గట్టి పట్టుదలతో
ఉద్యోగ వేట మీద బయల్దేరాడు రామనుజన్. బస్తీలో అవకాశాలు ఎక్కువ కనుక మళ్లీ మద్రాస్ దారి
పట్టాడు. రైలు ఖర్చులు పెట్టుకోవడానికే గగనమయ్యింది. ఇక మద్రాస్ లో అడుగుపెట్టిన దగ్గర్నుండి
బస, భోజనం అన్నీ సమస్యలే. ఓ పాత మిత్రుడి వద్ద కొంత కాలం తల దాచుకోవాలని అనుకున్నాడు.
కాని దగ్గర్లోనే ఏదో ఆశ్రమం వుందని, అక్కడ ఉచితంగా బస చెయ్యొచ్చని ఆ మిత్రుడు ఉదారంగా
ఆశ్రమానికి దారి చూపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన పాత శిష్యుడు విశ్వనాథ శాస్త్రి
తారసపడ్డాడు. విశ్వనాథ శాస్త్రి ఆ రోజుల్లో మద్రాసులో ప్రసిద్ధమైన ప్రెసిడెన్సీ కాలేజిలో చదువుకునే వాడు.
గురు శిష్యులు ఇద్దరూ ఒకే గదిలో కలిసి ఉండేవారు.
రోజూ ఉదయానే
రామనుజన్ ప్రయివేటు మాస్టరుగా ఉద్యోగాల వేటలో బయల్దేరేవాడు. అయితే రామానుజన్ చెప్పే
ప్రయివేటులో గణితం కన్నా వేదాంతం పాలెక్కువ అన్న మాట వేగంగా పొక్కింది. కనుక ఎక్కడా
ట్యూషన్లు చెప్పే అవకాశాలు దొరకలేదు. చేతిలో చిల్లి గవ్వ లేకపోవడం, శిష్యుడి మీద ఆధారపడి
జీవించాల్సి రావడం – ఇదంతా రామానుజన్ కి నరకయాతనగా ఉండేది. విశ్వనాథుడితో తన బాధంతా
వెళ్లగక్కుకునే వాడు. ఆ దశలో రామానుజన్ పడ్డ బాధ గురించి విశ్వనాథ శాస్త్రి ఇలా అంటాడు
–
“రోజూ తన దౌర్భాగ్యాన్ని
తలచుకుని వాపోయేవాడు. తనకి దేవుడిచ్చిన ఓ గొప్ప వరం వుందని, ఊరికే బాధపడకూడదని, తన
గొప్పదనాన్ని లోకం గుర్తించే సుముహూర్తం కోసం ఎదురు చూడాలని ఓదార్చడానికి ప్రయత్నించేవాణ్ణి.
అందుకు జవాబుగా ఆయన ‘గెలీలియో వంటి మహామేధావే మతమౌఢ్యానికి బలి అయ్యాడు. ఇలా నిరుపేదగా
కష్టాలు పడి రాలిపోవాలని నాకు రాసిపెట్టి వుంది కాబోలు’ అనుకుని బాధపడేవాడు. కాని భగవంతుడు
దయామయుడని, ఏదో ఒకనాడు తనని తప్పక గట్టెకిస్తాడని, శోకానికి లొంగిపోవద్దని ఓదార్పు
మాటలు చెప్పేవాణ్ణి.”
ట్యూషన్లు చెప్పే
అవకాశాలు ఎలాగూ అందిరాలేదు. పోనీ తన గణిత పరిశోధనలని ఎవరైనా గుర్తించి ఉద్యోగం ఇస్తారేమో? ఈ ఆశలో తను అంతవరకు రాసిన రెండు భారీ నోట్సు పుస్తకాలని
మోసుకుని బయల్దేరాడు. గణితం రంగంలో అంతో ఇంతో పలుకుబడి ఉన్న ఎందరో పెద్దమనుషుల దర్శనం
చేసుకున్నాడు. ‘అయ్యా! ఏదో తీరిక వేళల్లో నాకు చాతనైన గణిత పరిశోధనలు కొన్ని చేశాను…
తమరు కాస్త చిత్తగిస్తే…’ ఇలా నానా విధాలుగా తన పరిస్థితిని విన్నవించుకుని, అవకాశాల
కోసం అభ్యర్థించేవాడు.
సామాన్యంగా ముక్కుమొహం
తెలీని వాడు ఇంటిగడప తొక్కి ఉద్యోగం కావాలంటే, ‘మళ్లీ కనిపించమనో,’ ‘లేదు పొమ్మనో’
అనేవాళ్ళే ఎక్కువ. కాని రామానుజన్ విషయంలో అలాంటి చేదు అనుభవం కలగలేదు. దానికి కారణం
అతడి వ్యక్తిత్వం, మాట తీరు కావచ్చు. ముక్కుసూటిగా పోయే స్వభావం, ఏ అరమరికలు లేకుండా
మనసు విప్పి మాట్లాడే తత్వం – రామనుజన్ లోని ఈ లక్షణాలు సులభంగా అవతలి వారిని ఆకట్టుకునేవి.
మద్రాసులో తనని ఎరిగిన ఓ మిత్రుడు అతడి గురించి
ఇలా అంటాడు – “ఎప్పుడూ స్నేహంగా, అభిమానం, కలివిడిగా, సరదాగా ఉండేవాడు. తమిళం, ఇంగ్లీష్
పదాలతో మాటల గారడీలు చేస్తూ చమత్కారంగా మాట్లాడేవాడు. సరదాగా ఏవేవో కథలు చెప్పేవాడు.
జోకులు చెప్పి ఆ జోకులకి తెరలు తెరలుగా నవ్వేవాడు. అలా నవ్వుతున్నప్పుడు కొన్నిసార్లు
తన పిలక ముడి ఊడిపోయి ఆ పిలక కూడా అటూ ఇటూ ఊగుతూ చూసేవారికి ఇంకా నవ్వు తెప్పించేది.
… ఎప్పుడూ హుషారుగా ఉండేవాడు. మాటలో చిలిపితనం,
కళ్లో మెరుపు… అతణ్ణి చూసి ఇష్టపడని వాడు ఉండడు.”
కనుక చెయ్యి
చాచి అడిగినా సహాయం చెయ్యలేకపోయినందుకు బాధపడ్డవారేగాని కాదని ఛీకొట్టిన వారు లేరు.
ఉద్యోగ వేట నిరంతరాయంగా
కొనసాగింది. 1910 లో రామనుజన్ తిరుకోయిలూర్
అనే చిన్న ఊరికి వెళ్లాడు. ఆ ఊళ్లో వి. రామస్వామి అయ్యర్ అనే పెద్దమనిషిని కలుసుకోవాలి.
ఈయన ఆ ఊరికి డిప్యూటీ కలెక్టరుగా ఉండేవాడు. ఈయనకి అంతో ఇంతో గణితం తెలుసు. ఆ రోజుల్లోనే
ఈయన ‘భారతీయ గణిత సదస్సు’ అనే ఓ సదస్సుని స్థాపించి దానికి అధ్యక్షుడు అయ్యాడు. ప్రెసిడెన్సీ
కాలేజిలో చదువుకునే రోజుల్లో ‘ఎడ్యుకేషన్ టైమ్స్’ అనే బ్రిటిష్ పత్రికలో కొన్ని గణితవ్యాసాలు
రాశాడు. ఇరుగు పొరుగు వాళ్ళు ఆయన్ని ‘ప్రొఫెసరు గారు’ అని పిలిచేవారు.
రామనుజన్ ‘ప్రొఫెసరుగారి’
దర్శనం చేసుకుని తన నోట్సు పుస్తకాలు ఆయన ముందుంచాడు. రామస్వామి అయ్యర్ అనుభవం జ్యామెట్రీ
రంగంలో వుంది. రామానుజన్ రచనలు అధికశాతం సంఖ్యాశాస్త్రానికి చెందినవై ఉన్నాయి. ఏదో పరాయి భాషలో రాసినట్టు అనిపించాయి. ఉద్యోగం ఇవ్వలేదుగాని
మద్రాసులో తనకి తెలిసిన కొందరు గణితవేత్తలని కలుసుకొమ్మని సిఫారసు పత్రం ఇచ్చి పంపించాడు.
ఆ సిఫారసు పత్రం
చేతబూని మద్రాస్ లో పి.వి. శేషు అయ్యర్ అనే గణితవేత్తని కలుసుకోడానికి వెళ్లాడు రామనుజన్. ఈ శేషు అయ్యర్ లోగడ కుంభకోణంలో ప్రభుత్వ
కళాశాల రామానుజన్ కి పాఠాలు చెప్పిన ఆచార్యుడే. ఇప్పుడు మద్రాస్లో ప్రెసిడెన్సీ కాలేజిలో
గణిత బోధకుడిగా పని చేస్తున్నాడు. శేషు అయ్యర్ రామనుజన్ కి ప్రత్యక్షంగా సహాయం చెయ్యలేకపోయినా, ఎస్. బాలకృష్ణ అయ్యర్ అనే
మరో గణిత వేత్తని కలుసుకోమని పరిచయ పత్రం ఇచ్చి పంపాడు.
రామానుజన్ బాలకృష్ణ
అయ్యర్ ని కలుసుకుని తన నోట్సులు చూపించాడు. బాలకృష్ణుడికి ఆ నోట్సులలోని సమాచారం పెద్దగా
కొరుకుడు పడలేదు. రామానుజన్ కి సహాయపడలేని తన అశక్తతకి చింతిస్తున్నానని మాత్రం అన్నాడు.
(ఇంకా వుంది)
0 comments