వైరస్ యొక్క పరిమాణం గురించి కొంత ప్రాథమిక అవగాహన ఏర్పడ్డాక శాస్త్రవేత్తలు వైరస్ ల అంతరంగ నిర్మాణం మీద దృష్టి సారించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కి చెందిన హైన్జ్ ఫ్రెంకెల్-కాన్రాట్ మరియు రాబ్లీ విలియమ్స్ లు కలిసి టోబాకో మొసాయిక్ వైరస్ లోని ప్రోటీన్ అంశాలని శోధించారు. వైరస్ పదార్థాన్ని తగు రసాయనిక సంస్కారాలకి గురి చేస్తే అందులోని ప్రోటీన్ పదార్థం 2,200 శకలాలుగా విరిగిపోయింది. ఒక్కొక్క శకలంలో సుమారు 158 అమినో ఆసిడ్లు ఉన్న ప్రోటీన్ గొలుసులు ఉన్నాయి. శకలాల అణుభారం సుమారు 18,000 అని తెలిసింది. ఈ ప్రోటీన్ శకలాలలోని అమినో ఆసిడ్ల విన్యాసం గురించి 1960 ల కల్లా క్షుణ్ణంగా తెలిసింది. ఆ శకలాలని కరిగించినప్పుడు అవన్నీ కలిసి మళ్లీ వైరస్ లో ఉన్నట్లుగా కడ్డీ ఆకారంలో రూపొందాయి. కాల్షియమ్, మెగ్నీషియమ్ పరమాణువులు అ శకలాలని కలిపి ఉంచుతున్నాయి.
సామాన్యంగా వైరస్ లలోని ప్రోటీన్ శకలాలు తీరైన జ్యామితీయ ఆకారాలలో ఏర్పడతాయి. టొబాకో మొసాయిక్ వైరస్ లోని ప్రోటీన్ శకలాలు హెలిక్స్ (helix) ఆకారంలో ఏర్పడతాయి. పోలియో మైలైటిస్ లోని ప్రోటీన్ శకలాలు పన్నెండు పంచభుజులుగా ఏర్పాటు అవుతాయి. టిపులా అనే విరాజమాన (iridescent) వైరస్ లోని ఇరవై శకలాలు ఇరవై ముఖాలు గల క్రమబహుముఖి (icosahedron) ఆకారంలో ఏర్పడతాయి.
(ఇకోసా హెడ్రన్ ఆకారంలో ఉన్న వైరస్ కి ఉదాహరణ)
వైరస్ లోని ప్రోటీన్ అంశం డొల్లగా ఉంటుంది. ఉదాహరణకి టొబాకో మొసాయిక్ వైరస్ లోని ప్రోటీన్ అంశంలో 130 చుట్లు ఉన్న ప్రోటీన్ గొలుసు ఉంటుంది. ఆ చుట్ల మధ్య పొడవైన ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఈ ఖాళీ ప్రదేశంలోనే వైరస్ లో ఉండే డీ.ఎన్. ఏ. గాని, ఆర్. ఎన్. ఏ. గాని ఉంటుంది.
(Wiki)
టోబాకో మొసాయిక్ వైరస్ లోని ప్రోటీన్ అంశాలని శోధించిన ఫ్రెంకెల్- కాన్రాట్ యే, వైరస్ లోని ప్రోటీన్ అంశాన్ని, న్యూక్లీక్ ఆసిడ్ అంశాన్ని వేరు చేశాడు. ఇప్పుడు ఈ రెండు అంశాలకి వేరు వేరుగా వైరస్ కి ఉండే విషప్రభావం ఉంటుందాని అని పరీక్షించాడు. ఈ రెండు పదార్థాలు వేరు వేరుగా మాత్రం కణాన్ని ఇన్ఫెక్ట్ చెయ్యలేక పోయాయని ప్రయోగాలలో తేలింది. కాని ప్రోటీన్ ని, న్యూక్లీక్ ఆసిడ్ ని కలిపినప్పుడు మాత్రం మొదటి విషప్రభావం మళ్లీ కనిపించింది.
ఈ ప్రయోగాలని ఈ విధంగా వివరించడం జరిగింది. ప్రోటీన్, న్యూక్లీక్ ఆసిడ్ పదార్థాలని విడివిడిగా చూస్తే అవి జీవరహిత పదార్థాలే. కాని వాటిని కలిపినప్పుడు మాత్రం వాటికి ప్రాణం పోసినట్టు అయ్యింది. ఫ్రెంకెల్-కాన్రాట్ ప్రయోగాలు జీవశాస్త్రంలో కీలక ప్రయోగాలుగా కొనియాడబడ్డాయి.జీవరహిత పదార్థం సరిగ్గా ఎలాంటి పరిస్థితుల్లో జీవపదార్థంగా మారుతుంది అన్న విషయం ఈ ప్రయోగాలు తెలుపుతున్నట్టు అనిపించింది. అయితే పదార్థానికి ఈ విధంగా ‘జీవసహిత’, ‘జీవరహిత’ అనే లక్షణాలని ఆపాదించడం పొరబాటని తదనంతరం మాలిక్యులర్ బయాలజీలో జరిగిన పురోగతి దృష్ట్యా స్పష్టమయ్యింది.
వైరస్ యొక్క విషప్రభావం ఎక్కణ్ణుంచి వస్తోంది? ప్రోటీన్ నుండా, న్యూక్లీక్ ఆసిడ్ నుండా? ఈ ప్రశ్నని శోధిస్తూ ఫ్రెంకెల్-కాన్రాట్ ఓ చక్కని ప్రయోగం చేశాడు. వైరస్ యొక్క ఒక జాతి (strain) నుండి ప్రోటీన్ పదార్థాన్ని తీసుకుని, మరో జాతి నుండి న్యూక్లీక్ ఆసిడ్ అంశాన్ని తీసుకున్నాడు. ఈ రెండు పదార్థాల సంకరం వల్ల ఏర్పడ్డ కొత్త వైరస్ కి రెండు మూల వైరస్ ల లక్షణాలని కలగలిపిన మిశ్రమ లక్షణాలు ఉన్నాయి. ఏ వైరస్ జాతి నుండి ప్రోటీన్ తొడుగు వచ్చిందో, ఆ వైరస్ యొక్క ‘విషప్రభావపు తీవ్రత’ (అంటే పొగాకు ఆకులని పాడు చెయ్యడంలో వైరస్ యొక్క సామర్థ్యం) సంకర జాతి వైరస్ కి వచ్చింది. ఏ వైరస్ జాతి నుండి న్యూక్లీక్ ఆసిడ్ వచ్చిందో, ఆ వైరస్ నే పోలి వుంది ఈ కొత్త సంకరజాతి వైరస్.
ప్రోటీన్ యొక్క, న్యూక్లీక్ ఆసిడ్ యొక్క అంతవరకు తెలిసిన లక్షణాలకి, వైరస్ లో ఈ రెండు అంశాల క్రియలకి మధ్య చక్కగా పొంతన కుదిరింది. వైరస్ ఒక కణాన్ని అటకాయించినప్పుడు ఈ రెండు అంశాలు ఎలా కలిసి పని చేస్తున్నాయో అర్థమయ్యింది. ముందుగా వైరస్ యొక్క ప్రోటీన్ తొడుగు కణానికి గట్టిగా అతుక్కుని, కణాన్ని భేదించి, కణం లోపలికి చొరబడడానికి ఓ రంధ్రం చేస్తుంది. వైరస్ లోని న్యూక్లీక్ ఆసిడ్ ఆ రంధ్రం లోంచి కణం లోకి చొరబడుతుంది. లోపలికి చొరబడ్డ న్యూక్లీక్ ఆసిడ్ పదార్థం, ఆ కణంలోని జన్యు యంత్రాంగాన్ని తన సొంత ప్రయోజనాలకి వాడుకుంటూ కొత్త వైరస్ లని ఉత్పత్తి చేస్తుంది.
Reference:
Asimov, I., Guide to science 2: Biological sciences.
(ఇంకా వుంది)
0 comments