మానవుడు – అతడి
ప్రతీకలు (Man and his symbols)
కార్ల్ యుంగ్
(Carl Jung)
ఈ బ్లాగ్ లో
ఇంతవరకు మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన పోస్ట్ లు వెయ్యలేదు. ఆధునిక మనస్తత్వ శాస్త్రం
అనగానే సిగ్మండ్ ఫ్రాయిడ్, కార్ల్ యుంగ్ మొదలైన మహామహులు గుర్తొస్తారు. ఈ మధ్యన కార్ల్
యుంగ్ రాసిన Man and his symbols అనే పుస్తకం
దొరికింది. ఇది నిజానికి యుంగ్ మరి కొందరు నిపుణులతో కలిసి రాసిన పుస్తకం. ఇందులో మొదటి
అధ్యాయం Approaching the Unconscious అనే అధ్యాయం
చాలా ఆసక్తి కరంగా అనిపించింది.
వివిధ మానవ సంస్కృతులలో
ఎలా విలక్షణమైన ప్రతీకలు వాడబడుతూ వచ్చాయో చెప్తూ ఎంతో విభిన్నమైన సంస్కృతులలో కూడా
కొన్ని సామాన్య ప్రతీకలు వాడబడడం ఆశ్చకరంగా ఉంటుందని సూచిస్తాడు. దేశ కాలాలలో ఎంతో
ఎడం ఉన్న మానవ సంస్కృతులకి చెందిన ప్రతీకలలో ఏకత్వం ఉండడానికి కారణాలు మన ‘అచేతన’
(unconscious) లో ఉన్నాయన్న చిత్రమైన భావన యుంగ్ యొక్క చింతనకి మూలస్తంభం లాంటిది అని
చెప్పుకోవచ్చు.
మన మనసుని సచేతన
మనసు (conscious mind), అచేతన మనసు (unconscious mind) అని రెండు విభాగాలుగా విభజించవచ్చు.
ఇంద్రియాల ద్వార, ఆలోచన ద్వార తెలుసుకునే దంతా మన సచేతన మనస్సులో జరుగుతోంది. మన సచేతన
మనస్సుకి ‘అడుగున’ లేక ‘వెనుక’ గుప్తంగా ఉన్న మనో విభాగమే అచేతన మనస్సు. (అచేతన మనస్సు
అనే బదులు దాన్ని క్లుప్తంగా అచేతన (unconscious) అని పిలుస్తారు). దాన్ని మనం ప్రత్యక్షంగా
అనుభవించలేం. కాని దాని రహస్య ప్రభావాన్ని మనం సచేతన మనస్సులో అనుభవిస్తాము.
చిన్న ఉదాహరణ.
ఏదో సమావేశంలో లోతుగా మునిగిపోయి వుంటాము. ఏదో ముఖ్యమైన అంశం మీద చర్చ బాగా వేడిగా
కొన్ని గంటల తరబడి సాగింది. చర్చ ముగిశాక ఒక్కసారిగా నాలుక పిడచకట్టుకు పోయినట్టు అనిపిస్తుంది.
బాగా దాహం వేస్తుంది. అయితే ఎప్పట్నుంచో దాహం వేస్తూ ఉండోచ్చు. చర్చలో పడి దాన్ని మనం
పట్టించుకోలేదు. చర్చ పూర్తయ్యాక గాని అంతవరకు ‘అచేతనంగా’ ఉండిపోయిన ‘దాహం వేస్తోంది’
అన్న విషయం ‘సచేతన మనస్సు’లోకి ప్రవేశించలేదు.
అలాగే కొందరంటే
మనకు ఎందుకో ఇష్టం ఉంటుంది. ఎందుకో చెప్పలేం. మరి కొందరంటే మనకి అస్సలు పడదు. అందుకు కారణం ఏంటో తెలీకపోవచ్చు.
అంటే ఆ కారణం మన సచేతన మనస్సుకి తెలీదు. అసలు ‘కారణం’ అచేతన లో ఉంటుంది. కాని అచేతనకి భాష రాదు. కనుక కారణం ఏంటో
బాహటంగా, భాషని వాడి చెప్పలేం. ఈ విధంగా మనకి సచేతన మనసులో జరిగే వ్యవహారాల మీద (అంటే
మన ఆలోచనలు, నమ్మకాలు, అభిప్రాయాలు…) అచేతన మనస్సు యొక్క ప్రభావం రహస్యంగా వున్నా,
ప్రబలంగా ఉంటుంది.
అచేతనకి భాష
రాకపోయినా కొన్ని ప్రత్యేక ప్రతీకలు అనే మాధ్యమాన్ని వాడుకుంటూ అచేతనకి మనతో సంభాషిస్తుంది,
మనకి సంజ్ఞలు చేస్తుంది అంటాడు కార్ల్ యుంగ్. అచేతన యొక్క ఈ ‘పరిభాష’ ని అర్థం చేసుకుంటే
మనం మన జీవితాలని మరింత సమర్థవంతంగా జీవించొచ్చు అంటాడు. మన అచేతనలో ఏముందో తెలుసుకోగలిగితే
మన గురించి మనకి మరింత లోతైన అవగాహన ఏర్పడుతుంది అంటాడు.
కార్ల్ యుంగ్
చింతనలో ఈ అచేతన గురించిన ప్రస్తావన, వర్ణన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పైన చెప్పుకున్న
అధ్యాయం ‘అచేతన’ గురించి అతడి పరిశోధనల సారాంశాన్ని అందజేస్తుంది.
ఆ అధ్యాయం యొక్క
సంక్షిప్తానువాదం కొన్ని పోస్ట్ లలో ఓ సీరియల్ గా వెయ్యాలని ఉద్దేశం.
please go on.......... waiting for ur interpretations in psychological sciences too...... thank u for ur knowlege dwelling posts........
Thank you Krishna Chaitanya garu!