వర్ణమానినితో
పరిశీలనలు జరిపి సూర్యుడి లో ఉండే మూలకాలు (అలాగే ఇతర తారలలోని మూలకాలే కాక, తారల మధ్య
తారాంతర ధూళిలో ఉండే మూలకాలు కూడా) ఇక్కడ భూమిలో ఉండే మూలకాలు ఒక్కటేనని తెలుసుకోడానికి
వీలయ్యింది. ఈ పరిశీలనలు అనాదిగా వస్తున్న అరిస్టాటిల్ భావాలని పటాపంచలు చేశాయి. ఖగోళ
వస్తువులలో ఉండే పదార్థాలు, భూమిలో ఉండే పదార్థాలు పూర్తిగా వేరని చెప్పే అరిస్టాటిల్
సిద్ధాంతాలు తప్పని తెలిసింది.
కొత్త మూలకాలని
కనిపెట్టడానికి ఈ వర్ణమానిని ఓ అధునాతనమైన, శక్తివంతమైన పరికరంగా పరిణమించింది. ఒక
రసయనాన్నో, ఖనిజాన్నో మండించినపుడు పుట్టే వర్ణపటం అంతవరకు తెలిసిన ఇతర వర్ణపటాలతో
పోలనప్పుడు, ఆ వర్ణపటం ఏదో కొత్త పదార్థానికి చెందినది అని అనుకోవలసి ఉంటుంది.
ఈ కొత్త విధానాన్ని
ఉపయోగించి బున్సెన్, కిర్ష్‍హాఫ్ లు 1860 లో ఓ కొత్త మూలకం కోసం వెతుకుతూ కొన్ని పదార్థాలని పరీక్షించారు. చివరికి ఆ మూలకాన్ని కనుక్కున్నారు.
అదొక ఆల్కలీ లోహం అని తేల్చారు. ఆ లోహానికి సోడియమ్, పొటాషియమ్ లని పోలిన లక్షణాలు
ఉన్నాయని తెలుసుకున్నారు. దానికి సీషియమ్ (cesium) అని పేరు పెట్టారు. లాటిన్ లో ఆ
పదానికి అర్థం “ఆకాశ నీలం.” సీషియమ్ యొక్క వర్ణపటంలో ఆ రంగు వద్ద చార చాలా ప్రస్ఫుటంగా
కనిపిస్తుంది. 1861 లో ఇదే విధంగా మళ్లీ కృషి
చేసి మరో ఆల్కలీ లోహాన్ని కనుక్కున్నారు. దీనికి రుబీడియమ్ (rubidium) అని పేరు పెట్టారు. లాటిన్ లో ‘ఎరుపు’ అన్న అర్థంగల పదం నుండి ఈ పదం
వచ్చింది. దాని వర్ణపటంలో ఎర్ర చార స్ఫుటంగా కనిపిస్తుంది.
ఈ కొత్త అద్బుత
పరికరాన్ని ఇతర రసాయన శాస్త్రవేత్తలు కూడా వాడడం మొదలెట్టారు. అలాంటి వారిలో ఒకడు ఫ్రెంచ్
రసాయన శాస్త్రవేత్త పాల్ ఎమీల్ లకాక్ ద బ్వాబౌద్రాన్ (1838-1912). ఇతగాడు తను ఉండే
‘పిరినీ’ అనబడే ఫ్రెంచ్ ప్రాంతంలో దొరికే స్థానిక ఖనిజాలని పదిహేనేళ్లుగా వర్ణమానినితొ
పరిశీలిస్తూ వస్తున్నాడు. 1875 లో అతడు కొన్ని
ఖనిజాలలో కొత్త వర్ణ రేఖలు కనుక్కున్నాడు. జింక్ వున్న ముడి పదార్థంలో అతడికి ఓ కొత్త
మూలకం దొరికింది. దానికి గాలియమ్ (gallium) అని పేరు పెట్టాడు. ఈ పదం ఫ్రాన్స్ యొక్క
సాంప్రదాయక నామం అయిన Gaul నుండి వచ్చింది.
కొంత కాలం తరువాత
‘ద బ్వాబౌద్రాన్’ తగు మోతాదులో గాలియమ్ ని
శుద్ధి చేసి దాని లక్షణాలని పరీక్షించాడు. ఈ పరిశోధనల మీద అతడు రాసిన నివేదిక తరువాత
మెండెలేవ్ చేతిలో పడింది. గాలియమ్ అంటే మరేదో కాదని, తాను లోగడ ముద్దుగా ‘ఏక-అలూమినమ్’
అని పేరు పెట్టిన మూలకం ఇదేనని మెండెలేవ్ వెంటనే గుర్తించాడు. మరిన్ని లోతైన పరీక్షలు
జరిపిన మీదట ఆ సంగతి నిజమేనని తేలింది. మెండెలేవ్ ఊహించి చెప్పిన ఏక-అలూమినమ్ యొక్క
లక్షణాలు గాలియమ్ లక్షణాలతో చక్కగా సరిపోయాయి.
మెండెలేవ్ జోస్యం
చెప్పి నిర్ణయించిన మరి రెండు మూలకాలని సాంప్రదాయక పద్ధతులతోనే కనుక్కోవడం జరిగింది.
1879 లో స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త లార్స్
ఫ్రెడెరిక్ నిల్సన్ (1840-1899) ఓ కొత్త మూలకాన్ని కనుక్కున్నాడు. దానికి అతడు స్కాండియమ్
(స్కాండినావియా నుండి వచ్చిందీ పేరు) అని పేరు పెట్టాడు. దాని లక్షణాలు ప్రచురితం అయినప్పుడు
స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త పర్ థియోడోర్ క్లీవ్ (1840-1905) ఈ మూలకానికి లోగడ మెండెలేవ్
వర్ణించిన ఏక-బోరాన్ కి మధ్య పోలికని ఇట్టే గుర్తించాడు.
చివరికి
1886 లో జర్మన్ రసాయన శాస్త్రవేత్త క్లెమెన్స్
అలెగ్జాండర్ వింక్లర్ (1838-1904) వెండి ముడి పదార్థాన్ని విశ్లేషిస్తూ అందులో వున్న
తెలిసిన మూలకాల మొత్తం భారం ఆ పదార్థం యొక్క మొత్తం భారంలో 93% మాత్రమే వుందని గమనించాడు.
మిగిలిన 7% పదార్థాన్ని విశ్లేషించగా అది జర్మానియమ్
అనే కొత్త మూలకం అని తేలింది. మాండెలేవ్ చెప్పిన ఏక-సిలికాన్ ఇదేనని తరువాత తేలింది.
(ఇంకా వుంది)
0 comments