మామయ్య అన్నట్టే డేవీ సిద్ధాంతాలకి ఆధారాలు ముందు ముందు కనిపిస్తాయన్న నమ్మకంతో ముందుకు సాగిపోయాను. కాని అసలు ఆ ఆచూకీయే లేదు. కాని మామయ్యతో వాదనకి దిగదలచుకోలేదు. నా మౌనం అర్థాంగీకారంగా తీసుకున్నాడు కాబోలు. మా అవరోహణ నిరాఘాటంగా కొనసాగింది.
మరో మూడు గంటలు ప్రయాణించాం గాని మేం దిగుతున్న సొరంగం అంతు కనిపించలేదు. తల పైకెత్తి చూస్తే దాని వ్యాసం క్రమంగా చిన్నది కావడం కనిపించింది. దాని గోడలు చిన్న వాలుతో నెమ్మదిగా దగ్గర పడుతున్నాయి. కిందకి దిగుతున్న కొద్ది చీకటి మరింత చిక్కనవుతోంది.
ఇంకా కిందకి సాగిపోయాం. ఇప్పుడు మేం ఉన్న చోటి నుండి వింటుంటే కింద పడుతున్న రాళ్లు మరింత వేగంగా అడుక్కి చేరుకుంటుంన్నట్టు అనిపించింది. రాళ్లు నేల మీద పడ్డ చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది.
తాళ్లతో మేం కిందకి దిగడానికి చేసే విన్యాసాలు ఎన్ని సార్లు చేస్తున్నామో ఒక పక్క లెక్క పెట్టుకుంటూనే వున్నాను. ఇప్పటికి పద్నాలుగు సార్లు చేశాం. తాళ్లతో ఒక్కసారి కిందకి దిగడానికి అరగంట పట్టింది. అంటే మొత్తం ఏడు గంటలు. దిగిన ప్రతీసారి పావుగంట విరామం తీసుకుంటూ వచ్చాం. అంటే మొత్తం పద్నాలుగు పావుగంటలు. కనుక మొత్తం దిగిన సమయం పదిన్నర గంటలు. మధ్యాహ్నం ఒంటిగంటకి బయల్దేరాం. కనుక ఇప్పుడు రాత్రి పదకొండు దాటి ఉంటుంది. మేం దిగిన లోతు 200 X 14 అంటే 2800 అడుగులు.
అంతలో “ఆగండి!” అని హన్స్ అరిచిన అరుపుకి ఉలిక్కిపడ్డాను.
కొంచెం ఉంటే నేను మా మామయ్య నెత్తిన కాలు పెట్టేవాణ్ణే.
“చేరిపోయాం” అన్నాడు హన్స్.
“ఎక్కడికి చేరాం?” తనకి దగ్గరిగా అడుగేసి అడిగాను.
“సొరంగం అడుక్కి చేరిపోయాం,” అన్నాడు.
“ఇంతకన్నా ముందుకి పోలేమా?”
“అవును. ఇక్కడి నుండి కుడిపక్కకి తిరిగి వాలుగా పోయే మార్గం వుంది. దాని సంగతి రేపు చూద్దాం. ప్రస్తుతానికి భోజనం చేసి ఓ కునుకు తీద్దాం.”
సొరంగంలో ఏదో కాస్త మసక కాంతి ఇంకా వుంది. భోజనాల పెట్టె తెరిచి అంతా తలా కొంత తిన్నాం. లావా తునియల విరులు చల్లిన ఆ కరకు శిలల శయ్యల మీదే ఎలాగో నిద్రకి ఉపక్రమించాం.
అలా మేను వాల్చానో లేదో ఓ చక్కని దృశ్యం కనిపించింది. ఓ పెద్ద దూరదర్శినిలా 3000 అడుగుల పొడవున్న బ్రహ్మాండమైన నాళానికి అవతలి కొసలో తీక్షణమైన కాంతిబిందువు దర్శనమిచ్చింది.
ఇంత లోతు నుండి చూడడం వల్ల కాబోలు మినుకు మినుకు మనకుండా ప్రశాంతంగా వెలుగారుతోందా తార.
నా అంచనాల బట్టి అది 46 అర్సా మైనర్. ఆ తారని చూస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను.
(17 వ అధ్యాయం సమాప్తం)
0 comments