శాస్త్రవేత్తలు కాంతి వేగాన్ని కొలుస్తున్నప్పుడు వారికి కేవలం
ఓ ప్రత్యేకమైన రాశిని కొలవాలన్న ఉత్సుకత తప్ప ప్రత్యేకమైన లక్ష్యం అంటూ ఏమీ లేదు. శబ్ద
వేగాన్నో, ఓ గుర్రం వేగాన్నో కొలిచినట్టే ఇదీ అన్నట్టు భావించారు.
కాని మిగతా వేగాలలా కాక కాంతి వేగానికి ఓ ప్రత్యేకత వుందని
అప్పుడు వారికి తెలీదు.
కాంతి అనేది ఒక తరంగం అన్ని అందరూ ఒప్పుకున్న తరువాత అది
“దేని యొక్క తరంగం?” అన్న ప్రశ్న సహజంగా ఉద్భవించింది.
చెరువులో నీటి ఉపరితలం మీద అలలు పుడతాయి. అవి నీటి యొక్క తరంగాలు.
అలాగే శబ్ద తరంగాలు గాలిలో ప్రయాణించే తరంగాలు, అవి గాలి కదలికల యొక్క తరంగాలు. కాని
కాంతి శూన్యంలో కూడా ప్రయాణిస్తుంది. శబ్దం గాని, నీటి అలలు గాని పదార్థ మాధ్యమంలో
ప్రసారం అయ్యే తరంగాలు. కాంతికి అలాంటి పదార్థ మాధ్యమం అవసరం లేనట్టు కనిపిస్తోంది.
మరి కాంతి ఎలా ప్రసారం అవుతోంది?
విశ్వమంతా ఓ అస్పర్శమైన పదార్థం వ్యాపించి వుందని ప్రాచీనులు
భావించారు. ఆ పదార్థానికి ‘ఈథర్’ (ether) అని పేరు పెట్టారు. ఈ ఈథర్ లోని తరంగాలే కాంతి
అని భావించారు.
(రసాయన శాస్త్రంలోని ‘ఈథర్’ కి ఈ ‘ఈథర్’ కి మధ్య సంబంధం లేదని
గమనించాలి. – అనువాదకుడు.)
దీంతో మరో ఆసక్తి కరమైన వాదం బయల్దేరింది. అది వస్తువుల యొక్క
చలనానికి సంబంధించినది.
చలనాన్ని నిర్ధారించడానికి నిశ్చలంగా ఉన్న ఒక ప్రమాణం కావాలి.
ఒక వస్తువు కదులుతోంది అని చెప్పాలంటే కదలకుండా వున్న మరో వస్తువు వుండాలి. కదలని వస్తువు
బట్టి మరో వస్తువు కదులుతోందని చెప్పగలం.
భూమి ఉపరితలం మీద ఏదైనా వస్తువు కదులుతోంది అని మనం అంటున్నప్పుడు
నిశ్చలంగా వున్న భూమి ఉపరితలాన్ని ప్రమాణంగా తీసుకుంటాం.
కాని నిజానికి భూమి ఉపరితలం కదులుతోంది. ఎందుకంటే భూమి తన
అక్షం మీద అది తిరుగుతోంది. అంతే కాక భూమి సూర్యుడు చూట్టూ తిరుగుతోంది. అలాగే సూర్యుడు
కూడా పాలపుంత కేంద్రం చుట్టూ కదులుతున్నాడు. అసలు పాల పుంత గెలాక్సీయే విశాల విశ్వంలో
కదులుతోంది.
ఇలా ఆలోచిస్తూ పోతుంటే అన్నీ కదులుతున్నట్టు అనిపిస్తుంది.
విషయం గందరగోళంగా కనిపిస్తుంది.
వస్తువులు ఎలా కదులుతున్నా ఈ ఈథర్ మాత్రం ఎప్పుడూ నిశ్చలంగా
ఉంటుందని కొంత మంది తలపోశారు. కనుక ఈథర్ యొక్క స్థితి “నిరపేక్ష నిశ్చల స్థితి”
(absolute rest). ఇక మిగతా చలనాలు అన్నిటినీ నిశ్చలమైన ఈథర్ బట్టి నిర్వచించవచ్చు కనుక
అవన్నీ నిరపేక్ష చలనాలు (absolute motion) అని చెప్పుకోవచ్చు.
కాంతి వేగాన్ని కొలవడానికి ప్రయత్నించిన మికెల్సన్ కి తన ప్రయోగం
వల్ల మరో విషయం కూడా తెలుస్తుంది అనిపించింది. నిశ్చలమైన ఈథర్ బట్టి భూమి ఎంత వేగంతో
కదులుతోందో తెలుసుకోవచ్చు అనుకున్నాడు.
భూమి ఎలా కదిలినా అది నిశ్చలమైన ఈథర్ బట్టి కదులుతూ ఉండాలని
భావించాడు మికెల్సన్. భూమి మీద ఒక చోట ఓ కాంతి పుంజాన్ని పంపించి దాని వేగాన్ని కొలిచారు
అనుకోండి. కాంతి అనేది ఈథర్ తరంగం అనుకున్నాం గనక అది నిశ్చలమైన మాధ్యమంలో ప్రసారం
అవుతోంది. భూమి కదిలే దిశ కాంతి కదిలే దిశతో సమానం అయితే కాంతి పుంజం యొక్క వేగం కాంతి
యొక్క సహజ వేగానికి భూమి వేగం తోడైనంత కావాలి. అలా కాకుండా భూమి, కాంతి పుంజం వ్యతిరేక
దిశలలో ప్రయాణిస్తున్నట్టయితే కాంతి పుంజం యొక్క వేగం కాంతి యొక్క సహజ వేగం నుండి భూమి
వేగం తీసేసినంత కావాలి.
అలా రెండు వ్యతిరేక దిశలలో కొలిచినప్పుడు కాంతి వేగంలోని భేదాల
బట్టి భూమి యొక్క నిరపేక్ష వేగాన్ని నిర్ధారించొచ్చు. భూమి వేగం నిరపేక్షంగా తెలిస్తే
భూమిని బట్టి మిగత వస్తువుల వేగాలని నిర్ధారించవచ్చు.
(ఇంకా వుంది)
You are doing a very good job,by educating the common people with regard to science.
Thank you Satyam garu.
Nice article. Keep doing the great work