మొదట్లో నాకు ఏమీ కనిపించలేదు. ఒక్కసారిగా అంత కాంతి కనిపించేసరికి కళ్లు బైర్లు కమ్మాయి. తిరిగి కళ్లు తెరిచేసరికి ఎదుట కనిపించిన దృశ్యం చూసి అదిరిపోయాను.
“సముద్రం!” గట్టిగా అరిచేశాను.
“అవును” అన్నాడు మామయ్య సమర్ధిస్తూ. “ఇది లీడెన్ బ్రాక్ సముద్రం. దీన్ని మొట్టమొదట కనుక్కున్నది నేనే నని ఒప్పుకోడానికి మరే ఇతర అన్వేషకుడికి అభ్యంతరం ఉండదేమో.”
ఎదురుగా ఓ విశాలమైన జలాశయం. దీన్ని సముద్రం అనాలో, సరస్సు అనాలో అర్థం కావడం లేదు. దాని ఆవలి గట్టు కనిపించడం లేదు. ఈ దృశ్యం చూస్తే గ్రీకు ఇతిహాసంలో ఓ సన్నివేశం గుర్తొస్తోంది. యుద్ధంలో ఓడిపోయి పలాయనం చిత్తగిస్తున్న జీనోఫోన్ సేనలోని పదివేల మంది సిపాయిలు దిక్కు తెన్ను తెలీకుండా సంచరిస్తున్న సమయంలో ఒక్కసారిగా సముద్రం కనిపించగానే “తలట్టా! తలట్టా!” (సముద్రం! సముద్రం!) అని అరిచారట.
తీరం మీద కనిపించే మెరిసే ఇసుక జరీ అంచులా ఆ ప్రాంతానికి అందాన్నిస్తోంది. ఆగాగి తీరాన్ని తాకే చిన్నారి అలల రవం మనసుకి హాయి కలిగిస్తోంది. అక్కడక్కడ విసిరేసినట్టున్న గవ్వలు ఆ నిగూఢ లోకంలో వసించిన పురాతన జీవాల తొలి ఆనవాళ్లు. ఈ విశాలమైన భూగర్భ మందిరంలో కెరటాల సవ్వళ్లు చిత్రంగా ప్రతిధ్వనిస్తున్నాయి. తరంగాలపై సవారీ చేసే నురగ తరగలు గాలి వాటుకి ఎగిరి పడి నా ముఖం మీద చిందాయి. కొద్దిగా వాలుగా ఉన్న ఈ తీరానికి సుమారు రెండొందల గజాల దూరంలో ఉవ్వెత్తున పైకి లేచిన కొండల వరుస కనిపిస్తోంది. కొన్ని చోట్ల తరంగాల నిత్య తాండవానికి కొండల అంచులు ఒరుసుకుపోయి వాడిగా, కరకుగా కనిపిస్తున్నాయి. ఇక ఆ కొండల వెనుక నేపథ్యం అంతా అలుక్కుపోయినట్టు అవిస్పష్టంగా, అలౌకికంగా దర్శనమిస్తోంది.
ఈ విశాలమైన సముద్రం ఇంత మేరకు అయినా కనిపిస్తోందంటే దానికి కారణం ఈ పరిసరాలలో వ్యాపించిన ఏదో చిత్రమైన కాంతే. అది నిశ్చయంగా సూర్యకాంతి కాదు. భానుడి ప్రచండ కిరణపుంజాలు ఈ లోకంలోకి ప్రవేశించే అవకాశం లేదు. పోనీ అవి పాలిన, పలచని వెన్నెల కాంతులు కూడా కావు. ఒక మూలం నుండి వెలువడుతున్నట్టు కాకుండా అంతటా సమంగా విస్తరించి వుందీ కాంతి. దానికి తెల్లదనంతో పాటు కాస్తంత వెచ్చదనం కూడా ఉంది. ఈ కాంతికి మూలం ఏదో విద్యుత్ ప్రభావం అయ్యుంటుంది. భూమి మీద ధృవాలని ప్రజ్వలితం చేసే అరోరా బోరియాలిస్ కాంతి లాంటిదే ఈ కాంతి అయ్యుంటుంది.
నా నెత్తి మీద కనిపిస్తున్న దాన్ని ఆకాశం అనొచ్చో లేదో తెలీదు గాని, అక్కడ కొన్ని మబ్బులు మాత్రం కనిపిస్తున్నాయి. మారే ఆవిరుల ప్రభావానికి వర్షం పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వాతావరణ పీడనం ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు నీరు ఆవిరి ఎలా అవుతుంది అనుకున్నాను ముందు. కాని ఈ సందర్భంలో ఏ భౌతిక నియమం పని చేస్తోందో ఏమో గాని గాలిలో తెల్లని ఆవిరి చారలు కనిపిస్తున్నాయి. విద్యుత్ కాంతుల ప్రభావం వల్ల మబ్బుల్లో అవర్ణనీయమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మబ్బుల అడుగుభాగాల్లో చిక్కని చీకట్ళు తారాడుతున్నాయి. కొన్ని సార్లు రెండు మబ్బుల మధ్య నుండి ఏదో చెప్పలేని ప్రకాశం జాలువారుతోంది. అది సూర్యకాంతి కాదు. అందులో వెచ్చదనం లేదు. ఈ వెలుగు నీడల లాస్యం వల్లనో ఏమో ఆ ప్రాంతం అంతా ఒకవిధమైన శోకం అలముకున్నట్టు కనిపించింది. వజ్రాల్లాంటి తారలు పొదిగిన చీకటి ఆకాశానికి బదులుగా పైన ఏదో తేజం వుంది. ఈ పరిసరాల చుట్టూ కఠిన కంకర శిలతో చేయబడ్డ ఎత్తైన గోడలు ఉన్నాయి. భారమైన ఈ గోడలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు అనిపించినా కొన్ని ప్రత్యేక ఖగోళవస్తువులని మాత్రం అవి ఆపలేవు అనిపించింది.
ఆ సమయంలో బ్రిటన్ కి చెందిన ఓ కెప్టెన్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఒకటి గుర్తొచ్చింది. ఇతడు భూమి లోపల అంతా డొల్లగా ఉంటుందని ఊహించేవాడు. పైపొర చేసే అపారమైన ఒత్తిడి వల్ల లోపల గాలి ప్రకాశవంతం అవుతుందట! అలాంటి భూమి యొక్క అంతరంగంలో ప్లూటో, మరియు ప్రోసర్పిన్ అనే రెండు తారలు పరిభ్రమిస్తూ ఉంటాయట.
మేం వున్నది హద్దుల్లేని గుహలాంటి ప్రాంతం. దాని వెడల్పు ఎంతో తెలియడం లేదు. మసక మసక వెలుతురులో సముద్రం యొక్క ఆవలి గట్టు కూడా తెలీడం లేదు. ఈ గుహ ఎత్తు కొన్ని కోసులు ఉంటుందేమో. పైన కనిపిస్తున్న మేఘం ఎత్తు 12,000 అడుగులు ఉండొచ్చు. భూమి మీద మబ్బుల కన్నా దీని ఎత్తు చాలా ఎక్కువన్నమాట. దానికి కారణం ఇక్కడ గాలి సాంద్రత ఎక్కువ కావడమే అయ్యుంటుంది.
ఇంత బృహత్తరమైన ప్రాంతాన్ని గుహ అంటే సరిపోదేమో. భూగర్భపు లోతుల్లోని వింతలని వర్ణించడానికి మానవభాష సరిపోదేమో.
(ఇంకా వుంది)
0 comments