జర్మన్
బడులలో లాగా ఈ కొత్త విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు అంత చండశాసనులు కారు. కాని శాస్త్రవిషయాలలో వీరి పాండిత్యం అంతంత మాత్రంగానే ఉందని పించింది ఆల్బర్ట్ కి. లేకుంటే శాస్త్ర పరిజ్ఞానంలో తోటి విద్యార్థుల కన్నా ఎంతో ముందున్న ఆల్బర్ట్ ప్రమాణాలు ఆ ఆచార్యులకి మరీ అందనంత ఎత్తు ఉన్నాయేమో? పైగా విద్యార్థుల సందేహాలు తీర్చడంలో ఇక్కడి ప్రొఫెసర్లు ఎన్నో సార్లు విఫలం అయ్యేవారు. అసలు సందేహాలు తీర్చే విషయంలో వారికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నట్టు కనిపించలేదు.
చదువు
విషయంలో ఒక పక్క పరిస్థితులు ఇలా వుండగా, ఇంట్లో పరిస్థితి కూడా అంత సంతృప్తికరంగా ఏమీ లేదు. తండ్రి వ్యాపారం ఇంకా అనుకున్న స్థాయిలో పుంజుకోలేదు. ఈ విషయం మీద విచారం వ్యక్తం చేస్తూ 1898 లో
ఆల్బర్ట్ తన చెల్లెలు మాయాకి ఇలా జాబు రాశాడు. “ఏ దురదృష్టం వల్లనో ఏమో గాని, మన తల్లిదండ్రుల జీవితాల్లో ఇన్నేళ్ళ లో సంతోషంగా గడిచిన రోజు ఒక్కటి కూడా లేదన్న విషయం తలచుకుంటుంటే చాలా బాధగా వుంది. పెద్దవాణ్ణి అయ్యి కూడా ఊరికే చూస్తూ ఉండడం తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయత నా మనసుని కలచివేస్తోంది. ఇప్పుడు మన చుట్టాలకి భారం కావడం తప్ప ఎందుకూ పనికిరాకుండా పోయాను.”
ఇంతలో
అదృష్టం కలిసొచ్చి తండ్రి ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగయ్యింది అన్న వార్త వచ్చింది. దాంతో ఆల్బర్ట్ తన చదువుల మీద మనసు లగ్నం చెయ్యగలిగాడు. కరిగిపోయాయి అనుకున్న కలలకి మాళ్ళీ ప్రాణం పోసే అవకాశం దొరికింది. సమయం దొరికినప్పుడల్లా భౌతిక శాస్త్ర పుస్తక పఠనంలో మునిగిపోయేవాడు. క్లాసుల్లో గురువులు చెప్పేది తనకి ముందే తెలుసు అనిపించినప్పుడు క్లాసులు ఎగ్గొట్టి ఇంట్లోనో, లైబ్రరీలోనో కూర్చుని చదువుకునేవాడు. అంతర్జాతీయంగా భౌతికశాస్త్రం అతి వేగంగా పురోగమిస్తున్నప్పటికీ తనకి పాఠాలు చెప్పే ఆచార్యులు మాత్రం అవేవీ పట్టించుకోకుండా పాతపాఠాలే వల్లించేవారు. ఉదాహరణకి కాంతి అనేది కాంతికణాల ప్రవాహం అని కొన్ని శతాబ్దాల క్రితం న్యూటన్ ప్రతిపాదించాడు. కాని పందొమ్మిదవ శతబ్దపు చివరి దశలో ఇంగ్లండ్ కి చెందిన జేమ్స్ క్లర్క్ మాక్స్ వెల్ అనే సైద్ధాంతిక శాస్త్రవేత్త కాంతి అనేది ఓ తరంగం అని, అది విద్యుదయస్కాంత క్షేత్రంలోని తరంగం అని నిరూపించాడు. కాని ఈ కొత్త సిద్ధాంతాలు ఆల్బర్ట్ గురువుల పాఠ్యప్రణాలికలో స్థానం సంపాదించలేదు.
ఆల్బర్ట్
గురువులలో ఒకరిద్దరు ఈ కుర్రవాడు అడిగే ప్రశ్నలకి ఓపిగ్గా సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించేవారు. కాని కొందరికి మాత్రం ఆల్బర్ట్ పొడ గిట్టేది కాదు. వాళ్లలో ఒకడు హైన్రిక్ వెబర్. ఈ జర్మన్ శాస్త్రవేత్త కాంతి శాస్త్రంలోను, ఉష్ణ శాస్త్రంలోను ప్రత్యేక కృషి చేశాడు. కాని కాంతి శాస్త్రాన్ని బోధిస్తున్నప్పుడు ఎక్కడా మాక్స్ వెల్ సిద్ధాంతాల ప్రస్తావన తెచ్చేవాడు కాదట. ఇతడి పాఠాల గురించి చెప్తూ తదనంతరం ఆల్బర్ట్ “ఆయన పాఠాలు యాభై ఏళ్ల నాటివి” అని ఛలోక్తి విసిరాడట.
ఓ
సారి వెబర్ ఆల్బర్ట్ ని పిలిచి చిన్న సలహా ఇచ్చాడు. “నువ్వు చాలా తెలివైన కుర్రాడివి ఐన్ స్టయిన్. నిజంగా చాలా
తెలివైన వాడివి. కాని నీతో ఒకటే చిక్కు. నువ్వు అవతలి వాళ్ళు చెప్పేది వినిపించుకోవు.” అవతలి వాళ్లకి చెప్పడానికి ఏదైనా ఉంటే కదా వినిపించుకోడానికి, అని ఆల్బర్ట్ మనసులో నవ్వుకున్నాడేమో!
ఈ
రకమైన ధోరణి వల్ల కొందరు మాత్రం ఆల్బర్ట్ ని దుడుకువాడిగా, వదరుబోతుగా
జమకట్టేవాళ్లు.
చిన్నతనంలో ఉండే బెరుకుదనం క్రమంగా తొలగిపోయింది. నిండైన ఆత్మవిశ్వాసంతో ఉండేవాడు. ఆ ఆత్మవిశ్వాసం అహంకారం వల్ల వచ్చింది కాదు. తనకి ఆసక్తి గల రంగంలో అత్యంత శ్రద్ధతో కూడిన అధ్యయనం చేసి, విషయం గురించి లోతుగా ఆలోచించి అర్థం చేసుకుని, ఆ విధంగా ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పగలిగే ధైర్యం వల్ల వచ్చిందది. మానసిక పరిపాకానికి తగ్గ
దేహదారుఢ్యం
కూడా సమకూరింది. బక్కపలచగా, బెరుగ్గా ఉండే పిల్లవాడి స్థానంలో ఇప్పుడు ధృఢంగా, హుందాగా, ముఖంలో ప్రతిభ తొణికిసలాడే యువకుడు ఇప్పుడు కనిపిస్తున్నాడు.
ఈ
దశలో ఆల్బర్ట్ కి మార్సెల్ గ్రాస్మాన్ మరియు మిచెల్ ఆంజెలో బెస్సో అని ఇద్దరు మంచి నేస్తాలు ఉండేవారు. స్నేహితులు ముగ్గురూ కబుర్లలో పడితే గంటలు, పూటలు తెలీకుండా గడిచిపోయేవి. లోకంలోని సంగతులన్నీ ఆ సంభాషణల్లో చోటు చేసుకునేవి. ఎన్నో సార్లు సంభాషణ శాస్త్ర సంవాదంగా మారేది. క్లాసులో విన్న విషయాల గురించి చర్చికుంటూ లోతుగా శోధించేవారు. గురువులు లాంచనప్రాయంగా చెప్పిన విషయాలని ఆల్బర్ట్ ఏదో అపరిచిత కోణం నుండి చూస్తూ, కొత్తగా వివరించడం విని ఎన్నో సార్లు తక్కిన స్నేహితులు ఇద్దరూ ఆశ్చర్యపోయేవారు. ఆ విషయం గురించి అసలు అలా ఆలోచించవచ్చు అని కూడా ఎప్పుడూ వారికి స్ఫురించేది కాదు.
ఆల్బర్ట్
లాగ కాక మార్సెల్ గ్రాస్మన్, మిచెల్ బెస్సో లూ మాత్రం క్రమం తప్పకుండా క్లాసులకి వెళ్లేవాళ్లు. ఆల్బర్ట్ క్లాసులు
ఎగ్గొట్టి మరింత ఉన్నత స్థాయి అంశాలని చదువుకుంటూ కాలం గడిపేవాడు. కాని గురువులు మాత్రం ఉన్నత విషయాల జోలికి పోకుండా పాఠ్యప్రణాలికలోని అంశాల మీద మాత్రమే పరీక్షలు పెట్టేవారు. క్లాసులో ఏం జరుగుతోందో బొత్తిగా తెలీని ఆల్బర్ట్ కి పరీక్షల ముందు సంకట పరిస్థితి ఎదురయ్యేది. అలాంటి సందర్భాల్లో స్నేహితులు ముందుకొచ్చి, క్లాసులో తాము తీసుకున్న నోట్సు ఆల్బర్ట్ చేతిలో
పెట్టి, గండం గట్టెక్కించేవారు.
(ఇంకా
వుంది)
postlink