సోమవారం, ఆగస్టు 17
ఆదిమ యుగానికి చెందిన ఆ రాకాసి జీవాల ప్రత్యేక లక్షణాలని గుర్తుతెచ్చుకోడానికి ప్రయత్నించాను. పరిణామ క్రమంలో మాలస్క్ లు, క్రస్టేషియన్లు, చేపలకి తరువాత, స్తన్య జీవాలకి ముందు వచ్చిన జీవాలివి. అవి భూతలాన్ని సరీసృపాలు ఏలుతున్న రోజులు. రెండవ దశలో ఈ జీవాలు సముద్రాల మీద అధిపత్యం చేశాయి. కొండంత కాయాలు గల ఆ జీవాల బలం వర్ణనాతీతం. మనం నేడు చూసే మొసళ్లు ఆ మహాకాయాల యొక్క అల్పమైన ప్రతిరూపాలు.
ఆ రాకాసి జీవాల గురించి తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. వాటిని సజీవంగా చూసిన మానవుడు లేడు. మనిషి రాకకి వెయ్యి యుగాలకి ముందు అవి భూమి మీద సంచరించాయి. కాని ఆర్జిలేషియస్ సున్నపు రాయిలో వాటి శిలాజాలు మాత్రం మిగిలాయి. ఆ రాతిలో మిగిలిన శిలాజ విశేషాలని బట్టి ఆ మహాకాయాల రూపురేఖలని నిర్ధారించడానికి వీలయ్యింది.
హాంబర్గ్ లోని ఓ మ్యూజియమ్ లో ఓ సారి ఇలాంటి ఓ జీవం యొక్క అస్తిపంజరాన్ని చూశాను. దాని పొడవు ముప్పై అడుగులు. ఇప్పుడలాంటి రాకాసి జీవాలని ముఖాముఖి ఎదుర్కోవలసిందేనా? నాకా రాత తప్పదా? బహుశ నేను అనవసరంగా భయపడుతున్నానేమో. నేను చూసిన పలుగాట్లు బహుశ ఏ మొసలివో అయ్యుంటాయి.
ఓ సారి భయంగా సముద్రం వైపు చూశాను. ఆ నీటి లోతుల్లో ఏవుందో ఓసారి పొడ చూడడానికి ప్రయత్నించాను. ఏ క్షణమైనా నీటి లోతుల్లోంచి ఓ రాకాసి జీవం తటాలున పైకి తన్నుకు రావచ్చు. బహుశ ప్రొఫెసర్ లీడెన్ బ్రాక్ కి కూడా నాలాంటి అభిప్రాయమే వుందేమో. అందుకేనేమో ఆయన కూడా సముద్రం అంతా ఒక కొస నుండి అవతలి కొసకి కలయజూస్తున్నాడు. పోయి పోయి ఆయన సరిగ్గా ఇక్కడే లోతు కొలవాలా? గుర్రు పెట్టి నిద్దరోతున్న రాక్షసిని తట్టి మరీ లేపినట్టు అయ్యింది.
ఓ సారి మా తుపాకుల వైపు చూశాను. ఆ విషయాన్ని మామయ్య కూడా గుర్తించి నాతో ఏకీభవిస్తున్నట్టుగా తల పంకించాడు.
అంతలో నీటి ఉపరితలం మీద ఏదో సంచలనం కనిపించింది. అంటే నీట్లో ఏదో సంక్షోభం బయల్దేరినట్టుంది. ప్రమాదం దగ్గర పడుతోంది. అందరం అప్రమత్తం అయ్యాం.
మంగళవారం, ఆగస్టు 18
సాయంత్రం అయ్యింది. అంటే నిద్ర ప్రభావానికి కనురెప్పలు భారంగా కిందికి వాలే సమయం అయ్యింది. ఎందుకంటే ఇక్కడ రాత్రి పగలు ఉండవు. ఎందుకంటే ఇక్కడ ఆకాశంలో ఎప్పుడూ మారని కాంతులు తళతళ లాడుతూ కళ్లకి అలుపు తెప్పిస్తూ, ఆర్కిటిక్ సూరీణ్ణి తలపిస్తూ, ఉంటాయి. హన్స్ పడవ నడుపుతూ మెలకువగా ఉన్నాడు. అతడు పహరాలో ఉండగా నేను సుఖంగా నిద్రపోయాను.
రెండు గంటల తరువాత ఏదో బలమైన ఘాతానికి తుళ్లిపడి లేచాను. కొండలా పొంగి వస్తున్న అల మీద సవారీ చేస్తూ పడవ అంతెత్తుకి లేచి ఓ నూట ఇరవై అడుగులు మళ్లీ కింద పడింది.
“ఏవయ్యింది?” మావయ్య అరిచాడు. “నేల తగిలిందా?”
ఆరొందల గజాల దూరంలో ఓ నల్లని రాశి కేసి చూపించాడు హన్స్. ఆ రాశి నీటి మీద పైకి కిందకి ఎగసి పడుతోంది.
(ఇంక వుంది)
0 comments