ఓస్వాల్డ్ తన
వ్యాఖ్యానంలో ఉత్‍ప్రేరణ విషయంలో గిబ్స్ సిద్ధాంతాలని
చర్చించాడు. పదార్థాల మధ్య శక్తిపరమైన సంబంధాలని మార్చకుండా, ఉత్‍ప్రేరకాలు చర్యలని
వేగవంతం చేస్తాయని వాదించాడు. చర్యలో పాల్గొనే రసాయనంతో ఉత్‍ప్రేరకం కలిసి ఒక మధ్యగత
పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఆ మధ్యగత పదార్థం మళ్లీ విచ్ఛిన్నమై ఆఖరులో రావలసిన ఉత్పత్తులని విడుదల చేస్తుంది. ఆ కారణం చేత ఉత్‍ప్రేరకం మాత్రం మొదట్లో ఉన్న స్థితికి
వచ్చేస్తుంది.
ఉత్‍ప్రేరకం
పని తీరు
ఉత్‍ప్రేరకంతో
కలిసిన మధ్యగత పదార్థమే లేకుంటే ఆ చర్య మరింత నెమ్మదిగా నడిచేది. కొన్ని సందర్భాల్లో
ఆ నడక ఎంత నెమ్మదిగా ఉంటుందంటే అసలు చర్య జరుగుతోందని గుర్తుపట్టడమే కష్టం. కనుక ఉత్‍ప్రేరకం
తాను మారకుండా చర్యని మాత్రం వేగవంతం చేస్తుంది. మరో విషయం ఏంటంటే ఈ చర్యలో ఉత్‍ప్రేరకం యొక్క అణువుని పదే పదే వాడడం జరుగుతుంది కనుక, ఉత్‍ప్రేరకం
అతి తక్కువ మొతాదులో ఉన్నా చాలు చర్య గణనీయంగా త్వరితం అవుతుంది.
ఉత్‍ప్రేరణ పట్ల
ఈ రకమైన దృక్పథాన్ని ఈ నాటికీ శాస్త్రం ఒప్పుకుంటుంది. ఉత్‍ప్రేరకాలుగా పనిచేసే ప్రోటీన్ల
(వీటిని ఎన్‍జైమ్ లు అంటారు) చర్యని ఈ తీరులో అర్థం చేసుకోడానికి వీలయ్యింది. జీవ పదార్థంలో
రసాయన చర్యలని ఈ ఎన్‍జైమ్ లు త్వరితం చేస్తాయి.
ఆస్ట్రియాకి
చెందిన భౌతికశాస్త్రవేత్త, తాత్వికుడు అయిన ఎర్నెస్ట్ మాక్ (1838-1916) సిద్ధాంతాలతో ఓస్వాల్డ్ పూర్తిగా ఏకీభవించేవాడు. ప్రత్యక్షంగా
కొలవదగ్గ రాశులతో మాత్రమే భౌతిక శాస్త్రవేత్తలు వ్యవహరించాలని, కేవలం పరోక్షమైన ఆధారాల
మీద నిలిచే గణిత నమూనాలు నిర్మించడం మంచిది కాదని మాక్ అనేవాడు. ఆ కారణం చేత ఓస్వాల్డ్
‘పరమాణువులు’ అనే భావనని ఒప్పుకునేవాడు కాడు. ఎందుకంటే వాటి ఉన్కిని తెలిపే ప్రత్యక్ష
ఆధారాలు లేవు. ప్రముఖ శాస్త్రవేత్తలలో పరమాణు సిద్ధాంతాన్ని నమ్మని వారిలో ఇతడు ఆఖరి
వాడని చెప్పుకోవచ్చు. (కాని పరమాణు సిద్ధాంతానికి సత్ప్రయోజనాలు ఉన్నాయని మాత్రం ఓస్వాల్డ్
ఒప్పుకునేవాడు.)
ఈ సందర్భంలోనే
‘బ్రౌనియన్ చలనం’ అనే సంగతి ప్రస్తావనకి వచ్చింది. నీటిలో విస్తరించిన సన్నని రేణువులు
చంచలంగా కదులుతుంటాయి. మైక్రోస్కోప్ లో కూడా
చూడదగ్గ ఆ కదలికనే బ్రౌనియన్ చలనం అంటారు. ఈ చలనాన్ని మొట్టమొదట (1827 లో) స్కాటిష్
వృక్ష శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్ (1773-1858) గమనించాడు.
1905 లో జర్మన్-స్విస్ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‍స్టయిన్
(1879-1955) బ్రౌనియన్ చలనాల విషయంలో ఓ ముఖ్యమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. నీటిలో
విస్తరించిన రేణువులని నీటి అణువులు తన్నే తాపుల వల్ల ఆ రేణువులు అలా కదులుతున్నాయని
ఐన్‍స్టయిన్ సూచించాడు. నీటి అణువులు అల్లకల్లోలంగా కదులుతుంటాయి కనుక వాటి తాపులకి
నీటిలో మునిగిన రేణువులు కూడా అలజడిగా కదులుతుంటాయి. అలా కదిలే రేణువుల చలనాలని కచ్చితంగా
కొలిచినప్పుడు, ఆ కొలతల నుండి నీటి అణువుల పరిమాణాన్ని అంచనా వేయొచ్చని ఐన్‍స్టయిన్
గణితపరంగా నిరూపించాడు.
1908 లో ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త జాన్ బాప్తిస్త్
పెరిన్ (1870-1942) పై సిద్ధాంతానికి అవసరమైన
కొలతలు తీసుకునే ఏర్పాటు చేశాడు. ఆ కొలతల ఆధారంగా అణువుల, పరమాణువుల వ్యాసాల మొట్టమొదటి
అంచనాలు చేశాడు. బ్రౌనియన్ చలనం అనేది పరమాణువుల, అణువుల ఉనికికి ఇంచుమించు ప్రత్యక్షమైన
సాక్ష్యం కనుక ఓస్వాల్డ్ పరమాణు సిద్ధాంతం పట్ల తన ప్రతికూల వైఖరిని మార్చుకోవలసి వచ్చింది.
(పెరిన్ కాలంలోనే
పరమాణువుల ఉనికికి ఆధారాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. పరమాణువుల వ్యాసం రమారమి
1/250,000,000 ఇంచి ఉంటుందని తొలి అంచనాలు తెలిపాయి. ఈ పుస్తకం మూడవ
భాగంలోని చివరి అధ్యాయాలలో ఆ ఆధారాలని వివరంగా సమీక్షించడం జరుగుతుంది. గ్రీకు తాత్వికుడు
డెమాక్రిటస్ ఆరంభించిన ఈ పరమాణు గాధలో పతాకసన్నివేశంగా జర్మన్-అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త
ఎర్విన్ విల్హెల్మ్ ముల్లర్ (1911-1977)
field-emission microscope ని కనిపెట్టాడు.
1950 ల నడిమి కాలంలో ఈ పరికరంతో తీసిన పరమాణువుల
ఫోటోలు సంచలనాన్ని సృష్టించాయి. ఓ సన్నని లోహపు సూది మొన మీద నిలుపబడ్డ పరమాణువుల అమరికని
ఈ పరికరం ప్రస్ఫుటం చెయ్యగలిగింది.)
(ఇంకా వుంది)
0 comments