ముందుమాట
భారతీయ భాషా సాహిత్యాలలో పురాణ సాహిత్యానికి ముఖ్య స్థానం వుంది. దైనిక
జీవనంలో కూడా పౌరాణిక ఘట్టాలని, పౌరాణిక పాత్రలని తలచుకుంటూ, వారి నుండి
స్ఫూర్తిని గొంటూ బతకడం మనకి అలవాటైపోయింది. బలానికి
భీముడు, స్నేహానికి కర్ణుడు, స్వామిభక్తికి
హనుమంతుడు, సత్యవ్రతానికి రాముడు, పాతివ్రత్యానికి
సీత, నియమాలని, నిర్వచనాలని అతీతంగా భాసిల్లే పురుషోత్తమ తత్వానికి శ్రీ కృష్ణుడు
ప్రతీకలుగా నిలిచి మన మనసుల్లో చెరగని ముద్ర వేశారు.
అయితే మనకే కాక ఎన్నో ఇతర ప్రపంచ సంస్కృతులలో కూడా పురాణ సాహిత్యం వుంది. వారికీ
వేలుపులు ఉన్నారు. ఆ వేలుపుల్లో
నిమ్నోన్నతలు, ఆధిక్యత కోసం కీచులాటలు – ఇవన్నీ
వారికీ వున్నాయి. ముఖ్యంగా పాశ్చాత్య లోకానికి పట్టుకొమ్మ అయిన ప్రాచీన గ్రీకు
సాంప్రదాయంలో ఎంతో విస్తృతమైన పౌరాణిక సాహిత్యం వుంది. మనకి ఇంద్రుడు
ఉన్నట్లుగానే గ్రీకు వేలుపులకి నాథుడు జూస్ లేదా జూపిటర్. అతడి అధీనంలో
వివిధ దేవతా మూర్తులు లోకపాలనలో వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. మనుషులు
వారికి రకరకాల నివేదనలు అర్పించి వారిని ప్రసన్నులని
చేసుకోడానికి తిప్పలు పడుతుంటారు. గ్రీకు దేవతలు కూడా, మన వాళ్ళ
లాగానే, తమని మెప్పించిన వారిని దీవించి, నచ్చని
వారిని తెగ వేధిస్తుంటారు. గ్రీకు పురాణాలలో కూడా మన కథలలో లాగానే దైవాంశ సంభూతులైన మనుషులు
ఉంటారు. వీళ్లని
demigods అంటారు. వీళ్లు
భూమి మీద ఏదో మహత్కార్యం సాధించడం కోసం పుడతారు. నానా ఇక్కట్లూ
పడి, పైనుండి అడుగడుక్కి దేవతలు సాయం చేస్తుంటే, చివరికి
తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. వీళ్లే గ్రీకువీరులు. వారి సాహసగాధలు
తరతరాల పాఠకులని అలరించాయి.
గ్రీకు వీరుల్లో ముగ్గురు ముఖ్యులు. వాళ్లు
హెర్క్యులిస్, పెర్సియస్, జేసన్. వీరి సాహస కథామాలికే ఈ పుస్తకం.
postlink