దట్టమైన ఆవిరి
ఒక్కసారిగా ఘనీభవించి నీరయ్యింది. ఆవిరి నీరు కాగా ఏర్పడ్డ శూన్యాన్ని పూరించే ప్రయత్నంలో
వాతావరణంలో భయంకరమైన వాయుగుండాలు ఏర్పడ్డాయి. మేం ఉన్న బృహత్తరమైన గుహలో మూలమూలలా వ్యాపిస్తూ విజృంభిస్తున్నాయా
వాయుగుండాలు. చీకటి మరింత చిక్కన అవుతోంది. ఆ పరిసరాలని వర్ణిస్తూ రెండు వాక్యాలు రాయడానికి
నాకు గగనం అయ్యింది. అంతలో ఏదో అల తాకిడికి పడవ ఒక్కసారిగా పక్కకి ఒరిగిగింది. ఆ దెబ్బకి
హన్స్ వశం తప్పి కింద పడ్డాడు. ఎప్పుడూ తల ఒగ్గని మావయ్య కూడా విధి లేక సాష్టాంగపడిపోయాడు!
నా పరిస్థితి కూడా అంత భిన్నంగా ఏమీ లేదు. ఎలాగో కష్టపడి పాకి మావయ్య దగ్గరగా జరిగాను.
మావయ్య బలంగా ఓ తాడు పట్టుకున్నాడు. అంత భీభత్సంలో కూడా ఆయన ముఖంలో ఏదో సంతృప్తి చూసి
ఆశ్చర్యపోయాను.
హన్స్ కదలకుండా
అలాగే పడి వున్నాడు. అతడి పొడవాటి కేశాలు తుఫాను గాలికి అల్లలాడుతున్నాయి. ఆ కురుల
కొసల నుండీ ఏవో చిత్రమైన కాంతులు చిమ్ముతున్నాయి. ఆ కాంతుల మేలిమి ముసుగు మాటున అతడి
ముఖం చిత్రంగా వెలిగిపోతోంది.
ఇన్ని జరుగుతున్నా
తెరచాప కట్టిన గుంజ మాత్రం స్థిరంగానే వుంది. గాలి ధాటికి తెరచాప ఏ క్షణానైనా పగిలిపోడానికి
సిద్ధంగా వున్న బుడగ లాగా పొంగింది. కెరటాల మీద జారుతూ పడవ జోరుగా ముందుకి కదులుతోంది.
“తెరచాప, తెరచాప!”
అని అరిచాను. దాన్ని దించితే క్షేమం అన్నట్టుగా.
“వద్దు” మావయ్య
సమాధానం మునుపట్లాగే ధీమాగా వచ్చింది.
“నెజ్!” అన్నాడు
హన్స్ కూడా తల అడ్డుగా ఊపుతూ.
వర్షం ధాటి అంతకంతకు
పెరుగుతోంది. అది వర్షం అనే కన్నా జలపాతం అంటే సబబేమో. ఆ జలపాతాన్ని ఛేదించుకుంటూ మా
పడవ దిక్చక్రం దిశగా దూసుకుపోతోంది. కిందికి దిగి వస్తున్న వర్షామేఘం మధ్యలోనే చిత్రంగా
చీలిపోతోంది. కింద సముద్రం సలసల మరుగుతోంది. పై నుండి దిగి వస్తున్న రసాయన శక్తుల ప్రభావం
వల్ల నింగికి నీటికి మధ్య విద్యుదగ్నుల భీకర లాస్యం చెలరేగిపోతోంది. అలా పుట్టిన ఉరుములతో
ఆ లోకం దద్దరిల్లిపోతోంది. ఘర్షిస్తున్న నల్లని
మేఘాలు ఒక దాని మీద ఒకటి కాంతి శరాలు విసురుకుంటూ భీకరంగా పోరాడుకుంటున్నాయి. చుట్టూ
ముసురుకున్న సాంద్రమైన ఆవిరి ఏదో చిత్రమైన కాంతితో భాసిస్తోంది. ఆ వర్షంలో నీటి బొట్లతో
పాటు పెద్ద పెద్ద వడగళ్లు కూడా పడుతున్నాయి. మా ఇనుప పనిముట్ల మీద వడగళ్లు పడ్డప్పుడు
అవి తాకిన చోటి నుండి వెలుగు ఊరుతోంది. పర్వతాలలా ఉప్పొంగుతున్న సముద్ర జలాలు అగ్నిపర్వతాలలా
నిప్పులు కక్కుతున్నాయి. ఆ సలిలపర్వత శిఖరాగ్రాల మీద కాంతుల పింఛాలు నాట్యం చేస్తున్నాయి.
ఎటు చూసినా దర్శనమిచ్చే ఆ విపరీతమైన వెలుగుని చూడలేక కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఆగని
ఉరుముల ఢమరుక నాదానికి చెవులు హోరెత్తిపోతున్నాయి. తెరచాప కట్టిన గుంజ గడ్డిపరకలా వంగిపోతోంది.
(ఈ సందర్భంలో
నేను రాసుకున్న వార్త కాస్త అవిస్పష్టంగా వుంది. ఆ ఉద్విగ్న భరిత, అర్థచేతన స్థితిలో
ఏం రాశానో నాకే తెలీదు. ఏదో క్లుప్తంగా, సగం సగంగా రాసుకున్నాను. అవిస్పష్టంగా ఉన్న
నా వర్ణన బట్టి అప్పటి పరిస్థితి ఎంత గందరగోళంగా వుందో అర్థమవుతుంది అనుకుంటాను.)
0 comments