నా ముఖంలో ఆశ్చర్యం చూసి మామయ్య అడిగాడు –
“ఏవయ్యింది ఏక్సెల్?”
“నిన్నో ప్రశ్న అడగాలి? నేనిప్పుడు ఆరోగ్యంగానే ఉన్నానంటావా?”
“అందులో సందేహం ఏవుంది?”
“నా ఎముకలన్నీ కుదురుగానే ఉన్నాయా?”
“నిశ్చయంగా.”
“మరి నా తల?”
“ఏవో కొన్ని దెబ్బలు తగిలాయి గాని, ఉండాల్సిన చోటే భుజాల మీదే కుదురుగా వుంది.”
“కాని ఏమో నా తలకి ఏదో అయినట్టు అనిపిస్తోంది.”
“తలకి ఏమీ కాలేదు. కాని కాస్త మతిస్థిమితం తప్పింది.”
“అంతే అయ్యుంటుంది. మరైతే మనం తిరిగి ఉపరితలానికి వచ్చేశామా?”
“ముమ్మాటికీ లేదు.”
“కాని మరి నాకు ఎక్కడో వెలుగు కనిపిస్తోంది, గాలి ఊలలు వినిపిస్తున్నాయి. అలల కలకలం వినిపిస్తోంది.”
“ఓహ్! అదా? నా వద్ద కూడా పూర్తి సమాధానం లేదు. కాని ఒక్కటి మాత్రం చెప్పగలను. భౌగోళిక శాస్త్రానికి తెలీని రహస్యాలు ఇంకా ఎన్నో వున్నాయి. ”
“సరే ఇక బయల్దేరుదాం పద.”
“వద్దు ఏక్సెల్. ఈ పరిస్థితిలో నీకు చల్లగాలి సోకడం మంచిది కాదు.”
“లేదు లేదు. నేను బానే వున్నాను.”
“కాస్త ఓపిక పట్టు అల్లుడూ. పరిస్థితి మళ్లీ మొదటికి వస్తే మంచిది కాదు. ఇక ఆలస్యం చెయ్యడానికి లేదు. మన సముద్ర యాత్ర సుదీర్ఘమైన యాత్ర అయ్యేలా వుంది.”
“సముద్ర యాత్రా?”
“ఇప్పటికి విశ్రాంతి తీసుకో. హైలెస్సా అంటూ రేపే మనం బయల్దేరుతున్నాం.”
“హైలెస్సానా?” ఎగిరి గంతేసినంత పని చేశాను.
అసలేంటి ఇదంతా? ఇక్కడ ఏదైనా నదిగాని, చెరువు గాని, సముద్రం గాని ఉందా? ఈ భూగర్భపు ఓడ రేవులో మా కోసం ఏదైనా ఓడ సిద్ధంగా వుందా?
నా ఉత్సాహం చూసి మామయ్య నన్ను శాంతింప జేయడానికి చూసి విఫలయం అయ్యాడు. నా అసహనం నాకు కీడు చేస్తోందని గుర్తించినా ఏమీ చెయ్యలేకపోయాడు.
హడావుడిగా యాత్రకి సిద్ధం అయ్యాను. అదనపు రక్షణ కోసం నా చుట్టూ ఓ దుప్పటి చుట్టుకుని ఆ గుహ లోంచి బయటపడ్డాను.
(ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం)
0 comments