీసిన ’మోల్డ్’ లని విశ్లేషించే పని మీద పెట్టాడు. ఈ ప్రయత్నంలొనే A-377 అనే ఓ శక్తివంతమైన మోల్డ్ తయారయ్యింది. ఈ మందు గురించి సుబ్బారావు ఇలా రాసుకున్నాడు. “ఎంతో వైవిధ్యం గల రోగకారక క్రిముల మీద ఈ మందు నాగుపాము కాటులా పనిచేస్తుంది. కాని ఇతర శరీర కణాల మీద మాత్రం దీని ప్రభావం పిల్లికూన స్పర్శలాగా సున్నితంగా ఉంటుంది.” ఈ విధంగా టెట్రాసైకిలిన్ అనే కొత్త రకం ఆంటీబయాటిక్ మందులు తయారయ్యాయి.
ఆంటీబయాటిక్ రంగంలో తను సాధించిన విజయాలతో తృప్తి పడక పోలియో, కాన్సర్ వ్యాధుల మీద యుద్ధం ఆరంభించాడు. ఈ ప్రయత్నంలో పుట్టిన మందుల్లో టియోర్టెరిన్ (teorpterin) ఒకటి. ఇది లుకేమియా మందుగా సత్ఫలితాలనిచ్చింది.
1948, ఆగస్టు 9, సోమవారం, నాడు సుబ్బారావు ఆఫీసుకి రాకపోవడం చూసి తోటి ఉద్యోగులు ఆశ్చర్యపొయారు. శ్రమవ్యసన పరుడైన సుబ్బారావు ఇలా సోమవారం నాడు ఆఫీసుకి రాకపోవడం విడ్డూరంగా అనిపించింది. ఇంటికి వెళ్లి చూస్తే ఆయన బలమైన గుండెపోటుతో మరణించాడని తెలిసింది. అప్పటికి ఆయన వయసు 53. అమెరికాకి వచ్చిన తరువాత మళ్లీ ఎప్పుడూ ఆయన ఇండియాకి తిరిగి వెళ్లలేదు.
సంపూర్ణ చిత్తశుద్ధితో శాస్త్రవృత్తిని ఓ యజ్ఞంలా ఆచరించిన దీక్షాపరుడు సుబ్బారావు. తన ఆవిష్కరణల నుండి లౌకికమైన లబ్ది పొందాలని ఎప్పుడూ అనుకోలేదు. వాటి మీద పేటెంట్ల కోసం ఎన్నడూ ప్రయత్నించలేదు. పత్రికలు, పత్రికా విలేకరులు, పదవులు, బిరుదులు, - వీటన్నిటికి దూరంగా ఉండేవాడు. కాని భారత రత్న బిరుద ప్రదానం కోసం ఆయన పేరు ఒకసారి సూచించబడింది. అమెరికా పౌరుడు అయ్యే అవకాశం ఉన్నా భారతీయ పౌరుడిగానే ఉండిపోయాడు. ఎన్నో మహత్తర శాస్త్ర విజయాలు సాధించినా, సాధించినదానితో తృప్తి పడకుండా, పేరుకోసం, డబ్బుకోసం ప్రాకులాడకుండా, ఎప్పుడూ ఇంకా ఏవో మహోన్నత లక్ష్యాల కోసం అనిద్రితంగా శ్రమించే ఆదర్శశాస్త్రవేత్త సుబ్బారావు. ఆంధ్రులకి మాత్రమే కాదు, యావత్ భారతానికి, సమస్త వైజ్ఞానిక లోకానికి ఆయన చిరస్మరణీయుడు.
Reference:
Arvind Gupta, Great Indian Scientists.
Can you please give the link to Arvind Gupta article. Is it somewhere in http://www.arvindguptatoys.com/
Thanks.
swarup
Folic Acid & Tetracyclin are invented by Subbarao
Swarup garu:
Yes the English original of this article is in http://www.arvindguptatoys.com/ in "books" section.