మొదటి రెండు రోజులు ఓడ ప్రయాణం
రామానుజన్ కి అంత సుఖమయంగా సాగలేదు. ఎత్తిపడేసే కెరటాల కుదుపుకి రామానుజన్ కి కడుపులో
తిప్పినట్టు అయ్యేది. రెండు రోజుల ప్రయాణం తరువాత ఓడ కొలొంబో దాటింది. ఇక అక్కణ్ణుంచి
విశాలమైన అరేబియన్ సముద్రాన్ని దాటాలి. ఇండియాకి యూరప్ కి మధ్య సముద్ర మార్గాలకి సుదీర్ఘమైన
చరిత్ర వుంది. యూరప్ నుండి ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుక్కున్న వాస్కో ద గామా ఆఫ్రికా
చుట్టూ తిరిగి, కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా కేరళ చేరుకున్నాడు. కాని 1869 లో సూయెజ్ కాలువ నిర్మాణం తరువాత ఇండియాకి యూరప్
కి మధ్య దూరం బాగా తరిగిపోయింది. అరేబియన్ సముద్రం దాటాక, ఈజిప్ట్ కి సౌదీ అరేబియాకి మధ్య వున్న సూయెజ్ కాలువ దాటితే నేరుగా మధ్యధరా సముద్రంలోకి ప్రవేశించవచ్చు.
రామానుజన్ ని మోసుకుపోతున్న బ్రిటిష్ ఓడ ఎస్. ఎస్.
నెవాసా ముందు ఆఫ్రికా తూర్పు తీరం మీద యెమెన్
దేశంలో వున్న అడెన్ రేవుని చేరుకుంది. అక్కణ్ణుంచి బయల్దేరగానే ఎర్రసముద్రం మొదలవుతుంది.
ఎర్ర సముద్రానికి ఉత్తర కొసలో ఉన్న సూయెజ్ కాలువని దాటగానే మధ్యధరా సముద్రం మొదలయ్యింది.
మధ్యధరా సముద్ర తీరం మీద ఉన్న ప్రఖ్యాత జెనొవా రేవులో ఏప్రిల్
7 న ఓడ లంగరు వేసింది. అక్కణ్ణుంచి బయల్దేరి జిబ్రాల్టర్ జలాసంధి దాటుకుంటూ
మధ్యధరా సముద్రాన్ని వొదిలి, బిస్కే ఖాతం లోంచి ప్రయాణిస్తూ ఇంగ్లండ్ దిశగా ఓడ ముందుకి
సాగిపోయింది. చివరికి ఏప్రిల్ 14 న థేమ్స్ నదీ ముఖం వద్ద ఉన్న ప్లిమత్ రేవులోకి ఓడ
ప్రవేశించింది.
నెవిల్, అతడి అన్నయ్య, రామానుజన్
ని కలుసుకోడానికి రేవుకి వచ్చారు. రామానుజన్ ని తీసుకుని లండన్ లో సౌత్ కెన్సింగ్టన్
ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ రోజుల్లో లండన్ ప్రపంచ నగరాలలో గొప్ప ప్రాభవం, వైభవం గల
నగరాలలో ఒకటి. యాభై లక్షల జనాభా గల మహా నగరం.
పారిశ్రామిక విప్లవం యొక్క ఫలితాలని
నిండుగా అనుభవించిన నగరం. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన విశాల బ్రిటిష్ సామ్రాజ్యానికి
రాజధాని. యాభై లక్షల జనాభా గల ఆ మహా నగరం జనాభా బట్టి చూస్తే మద్రాస్ కన్నా పది రెట్లు
పెద్దది. పేరుకి నగరమే అయినా పల్లెటూరి వాతావరణం గల మద్రాస్ కి, ఇరవయ్యవ శతాబ్దపు లక్షణాలన్నీ
నిండుగా సంతరించుకున్న లండన్ కి మధ్య ఎంతో తేడా ఉంది. లండన్ వీధుల్లో కారు దూసుకుపోతుంటే,
ఆ తేడాని గమనిస్తూ మౌనంగా కూర్చుండిపోయాడు
రామనుజన్.
అసలే కొత్త ఊరు, కొత్త దేశం,
కొత్త సంస్కృతి. కొత్త పరిసరాలకి రామానుజన్
సులభంగా అలవాటు పడేందుకు గాను నెవిల్ రామానుజన్
ని నేరుగా కేంబ్రిడ్జ్ కి తీసుకెళ్ళకుండా ముందు క్రోమ్వెల్ రోడ్డుకి తీసుకెళ్లాడు.
ఆ రోడ్డు మీద కొన్ని భారతీయ కార్యాలయాలు ఉన్నయి. కనుక ఆ ప్రదేశం మరీ కొత్తగా అనిపించకపోవచ్చు.
ఆ రోజుల్లోనే ఏ. ఎస్. రామలింగం అనే తమిళుడు కూడా రామానుజన్ కి పరిచయం అయ్యాడు. తమిళనాడు
లోని కడలూర్ నుండి వచ్చిన ఈ వ్యక్తిని చూడగానే రామానుజన్ కి ప్రాణం లేచొచ్చినట్టయ్యింది.
క్రోమ్వెల్ రోడ్డు మీద ఇంట్లో ఓ నాల్గు రోజులు ఉన్నాక నెవిల్ రామానుజన్ ని కేంబ్రిడ్జ్
లో తన ఇంటికి తీసుకెళ్ళాడు.
మర్నాడు నెవిల్ రామనుజన్
ని కేంబ్రిడ్జ్ కి తీసుకెళ్లాడు. రామానుజన్ ప్రత్యేకించి ఓ విద్యార్థిలా అక్కడ చదువుకోడానికి
రాకపోయినా, గతంలో తనకి ఉన్నత విద్యా రంగంలో పెద్దగా శిక్షణ లేని లోటు తీర్చేందుకు గాను
రామానుజన్ అక్కడ కొన్ని కోర్సులు తీసుకోవాలని
నిశ్చయమయ్యింది. కొద్ది రోజుల్లోనే హార్డీ,
లిటిల్ వుడ్ లు రామానుజన్ ని చూడడానికి వచ్చారు. వీరిని చూడగానే రామానుజన్ కి చిన్ననాటి
ప్రాణా స్నేహితులని చూసినంత సంతోషం కలిగింది. బాహ్యప్రపంచంలో తన స్నేహితులు, బంధుజనం
అంతా మద్రాసులో ఉన్నారు. కాని గణితలోకంలో తన స్నేహితులు, సమవుజ్జీలు తక్కువ. అలాంటి
వారి జాబితాలో హార్డీ, లిటిల్ వుడ్ లు ముఖ్యులు. జూన్ లో ఓ సారి ఇంటికి ఉత్తరం రాస్తూ,
“హార్డీ, నెవిల్ తదితరులు అంతా చాలా స్నేహపూర్వకంగా, నిగర్వంగా ఉన్నారు,” అని రాశాడు.
(ఇంకా వుంది)
Very good to read