“నువ్వు డా. ఎల్లా ప్రగడ సుబ్బారావు గురించి విని ఉండకపోవచ్చు. కాని ఆయన ఉండబట్టే నీ ఆయువు మరింత పెరిగింది” – డోరాన్ కె. ఆంట్రిమ్.
“వైద్య రంగంలో ఈ శతాబ్దంలోనే ఓ గొప్ప మేధావి,”” అంటూ న్యూ యార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక డా. ఎల్లాప్రగడ సుబ్బారావును ప్రశంసించింది. “ఎన్నో మహమ్మారి వ్యాధులకి విరుగుడు కనుక్కుని ప్రపంచం అంతటా కోటానుకోట్ల వ్యాధిగ్రస్తులకి స్వస్థత చేకూర్చాడు.”
ఎల్లాప్రగడ సుబ్బారావు పుట్టిన తేది జనవరి 12, 1895. స్వగ్రామం పశ్చిమగోదావరిలోని భీమవరం.
ఏడుగురు సంతానంలో ఇతడు మూడోవాడు. తండ్రి జగన్నాథం అనారోగ్యం వల్ల తొందరగా పదవీవిరమణ చెయ్యాల్సి వచ్చింది. నాటి నుండి ఇల్లు గడవడం కష్టం అయ్యింది. ఇంట్లో పరిస్థితి అలా దీనంగా ఉండడంతో సుబ్బారావు మనసు చదువు మీద నిలవలేకపోయింది. ఒకరోజు ఎవరితోనూ చెప్పాపెట్టకుండా ఇల్లు వదిలి వారణాసికి పారిపోవాలని ప్రయత్నించాడు. అక్కడైనా తల రాత మారుతుందేమో నని ఓ ఆశ. కాని తల్లి వెంకమ్మ ఎలాగో కొడుకు పన్నాగం పసిగట్టి, తిరిగి ఇంటికి తెచ్చింది. వెర్రి మొర్రి వేషాలు వెయ్యకుండా బుద్ధిగా చదువుకోమని బడికి పంపించింది. భర్త మరణం తరువాత వెంకమ్మ తన మంగళసూత్రం అమ్మి కొడుకు చదువుకి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడింది.
మద్రాసులో ప్రెసిడెన్సీ కాలేజిలో చదువుకునే రోజుల్లో తరచు రామకృష్ణా మిషన్ కి వెళ్తూ ఉండేవాడు. అక్కడ చాలా సేపు కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ఒకదశలో సన్యసించి సంసారాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని ఆరాట పడ్డాడు. కాని అలాంటి ఆలోచనే పెట్టుకో వద్దని తల్లి గట్టిగా మందలించింది. చివరికి చేసేది లేక మద్రాస్ మెడికల్ కాలేజిలో చేరాడు. డాక్టరుగా శిక్షణ పొందితే రామకృష్ణా మిషన్ ఆస్పత్రులలో డాక్టరుగా పని చెయ్యొచ్చని అనుకుని సరిపెట్టుకున్నాడు. కాని చదువుకి అయ్యే ఖర్చు భరించే స్తోమత తనకి లేదు. ఇక ఒక్కటే మార్గం. పెళ్లి చేసుకుంటే కట్నం డబ్బుతో హాయిగా చదువుకోవచ్చు! ఆ రోజుల్లో ఎంతో మంది యువకులు చేసే పనే తనూ చేశాడు. తల్లి కూడా తన ఆలోచనని ఆమోదించింది. అయితే ఆవిడ కారణాలు వేరు. ఇలాగైనా కొడుకు ’పిచ్చి’ కుదురుతుందని ఆవిడ ఆశ. చివరికి మే 10, 1919 నాడు తన కన్నా 12 ఏళ్లు చిన్నదైన శేషగిరిని వివాహం చేసుకున్నాడు.
ఆ రోజుల్లోనే గాంధీ మొదలుపెట్టిన స్వదేశీ ఉద్యమం చేత ప్రభావితుడైన సుబ్బారావు బ్రిటిష్ వస్తువులని వాడడం మానేశాడు. ఖాదీ బట్టలు వేసుకోవడం మొదలెట్టాడు. ఈ పద్ధతి కాలేజిలో ఇంగ్లీషు అధికారులకి నచ్చలేదు. దాంతో తనకి న్యాయంగా ఇవ్వాల్సిన ఎమ్.బి.బి.ఎస్. డిగ్రీకి బదులు మరింత తక్కువదైన ఎల్.ఎమ్.ఎస్. డిగ్రీ మాత్రం ఇచ్చారు.
దాంతో ఒళ్లు మండిన సుబ్బారావు పాశ్చాత్య వైద్య వ్యవస్థ మీదే ధ్వజం ఎత్తాడు. పాశ్చాత్యపద్ధతిలో ప్రాక్టీసు చెయ్యకుండా పోయి మద్రాస్ ఆయుర్వేదం కాలేజిలో అనాటమీ లెక్చరరుగా చేరాడు.
ఆ కాలంలోనే అమెరికా నుండి వచ్చిన ఓ డాక్టరు, సుబ్బారావుకి పరిచయం అయ్యాడు. పైచదువులకి అమెరికా వెళ్లమని సలహా ఇచ్చాడు ఆ డాక్టరు. మామగారు ఇచ్చింది కొంత, శ్రేయోభిలాషులు ఇచ్చింది కొంత కూడేసుకుని, మూడేళ్లలో తిరిగొస్తానని ఇంకా ఇరవై కూడా దాటని తన కుర్ర భార్యకి మాటిచ్చి, అమెరికాకి బయలుదేరాడు. కాని దురదృష్టవశాత్తు ఆమె మళ్లీ ఎప్పుడూ తన భర్తని చూడలేదు.
1923 అక్టోబర్ 26 నాడు జేబులో 100 డాలర్లతో బాస్టన్ నగరంలో దిగాడు సుబ్బారావు. స్కాలర్షిప్ సంపాదించడానికి తన ఎల్.ఎమ్.ఎస్. సటిఫికేట్ సరిపోలేదు. ఆ దుర్భరమైన తొలి దశలలో సుబ్బారావు ప్రొఫెసర్ అయిన డా. రిచర్డ్ స్ట్రాంగ్ తనకి ఎన్నో విధాలుగా సహాయం చేశాడు. తీరిక వేళల్లో ఆస్పత్రిలో చిన్నా చితకా పనులు చేసుకూంటూ ఎలాగో బతుకు వెళ్లబుచ్చాడు.
చివరికి హార్వర్డ్ మెడికల్ స్కూల్ నుండి ట్రాపికల్ మెడిసిన్ లో డిప్లొమా సాధించాడు. డా. క్రయస్ ఫిస్క్ అనే శాస్త్రవేత్తకి చెందిన బయోకెమిస్ట్రీ లాబరేటరీలో చేరాడు. అక్కడ పని చేసిన రోజుల్లోనే రక్తంలోను, మూత్రంలోను ఫాస్ఫరస్ శాతాన్ని అంచనా వెయ్యడానికి ఓ కొత్త పద్ధతి కనిపెట్టాడు. ఇదే ఫిస్క్-సుబ్బారావ్ పద్ధతిగా పేరు పొందింది. బయోకెమిస్త్రీ విద్యార్థులు ఇప్పటికీ ఈ పద్ధతి గురించి చదువుకుంటారు. ఇటివలి కాలంలో థైరాయిడ్ సమస్యలని, మూత్ర వ్యవస్థకి చెందిన రికెట్స్ (renal rickets) ని కనిపెట్టడానికి ఇదో ముఖ్యమైన ఆయుధంగా పరిణమించింది.
(సశేషం...)
ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాలలో ఈయన గురించి చదువుకున్నాం కానీ అంతగా గుర్తు లేదు. మళ్ళీ పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు.
I once saw a website dedicated to him and cannot find it any more. Have you noticed any? Meanwhile here are a couple of interesting articles about him which you might have seen:
http://www.lilburnes.org/Students/Scientists/4thB/Yellapragada_SubbaRow_Destiny.htm
http://www.abitabout.com/Yellapragada+Subbarao
Found it. Apparently it is being upgraded:
http://www.ysubbarow.info/fifthlecture1.html
Swarup garu
Thank you very much for the info. Will look them up.
Great !! Thanks Chakravartigaaru and Gadde Saroop gaaru