అధ్యాయం -
35
విద్యుత్ తుఫాను
శుక్రవారం, ఆగస్టు 21
మర్నాటికి ఆ
అద్భుతమైన గీసర్ కనుమరుగయ్యింది. గాలి జోరు పెరిగింది. గాలి వాటుకి మా తెప్ప ఏక్సెల్
దీవి నుండి దూరమయ్యింది. మేం వున్న దూరంలో ఆ ఘోష సద్దుమణిగింది.
వాతావరణం (అసలు
ఆ పదాన్ని ఈ సందర్భంలో వాడొచ్చో లేదో కూడా తెలీదు) తొందర్లోనే మారే సూచన్లు కనిపిస్తున్నాయి.
వాతావరణం అంతా దట్టమైన ఆవిర్లు కమ్ముకుని వున్నాయి. ఉప్పునీరు ఆవిరి కాగా పుట్టిన ఆ
ఆవిర్లలో విద్యుదావేశం దట్టంగా వ్యాపించి వుంది. మబ్బులు ఇంకా ఇంకా కిందికి వంగి కాలవర్ణాన్ని
సంతరించుకున్నాయి. తటిల్లతల తళుకులు దట్టమైన
ఆ ఆవిరి తెరలని ఛేదించలేకున్నాయి. ఆ నల్లని నీరు, ఆ మసక మసక వెలుతురు – ఆ ప్రాంతం
అంతా ఏదో చెప్పరాని ప్రళయతాండవం కోసం కట్టిన వేదికలా భయంకరంగా వుంది.
మహోగ్రమైన వాతావరణ
మార్పులు ఆసన్నమైనప్పుడు భూమి మీద ఎన్నో జీవాలలో లాగానే నా మనసులో కూడా ఎదో కల్లోలం
మొదలయ్యింది. వంపులు తిరిగిన క్యుములస్ మబ్బులు భారంగా, భయంకరంగా కనిపిస్తున్నాయి.
పెనుతుఫాను ఆసన్నమైనప్పుడు గాలిలో వుండే గాంభీర్యం వాటిలో కనిపిస్తోంది. గాలి భారంగా
వుంది. సంద్రం నిబ్బరంగా వుంది.
దూరం నుంచి మబ్బులు
అల్లకల్లోలంగా వున్న నేపథ్యం మీద అద్దిన పెద్ద పెద్ద దూదేకుల్లా వున్నాయి. సంఖ్యలో
తక్కువగానే వున్నా పరిమాణంలో మాత్రం చాలా పెద్దగా వున్నాయి. బరువుకి నెమ్మదిగా దిక్చక్రం
మీదుగా వాలుతాయి. కాని ఇంతలో ఏదో తెమ్మెర తాకిడికి కాస్త పైకి లేస్తాయి. ఆ తెలిమంచు
సముద్రం మీద మెత్తని పరుపులా వ్యాపించింది. ఆ పానుపు మీద విద్యుల్లతా కాంతులు లాస్యం
చేస్తున్నాయి.
వాతావరణం అంతా
విద్యుదావేశంతో నిండిపోయింది. ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఆ సమయంలో నన్ను
గాని నా పక్కన ఉన్న వాళ్ళు తాకితే పెద్ద షాక్ తగులుతుందని అనిపించింది.
ఉదయం పది గంటలకి
తుఫాను సూచనలు మరింత తీవ్రం అయ్యాయి. గాలి మరింత ఉధృతం అయ్యింది. పైన వేళ్లాడుతున్న
విశాలమైన మేఘజాలం భయంకర పెనుతుఫానులకి ఆలవాలం.
అశుభం పకలడం
మంచిది కాదని పెద్దలు అంటారుగాని ఈ సమయంలో అనకుండా ఉండలేకపోతున్నా,
“వాతావరణం దారుణంగా
వుంది.”
ప్రొఫెసర్ మావయ్యలో
ఉలుకు పలుకు లేదు. ఆయన వదనం గంభీరంగా వుంది. ఎదుట అనవధికంగా వ్యాపించి వున్న వారిధి
కేసి నిశితంగా చూస్తున్నాడు. ఏమనుకున్నాడో ఏమో కాని బయటికి మాత్రం ఓ సారి నిట్టూర్చాడు.
“భయంకరమైన తుఫాను
ముంచుకొచ్చేలా వుంది,” అన్నాను దిక్చక్రం కేసి చూపిస్తూ. “ఆ నల్లని మబ్బులని చూడబోతే
సముద్రాన్ని కబళించేలా వున్నాయి.”
నలుదిశలా గాఢమైన
నిశ్శబ్దం అలముకుంది. గాలుల ప్రళయఘోష ఒక్కసారిగా ఎందుకో సద్దుమణిగింది. ఒక్క క్షణం
ప్రకృతి శ్వాస నిలిచిపోయినట్టుగా అనిపించింది. తెరచాప కట్టిన దుంగ పై కొసన ఉన్న వాడి
అయిన లోహపు మొన చుట్టూ పేరుకున్న విద్యుదావేశాల వల్ల దాని నుండి సెయింట్ ఎల్మో కాంతులు
ఎగజిమ్ముతున్నాయి. తెరచాపలో ఒక్క చలనం కూడా లేదు. ఒక్క అల కూడా లేని నిశ్చల జలాలలో
చుక్కాని చలనం లేకుండా పడి వుంది. ముందుకు కదిలే ఉద్దేశం లేనప్పుడు తెరచాప దించడం ఉత్తమం
అనిపిస్తుంది. లెకుంటే తెరచాప పైకెత్తి వుంటే తుఫాను తాకిన మరుక్షణం పడవ తలక్రిందులు
అవుతుంది.
“తెరచాప దించేయడం
మంచిది. లేకుంటే అపాయం,” అరిచాను.
“వద్దు, వద్దు.
అలాగే వున్నీ,” తిరిగి అరిచాడు మావయ్య. “గాలి వీస్తే వీయనీ. పడవ ఏ బండకో కొట్టుకుని
ముక్కలైనా ఫరవాలేదు. ఇవాళ ఎలాగోలా తీరాన్ని చూడాల్సిందే.”
ఆయన నోట్లోంచి
ఆ మాటలు వెలువడ్డాయో లేదో, దక్షిణ ఆకాశంలో ఏదో విచిత్ర పరిమాణం ఆరంభమయ్యింది.
(ఇంకా వుంది)
0 comments