కాపెల్ క్యూరిగ్ వద్ద హెన్స్లోని విడిచిపెట్టి నేను వేరేగా ముందుకు సాగిపోయాను. దిక్సూచిని, మాప్ ని ఆధారంగా చేసుకుని సరళరేఖలో కొండలు దాటుకుంటూ బార్మౌత్ దిశగా సాగిపోయాను. నేను ఎంచుకున్న దిశలో ఏదైనా దారి కనిపిస్తే ఆ దారి మీదుగా ప్రయాణించాను గాని, లేకుంటే ఎక్కువగా కొండల మీదుగానే ప్రయాణిస్తూ పోయాను. ఈ రకమైన యాత్రా పద్ధతి నాకు బాగా నచ్చింది. దారిలో ఎన్నో అద్భుతాలు చూస్తూ ఆనందంగా ముందుకు సాగిపోయాను. బార్మౌత్ లో కొందరు కేంబ్రిడ్జ్ నేస్తాలని కలుసుకున్నాను. అందరం ష్రూస్ బరీ కి, మాయర్ కి వెళ్ళి సరదాగా షూటింగ్ చేశాం. తాత్కాలికంగా నా పరిశోధనల గురించి మర్చిపోయాను. చాలా కాలంగా నేస్తాలతో కలిసి షూటింగ్ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాన్ని వదులుకోదలచుకోలేదు.
‘బీగిల్ యాత్ర – డిసెంబర్ 27, 1831 నుండి అక్టోబర్ 2, 1836 దాకా
ఉత్తర వేల్స్ లో జరిపిన భౌగోళిక యాత్ర నుండి తిరిగి వచ్చిన తరువాత ఇంటికి రాగేనే హెన్సో రాసిన ఉత్తరం ఒకటి నాకోసం ఎదురు చూస్తోంది. ‘బీగిల్’ యాత్రలో ప్రకృతి శాస్త్రవేత్త గా రావాలనుకునే కుర్రవాడు ఎవడైనా ఉంటే రావచ్చని, అతడిని తన సొంత కాబిన్ లో ఇంత చోటు ఇచ్చేందుకు కాప్టెన్ ఫిట్జ్ రాయ్ ఒప్పుకుంటున్నాడని ఆ ఉత్తరంలో సమాచారం. నేనైతే ఆ అవకాశానికి ఎగిరి గంతేశాను. ఇక నాన్నగారి అనుమతి తీసుకోవాలి. నాన్నగారికి ఈ విషయం చెప్పగానే మండిపడ్డారు. “బుద్ధున్నవాడు ఎవడైనా ఇలాంటి యాత్రకి ఒప్పుకుంటే నేనూ ఒప్పుకుంటాను,” అన్నారు. ఇక చేసేదిలేక ఆ రోజే అవకాశాన్ని తిరస్కరిస్తూ ఉత్తరం రాశాను. మర్నాడు మాయర్ కి వెళ్లాను సెప్టెంబర్ 1 కి సన్నాహాలు చేసుకోవాలని. అక్కడ ఒక రోజు నేను షూటింగ్ లో మునిగి వున్న సమయంలో మా మామయ్య (జోసయ్యా వెడ్జ్ వుడ్) నన్ను పిలిపించాడు. కావలిస్తే నాతో పాటు ష్రూస్బరీ కి వచ్చి నాన్నగారితో మాట్లాడుతానని, ఇంత గొప్ప అవకాశం వదులుకోవడం మంచిది కాదని అన్నాడు. నాన్నగారికి మామయ్య అంటే చాలా గౌరవం. అంతకన్నా వివేకవంతుడు లోకంలో లేడని ఆయన నమ్మకం. మామయ్య చెప్పగానే మరుమాట్లాడకుండా ఒప్పుకున్నారు. కేంబ్రిడ్జ్ లో ఉండే రోజుల్లో నేను కాస్త ఉదారంగానే ఖర్చుపెట్టేవాణ్ణి. ఈ యాత్రలో మాత్రం అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తపడతానని నాన్నగారితో ఇలా అన్నాను, “బీగిల్ యాత్రలో నాకు ఇచ్చిన డబ్బు కన్నా ఎక్కువ ఖర్చుపెట్టడానికి నేనేమైనా తెలివి తక్కువ వాడినా ఏంటి?” అది విని నాన్నగారు చిరునవ్వు నవ్వుతూ “నువు తెలివితక్కువ వాడివి కావనే అందరూ అంటారులే!” అని ఊరుకున్నారు.
మర్నాడే కేంబ్రిడ్జ్ కి వెళ్లి హెన్స్లో ని కలుసుకున్నాను. అక్కణ్ణుంచి లండన్ కి వెళ్లి ఫిట్జ్ రాయ్ ని కలుసుకున్నాను. ఈ ఫిట్జ్ రాయ్ నన్ను చూసీ చూడగానే, ముఖ్యంగా నా ముక్కుని చూడగానే, కుదరదు పొమ్మనే ప్రమాదం ఉందని ఇంతకు ముందే విన్నాను. ఈ ఫిట్జ్ రాయ్ గారు లవాటర్ కి ఏకలవ్య శిష్యుడట! ముఖ కవళికల బట్టి మనిషి తత్వాన్ని తెలుసుకోవచ్చని ఇతడు గాఢంగా నమ్ముతాడు. బీగల్ యాత్ర మీద రావడానికి కావలసిన తెగువ, సత్తువ, ధృఢనిశ్చయం ఇలాంటి ముక్కు ఉన్నవాడికి ఉంటాయా అని అతడి సందేహం. నా ముక్కు అతణ్ణి తప్పుదారి పట్టించిందని తరువాత అతడు గ్రహించి ఉంటాడని అనుకుంటాను.
ఈ ఫిట్జ్ రాయ్ ఎంతైనా చెప్పుకోదగ్గ మనిషి. ఇతనిలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. కర్తవ్యనిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తాడు. మహా దైర్యవంతుడు. పొరపాటుని సులభంగా క్షమిస్తాడు. విసుగు వేసట లేకుండా పనిచేస్తాడు.
తన కింద పని చేసేవారికి మంచి స్నేహితుడిలా నడచుకుంటాడు. తన సహాయం ఎవరికైన అవసరం అని తెలిస్తే, ఆ సహాయానికి వాళ్ళు అర్హులు అని తెలిస్తే, ఆ సహాయాన్ని అందించడంలో ఎంత దూరం అయినా వెళ్తాడు. చూడడానికి చాలా హుందాగా పెద్దమనిషి తరహాగా ఉంటాడు. ఈ విషయంలో మాత్రం తన మామయ్య అయిన లార్డ్ కాజిల్ రే పోలికలే వచ్చాయని తదనంతరం ‘రియో’ లో ఓ మినిస్టరు చెప్పాడు. అంతేకాక మహారాజు చార్లెస్ – 2 కి, ఇతనికి గాఢమైన పోలికలు ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. డా॥ వాలిచ్ ఓ సారి తను సేకరించిన మహారాజు చార్లెస్ ఫోటోలు తెచ్చి చూపించాడు. వాటిలో ఒక ఫోటోకి ఫిట్జ్ రాయ్ మధ్య ఎంతో పోలిక వుంది.
కాని ఫిట్జ్ రాయ్ లో దుర్గుణం వుంది. అతడు మహా ముక్కోపి. అది ఉదయానే తారస్థాయిలో ఉంటుంది. తన డేగచూపుతో ఓడ మొత్తం ఓ సారి పర్యవేక్షిస్తాడు. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా ఇక దండకం అందుకుంటాడు. కాని నా అదృష్టం బావుండి నాతో మాత్రం చాలా మర్యాదగా ఉండేవాడు. ఏదేమైనా ఈ మనిషితో సన్నిహితంగా జీవించడం తమాషా కాదు. కాని పాపం మరి నాకు తప్పింది కాదు. ఇద్దరం ఒకే కాబిన్ లో జీవించాలి మరి!
మా ఇద్దరి మధ్య ఎన్నో సార్లు వాగ్వివాదాలు రేగాయి. ఉదాహరణకి ఓ సారి బ్రెజిల్ లో బహ్తా ప్రాంతంలో ప్రయాణిస్తుండగా ఓ సారి బానిస పద్ధతిని సమర్ధిస్తూ, పొగుడుతూ మాట్లాడాడు. నాకు ఆ పద్ధతి అంటేనే అసహ్యం. ఓ గొప్ప ‘బానిసల యజమాని’ గురించి చెప్పుకొచ్చాడు. ఆ యజమాని వద్ద ఎంతో మంది బానిసలు ఊడిగం చేస్తుంటారట. ఓ రోజు ఆ యజమాని తన బానిసలు అందరినీ పిలిచి ‘మీరంతా నా వద్ద సంతోషంగా ఉన్నారా, లేక వెళ్లిపోవాలని అనుకుంటున్నారా?’ అని అడిగాడట. యజమాని సమక్షంలో అలా అడిగితే వాళ్ళు అలా కాక మరోలా ఎందుకు సమాధానం చెప్తారని అడిగాను. నా సమాధానికి అతడికి ఒళ్ళుమండిపోయింది. తన అభిప్రాయాన్ని నేను గౌరవించలేదు కనుక ఇద్దరం ఇక కలిసి ఉండడం వీలుపడదన్నాడు. ఓడ నుండి బయటికి గెంటేస్తాడని భయపడ్డాను. ఒక లెఫ్టెనెంట్ ని పిలిచి నన్ను చెడామడా తిట్టమన్నాడు. ఓడలో కింది ఉద్యోగులు కొందరు నా పరిస్థితి చూసి జాలిపడ్డారు. నన్ను వాళ్లతో పాటు వాళ్ల కాబిన్ లో ఉండమని ఆహ్వానించారు. వాళ్ల ఔదార్యం చూసి నా మనసు తేలికపడింది. కాని కొన్ని గంటల తరువాత ఫిట్జ్ రాయ్ చల్లబడ్డాడు. మనిషిని పంపించి క్షమాపణ కోరుతున్నట్టుగా కబురు పెట్టాడు. నేను ఎప్పట్లాగే తన కాబిన్ లోనే ఉండొచ్చని అనుమతి ఇచ్చాడు.
(ఇంకా వుంది)
0 comments