ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ (1833-1896) కుటుంబీకులు ఆ రోజుల్లో నైట్రోగ్లిసరిన్ ని ఉత్పత్తి చేసేవారు. ఒకసారి తమ కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నోబెల్ తన
సోదరుణ్ణి
పోగొట్టుకుంటాడు. ఆ సంఘటనకి తల్లడిల్లిన నోబెల్ ఎలాగైనా ఈ మందుపాతరని లొంగదీసుకోవాలని సంకల్పిస్తాడు. ఆ సమస్య మీద పని చేసిన నోబెల్ “కీసెల్గూర్” (kieselguhr) అనే ఓ
ప్రత్యేక ఖనిజం నైట్రోగ్లిసరిన్ ని అధిక మోతాదుల్లో పీల్చుకోగలదని గమనిస్తాడు. చూర్ణంలా చెయ్యబడ్డ కీసెల్గూర్ ని గొట్టాలలా పోతపోసి సురక్షితంగా వాడొచ్చు. అలా మార్పులు చేసినా నైట్రోగ్లిసరిన్ లో ఉండే విస్ఫోటక శక్తి ఈ మిశ్రపదార్థానికి కూడా ఉండడం విశేషం. అలా పుట్టిన పదార్థానికే నోబెల్ డైనమైట్ అని పేరు పెట్టాడు. ఇలాంటి భయంకర మారణాయుధాలు ప్రయోగించబడే యుద్ధాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే ఆ దెబ్బకి తట్టుకోలేక ప్రత్యర్థులు త్వరగా రాజీకి దిగుతారని ఆశించాడు నోబెల్. అతడి ఉద్దేశం మంచిదే అయినా మనిషి మనస్తత్వాన్ని, యుద్ధ ప్రీతిని అర్థం చేసుకోవడంలో అతడు పొరబడ్డాడని, అతడి ఆశాభావం నిరాధారమని తరువాత తెలిసింది.
ఆల్ఫ్రెడ్ నోబెల్
ఆ
విధంగా పందొమ్మిదవ శతాబ్దపు చివరి దశలో అత్యంత భయంకర విస్ఫోటక పదార్థాల రూపకల్పన, యుద్ధ ప్రయోజనాల కోసం
రసాయన
శాస్త్రం అందించిన అతిముఖ్యమైన సేవలకి తార్కాణాలుగా చెప్పుకోవచ్చు. ఐదు శతాబ్దాల క్రితం కనుక్కోబడ్డ మందుగుండు తరువాత ఈ రంగంలో రసాయన శాస్త్రం సాధించిన అతిముఖ్యమైన విజయం ఇదేనని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘోరపరిణామాన్ని కూడా తలదన్నేలా మొదటి ప్రపంచ యుద్ధ నేపథ్యంలో యుద్ధ ప్రయోజనాల కోసం భయంకర విషవాయువులని రూపొందించడం జరిగింది. ఇలాంటి పరిణామాల దృష్ట్యా యుద్ధం పేరుతో సైన్స్ ని ఎలాంటి దుష్ప్రయోజనాలకి మళ్లిస్తారో క్రమంగా తెలిసొచ్చింది. ఇక యుద్ధ విమానాలు, అణుబాంబులు మొదలైన మారణ శక్తులు రంగ ప్రవేశం చేశాక ఈ విషయంలో ఇక సందేహం అనేదే లేకుండా పోయింది. పందొమ్మిదవ శతాబ్దం చివరి వరకు కూడా దివిపై భువిని వెలయింపజేయడమే సైన్స్ లక్ష్యం అన్న విశ్వాసం వుండేది. కాని క్రమంగా ఆ విశ్వాసం కరిగిపోయింది. పచ్చని ప్రపంచాన్ని మరుభూమిగా మార్చగల సైన్స్ యొక్క వికృత ముఖాన్ని మానవాళి గుర్తించింది.
పాలిమర్లు
అయితే
మరి కొన్ని రంగాల్లో మాత్రం కర్బన రసాయనాల శాంతియుత ప్రయోజనాలు ఊపందుకున్నాయి. ఉదాహరణకి పూర్తిగా నత్రీకరించబడ్డ సెల్యులోస్ (nitrated cellulose) కి విస్ఫోటాత్మక లక్షణాలు ఉన్నాయన్నది నిజమే. కాని పాక్షికంగా నత్రీకరించబడ్డ సెల్యులోస్ (pyroxylin, పైరాక్సిలిన్) అంత ప్రమాదకరంగా ఉండదు. దానికి ఎన్నో సత్ప్రయోజనాలు ఉన్నాయి.
ఒకప్పుడు
బిలియర్డ్స్ ఆటలో దంతపు బంతులు వాడేవారు. అవి మరీ ఖరీదైనవని వాటిని ప్రత్యామ్నాయంగా కాస్త ఖర్చుతక్కువైనా, అదే మన్నిక గల బంతులు రూపొందించిన వారికి ఒక బహుమతి ప్రకటించబడింది. ఆ బహుమానాన్ని సాధించడానికి అమెరికన్ ఆవిష్కర్త జాన్ వెస్లీ హయట్ (1837-1920) పూనుకున్నాడు.
పైరాక్సిలిన్
తో తన ప్రయోగాలు ఆరంభించాడు. ఆల్కహాలు, ఈథరు కలిపిన మిశ్రమంలో దాన్ని కరిగించాడు. ఆ పదార్థాన్ని మరింత మెత్తగా, నమ్యంగా చెయ్యడానికి కొంత కర్పూరం కలిపాడు. 1869 కల్లా ఓ చక్కని పదార్థాన్ని రూపొందించాడు. దానికి సెల్యులాయిడ్ అని పేరు పెట్టాడు. ఏ బహుమానం కోసం అయితే ఈ ప్రయత్నమంతా చేశాడు ఆ బహుమతి దక్కింది. ఈ సెల్యులాయిడ్ మొట్టమొదటి కృత్రిమ, సంయోజిత ప్లాస్టిక్. దీన్ని కావలసిన ఆకృతిలో మలచుకోవడానికి వీలయ్యింది.
పైరాక్సిలిన్
ని బంతులుగా మలచడమే కాదు, దాన్ని తీగలుగాను, పొరలుగాను కూడా సాగదీయడానికి వీలయ్యింది. దీన్ని తీగలుగా మలచడానికి ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త లూయీ మారీ హిలేర్ బెర్నిగో (1839-1924) పైరాక్సిలిన్ కరిగించిన ద్రావకాలని సన్నని రంధ్రాల గుండా పోయేలా జల్లెడ పట్టాడు.
అలా
రంధ్రాల్లోంచి
బయటికి వచ్చిన ద్రావకం వెంటనే ఆవిరై సన్నని దారంగా మారేది. ఈ దారాలని పేని పట్టు లాంటి మేలిమి వస్త్రాన్ని అల్లడానికి వీలయ్యింది. కిరణంలా మెరుస్తోందని ఈ పదార్థానికి ‘రేయాన్’ (rayon, ray=కిరణం) అని పేరు పెట్టాడు. ఈ పదార్థాన్ని అతడు పేటెంట్ చేశాడు.
అలాగే
పొర లాగా తీర్చిదిద్దబడ్డ ప్లాస్టిక్ కి కూడా కొన్ని చక్కని ప్రయోజనాలు కనుక్కోబడ్డాయి. అమెరికన్ ఆవిష్కర్త్ జార్జ్ ఈస్ట్మన్ (1854-1932) దీనికి పొటోగ్రఫీలో వినియోగించాడు. సిల్వర్ సమ్మేళనాలు కలిపిన ఎమల్షన్ ని ఇతడు జెలటిన్ తో కలిపాడు. ఈ మిశ్రమాన్ని నిలవ ఉంచడానికి కూడా వీలవుతుందని తెలిసింది. కనుక అప్పటికప్పుడు దీన్ని తయారు చెయ్యాల్సిన అవసరం లేదు. 1884 లో అతడు ఫోటోగ్రఫీలో వాడే గాజు పలకకి బదులు సెల్యులాయిడ్ తెరని వాడాడు. ఈ దెబ్బతో అంతవరకు నిపుణుల సొత్తు అయిన ఫొటోగ్రఫీ కళ అందరికీ అందుబాటులోకి వచ్చింది.
(ఇంకా వుంది)
సర్ , sreenivasa chakravarti గారూ , మీ పోస్ట్ లు ఎంతో విజ్ఞానదాయకంగా , అందరికీ అర్థమయ్యే రీతిలో అద్భుతంగా ఉన్నాయి . "పాతాళానికి ప్రయాణం " అన్న పేరుతో "Journey to the center of the earth"అనువాదకర్త మీరేనా ? మీ బ్లాగ్ లో ఎక్కడా ఆ సమాచారం లేకపోవడం వల్ల అడుగుతున్నాను ఆ పుస్తకం నాకు ఎంతగానో నచ్చింది .
అవునండి. పాతాళానికి ప్రయాణానికి అనువాదకర్త నేనే. ఈ బ్లాగ్ లో దాని అనువాదం కొన్నేళ్ళు సాగింది.
ఆ పోస్ట్ లన్నీ 'పాతాళానికి ప్రయాణం' అన్న టాగ్ తో వున్నాయి.
http://scienceintelugu.blogspot.in/2015/10/blog-post_10.html