శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.










వడ్రంగి పిట్టకి తల బొప్పి ఎందుకు కట్టదు?

సరదాగా ఓ సారి తీరిక వేళలో ఎప్పుడైనా ఓ చిన్న ప్రయోగం చెయ్యండి. మంచి ముహూర్తం చూసుకొని, మాంచి గోడ చూసుకుని, దాని మీద తలని వేగంగా ఠపీ ఠపీ మని బాదుకోవాలన్నమాట. అదీ మామూలుగా కాదు. వేగం కనీసం 7 m/sec ఉండాలి, సెకనుకి కనీసం 20 సార్లయినా బాదుకోవాలి. త్వరణం భూమి గురుత్వ త్వరణానికి ఓ వెయ్యి రెట్లు పైగా ఉంటే బావుంటుంది. కొంచెం కష్టమే నంటారా? అదేంటండి బాబు? ఓ చిన్న పిట్ట చెయ్యగా లేంది చెట్టంత మనిషి చెయ్యలేడా?



టటట... అంటూ చిర్రెత్తించే చప్పుడు చేస్తూ కనిపించే ప్రతీ చెట్టు మీదా తూట్లు పొడిచే వడ్రంగి పిట్ట (woodpecker) గురించి అందరం వినేవుంటాం. కారడవి లాంటి మా క్యాంపస్ లో ఎన్నో సార్లు కనిపిస్తుంటాయి కూడా. అంత వేగంతో, అన్ని సార్లు, అంత సేపు అలా తలని చెట్లకి బాదుకుంటే మరి పాపం ఆ చిన్నారి తలకి ఏమీ కాదా? తెగి కింద పడదా? కనీసం తలనెప్పి కూడా రాదా?



మామూలుగా ఈ విషయం గురించి ఆలోచించం గాని, ఈ పిట్టది నిజంగా గట్టి బుర్రే. పక్షుల్లో కూడా ఈ పిట్ట ఈ విషయంలో ప్రత్యేకం. ఎందుకంటే ఇతర రకాల పక్షులకి ఈ సామర్థ్యం ఉన్నట్టు కనిపించదు. పొరపాట్న ఏ గాజు కిటికీకో గుద్దుకున్న పక్షులు ఎన్నో సార్లు ఆ దెబ్బకి తట్టుకొలేక స్పృహ కోల్పోయి నిశ్చేష్టంగా కింద పడడం చూస్తుంటాం. కాసేపయ్యాక మళ్లీ తేరుకుని తమ ఆకాశ విహారంలో సాగిపోతాయి. అది వేరే విషయం. కాని వడ్రంగి పిట్టకి ఈ సమస్యలేమీ లేవు.

’...కాదేదీ సైన్స్ కనర్హం” కనుక ఈ విషయం మీద శాస్త్రవేత్తలు ఎంతో పరిశోధన చేశారు. వడ్రంగి పిట్ట తలకి రక్షణగా పనిచేస్తున్న కొన్ని కారణాలు కనుక్కున్నారు.

1. వడ్రంగి పిట్ట తలలోని మెదడు పరిమాణం చాలా చిన్నది. దాని కపాలంలో మెదడు చాలా బిర్రుగా, కదలకుండా బంధించబడి ఉంటుంది. అందుకు భిన్నంగా మన మెదడు పెద్దది, బరువైనదీను (1.3 kgs). మన కపాలానికి మెదడుకి మధ్య కొంత ఎడం ఉంటుంది. ఆ ఎడంలో సెరెబ్రో స్పైనల్ ద్రవం ప్రవహిస్తుంటుంది. అందుకే మన తల ఉన్నట్లుండి కదిలినప్పుడు, అందులోని మెదడు జడత్వం వల్ల కదలకుండా ఉండడం వల్ల కపాలపు వెనుక భాగం మీద వొత్తబడుతుంది. రోడ్డు ప్రమాదంలో ఈ విధంగా తల, మెదడు గాయపడవచ్చు. ఈ పిట్ట మెదడు చిన్నది కనుక బతికిపోయింది.



2. మనిషి మెదడు ఉపరితలం అంతా మిట్టపల్లాలుగా ఉంటుంది. ’మిట్ట’లని ’జైరై (gyri) అని, ’పల్లాల’ని సల్కై (sulci) అని అంటారు. గిజిగాడు పిట్ట మెదడు నునుపుగా ఉంటుంది. వస్తువు చిన్నది అవుతున్న కొలది దాని ఉపరితలానికి, ఆయతనానికి (volume) మధ్య నిష్పత్తి పెద్దదవుతూ వస్తుంది. కనుక తల చెట్టుకి గుద్దుకున్నప్పుడు ఆ అభిఘాతపు ధాటి మెదడు ఉపరితలం మీద సమంగా విస్తరించబడుతుంది. తరువాత దీని మెదడు మీద కూడా కాస్తంత సెరిబ్రోస్పైనల్ ద్రవం ఉంటుంది. చిక్కని ఈ ద్రవం మెదడు చుట్టూ మెత్తని కవచంలా ఉంటూ దెబ్బ తగలకుండా కాపాడుతుంది.


3. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పిట్ట చెట్టుని కొట్టేటప్పుడు దెబ్బ సూటిగా, చెట్టు ఉపరితలానికి కచ్చితంగా లంబంగా, విసురుతుంది. సుత్తితో గోడలో మేకు కొట్టేటప్పుడు సుత్తిని సూటిగా, గోడకి లంబంగా విసరడం ముఖ్యం. దెబ్బ వాలుగా పడిందంటే వేలు చితికిపోతుందని ప్రత్యేకించి నొక్కి వక్కాణించనక్కర్లేదు.



ఈ విషయాన్ని పరీక్షించడానికి ఓ పిట్టని టైప్ రైటర్ మీద ’కీ’ లని కొట్టేలా శిక్షణ నిచ్చారు. ’కీ’ల మీద కొట్టే ముందు పరీక్షగా ఓ రెండు సార్లు మెత్తగా కొట్టి చూసుకుంటుంది. ఒడుపు తెలిశాక గురి చూసి, ఉపరితలం మీద దెబ్బ లంబంగా పడేలా ఎప్పట్లాగే ప్రచండ వేగంలో బాదుడు మొదలెడుతుంది. ఈ కారణం చేత పిట్ట మెదడు మీద పడే ఒత్తిడి (stress) మెదడుని మెలితిప్పేలా, పిండేలా (shear stress) ఉండదు. అలాంటి ఒత్తిడి వల్లనే మనుషులు రోడ్డు ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు మెదడులో నాడీ తీగలు విస్తృతంగా గాయపడవచ్చు. దీన్నే Diffuse Axonal Injury (DAI) అంటారు. ఉపరితలానికి లంబందా దెబ్బ కొట్టడం నేర్చిన వడ్రంగి పిట్ట ఈ రకమైన గాయం తగలకుండా జాగ్రత్తపడుతోంది.

’హై స్పీడ్’ కెమేరాతో ఈ చెట్టు కొట్టుడు కార్యక్రమాన్ని వీడియో తీసిన శాస్త్రవేత్తలు మరో చిత్రమైన విషయాన్ని కూడా గమనించారు. దెబ్బ వేసేటప్పుడు పిట్ట కళ్లు మూసుకుంటుందట. మరి ఆ చర్య చెట్టు బెరడు నుండి ఎగసే పొట్టు కంట్లో పడకుండానా, లేక తల కదిలే వేగానికి కళ్లు రాలి కిందపడకుండానా అన్న విషయం అర్థం కాక శాస్త్రవేత్తలు ఇప్పటికీ తర్జనభర్జనలు పడుతున్నార్ట.


References:
http://www.thenakedscientists.com/HTML/articles/article/whydontwoodpeckersgetbraindamage/
- May et al., Arch Neurol 1979 Jun; 36(6): 370-3- May et al., Lancet 1976 Feb 28;1(7957):454-5



24 comments

  1. Good info

     
  2. very nice . ilanti vishyaalu meeda interest naku kuda. India lo next generationki ina sare ilanti scientific reasoning alavaatu chesthe bavundu. keep going sir.

     
  3. KAMAL Says:
  4. nice info thank you

     
  5. Anonymous Says:
  6. చాలా ఆసక్తికరం.....
    - శరత్

     
  7. మంచి విషయాలు చెప్పారు. మీ బ్లాగు అంతా విజ్నానంతొ నింపుతున్నందుకు ధన్యవాదాలు..

     
  8. తార Says:
  9. లంబంగా, అభిఘాతపు ధాటి , .. ఇలా బాష కొంచం కష్టంగా అనిపించింది, ఇలాంటి వాటికి కుడా ఆంగ్ల పదాలని పక్కన రాస్తే బాగుంటుందెమో, ఇప్పుడు అందరూ ఇంగ్లీషు చదువులు కదా, టెక్నికల్ పదాలు అర్ధం కావటం కొంచం కష్టం.

     
  10. @తార గారు, మనకు అర్థం కాకపోయినప్పటికీ, ఇంగ్లీష్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి నేర్చుకున్నాం. మన తెలుగు దగ్గరికి వచ్చేసరికి అలసత్వం ఎందుకు? చిన్నపాటి ప్రయత్నంతోటే సులభంగా అర్థమవుతాయి కదా.

     
  11. lalithag Says:
  12. తార గారు అడిగినది, మిగిలిన పదాలకుమల్లే, ఈ పదాలకి కూడా పక్కన ఆంగ్ల పదం కూడా ఇస్తే బావుంటుంది కదా అని అనుకుంటా.

    తెలుగులో చదవాలన్న ఆసక్తిని పెంచే మీ వ్యాసాలు చదివే వారి భాష పెరగడానికి అది ఉపయోగకరంగా ఉంటుందని మనవి :-) ఆంగ్లంలో కాకున్నా, సులభమైన తెలుగులో వివరించినా బావుంటుంది.

    ఇంకో ఆలోచన, నేను అప్పుడప్పుడూ చూస్తున్నాను కాని, వివరంగా చూడలేదు కనుక ఉందో లేదో తెలీదు. ఒక glossary లాంటిది మీరు ప్రవేశ పెడితేనో?
    సాంకేతిక / శాస్త్ర పరమైన పదాలకి సులభమైన తెలుగులో వివరణ ఇస్తూ?

     
  13. తార Says:
  14. లలిత గారు, అవును నేనటున్నది మీరు చెప్పినదే.
    తెలుగు ముఖ్యమే, కానీ అర్ధం కావాలి కదా, మెల్లగ అలవాటు చేయమంటున్నాను,లంబంగా అంటేనే తెలియని నాకు, అభిఘాతపు ధాటి అనగానే మతి పొయింది.

     
  15. Nrahamthulla Says:
  16. తెలుగులో శాస్త్ర విజ్ఞానాన్ని అందిస్తున్నందుకు అభినందనలు.నరావతారం లాంటి పుస్తకాలు పదవతరగతి పిల్లలకు కూడా అర్ధమయ్యేవి.రానురాను చాలా తెలుగు పదాలను సంస్కృతంలోకి మార్చి తెలుగులో చదువు అంటే భయపడేలా చేశారు,ఇంకా చేస్తున్నారు.ఉదా : కూడిక=సంకలనము.తీసివేత=వ్యవకలనము,హెచ్చవేత=గుణకారము,నిటారుగా=లంబంగా,పిచికారీ=ముషలికము . . .ఇలా

     
  17. Anonymous Says:
  18. ఇంగ్లీషులో చదివేటప్పుడు ఏదైనా కొత్తపదం తగిల్తే తమకొక కొత్తపదం నేర్పినందుకు సదరు రచయితని ఇదే తెలుగు పాఠకులు అభినందిస్తారు. తెలుగులో తమకి తెలియని పదాలు తగిల్తే అసలవి వాడడమే తప్పు అన్నట్లు ఆ రచయిత మీద దాడి, ఎగతాళి, దూషణ. ఈ దుష్టసంస్కారం నుంచి తెలుగువాళ్లు బయటపడాలి. మీకు మతులు పోతే జాతికి పెద్ద నష్టమేమీ లేదు. కానీ ఒక జాతికి తనదంటూ ఒక సొంత భాష, పదజాలమూ ఉండడం ముఖ్యం. అదే ఆ జాతి యొక్క ప్రత్యేక ఉనికి. తెలుగు తెలియకపోతే నేర్చుకోవాలి. అంతేగానీ రచయిత ఏదో మహాపాపం చేసినట్లు విరుచుకుపడ్డం కుసంస్కారం. లేదంటారూ , మీకిష్టమైన ఇంగ్లీషుభాషలోనే మీరు సైన్సు చదువుకోండి. ఎవరు కాదన్నారు ?

     
  19. రహమతుల్లా గారు: మీరు చెప్పింది నిజమే. తెలుగులో సైన్స్ సాహిత్యం, ముఖ్యంగా జనరంజక విజ్ఞానం (popular science) సులభంగా అర్థమయ్యేలా ఉండాలని నేనూ ఒప్పుకుంటాను. అయితే దానికి ’సంస్కృత’ పదాలు వాడాలా, ’తెలుగు’ పదాలు వాడాలా అన్న విషయంలో కాస్త విభేదిస్తాను. వాగానుశాసనుడు నన్నయ గారు తెలుగులో సంస్కృత పదాలు ఎలా వాడాలో నేర్పి రెండు భాషలకి ఘనంగా పెళ్లి చేసిన వెయ్యేళ్ల తరువాత కూడా సంస్కృతాన్ని ఓ పరాయి మనిషిగా చూడడం సంస్కారం అనిపించుకోదు. కొన్ని జాను తెలుగు పదాలు కూడా కష్టంగా అనిపిస్తాయి. (పాల్కురికి సోమనాథుడి పుస్తకం తెరిచి దిమ్మ దిరిగి ఉరికి పోయాను!) అలాగే ఎన్నో సంస్కృత పదాలు చాలా సుపరిచితంగా అనిపిస్తాయి. ఏది ఎప్పుడు వాడాలి అన్నది కొంచెం జటిలమైన ప్రశ్న. దానికి ఓ సామాన్య సూత్రమేమీ లేదని నా అభిప్రాయం. మంచిరచయిత “సమయానికి తగు మాట” విసుర్తూ పోవాలి.
    మరో చిన్న విషయం: లంబం = నిటారు అన్నారు. నేనైతే లంబం = perpendicular, నిలువు = vertical; నిటారు=erect అన్న అర్థంలో వాడుతాను,

     
  20. Nrahamthulla: లంబం అనేదానికి నిటారు అనేది చాలదనుకుంటాను. భూమికి లంబంగా ఉండేదాన్ని నిటారుగా ఉన్నదంటారు. చెట్టుకు లంబంగా కొడుతున్నది పిట్ట. ఇక్కడ నిటారు అనేది సరైనమాట కాదు, లంబమే సరైనదనుకుంటాను. 1981 వరకూ నా చదువు తెలుగులో సాగింది, నేను లంబం అనే చదూకున్నాను. పోతే, మీరు చెప్పే సంస్కృతీకరణం నిజమే. దానికి కారణం తెలుగులో క్రియావాచకాలున్నంతగా నామవాచకాలు లేకపోవడం కావచ్చు. అచ్చతెలుగులో రాయకూడదేమోననే తెలివితక్కువతనము, భావదారిద్ర్యమూ కూడా మరో కారణం కావచ్చు. కారణమేదైనా, అది మాత్రం భాష పట్ల తప్పు అనే నా అభిప్రాయం.

     
  21. ప్రయోజనాత్మకమైన సైటును చక్కగా నిర్వహిస్తున్నందుకు మీకు నా అభినందనలు.

     
  22. లలితగారు, తార గారు:
    1. “మేకు కొట్టేటప్పుడు సుత్తిని సూటిగా, గోడకి లంబంగా...” అన్నప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ’లంబం’ అన్న పదానికి అర్థం తెలిసిపోతుంది అనుకున్నాను.
    2. అయితే అభిఘాతం అనేది మరి కాస్త కష్ఘ్టమైన పదం. నేనే కాస్త సులభమైన పదం వాడితే సరిపోయేది.

    (ఇలా అంటే మాయాబజార్ లో ఓ సన్నివేశం గుర్తొస్తోంది. మాయా శశిరేఖ ఉదయానే పక్క మీంచి దిగబోతూ ఓ చిన్న కాలిపీట (footstool) మీద పాదం మోపితే అది పుటుక్కున విరుగుతుంది. “అయ్యో! నేనే కాస్త సున్నితంగా దిగితే సరిపోయేదే!” అంటుంది పశ్చాత్తాపం నటిస్తూ. :-)

    పారిభాషిక పద కోశం ఉంటే, ముఖ్యంగా ఆన్ లైన్ ఉంటే చాలా బావుంటుంది. చిన్న స్థాయిలో వీలు కుదిరినప్పుడు చెయ్యడానికి ప్రయత్నిస్తాను. కాని ఏం చెయ్యడానికైనా సమయం కావాలి. (నాకు వేరే ఉద్యోగం ఉందని, ఇది కేవలం హాబీయే నని నేనే తరచు మర్చిపోతుంటాను.) అందుకే సహాయం కోసం నలుగురినీ అడుగుతుంటాను. నలుగురూ సాయం చేస్తే ఆన్ లైన్ తెలుగు పారిభాషిక పదకోశ నిర్మాణానికి కొన్ని ఉపాయాలు ఉన్నాయి. దాని గురించి మరో పోస్ట్ లో చర్చిస్తాను.

     
  23. oremuna Says:
  24. http://te.wiktionary.org

     
  25. కొంచెం ఆలస్యంగా వచ్చానిక్కడికి, మంచి చర్చ జరిగిందే! ఎవరో అనానిమస్ కొంచెం ఘాటుగా స్పందించిన నిజాల్ని స్పృషించాడు. ఆంగ్లంలో తెలియని పదం తగిలినప్పుడు తెలుసుకుంటాం, కాని తెలుగుకొచ్చేసరికి మన మాతృభాషలోనే మనకి తెలియని పదం వాడి లాభమేంటి అనే ఒకలాంటి(అహంలాంటిది) భావం కలుగుతుంది, ఆ క్షణంలో పర్యాయపదాలు, నానార్థ పదాలు ఎంత ముఖ్యమో గుర్తుకు తెచ్చుకుంటే సరిపోతుంది. మన పదసంపద వ్యాప్తికి పనికొస్తుంది.
    పై వ్యాఖ్య ఎవరినీ వ్యక్తిగతంగా ఉద్దేశించబడినది కాదు.
    పై విషయాన్ని వదిలేస్తే,
    @చక్రవర్తి గారికి,
    మనిషిలోని చిన్న మెదడు మన శరీరాన్ని బాలెన్సుని(దీనికి సరైన తెలుగు పదం గుర్తుకు రావట్లేదు :() నియంత్రిస్తుందని గుర్తు, మరి మనం ఏదైనా వాహనం సైకిలో, కారో నడిపేటప్పుడు కూడా బాలెన్సుకు సంబంధించిన గణన చిన్న మెదడు లోనే జరుగుతుందా?

     
  26. Nrahamthulla Says:
  27. శ్రీనివాస చక్రవర్తి గారూ ఎవరు ఏమనుకున్నా సాధ్యమైన వరకు సులభమైన తెలుగు పదాలు వాడుతూ ముందుకెళ్ళండి.అసలు ఈమాత్రం చేసే వాళ్ళు కూడా కావాలిగా.జనం వాడుకలో కూడిక తీసివేత లాంటి పదాలు మనకు లేనప్పుడు వాటికి బదులు సుపరిచితంగా అనిపించే సంస్కృతాంగ్ల పదాలు నిరభ్యంతరంగా వాడండి."సమయానికి తగు మాట" విసరండి.Anonymous అన్నట్లు అదేమీ తప్పుకాదు.అర్ధమవటమే ముఖ్యం.చదువరి చెప్పినట్లు తెలుగులో రాయకూడదేమోననే తెలివితక్కువతనము,భావదారిద్ర్యమూ (రాయకూడదనే మొండితనమూ బడాయి) మనవాళ్ళు వదిలెయ్యాలి.

     
  28. Anonymous Says:
  29. always rocks

     
  30. తార Says:
  31. anon,

    సైన్సు, లెఖ్ఖలు చదివేటప్పుడు తెలుగు ఐనా, ఇంగిలిపీసు ఐనా, అర్ధం వెతుక్కోవాలి అంటే చిరాకుగా వుంటుంది తప్ప ఇది బాష గురించి ప్రశ్న కాదు,(బహుశా నాకు).
    చక్రవర్తి గారు, అన్న అలవాట్లు తొందరగా పోవటం లేదు, లంబంగా అంటే ఎమో, పర్పెండిక్యులర్ గా ఐనా కొట్టమని రాస్తాడు, దాని కోసమే కొత్త బ్లాగ్ మొదలెట్టాల్సి వచ్చింది మరి.

     
  32. ఇంత చిన్న విషయం లో ఎంత విజ్ఞానాన్ని తెలియచేసారు!!!!!!

    ఖచ్చితంగా మీరు మనిషి కాదు..వడ్రంగి పిట్టే.....

     
  33. Unknown Says:
  34. Very good info... Thank you all....

     
  35. CvaG Says:
  36. You are right.

     
  37. CvaG Says:
  38. ప్రతి విషయం తెలుసుకోవాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం... ధన్యవాదాలు...
    నాకొక చిన్న సందేహం,
    దాని తల గురించి వివరించారు . అలాగే అం బలంగా కొట్టగలిగే దాని ముక్కును గురించి కూడా వివరిస్తే బాగుండు... అనుకుంటున్న..

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts