అర్థాయుష్షు (half-life)
పరమాణువుల యొక్క అంతరంగ విన్యాసం గురించి తెలిపే అధ్యయనాల వల్ల మరింత పరిజ్ఞానం ఏర్పడుతున్నా, మరెన్నో కొత్త సమస్యలు తలెత్తుతూనే వున్నాయి.
1900 లో క్రూక్స్ యురేనియమ్ సమ్మేళనాల గురించి ఓ చిత్రమైన విషయాన్ని గమనించాడు. కొత్తగా తయారైన యురేనియమ్ సమ్మేళనాలు కాస్తంత మాత్రంగానే రేడియోధార్మికతని ప్రదర్శిస్తున్నాయని అతడు గుర్తించాడు. కాని 1902 లో రూథర్ఫర్డ్, తన సహోద్యోగి, బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త ఫ్రెడెరిక్ సాడీ (1877-1956) తో కలిసి ఓ ముఖ్యమైన సూచన చేశాడు. యురేనియమ్ పరమాణువు ఒక ఆల్ఫా రేణువుని విడుదల చేసినప్పుడు దాని తత్వం మారిందని వాళ్లు సూచించారు. ఆల్ఫా రేణువులని వొదులుకున్న యురేనియమ్ పరమాణువు ఓ కొత్త పరమాణువుగా మారిపోయింది. ఇది యురేనియమ్
కన్నా శక్తివంతంగా రేడియోధార్మిక కిరణాలు వెలువరించసాగింది. క్రూక్ చేసిన పరిశీలనకి ఈ విధంగా ఓ
ఆధారం దొరికింది.
అలా కొత్తగా పుట్టిన పరమాణువు మళ్లీ విచ్ఛిన్నం చెంది మరో పరమాణువుగా మారింది. ఆ విధంగా
యురేనియమ్ అనే పితృ మూలకం నుండి వరుసగా ఎన్నో మూలకాలు – ఒక రేడియోధార్మిక మూలకాల శ్రేణి, (radioactive series) – పుట్టుకు రాగలవని తెలిసింది. వీటిలో వరుసగా రేడియమ్, పోలోనియమ్ మొదలైన రేడియోధార్మిక మూలకాలు వచ్చి చివరిగా రేడియోధార్మికం కాని సీసం వచ్చింది. ఈ కారణం చేతనే రేడియమ్, పోలోనియమ్ మొదలుకొని ఇతర అరుదైన రేడియోధార్మిక మూలకాలు ఎన్నో యురేనియమ్ ఖనిజాలలో దొరుకుతాయి. యురేనియమ్ నుండి మరో రేడియోధార్మిక శ్రేణి కూడా పుట్టింది. థోరియమ్ నుండి కూడా మరో శ్రేణి పుట్టింది.
(యురేనియమ్ విచ్ఛిన్నమై సీసం ఏర్పడే వైనాన్ని చూస్తే మూలకాలకి బాయిల్ ఇచ్చిన నిర్వచనం ప్రకారం యురేనియమ్ మూలకమే కాదని అనుకోవలసి వస్తుంది. కాని పరమాణు సంఖ్య మీద ఆధారపడ్డ నిర్వచనం ప్రకారం అది ఇప్పటికీ మూలకమే. పరమాణువు అవిభాజ్యాలు కావని తెలిసిపోయాక, మూలకాలు కూడా మారని తత్వాలు కావని తెలిసిపోయింది. ఒక విధంగా మనం తిరిగి తిరిగి మళ్లీ కాస్త ఉన్నత స్థాయిలో పరుసవేదానికి చెందిన భావన వద్దకి చేరుకున్నాం అనుకోవాలి.)
ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న తలెత్తింది. రేడియోధార్మిక మూలకాలు నిరంతరం బద్దలవుతూ మరింత సరళాంశాలుగా మారుతున్న పక్షంలో అసలు రేడియోధార్మిక మూలకాలు ప్రకృతిలో ఎందుకు మిగిలి వున్నాయి? 1904 లో రూథర్ఫర్డ్ ఈ సమస్యని పరిష్కరించాడు. రేడియోధార్మిక పదార్థం యొక్క తరుగుదల వేగాన్ని పరిశీలించిన రూథర్ఫర్డ్ ఒక విషయం గమనించాడు. ఏ రేడియోధార్మిక పదార్థానికైనా అందులో సగానికి సగం మారిపోడానికి ఓ నియత సమయం పడుతుందని ఇతడు గుర్తించాడు. ఆ నియత సమయం ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్కలా ఉంటుంది. ఆ సమయానికి రూథర్ఫర్డ్
‘అర్థాయుష్షు’
(half-life) అని
పేరు పెట్టాడు.
ఉదాహరణకి రేడియమ్ యొక్క అర్థాయుష్షు విలువ 1600 సంవత్సరాలు. భూమి యొక్క సుదీర్ఘమైన చరిత్రలో దాని పైపొరలలో ఉండే రేడియమ్ అంతా ఎప్పుడో మాయమైపోయి వుంటుంది. కాని మరింత అధిక పరమాణు సంఖ్య గల యురేనియమ్ విచ్ఛిన్నం చెంది కొత్త రేడియం పుట్టుకొస్తుంటుంది. కొన్ని యురేనియమ్ ఉత్పత్తుల యొక్క విచ్ఛిత్తి విషయంలో కూడా ఈ నిజమే వర్తిస్తుంది. వాటి అర్థాయుష్షుల విలువ కొద్ది సెకనులు మాత్రమే ఉంటుంది.
ఇక యురేనియమ్
నే తీసుకుంటే దాని అర్థాయుష్షు విలువ 4,500,000,000 సంవత్సరాలు. ఇది చాలా సుదీర్ఘమైన కాలం. భూమి యొక్క సుదీర్ఘమైన చరిత్రలో దాని ఆరంభంలో ఉండే యురేనియమ్ లో చాలా చిన్న అంశం మాత్రమే విచ్ఛిన్నం అయ్యుంటుంది. ఇక థోరియమ్ యొక్క అర్థాయుష్షు మరీ ఎక్కువ – 14,000,000,000 సంవత్సరాలు.
(ఇంకా వుంది)
0 comments