కొలంబియాలో ని గువచారా గుహని హంబోల్ట్ మహాశయుడు సందర్శించాడు గాని ఆ గుహ ఎంత లోతు వుందో పూర్తిగా తెలుసుకోలేకపోయాడు. 2500 అడుగుల లోతుకి వెళ్ళాడు గాని అంత కన్నా లోతుకి పోలేకపోయాడు. అలాగే కెంటకీ లో కూడా అతి విశాలమైన గుహ ఒకటుంది. అందులో పెద్ద సరస్సు ఉంది. సరస్సు మీద ఐదొందల అడుగుల ఎత్తున గుహ యొక్క చూరు ఉంటుంది. అందులోని సొరంగాల శాఖల పొడవు నలభై మైళ్ల పొడవు ఉంటుందని దాన్ని చూసిన యాత్రికులు చెప్తారు. కాని నా ఎదుట ప్రస్తుతం కనిపిస్తున్న విశాలమైన గుహ్య ప్రాంతంతో పోల్చితే అవన్నీ చిన్నపాటి బొరియలు. పైన మెరిసే మేఘాలు, చుట్టూ తుళ్ళిపడే విద్యుల్లతలు, కింద అందరాని ఆవలితీరం గల సంద్రం – ఇవన్నీ చూస్తూ ఉంటే నా మనసుని ఏదో నిశ్చేష్టత ఆవరించింది.
ఈ వింతలన్నీ మౌనంగా తిలకిస్తూ ఉండిపోయాను. నా మనోభావాలని వ్యక్తం చెయ్యడానికి మాటలు చాలడం లేదు. యురేనస్ మీదనో, నెప్ట్యూన్ మీదనో మరే ఇతర సుదూర గ్రహం మీదనో ఉన్న అనుభూతి కలుగుతోంది. నాకు ప్రస్తుతం కలుగుతున్న అనుభూతులని అర్థం చేసుకోడానికి నా జీవితంలో నేను ఇంతవరకు సేకరించిన ధరాగత అనుభవాలు సరిపోవు. అలాంటి కొత్త అనుభవాలని వర్ణించడానికి కొత్త మాటలు అవసరం. నా ఊహాశక్తికి అలాంటి పదాలు అంతుచిక్కలేదు. భయం, సంభ్రమం కలగలసిన మనోభావంతో ఎదుట దృశ్యాన్ని తిలకిస్తూ ఉండిపోయాను.
చుట్టూ కనిపించే అలౌకిక సౌందర్యాన్ని చూస్తుంటే మనసుకి ఎంతో హాయి కలిగింది. సాంద్రమైన శీతల పవనాలు ముఖాన్ని నిమిరి పోతుంటే ఎంతో స్వాంతన చేకూరింది.
నలభై ఏడు రోజులు కరకైన, ఇరుకైన సొరంగ మార్గాలలో బందీగా పడి వున్న తరువాత ఇలా గుండెల నిండా చల్లగా ఊపిరి నింపుకునే భాగ్యం కలగడం చెప్పలేని ఆనందంగా వుంది.
సొరంగాన్ని వదిలి బయటికి రావడం గొప్ప వరంలా అనిపించింది.
“నడవడానికి కాస్త ఓపిక వుందా?” మామయ్య అడిగాడు.
“ఓ బోలెడు. ఈ క్షణం నడవగలగడం ఓ గొప్ప వరంలా తోస్తోంది.”
“అయితే చెయ్యి పట్టుకో. తీరం వెంట అలా తిరిగొద్దాం.”
మామయ్య, నేను నెమ్మదిగా ఆ సముద్ర తీరం వెంట సంచారం మొదలెట్టాం. ఎడమ పక్క కొండలు శంఖాకారపు రాళ్లు గుట్టలుగుట్టలుగా పేర్చినట్టు ఉన్నాయి. ఆ గుట్టల మీదగా జాలువారే వేవేల సెలయేళ్ల కలకలం వీనుల విందుగా వుంది. అప్పుడప్పుడు ఉప్ఫున ఎగసిపడే మెరిసే ఆవిర్లు వేణ్ణీటి బుగ్గల ఉనికిని సూచిస్తున్నాయి.
ఇన్ని చిట్టేళ్ల మధ్యలో మా చిన్నారి నేస్తం హన్స్ బాక్ ని పోల్చుకోగలిగాను. చీకటి సొరంగం లోంచి నెమ్మదిగా బయటికి ప్రవహిస్తూ ఆ విశాల సాగరంలో కలసిపోతోంది ఆ కలయికే తన జీవన సాఫల్యం అన్నట్టు…
“అది మళ్ళీ కనిపించదు కదా?” నిట్టూరుస్తూ అన్నాను.
“దారి చూపడానికి ఏదో ఒకటి కావాలి. అదైతేనేం, మరొకటి ఐతేనేం?” మామయ్య తేలిగ్గా అన్నాడు.
అది వట్టి కృతఘ్నత అనిపించింది.
ఆ క్షణం నా దృష్టి ఓ అనుకోని దృశ్యం మీద పడింది.
(ఇంకా వుంది)
0 comments