1904 నుండి
1909 వరకు ఈ రచన కార్యక్రమం నిరాఘాటంగా ఓ ప్రభంజనంలా సాగింది. విద్యాలయాలకి, పండితులకి,
తోటి విద్యార్థులకి దూరంగా ఏకాంతంగా ఓ దీక్షలా సాగింది ఈ గణితసృజన. ఆ దశలో రామానుజన్
ఒంటరిగా పరిశ్రమించకుండా ఏ గణితవేత్త ప్రాపకంలోనైనా పని చేసి వుండి వుంటే, అతడి సృజన
మరింత ఘనంగా ఉండేదేమే అని కొందరు అభిప్రాయపడతారు. కాని ఒక విధంగా ఈ ఒంటరితనం తన సృజన
మరింత వన్నె తెచ్చిపెట్టిందేమో. అంతర్జాతీయ గణిత సమాజంలో భాగంగా ఉంటూ, ఇతర గణితవేత్తల
సృష్టి గురించి బాగా పరిచయం కలిగి వుంటే, ఆ భావాల ప్రభావం మరీ బలంగా ఉండేదేమో. అన్యుల
పద్ధతుల ప్రభావం మరీ బలంగా ఉన్నప్పుడు ఆ పద్ధతులని వొదిలించుకుని నూతన పద్ధతులని కనిపెట్టే
స్ఫూర్తి బలహీనం అవుతుంది. అన్యుల ఆలోచనల ప్రభావం బలంగా ఉన్నప్పుడు కొత్త ఆలోచనలు పుట్టే
అవకాశం తక్కువ. అందరిలో కలిసి మందలో మందలా ముందుకు పోతున్నప్పుడు సుఖమయంగా ఉన్న ఆ మార్గాన్ని వొదిలిపెట్టి ప్రమాదం
(అదృష్టం ఉంటే పెన్నిధి) పొంచి వున్న కొత్త పుంతలు తొక్కాలని అనిపించదు. ఆ ఐదేళ్లూ
రామనుజన్ అనుభవించిన ఏకాంతవాసం ఒక విధంగా అతడికి గొప్ప వరంలా సంక్రమించింది. గణిత రంగంలో
ఎవరూ చేరని ఎత్తుకి ఎదగడానికి అది తొలి మెట్టు అయ్యింది.
పెళ్ళీడోచ్చిన
కొడుకు చదువు, ఉద్యోగం లేకుండా రోజల్లా ఓ మూల కూర్చుని ఏవో నోట్సులు రాసుకుంటూ ఉండడం
తల్లిదండ్రులకి నచ్చలేదు. ఒంటరితనం గణితానికి మంచిదేమో కాని జీవితానికి కాదు. ఈ ఒంటరితనానికి
ఏదో ఒక చికిత్స చెయ్యాలి.
కొడుక్కి పెళ్ళి
సంబంధాలు వెతకడం మొదలెట్టింది కోమలతమ్మ.
* * *
జానకీ శ్రీనివాసుల పరిణయం
కుంభకోణానికి
అరవై మైళ్ళ దూరంలో రజేంద్రం అని ఓ కుగ్రామం వుంది. ఆ గ్రామంలో కోమలతమ్మకి పరిచయస్తులు
ఉన్నరు. 1909 లో ఓ సారి వారి ఇంటికి వెళ్ళింది
కోమలతమ్మ. అక్కడ ఓ పిల్ల కోమలతమ్మ దృష్టిని ఆకర్షించింది. అమ్మాయి కాస్త బక్కపలచగా
వున్నా కళ్లలో ఏదో చమక్కు కనిపించింది. వెంటనే ఆ అమ్మాయి జాతక వివరాలు అడిగి తెలుసుకుంది.
ఆ అమ్మాయి పేరు జానకి, వయసు తొమ్మిదేళ్ళు. కొడుకు రామనుజన్ జాతకం, ఆ పిల్ల జాతకం అక్కడికక్కడే
గోడ మీద స్వయంగా వేసుకుని, రెండూ పోల్చి చూసుకుని, రెండు జాతకాలు సరిపోయాయని నిర్ధారించేసింది.
జానకీ రామానుజుల పరిణయం నిశ్చయమయ్యింది. అంత హడావుడిగా తన అభిప్రాయం తెలుసుకోకుండా,
అంగీకారం లేకుండా భార్య ఇలా పెళ్లి కుదిర్చేయడం భర్త శ్రీనివాసుడికి బొత్తిగా నచ్చలేదు.
కాని నచ్చకపోయినా పెద్దగా చేసేది కూడా ఏమీ లేదు. ఆ ఇంట్లో కోమలతమ్మ చెప్పిందే వేదం.
జూలై 14,
1909 లో జానకికి, రామనుజన్ కి మధ్య వివాహం
జరిగింది. ఆ రోజుల్లో బాల్య వివాహలు పరిపాటిగా జరిగేవి. అయితే వివాహం అయిన వెంటనే పిల్ల
మెట్టింటికి కాపురానికి వెళ్లేది కాదు. వయసు వచ్చినదాక పుట్టింట్లోనే ఉండి ఆ తరువాత
మెట్టెంటి గడప తొక్కేది. మూడు ముళ్ళూ వేయించుకున్నాక, ఏడడుగులూ నడిచిన తరువాత ఇక భర్తని
కళ్ళార చూసిందిగాని, మనసు విప్పి మాట్ళాడింది గాని లేదు. ఇంకా పది నిండని జానకికి తన
భర్త గురించి పెద్దగా తెలీదు. తన కొడుకు గొప్ప గణిత మేధావి అని కోమలతమ్మ జానకి తల్లితో
ఏదో చెప్తుంటే వింది.
పెళ్ళితో కొడుకు
జీవితం గొప్ప మలుపు తిరుగుతుందని నమ్మింది కోమలతమ్మ. కాని పెళ్ళి చేసుకుని కుంభకోణానికి తిరిగొచ్చిన రామనుజన్
కి పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించలేదు.
మునుపటి ఒంటరితనం అలాగే వుంది. పైగా ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. అంతవరకు ఉద్యోగం
లేకుండా ఇంట్లో ఊరికే కూర్చున్నా చెల్లిపోయింది.
రేపో మాపో భార్య కాపురాని కొస్తుంది. భర్తకి దమ్మిడీ సంపాదించడం చాతకాదని తెలిస్తే
బాధపడుతుంది. నలుగురూ నాలుగు విధాలుగా అనుకుంటారు.
కనుక ఇక ఏదో ఒకటి చెయ్యాల్సిందే.
(ఇంకా వుంది)
>జానకీ రామానుజుల పరిణయం నిశ్చయమయ్యింది. ....
మీరు శీర్షిక తప్పుగా ఉంచారు. "జానకీ శ్రీనివాసుల పరిణయం" అన్నది తప్పు కదా?
వెంటనే "జానకీరాముల పరిణయం అని మార్చుతారా?" నిజానికి ఇదీ తప్పే. అతడిపేరు రామానుజం కదా!