ఇంత కాలం మమ్మల్ని
హడలగొట్టిన నీటిధారకి దగ్గరపడుతున్న కొద్ది దాని పరిమాణం మా కళ్ల ముందే ఇంతింతై ఎదగసాగింది.
ఆ చిట్టి దీవి నిజంగానే ఓ పెద్ద క్రిటేషియన్ జాతి జలచరంలా వుంది. దాని ఎత్తు కెరటాల
మీద ఓ ఇరవై గజాలు ఉంటుందేమో. ఆ దీవి మీద ‘గీసర్’ విభ్రాంతి కలిగించే విధంగా అంతెత్తుకి
ఎగసి పడుతోంది. అసలు ‘గీసర్’ అనే పదానికి అర్థం ‘రౌద్రం’ అట. అడపదపా పెద్ద పెద్ద విస్ఫోటాలు
వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు ఓ పెద్ద నీటి వెల్లువ ఉఫ్ఫని పెద్ద విస్ఫోటంతో దీవి
లోంచి ఆవిర్లు కక్కుకుంటూ ఎగజిమ్మి ఇంచుమించు మబ్బులని తాకేటంత ఎత్తుకి ఎగసిపడుతోంది.
రాతిలో దాగి వున్న అగ్ని శక్తే ఈ నీటి ధారలకి ఇంధనంగా పని చేస్తోంది. మధ్య మధ్యలో విద్యుల్లతా కాంతుల తళుకులు ఆ నీటి
ధారలకి అలంకారాలు అందిస్తున్నాయి. ఆ విద్యుత్ కాంతుల వక్రీభవనం వల్ల కాబోలు కిందికి పడుతున్న తుషార బిందువులు
కోటివన్నెలతో మెరిసిపోతూ ఆ విచిత్ర లోకానికి ఏదో
అలౌకికసౌందర్యాన్ని ఆపాదిస్తున్నాయి.
“రండి. పడవ దిగుదాం,”
అన్నాడు ప్రొఫెసరు.
“కాని ఆ నీటి
ధారకి కాస్త దూరంగా ఉండాలి. దాని దెబ్బకి మన తెప్ప ఒక్క క్షణంలో మునిగిపోతుంది.”
హన్స్ మా తెప్పని
ఎప్పట్లాగే ఒడుపుగా నడిపిస్తూ దీవి అంచుకి తీసుకొచ్చాడు.
పడవ నుంచి ఓ
రాయి మీదకి గెంతాను. మేం నడుస్తున్న రాయి సిలికాన్, సున్నపురాయి కలిసిన కంకర రాయి.
మా కాళ్ల కింద నేల కంపిస్తోంది, బాయిలర్ లా కుతకుతలాడుతోంది. మరుగుతున్న నీటిలో ఓ ధర్మామీటరు
ముంచి ఉష్ణోగ్రత కొలిచాను. ఉష్ణోగ్రత 325 డిగ్రీలకి పైగా వుంది. అంటే నీటి మరుగుస్థానం
కన్నా చాలా హెచ్చు. అంటే అడుగున భుగభుగ మండే ఏదో సహజ కొలిమి లోంచి ఈ నీరు ఎగజిమ్ముతోంది
అన్నమాట. ఆ విషయం మరి ప్రొఫెసర్ లీడెన్ బ్రాక్ సిద్ధాంతాలకి పూర్తిగా విరుద్ధంగా వుంది.
ఆ విషయం బయటికి వెళ్లగక్కకుండా ఉండలేకపోయాను.
“అలాగా? కాని
నేను చెప్పిందానికి అది విరుద్ధం ఎలా అవుతుంది?” ఎదురు ప్రశ్న వేశాడు మావయ్య.
“అబ్బే! ఏం లేదులే
మావయ్యా. ఊరికే అన్నా.” ఎలాగో మాట దాటేశాను. మావయ్య కొండ లాంటి మొండి వైఖరి నాకు కొత్తేం
కాదు.
ఒక్క విషయం మాత్రం
గట్టిగా చెప్పగలను. ఇంతవరకు మా విచిత్ర యాత్రలో మమ్మల్ని అదృష్టం వెన్నంటే వుంది. ఇంతవకు
మేం ఎదుర్కున్న ఉష్ణోగ్రతా పరిస్థితులు చాలా సుముఖంగా వున్నాయనే చెప్పాలి. కాని ఇక
ముందు కేంద్రంలోని ఉష్ణోగ్రత ఎంత ఎక్కువ అవబోతోందంటే, దాన్ని కొలవడానికి మా వద్ద ఉన్న
థర్మామీటర్లు సరిపోవు.
“అదేంటో చూద్దాం
పద,” అంటూ ప్రొఫెసరు అల్లుడికి బయల్దేరమని సైగ చేశాడు. (పోతూ పోతూ ఎంతో ఉదార బుద్ధి
గల మావయ్య ఆ దీవికి అల్లుడి పేరు పెట్టడం మాత్రం మర్చిపోలేదు.)
కొన్ని నిమిషాల
పాటు ఆ గీసర్ గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను. నీటి ధారలోని ధాటి ఎప్పుడూ ఒక్కలా లేదన్న
విషయం గమనించాను. ఒకసారి ధార చాలా పైకి లేస్తుంది. మరో సారి కాస్తంత ఎత్తు లేచి కింద
పడిపోతుంది. దానికి కారణం కింద భూగర్భ జలాశయంలో ఉన్న ఆవిరి యొక్క పీడనంలోని హెచ్చుతగ్గులే
నని అర్థం చేసుకున్నాను.
ఎట్టకేలకు దీవికి
వీడ్కోలు చెప్పి దాని దక్షిణ తీరం వద్ద చిట్టిపొట్టి రాళ్ల చుట్టూ ఒడుపుగా ముందుకి
సాగిపోయాం. మేం దీవి మీద సంచరిస్తున్న సమయంలో హన్స్ తన చుక్కానికి మరమ్మత్తులు చేసుకున్నాడు.
ఇంతవరకు మేం
ప్రయాణించిన దూరం కొలిచి నా యాత్రాపత్రికలో రాసుకున్నాను. గ్రౌబెన్ రేవుని వదలిన దగ్గర్నుండి
రెండొందల డెబ్బై కోసుల దూరం సముద్రం మీద ప్రయాణించాము. అలాగే ఐస్లాండ్ వదిలిన దగ్గర్నుండి
ఇంగ్లండ్ కి అడుగున ప్రయాణిస్తూ ఆరొందల ఇరవై కోసుల దూరం వచ్చేశాం.
(ముప్పై నాలుగవ
అధ్యాయం సమాప్తం)
Adenti.......meeku yellow stone national park (wy. USA) gurinchi teliyadaa? Akkada enno enno geysers. Annitlonuu Old faithful maree peddadi.prati 90 nimishalaki erupt avuthuu vuntundi dadapu 50 meters varaku.
Adenti.......meeku yellow stone national park (wy. USA) gurinchi teliyadaa? Akkada enno enno geysers. Annitlonuu Old faithful maree peddadi.prati 90 nimishalaki erupt avuthuu vuntundi dadapu 50 meters varaku.