తదనంతరం రామానుజన్
కి ఆర్. రామచంద్ర రావు అనే పెద్దమనిషిని కలుసుకునే అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని
ఇప్పించింది ఎవరో కాదు - స్వరాజ్య విప్లవ కారుడు సి.వి. రాజగోపాలాచారి. రామానుజన్,
రాజగోపాలాచారి ఇద్దరూ కుంభకోణంలో పెరిగారు. ఇద్దరూ ఒకే స్కూల్ లో చదువుకున్నారు. రాజగోపాలాచారి
సిఫారసు మీద రామానుజన్ రామచంద్ర రావు ని కలుసుకోడానికి వెళ్లాడు. ఆ రోజుల్లో ఈ రామచంద్ర రావు నెల్లూర్ జిల్లాకి కలెక్టరుగా ఉండేవాడు.
బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకి ‘రావు బహద్దూర్’ బిరుదు ప్రదానం చేసి సత్కరించింది. ఈయనకి
కూడా గణితంలో మంచి ప్రవేశం ఉండేది. రామస్వామి అయ్యర్ స్థాపించిన ‘భారతీయ గణిత సదస్సు’కి
రామచంద్ర రావు సెక్రటరీగా ఉండేవాడు.
రామానుజన్ తో
తొలి సమాగమం గురించి రామచంద్ర రావు ఇలా రాసుకున్నాడు –
“పొట్టిగా, లావుగా,
మురికి బట్టలతో, మాసిన గడ్డంతో ఓ వ్యక్తి నా గదిలోకి వచ్చాడు. అతడిలో ఒకే ప్రత్యేకత
తన కళ్లలో కనిపించే ఏదో తీక్షణత. తన చేతిలో ఏవో చింకి కాగితాల నోట్సు పుస్తకాలు ఉన్నాయి.”
కాని రామానుజన్
రాతలు రామచంద్ర రావుకి ఏ మాత్రం అర్థం కాలేదు. రామనుజన్ ని తన నోట్సులు తన వద్ద కొన్నాళ్లు
ఉంచమని చెప్పి, మళ్లీ కనిపించమని పంపేశాడు. పట్టువదల కుండా రామానుజన్ ఆయన్ని మొత్తం
నాలుగు సార్లు కలుసుకున్నాడు. నాలుగో సారి సెలవు తీసుకుంటూ రామనుజన్ ఓ చిన్న విషయం
విన్నవించుకున్నాడు. బొంబాయికి చెందిన ప్రొఫెసర్ సల్ధానా అనే గణితవేత్తకి తనకి మధ్య
ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయని చెప్తూ ఆ ఉత్తరాలలో ఒకటి చూపించాడు. తనకి కూడా ఈ పరిశోధనలు
పెద్దగా అర్థం కాలేదని, అయితే అవి రాసిన వాడు మోసగాడు మాత్రం ససేమిరా కాదని ఆ ఉత్తరంలో
ప్రొఫెసర్ సల్ధానా పేర్కొన్నాడు. దాంతో పాటు తన నోట్సులలో కొన్ని సరళమైన ఫలితాలు రామచంద్రరావుకి
వివరించి చూపించాడు. రామచంద్ర రావుకి నెమ్మదిగా రామానుజన్ మీద నమ్మకం ఏర్పడింది. తగిన
రీతిలో రామానుజన్ కి సహాయ పడాలని నిశ్చయించుకున్నాడు.
రామచంద్ర రావు
రామానుజన్ ని తిరిగి శేషు అయ్యర్ వద్దకి పంపేశాడు. నెల్లూరు లాంటి చిన్న ఊళ్ళో, ఏ తాలూకా
కార్యాలయంలోనో అతణ్ణి ఓ గుమాస్తాగా మగ్గనివ్వడం భావ్యం కాదని అతడు మద్రాసులో ఉండడమే
మేలని తన అభిప్రాయం తెలిపాడు. ఉద్యోగం ఇవ్వలేకపోయినా రామానుజన్ నెలకి పాతిక రూపాయల
పారితోషకం సర్దుబాటు అయ్యేలా తను ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చాడు.
ఆ విధంగా రామానుజన్
ని నెల నెలా పాతిక రూపాయలు మనియార్డరులో వచ్చేవి. నిత్యావసరాలకి అది సరిపోయేది. తనకి
ప్రియాతిప్రియమైన గణితం మీదే ఇప్పుడు ఏకమస్కంగా ధ్యాస పెట్టడానికి వీలయ్యింది. కుంభకోణం
వదిలి మద్రాసుకి మకాం మార్చేశాడు. 1911-1912
ప్రాంతాల్లో మద్రాసులోనే పలు చోట్ల జీవించాడు. ఈ దశలోనే మొదటి సారిగా అతడి గణిత
మేధస్సు తన చుట్టూ ఉండే వారికి మాత్రమే కాకుండా బయటి ప్రపంచానికి తెలిసొచ్చింది.
(ఇంకా వుంది)
0 comments