తెర మీద బ్రహ్మానందాన్ని చూడగానే నవ్వు ఎందుకు వస్తుంది? ఓ బాపు కార్టూన్ ని చూసినప్పుడో, ఓ పి.జి. వుడ్ హౌస్ నవల చదివినప్పుడో నవ్వుఎందుకు వస్తుంది? అసలు నవ్వు ఎందుకు వస్తుంది? చక్కలిగిలి పెట్టినప్పుడు నవ్వు ఎందుకు వస్తుంది? కాని ఎవరికి వారే, బోరు కొట్టినప్పుడల్లా తమకి తాము చక్కలిగిలి పెట్టుకుని ఎందుకు నవ్వుకోలేరు?
“కాదేదీ సైన్స్ కనర్హం” కనుక ఈ నవ్వు గురించి కూడా నాడీశాస్త్రంలో కొంత పరిశోధన జరిగింది. అయితే నవ్వు ఓ వ్యాధి కాదు కనుక, ఓ మెదడు వ్యాధి మీద జరిగేటంత పెద్ద ఎత్తున దీని మీద పరిశోధన జరగలేదు. కాని కొన్ని మెదడు సమస్యల నేపథ్యంలో ఆపుకోలేని, అసహజమైన నవ్వు రావడం విశేషం. ఉదాహరణకి ఎపిలెప్సీ వ్యాధి గురించి అందరం వినే వుంటాం. దీన్నే సామాన్య పరిభాషలో ’ఫిట్స్’ అంటారు. ఈ ఫిట్స్ లేదా seizures వచ్చినప్పుడు కొన్ని సార్లు రోగి గిల గిల తన్నుకోవడం కనిపిస్తుంది. కొన్ని రకాల సీజర్స్ వచ్చినప్పుడు రోగి నిశ్చలంగా ఉండిపోతాడు. కాని ఆ సమయంలో తనకి పరిసరాల స్పృహ ఉండదు. ఇక మరికొన్ని రకాల సీజర్స్ లో రోగులు హఠాత్తుగా పెద్ద పెట్టున నవ్వడం, ఏడవడం వంటివి చేస్తారు. ఇలాంటి సీజర్స్ ని gelastic seizures అంటారు. (మరి గ్రీకులో Gelos అంటే నవ్వు!)
ప్రఖ్యాత నేచర్ పత్రికలో ( vol 391, page 650, 1998) లో, “Electric current stimulates laughter” అన్న పేరు గల వ్యాసంలో, నవ్వుకి మెదడుకి మధ్య ఓ ఆసక్తికరమైన సంబంధం ప్రకటించబడింది. మెదడులో కొన్ని చోట్ల విద్యుత్ కరెంటు ని ప్రవేశపెడితే, అలాంటి ప్రేరణ నిచ్చిన వ్యక్తి నవ్విందట. ఏ.కె. అన్న పేరు గల 16 ఏళ్ల అమ్మాయికి ఎపిలెప్సీ ఉంది. అందుకు చికిత్సగా ఆమెకి సర్జరీ చేస్తున్నారు. సర్జరీ చేసి మెదడులో ఏ భాగం వల్ల ఈ ఎపిలెప్సీకి సంబంధించిన సీజర్స్ వస్తున్నాయో తెలుసుకుని ఆ భాగాన్ని తొలగిస్తారు, లేదా నాశనం (lesion) చేస్తారు. అయితే మెదడులో “మంచి” భాగాలు, ఎపిలెప్టిక్ సీజర్స్ కలుగజేసే “చెడు” భాగాలు రెండూ ఒక్కలాగాలే ఉంటాయి కనుక, మెదడులో వివిధ ప్రాంతాలకి విద్యుత్ ప్రేరణ (electric stimulation) ఇచ్చి దాని ప్రతిస్పందన ఎలా ఉందో చూసి, మంచి చెడులు నిర్ణయించే పద్ధతి ఒకటి ఉంది. ఎక్కడ ప్రేరణ ఇస్తే సీజర్ పుడుతుందో సమస్య అక్కడ ఉందన్నమాట. ఇలాంటి అన్వేషణలో మెదడులో పలు ప్రాంతాల్లో ప్రేరణ నిస్తూ పోతున్న సమయంలో అనుకోకుండా ఒక ప్రాంతంలో ప్రేరణ నిచ్చినప్పుడు ఆ అమ్మాయి గట్టిగా నవ్విందట. ఆ ప్రాంతంలో ప్రేరణ నిచ్చిన ప్రతీ సారి అమ్మాయి అలాగే నవ్విందట. అయితే ఆ ప్రాంతం ఎక్కడుందో చెప్పాలంటే మెదడు నిర్మాణం గురించి ఓ సారి గమనించాలి.
మెదడులో రెండు గోళార్థాలు (hemispheres) ఉన్నాయని, ప్రతి గోళార్థంలోను నాలుగు విభాగాలు (lobes) ఉన్నాయని చిన్నప్పుడు వినే వుంటాం. ఇందులో మెదడులో ముందు పక్క కనిపిస్తున్న పెద్ద విభాగం frontal lobe. మెదడు ఉపరితలం అంతా మిట్ట పల్లాలుగా ఉంటుందని, “మిట్ట” లని gyri అని, “పల్లాల”ని sulci అని అంటారని కిందటి పోస్ట్ లో చెప్పుకున్నాం. ఎడమ గోళార్థంలో (left hemisphere) frontal lobe లో పై భాగంలో ఉండే superior frontal gyrus అనే 2cm X 2cm విస్తీర్ణం గల ప్రాంతంలో ప్రేరణ నిచ్చినప్పుడు నవ్వు పుడుతోంది. మెదడు వ్యాధి ఉన్న వారి నవ్వుకి, ఈ నవ్వుకి మధ్య లక్షణంలో తేడా ఉందని గమనించారు డాక్టర్లు. విద్యుత్ ప్రేరణ వల్ల పుట్టిన ఈ నవ్వులో ఆనందాతిరేకం (mirth) ఉందని ఏ.కె. స్వయంగా చెప్పుకుంది. అలాగే ఈ ప్రాంతంలో ప్రేరణ నిచ్చినప్పుడు నవ్వు మాత్రమే వచ్చింది గాని, సీజర్స్ రాలేదు. ఎందుకు నవ్వావు? అని అడిగితే ప్రతీ సారీ ఏదో కొత్త కథ చెప్పేది.
అయితే నవ్వడం అనే చర్యని కేవలం మెదడులో superior frontal gyrus మాత్రమే శాసిస్తుందని కాదు. ఏ చర్యనయినా మెదడులో పలు ప్రాంతాలు కలిసి సమిష్టిగా నియంత్రిస్తాయి. కనుక superior frontal gyrus అనేది నవ్వుని శాసించే ఓ పెద్ద circuit లో ఒక భాగం మాత్రమే. ఎందుకంటే నవ్వులో ఎన్నో అంశాలు ఉన్నాయి.
1. నవ్వులో ఆనందం అనే భావావేశం ఉంటుంది. (భావావేశం లేకుండా కూడా నవ్వొచ్చు. అందుకే మనస్తూర్తిగా నవ్వే నవ్వుకి, తెచ్చిపెట్టుకున్న నవ్వుకి మధ్య తేడా ఉంటుంది. ఈ విషయం పైకి కూడా కనిపిస్తుంది.)
ఈ మూడు రకాల అంశాలని మెదడులో వివిధ ప్రాంతాలు శాసిస్తుంటాయి. అవన్నీ కలిపితే మెదడులో నవ్వుని శాసించే నాడీ వ్యవస్థ అవుతుంది. అయితే ఆ సంపూర్ణ వ్యవస్థలో ఏఏ ప్రాంతాలు భాగాలుగా ఉన్నాయి, అవి ఎలా కలిసి పని చేస్తున్నాయి అన్న విషయం ప్రస్తుతానికి స్పష్టంగా లేదు. దాని గురించి ఇంకా పరిశోధన జరుగుతోంది.
References:
http://faculty.washington.edu/chudler/laugh.html
http://health.howstuffworks.com/mental-health/human-nature/other-emotions/laughter1.htm
సరదాగా ఓ సారి తీరిక వేళలో ఎప్పుడైనా ఓ చిన్న ప్రయోగం చెయ్యండి. మంచి ముహూర్తం చూసుకొని, మాంచి గోడ చూసుకుని, దాని మీద తలని వేగంగా ఠపీ ఠపీ మని బాదుకోవాలన్నమాట. అదీ మామూలుగా కాదు. వేగం కనీసం 7 m/sec ఉండాలి, సెకనుకి కనీసం 20 సార్లయినా బాదుకోవాలి. త్వరణం భూమి గురుత్వ త్వరణానికి ఓ వెయ్యి రెట్లు పైగా ఉంటే బావుంటుంది. కొంచెం కష్టమే నంటారా? అదేంటండి బాబు? ఓ చిన్న పిట్ట చెయ్యగా లేంది చెట్టంత మనిషి చెయ్యలేడా?
టటట... అంటూ చిర్రెత్తించే చప్పుడు చేస్తూ కనిపించే ప్రతీ చెట్టు మీదా తూట్లు పొడిచే వడ్రంగి పిట్ట (woodpecker) గురించి అందరం వినేవుంటాం. కారడవి లాంటి మా క్యాంపస్ లో ఎన్నో సార్లు కనిపిస్తుంటాయి కూడా. అంత వేగంతో, అన్ని సార్లు, అంత సేపు అలా తలని చెట్లకి బాదుకుంటే మరి పాపం ఆ చిన్నారి తలకి ఏమీ కాదా? తెగి కింద పడదా? కనీసం తలనెప్పి కూడా రాదా?
మామూలుగా ఈ విషయం గురించి ఆలోచించం గాని, ఈ పిట్టది నిజంగా గట్టి బుర్రే. పక్షుల్లో కూడా ఈ పిట్ట ఈ విషయంలో ప్రత్యేకం. ఎందుకంటే ఇతర రకాల పక్షులకి ఈ సామర్థ్యం ఉన్నట్టు కనిపించదు. పొరపాట్న ఏ గాజు కిటికీకో గుద్దుకున్న పక్షులు ఎన్నో సార్లు ఆ దెబ్బకి తట్టుకొలేక స్పృహ కోల్పోయి నిశ్చేష్టంగా కింద పడడం చూస్తుంటాం. కాసేపయ్యాక మళ్లీ తేరుకుని తమ ఆకాశ విహారంలో సాగిపోతాయి. అది వేరే విషయం. కాని వడ్రంగి పిట్టకి ఈ సమస్యలేమీ లేవు.
’...కాదేదీ సైన్స్ కనర్హం” కనుక ఈ విషయం మీద శాస్త్రవేత్తలు ఎంతో పరిశోధన చేశారు. వడ్రంగి పిట్ట తలకి రక్షణగా పనిచేస్తున్న కొన్ని కారణాలు కనుక్కున్నారు.
1. వడ్రంగి పిట్ట తలలోని మెదడు పరిమాణం చాలా చిన్నది. దాని కపాలంలో మెదడు చాలా బిర్రుగా, కదలకుండా బంధించబడి ఉంటుంది. అందుకు భిన్నంగా మన మెదడు పెద్దది, బరువైనదీను (1.3 kgs). మన కపాలానికి మెదడుకి మధ్య కొంత ఎడం ఉంటుంది. ఆ ఎడంలో సెరెబ్రో స్పైనల్ ద్రవం ప్రవహిస్తుంటుంది. అందుకే మన తల ఉన్నట్లుండి కదిలినప్పుడు, అందులోని మెదడు జడత్వం వల్ల కదలకుండా ఉండడం వల్ల కపాలపు వెనుక భాగం మీద వొత్తబడుతుంది. రోడ్డు ప్రమాదంలో ఈ విధంగా తల, మెదడు గాయపడవచ్చు. ఈ పిట్ట మెదడు చిన్నది కనుక బతికిపోయింది.
2. మనిషి మెదడు ఉపరితలం అంతా మిట్టపల్లాలుగా ఉంటుంది. ’మిట్ట’లని ’జైరై (gyri) అని, ’పల్లాల’ని సల్కై (sulci) అని అంటారు. గిజిగాడు పిట్ట మెదడు నునుపుగా ఉంటుంది. వస్తువు చిన్నది అవుతున్న కొలది దాని ఉపరితలానికి, ఆయతనానికి (volume) మధ్య నిష్పత్తి పెద్దదవుతూ వస్తుంది. కనుక తల చెట్టుకి గుద్దుకున్నప్పుడు ఆ అభిఘాతపు ధాటి మెదడు ఉపరితలం మీద సమంగా విస్తరించబడుతుంది. తరువాత దీని మెదడు మీద కూడా కాస్తంత సెరిబ్రోస్పైనల్ ద్రవం ఉంటుంది. చిక్కని ఈ ద్రవం మెదడు చుట్టూ మెత్తని కవచంలా ఉంటూ దెబ్బ తగలకుండా కాపాడుతుంది.
ఈ విషయాన్ని పరీక్షించడానికి ఓ పిట్టని టైప్ రైటర్ మీద ’కీ’ లని కొట్టేలా శిక్షణ నిచ్చారు. ’కీ’ల మీద కొట్టే ముందు పరీక్షగా ఓ రెండు సార్లు మెత్తగా కొట్టి చూసుకుంటుంది. ఒడుపు తెలిశాక గురి చూసి, ఉపరితలం మీద దెబ్బ లంబంగా పడేలా ఎప్పట్లాగే ప్రచండ వేగంలో బాదుడు మొదలెడుతుంది. ఈ కారణం చేత పిట్ట మెదడు మీద పడే ఒత్తిడి (stress) మెదడుని మెలితిప్పేలా, పిండేలా (shear stress) ఉండదు. అలాంటి ఒత్తిడి వల్లనే మనుషులు రోడ్డు ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు మెదడులో నాడీ తీగలు విస్తృతంగా గాయపడవచ్చు. దీన్నే Diffuse Axonal Injury (DAI) అంటారు. ఉపరితలానికి లంబందా దెబ్బ కొట్టడం నేర్చిన వడ్రంగి పిట్ట ఈ రకమైన గాయం తగలకుండా జాగ్రత్తపడుతోంది.
’హై స్పీడ్’ కెమేరాతో ఈ చెట్టు కొట్టుడు కార్యక్రమాన్ని వీడియో తీసిన శాస్త్రవేత్తలు మరో చిత్రమైన విషయాన్ని కూడా గమనించారు. దెబ్బ వేసేటప్పుడు పిట్ట కళ్లు మూసుకుంటుందట. మరి ఆ చర్య చెట్టు బెరడు నుండి ఎగసే పొట్టు కంట్లో పడకుండానా, లేక తల కదిలే వేగానికి కళ్లు రాలి కిందపడకుండానా అన్న విషయం అర్థం కాక శాస్త్రవేత్తలు ఇప్పటికీ తర్జనభర్జనలు పడుతున్నార్ట.
References:
http://www.thenakedscientists.com/HTML/articles/article/whydontwoodpeckersgetbraindamage/
- May et al., Arch Neurol 1979 Jun; 36(6): 370-3- May et al., Lancet 1976 Feb 28;1(7957):454-5
పిల్లలు జన్మత: శాస్త్రవేత్తలు. తమ చుట్టూ ఉన్న అజ్ఞాత ప్రపంచాన్నిశోధించి సాధించాలని తాపత్రయపడుతుంటారు. ఈ సంగతి తల్లిదండ్రులకి కూడా తెలుసు. మాట, నడక నేర్చిన నాటి నుండీ, పిల్లల్లో తెలుసుకోవాలనే ఉత్సుకత వారిని ఈ అన్వేషణా మార్గంలో ముందుకు తోస్తుంది. కాని ఎందుచేతనో వయసు పెరుగుతున్న కొలది ఆ ఉత్సాహం క్రమంగా అణగారిపోతుంది. మనిషి జీవితంలో ఇదొక తీవ్రమైన నష్టంగా భావించాలి.
ఈ సమస్యని చక్కదిద్దడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వైజ్ఞానిక విద్యని ఇంకా అభివిద్ధి పరచాల్సిన అవసరం ఉంది. టీచర్ల శిక్షణని పెంచాలని, విద్యాప్రణాలికలని మెరుగుపరచాలని ఇలా నిపుణులు ఎన్నో సూచనలు చేశారు.
ఈ అధ్యయనాలు, వాటికి ఆధారంగా ఉన్న సిద్ధాంతాలు, చాలా వరకు ఓ మౌలిక విషయాన్ని విస్మరిస్తున్నాయి. విజ్ఞానం యొక్క అంతరంగం లోకి విద్యార్థులు తొంగి చూసేలా వీలు కల్పిస్తూ, విజ్ఞానం యొక్క అత్యధ్భుత సారాన్ని ఆస్వాదించేటట్టు చెయ్యకుండా, ఈ శిక్షణలన్నీ కేవలం సాంకేతిక వివరాలలో, పద్ధతుల వినియోగంలో యాంత్రికమైన దక్షతని పెంచే తీరులోనే పనిచేస్తున్నాయి.
అసలు నేను మాట్లాడిన పిల్లల్లో చాలా మందిలో సైన్సులోని ప్రగాఢ, మౌలిక ప్రశ్నల కనీస మాత్ర అవగాన కూడా లేదు. చిన్న చిన సాంకేతిక వివరాలను మాత్రమే నిరంతరం అవపోసన పడుతూ అదే అసలు విజ్ఞానం అన్న భావనలో ఉంటారు. ఈ విశ్వం ఎక్కణ్ణుంచి పుట్టింది? జీవం ఎలా ఆవిర్భవించింది? మెదడు చర్యలలో చైతన్యం ఎలా అభివ్యక్తం అవుతోంది? వారి శిక్షణలో ఇలాంటి ప్రశ్నల ప్రసక్తే రాదు. సంగీతం నేర్చుకునే విద్యార్థులకి ఎప్పుడూ స్వరజతులే నేర్పిస్తూ, మహావాగ్గేయకారులు రాసిన కృతుల జోలికే పోకుండా సాగే సంగీత బోధన లాగానే, ఈ విధమైన సైన్సు బోధన పిల్లల్లో సైన్సు పట్ల విస్మయం కలుగజేయదు. కళ్లింతచేసి ’అబ్బా! సైన్స్ అంటే అదా?” అని అబ్బురపడనీయదు.
ఈ సందర్భంలో, ఊరికే ఒక అవగాహన కలగడానికి, భౌతిక శాస్త్రాన్నే తీసుకుంటే గత శతాబ్దంలో ఎన్నో విప్లవాత్మకమైన పరిణామాలు వచ్చాయి. ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతం, సామాన్య సాపేక్షతా సిద్ధాంతం, క్వాంటం సిద్ధాంతం మొదలైనవి భౌతిక యదార్థం పట్ల మన దృక్పథాన్ని సమూలంగా మార్చేసిన కొన్ని అద్భుత పరిణామాలు. ఇక గత పదేళ్లలోనే విశ్వ విన్యాసం గురించిన మన అవగాహనలో కొన్ని సంచలనాత్మక మర్పులు వచ్చాయి. సుదూరమైన భవిష్యత్తులో విశ్వం ఎలా ఉంటుంది అన్న విషయంలో కొన్ని కొత్త సిద్ధాంతాలు బయలుదేరాయి.
ఇవన్నీ చాలా మౌలికమైన, బృహత్తరమైన పరిణామాలు. కాని హైస్కూలు స్థాయి లోనో, ఇంకా చిన్న తరగతుల స్థాయిలోనో ఇలాంటి విప్లవాల ప్రస్తావన చాలా అరుదుగానే వస్తుంటుంది. ఒక్క భౌతిక శాస్త్రంలోనే కాదు, జీవ, రసాయన, గణిత శాస్త్రాలలో కూడా ఈ ఒరవడే మనకి కనిపిస్తోంది.
ఈ బోధనా పద్ధతికి మూలంలో సైన్సు బోధన నిలువుగా, అంటే ఓ కచ్చితమైన వరుసక్రమంలో సాగాలన్న ఒక నమ్మకం ఉంది. ముందు ’అ’ నేర్చుకుంటే, ఆ తరువాత ’ఆ’ నేర్చుకుంటే, అటు పిమ్మట ’ఇ’... ఇలా సాగుతుందీ బోధన. మరి ఇందులో మొదటి మెట్టు అయిన ’అ’ అనే అంశం కొన్ని వందల ఏళ్ల క్రితం కనుక్కోబడ్డ విషయం అయినప్పుడు, అక్కణ్ణుంచి మొదలుపెట్టి నెమ్మదిగా ఆధునిక యుగం వరకు రావాలంటే మరి చాలా కాలమే పడుతుంది. ఇక స్కూల్లో తప్పనిసరిగా జరిగే కార్యక్రమాలు – సమీకరణాలు సాధించడం, రసాయన చర్యలని విశ్లేషించడం, కణాలలో అంతర అంశాల చర్యలన్నీ జ్ఞాపకం పెట్టుకోవడం – మొదలైనవన్నీ తుచ తప్పకుండా చేసుకుంటూ పోతే మరి నిస్సందేహంగానే స్వర్గారోహణంలా నిలువు దిశలో చాలా దూరమే పోవాల్సి ఉంటుంది.
కాని సైన్స్ అంటే కేవలం ఈ సాంకేతిక వివరాలే కాదు. ఆ వివరాల వెన్నుక ఉన్న అందమైన, లోతైన భావనలు కూడా సైన్సే. చెప్పే తీరులో చెప్తే, మరీ ఎక్కువ సాంకేతిక వివరాలు గుప్పించకుండా, అత్యంత ఆధునిక ఆవిష్కరణలని, సిద్ధాంతాలని స్కూలు పిల్లలకి అర్థమయ్యేలా చెప్పొచ్చు. వివరాలు పెద్దగా లేకపోయినా, మూల భావాలని వ్యక్తం చెయ్యగలిగామంటే ఆ భావాలే పిల్లలలో సాంకేతిక వివరాలు కూడా నేర్చుకోవాలన్న ఆకాంక్ష కలుగజేస్తాయి. ఎప్పుడూ వైజ్ఞానిక ఫలితాలకి, లెక్కలు చెయ్యడానికి మాత్రమే ప్రాధాన్యత నిస్తున్నప్పుడు, పిల్లలు సైన్సు భావాల తన్మయత్వంలో తారామండలాన్ని దాటి తేలిపోయే అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు.
సైన్సు ఓ అత్యద్భుతమైన సాహసగాధ. మనిషి తన గురించి, తన పరిసరాల గురించి తెలుసుకోడానికి కొన్ని వేల ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాల చరిత్ర అది. ఈ సుదీర్ఘ మానవ భావపరిణామ నాటకాన్ని, అందులో ఉత్సాహాన్ని, మహత్తుని వ్యక్తం చేసేలా ఉండాలి సైన్సు బోధన. సంగీతం, కళ, సాహిత్యాల స్థాయిలో వాటికి సమానంగా సైన్సు కూడా ఉంచేట్టుగా మన సంస్కృతిని మలచుకోవాలి. సైన్సు జీవన సారంలో లోతుగా ఇమిడిపోవాలి.
ఇరాక్ లో పోరాడుతున్న ఆ సైనికుడు మాత్రమే కాదు, మనని ఎన్నో రకాలుగా వేరుచేసే కుటిల అడ్డుగోడల కన్నా అతీతమైన విశ్వరహస్యం కోసం చేసే ఓ మానవసహజ అన్వేషణ ప్రతీ ఒక్కరు తప్పకుండా చేపట్టాల్సిన ఓ గురుతర బాధ్యత, ప్రతీ పసివాడికి అదో జన్మహక్కు.
- బ్రయాన్ గ్రీన్.
వృత్తి రీత్యా శాస్త్రవేత్తని కనుక పైన చెప్పిన విషయాలు నిజమని అనుభవం మీద తెలుసు. కాని సైన్సు లోని సత్యాలని అనుభవించడానికి, సైన్సు మన జీవితాన్ని మార్చడానికి మనం వృత్తి రిత్యా శాస్త్రవేత్తలం కానక్కర్లేదు అని కూడా తెలుసు. కాలబిలాల గురించి, మహావిస్ఫోటం (big bang) గురించి చెప్తున్నప్పుడు పిల్లల కళ్లలో కాంతులు చిందడం నేను కళ్లారా చూశాను. హై స్కూలు తరువాత బడి మానేసిన వాళ్లు కూడా మానవ జీనోమ్ ప్రాజెక్ట్ గురించి పాపులర్ సైన్స్ పుస్తకాలు చదివి సైన్సు మీద, చదువు మీద ఉత్సాహం పుట్టుకొచ్చి మళ్లీ కాలజిలో చేరిన పిల్లలు నాకు తెలుసు. ఇందాక నేను ప్రస్తావించిన సైనికుడు కూడా తన ఉత్తరంలో, దుమ్ము కొట్టుకుపోయిన, ప్రమాదకరమైన బాగ్దాద్ పరిసర ప్రాంతాల్లో సాపేక్షతా సిద్ధాంతం గురించి, క్వాంటం మెకానిక్స్ గురించి చదువుతుంటే ఏదో నూతన జీవనోత్సాహం కలుగుతోందని, ఓ మహత్తర యదార్థంలో మనమంతా భాగమన్న ఏదో కొత్త అవగాహన కలుగుతోందని రాశాడు.
అయినా కూడా సైన్సు అంటే ఏ పరీక్ష కోసమో క్లాస్ రూమ్లో చర్చించుకునే ప్రత్యేక అంశంగానో, వాస్తవ ప్రపంచంలో ఉన్నట్లుండి ఏ సాంకేతిక పరికరంలోనో అభివ్యక్తం అయ్యే ఏదో గూఢవిద్య లాగానో పరిగణించబడుతూ ఉంటుంది. కాని నిజానికి సైన్స్ అంటే జీవనోత్సాహాన్ని, స్ఫూర్తిని కలిగించే ఓ అందమైన భాష. మన ఊహకి ఊపిరి పోసే కమ్మని కవితలు వైజ్ఞానిక ఆవిష్కరణలు.
సైన్స్ కి మీకు పొత్తు కుదరదని మీరు అనుకుంటే (చాలా మంది విషయంలో ఇది నిజం) సైన్స్ యొక్క ఈ పార్శ్వాన్ని మీరు ఎన్నడూ అనుభూతి చెందలేదన్నమాట. హైస్కూలు వరకు సైన్స్ చదువుకుని ఆ తరువాత సైన్స్ వొదిలిపెట్టిన ఎంతో మందితో మాట్లాడాను. చాలా మందిలో సైన్స్ అంటే ఒక విధమైన బెదురు, అది జీవితానికి సంబంధించిన ఏదో లోకోత్తర విషయం అన్న భావనే ఉంది. ఈ పరిణామం అంత మంచిది కాదు.
కళ, సంగీత, సాహిత్యాలు లేని జీవితం ఎలాగైతే శున్యంగా, అసంపూర్ణంగా తోచుతుందో, సైన్స్ లేని జీవితంలో కూడా ఓ ముఖ్యమైన, మౌలికమైన అంశం లోపిస్తుందని చెప్పొచ్చు.
ఉదాహరణకి రాత్రి వేళ ఆకాశంలో మినుకు మినుకు మనే వేవేల తారలని చూసి అందరం అబ్బురపడడం ఒక ఎత్తు. 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం, మహావిస్ఫోటం జరిగిన తరుణంలో, అత్యంత క్రమబద్ధమైన పరిస్థితులలో ఆ తారలన్నీ ఆవిర్భవించాయని తెలియడం మరో ఎత్తు. అక్కడితో ఆగక తారలు కేంద్రక కొలిములని, కార్బన్, నైట్రోజెన్, ఆక్సిజన్ లని విశ్వానికి అవే సరఫరా చేస్తాయని, ఆ మూలకాలు మన జీవపదార్థ నిర్మాణానికి ముడిసరుకు అని తెలియడం మూడో ఎత్తు.
ఇంకా ముందుకు వెళ్తే విశ్వమంతా వ్యాపించిన ద్రవ్యరాశిలో తారల ద్రవ్యరాశి కేవలం 4% మాత్రమే నని తెలుస్తుంది. ఇక తక్కిన పదార్థం ఎక్కడుంది, ఎలా వుంది అన్న విషయం గురించి ఇప్పటికీ ముమ్మరంగా పరిశోధన జరుగుతోంది. దానికి చీకటి పదార్థం అని చీకటి శక్తి అని మాత్రం పేర్లు పెట్టారు.
(సశేషం...)
బ్రయాన్ గ్రీన్ ఓ స్ట్రింగ్ థియరీ నిపుణుడు. The Elegant Universe, మొదలైన popular science పుస్తకాల రచయితగా చాలా పేరు పొందాడు. సైన్సు జీవితానికి ఎందుకు అవసరమో వివరిస్తూ New York Times పత్రికలో ఇతడు రాసిన ఓ వ్యాసానికి ఇది అనువాదం.
http://www.nytimes. com/2008/ 06/01/opinion/ 01greene. html?pagewanted= 2&ei=5087& em&en=0763f2d290 58a80b&ex= 1212638400
సైన్సు జీవితానికి అర్థాన్నిస్తుంది – బ్రయాన్ గ్రీన్
“కొన్నేళ్ళ క్రితం ఇరాక్ లో పని చేస్తున్న ఓ అమెరికన్ సైనికుడి దగ్గర్నుండి నాకో ఉత్తరం వచ్చింది. యుద్ధంలో తను ఎదుర్కుంటున్న కష్టాలని, బాధలని ఏకరువు పెట్టుకొచ్చాడు. ఈ యుద్ధం తనని మానసికంగాను, భౌతికంగాను బాగా కృంగదీస్తోందని మొరపెట్టుకున్నాడు. ఆ ఒంటరితనంలో, ఆ యాతనామయ జీవితంలో నేను రాసిన పుస్తకం ఒకటి తనకి స్వాంతన నిస్తోందని రాశాడు. ఆ సైనికుడి ఉత్తరం నాకే కాదు, మీకు కూడా కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పుస్తకం సైన్సు గురించి. ప్రకృతి యొక్క ప్రగాఢ సత్యాల గురించి శాస్త్రవేత్తల చిరకాల అన్వేషణ గురించి.
కాని మరో రకంగా చూస్తే అందులో అంత వింత ఏమీ లేదనిపిస్తుంది. సైన్సు జీవితానికి ఒక అర్థాన్ని ఇవ్వగలదు. జీవితాన్ని సార్థకం చెయ్యగలదు. అంతే కాక ఆ సిపాయి ఉత్తరం ఓ ముఖ్యమైన విషయం మీద కూడా వ్యాఖ్యానించింది. మన విద్యావ్యవస్థ పిల్లలకి సైన్సుని తమ జీవితాలలో భాగంగా ఎలా చేసుకోవాలో నేర్పించలేకపోతోంది.
అదెలోగో కొంచెం వివరించనివ్వండి.
ఈ రోజుల్లో మనకి ఎక్కడ చూసినా సెల్ ఫోన్లు, ఐ-పాడ్ లు, లాప్ టాప్ లు ప్రత్యక్షమవుతున్నాయి. దీన్ని బట్టి మన దైనందిన జివితాలలో సైన్సు ఎంత లోతుగా పాతుకుపోయిందో స్పష్టం అవుతుంది. ఇక సీటీ స్కానర్లు, ఎమ్.ఆర్.ఐ. యంత్రాలు, పేస్ మేకర్లు, ఆర్టీరియల్ స్టెంట్ లు, మొదలైన సాంకేతిక పరికరాలు మనకు ప్రాణం పోస్తున్నాయి, ఆయువు పెంచుతున్నాయి. ఇక ప్రపంచ పరిస్థితులని బేరీజు వేస్తున్నప్పుడు, వాతావరణ మార్పులని పరిశీలిస్తున్నప్పుడు, ధరావ్యాప్త వ్యాధులు, టెర్రరిస్ట్ దాడులు, తరిగిపోతున్న సహజ వనరులు, మొదలైన సమస్యలని ఎదుర్కుంటున్నప్పుడు పరిష్కారాల కోసం, సమాధానాల కోసం సైన్సునే ఆశ్రయిస్తున్నాం.
ఇక వైజ్ఞానిక రంగంలో ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్న కొన్ని సువర్ణావకాశాలు – మూలకణాలు, జెనోమిక్ సీక్వెన్సింగ్, వ్యక్తీకృత వైద్యం, ఆయుర్ వృద్ధి పరిశోధన, నానోసైన్స్, మెదడు-మరల అనుసంధానం, క్వాంటం కంప్యూటర్లు, అంతరిక్ష సాంకేతికం – మొదలైనవన్నీ చూస్తే సామాన్య ప్రజలలో వైజ్ఞానిక అంశాల పట్ల సరైన అవగాహన కలుగజేయడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. ఒక జాతిగా మన భవిష్యత్తుని మలచే విషయాల గురించి, సమస్యల గురించి, సరైన నిర్ణయాలు తీసుకోదలచుకుంటే సైన్సు పట్ల అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి అవుతుంది.
సైన్సు మనకి ఎందుకు ముఖ్యమో వివరిస్తూ పై కారణాలు చాలా మంది చెప్తుంటారు. పై కారణాలు ముఖ్యమైనవే. కాదనను. కాని ఇంత కన్నా ముఖ్యమైన విషయం మరొకటి ఉంది.
సైన్సు ముఖ్యం అనడానికి మరింత లోతైన కారణం ఒకటుంది. సైన్సు ఒక జీవన విధానం. సైన్సు ఒక విశ్వదృక్పథం. సైన్సు మనని ఏమీ తెలియని అయోమయ స్థితి నుండి నిర్దిష్టమైన అవగాహన దిశగా ఓ కచ్చితమైన, విశ్వసనీయమైన మార్గం వెంట చేయి పుచ్చుకుని తీసుకుపోతుంది. మన అంతర్యంలో సైన్సు తెచ్చే మార్పు (అది అనుభవించిన భాగ్యం గలవారికి తెలుస్తుందది) ఓ ప్రగాఢమైన, స్ఫూర్తిదాయకమైన, శక్తిదాయకమైన అనుభవం. మన చుట్టూ కనిపించే ఎన్నో విషయాల గురించి, మన మనసుకి తట్టే ఎన్నో ప్రశ్నలకి, సైన్సు వివరణలు ఇస్తున్నా, వాటిని గుడ్డిగా నమ్మమనదు. ప్రయోగాలతో, పరిశీలనలతో ఎవరికి వారే ఆ విషయాలని స్వీయానుభూతి చేత వాటిని ఎలా నిర్ధారించుకోవచ్చో చెప్తుంది. మానవ జీవితానుభూతులలో కెల్లా ఇది చాలా లోతైన, పవిత్రమైన అనుభవం అనిపిస్తుంది.
(సశేషం...)
ఈ పద్ధతితో కండరాల సంకోచానికి కావలసిన శక్తికి మూలం గ్లైకోజెన్ యే నన్న మునుపటి వాదనని వమ్ముచెయ్యడానికి సుబ్బారావుకి సాధ్యం అయ్యింది. ఈ వాదనే 1922 లో హిల్, మెయెరోఫ్ లకి వైద్య, జీవక్రియా శాస్త్రాలలో నోబెల్ బహుమతిని తెచ్చి పెట్టింది. కండరాల సంకోచమే కాదు సమస్త జీవక్రియలకి శక్తి మూలం ఆడెనొసిన్ ట్రైఫాస్ఫేట్ అనే అణువు అని సుబ్బారావు కనుక్కున్నాడు. అంటే విశ్రాంత స్థితిలో ఉన్న కండరం కన్నా, అలసిన స్థితిలో కండరంలో ఏ.టీ.పీ. సాంద్రత తక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఆవిష్కరణలన్నీ ఏప్రిల్ 1927 నాటి సంచికలో ప్రఖ్యాత ’సైన్స్’ పత్రికలో అచ్చయ్యాయి. ఈ పరిశోధనే అతడికి డాక్టరేట్ పట్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ పరిణామంతో వైజ్ఞానిక సంఘంలో సుబ్బారావు గౌరవం అమాంతంగా పెరిగింది. అది చూసి రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ అతడికి ఫెలోషిప్ కూడా ఇచ్చి ఆదరించంది.
ఆ తరువాత సుబ్బారావు భయంకరమైన ఎనీమియా వ్యాధి మీద ధ్వజం ఎత్తాడు. పంది కాలేయం నుంచి విటమిన్ బి 12 వెలికి తీసి, అది ఎనీమియా కి విరుగుడుగా పనిచేస్తుందని నిరూపించాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా విటమిన్ల వేట మొదలయ్యింది. ఆ ప్రయత్నంలో ఎన్నో కొత్త విటమిన్లు కనుక్కోబడ్డాయి.
విశ్వవిద్యాలయాలలో కన్నా పెద్ద పెద్ద ఫార్మసూటికల్ కంపెనీలలో అయితే పరిశోధనకి మరింత మెరుగైన సౌకర్యాలు ఉంటాయని అనిపించింది సుబ్బారావుకి. కనుక 1940 లో పేరు మోసిన లీడర్లే లాబరేటరీలలో చేరాడు. ఈ కొత్త ఉద్యోగంలో చేరాక ఎంతో కాలం పగలనక్ రాత్రనక కృషి చేసి ఫోలిక్ ఆసిడ్ ని సంయోజించ గలిగాడు. గత యాభై సంవత్సరాలలోను విటమిన్ బి 12 తో పాటు ఈ ఫోలిక్ ఆసిడ్ కూడా ఎనీమియాకి మందుగా పని చేసి మానవజాతికి ఎంతో మేలు చేసింది.
అక్కడితో ఆగక సుబ్బారావు, అతడి వైజ్ఞానిక బృందం ఎన్నో ఇతర వ్యాధుల మీద యుద్ధం ప్రకటించారు. ఈ పరిశోధనలలో ఆయన రెండు పడవల మీద ప్రయాణిం సాగించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన జీవ అణువులని అణువణువూ తెలిసిన రసాయన శాస్త్రవేత్త మాత్రమే కాదు, మానవయాతనని ఎలాగైన ఉపశమింపజేయడానికి కంకణం కట్టుకున్న దయామయుడైన వైద్యుడు కూడా. తనలోని ఈ రెండు సామర్థ్యాలు – మనుషుల పట్ల కరుణ, రసాయన శాస్త్రంలో అనుపమాన ప్రజ్ఞ – తన బృందాకి కూడా నిరంతరం స్ఫూర్తిదాయకంగా ఉండేవి.
1928 లో అలెక్సాండర్ ఫ్లెమింగ్ సూక్ష్మక్రిముల పాలిటి బ్రహ్మాస్త్రం లాంటి ఓ కొత్త శక్తివంతమైన మందుని కనుక్కున్నాడు. దాని పేరే పెన్సిలిన్. పెన్సిలిన్ రాకతో వైద్యచరిత్రలో ఆంటీబయాటిక్ యుగం మొదలయ్యింది. ఆ కొత్త రకం మందుల ప్రాముఖ్య్తత సుబ్బారావు మొదట్లోనే పసిగట్టాడు. ఓ వృక్షశాస్త్రవేత్తని తన బృందంలో చేరుకుని ప్రపంచం నలుమూలల నుండి తెప్పిచ్చిన మట్టి నుండి వెలికి తీసిన ’మోల్డ్’ లని విశ్లేషించే పని మీద పెట్టాడు. ఈ ప్రయత్నంలొనే A-377 అనే ఓ శక్తివంతమైన మోల్డ్ తయారయ్యింది. ఈ మందు గురించి సుబ్బారావు ఇలా రాసుకున్నాడు. “ఎంతో వైవిధ్యం గల రోగకారక క్రిముల మీద ఈ మందు నాగుపాము కాటులా పనిచేస్తుంది. కాని ఇతర శరీర కణాల మీద మాత్రం దీని ప్రభావం పిల్లికూన స్పర్శలాగా సున్నితంగా ఉంటుంది.” ఈ విధంగా టెట్రాసైకిలిన్ అనే కొత్త రకం ఆంటీబయాటిక్ మందులు తయారయ్యాయి.
ఆంటీబయాటిక్ రంగంలో తను సాధించిన విజయాలతో తృప్తి పడక పోలియో, కాన్సర్ వ్యాధుల మీద యుద్ధం ఆరంభించాడు. ఈ ప్రయత్నంలో పుట్టిన మందుల్లో టియోర్టెరిన్ (teorpterin) ఒకటి. ఇది లుకేమియా మందుగా సత్ఫలితాలనిచ్చింది.
1948, ఆగస్టు 9, సోమవారం, నాడు సుబ్బారావు ఆఫీసుకి రాకపోవడం చూసి తోటి ఉద్యోగులు ఆశ్చర్యపొయారు. శ్రమవ్యసన పరుడైన సుబ్బారావు ఇలా సోమవారం నాడు ఆఫీసుకి రాకపోవడం విడ్డూరంగా అనిపించింది. ఇంటికి వెళ్లి చూస్తే ఆయన బలమైన గుండెపోటుతో మరణించాడని తెలిసింది. అప్పటికి ఆయన వయసు 53. అమెరికాకి వచ్చిన తరువాత మళ్లీ ఎప్పుడూ ఆయన ఇండియాకి తిరిగి వెళ్లలేదు.
సంపూర్ణ చిత్తశుద్ధితో శాస్త్రవృత్తిని ఓ యజ్ఞంలా ఆచరించిన దీక్షాపరుడు సుబ్బారావు. తన ఆవిష్కరణల నుండి లౌకికమైన లబ్ది పొందాలని ఎప్పుడూ అనుకోలేదు. వాటి మీద పేటెంట్ల కోసం ఎన్నడూ ప్రయత్నించలేదు. పత్రికలు, పత్రికా విలేకరులు, పదవులు, బిరుదులు, - వీటన్నిటికి దూరంగా ఉండేవాడు. కాని భారత రత్న బిరుద ప్రదానం కోసం ఆయన పేరు ఒకసారి సూచించబడింది. అమెరికా పౌరుడు అయ్యే అవకాశం ఉన్నా భారతీయ పౌరుడిగానే ఉండిపోయాడు. ఎన్నో మహత్తర శాస్త్ర విజయాలు సాధించినా, సాధించినదానితో తృప్తి పడకుండా, పేరుకోసం, డబ్బుకోసం ప్రాకులాడకుండా, ఎప్పుడూ ఇంకా ఏవో మహోన్నత లక్ష్యాల కోసం అనిద్రితంగా శ్రమించే ఆదర్శశాస్త్రవేత్త సుబ్బారావు. ఆంధ్రులకి మాత్రమే కాదు, యావత్ భారతానికి, సమస్త వైజ్ఞానిక లోకానికి ఆయన చిరస్మరణీయుడు.
Reference:
Arvind Gupta, Great Indian Scientists.
“నువ్వు డా. ఎల్లా ప్రగడ సుబ్బారావు గురించి విని ఉండకపోవచ్చు. కాని ఆయన ఉండబట్టే నీ ఆయువు మరింత పెరిగింది” – డోరాన్ కె. ఆంట్రిమ్.
“వైద్య రంగంలో ఈ శతాబ్దంలోనే ఓ గొప్ప మేధావి,”” అంటూ న్యూ యార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక డా. ఎల్లాప్రగడ సుబ్బారావును ప్రశంసించింది. “ఎన్నో మహమ్మారి వ్యాధులకి విరుగుడు కనుక్కుని ప్రపంచం అంతటా కోటానుకోట్ల వ్యాధిగ్రస్తులకి స్వస్థత చేకూర్చాడు.”
ఎల్లాప్రగడ సుబ్బారావు పుట్టిన తేది జనవరి 12, 1895. స్వగ్రామం పశ్చిమగోదావరిలోని భీమవరం.
ఏడుగురు సంతానంలో ఇతడు మూడోవాడు. తండ్రి జగన్నాథం అనారోగ్యం వల్ల తొందరగా పదవీవిరమణ చెయ్యాల్సి వచ్చింది. నాటి నుండి ఇల్లు గడవడం కష్టం అయ్యింది. ఇంట్లో పరిస్థితి అలా దీనంగా ఉండడంతో సుబ్బారావు మనసు చదువు మీద నిలవలేకపోయింది. ఒకరోజు ఎవరితోనూ చెప్పాపెట్టకుండా ఇల్లు వదిలి వారణాసికి పారిపోవాలని ప్రయత్నించాడు. అక్కడైనా తల రాత మారుతుందేమో నని ఓ ఆశ. కాని తల్లి వెంకమ్మ ఎలాగో కొడుకు పన్నాగం పసిగట్టి, తిరిగి ఇంటికి తెచ్చింది. వెర్రి మొర్రి వేషాలు వెయ్యకుండా బుద్ధిగా చదువుకోమని బడికి పంపించింది. భర్త మరణం తరువాత వెంకమ్మ తన మంగళసూత్రం అమ్మి కొడుకు చదువుకి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడింది.
మద్రాసులో ప్రెసిడెన్సీ కాలేజిలో చదువుకునే రోజుల్లో తరచు రామకృష్ణా మిషన్ కి వెళ్తూ ఉండేవాడు. అక్కడ చాలా సేపు కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ఒకదశలో సన్యసించి సంసారాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని ఆరాట పడ్డాడు. కాని అలాంటి ఆలోచనే పెట్టుకో వద్దని తల్లి గట్టిగా మందలించింది. చివరికి చేసేది లేక మద్రాస్ మెడికల్ కాలేజిలో చేరాడు. డాక్టరుగా శిక్షణ పొందితే రామకృష్ణా మిషన్ ఆస్పత్రులలో డాక్టరుగా పని చెయ్యొచ్చని అనుకుని సరిపెట్టుకున్నాడు. కాని చదువుకి అయ్యే ఖర్చు భరించే స్తోమత తనకి లేదు. ఇక ఒక్కటే మార్గం. పెళ్లి చేసుకుంటే కట్నం డబ్బుతో హాయిగా చదువుకోవచ్చు! ఆ రోజుల్లో ఎంతో మంది యువకులు చేసే పనే తనూ చేశాడు. తల్లి కూడా తన ఆలోచనని ఆమోదించింది. అయితే ఆవిడ కారణాలు వేరు. ఇలాగైనా కొడుకు ’పిచ్చి’ కుదురుతుందని ఆవిడ ఆశ. చివరికి మే 10, 1919 నాడు తన కన్నా 12 ఏళ్లు చిన్నదైన శేషగిరిని వివాహం చేసుకున్నాడు.
ఆ రోజుల్లోనే గాంధీ మొదలుపెట్టిన స్వదేశీ ఉద్యమం చేత ప్రభావితుడైన సుబ్బారావు బ్రిటిష్ వస్తువులని వాడడం మానేశాడు. ఖాదీ బట్టలు వేసుకోవడం మొదలెట్టాడు. ఈ పద్ధతి కాలేజిలో ఇంగ్లీషు అధికారులకి నచ్చలేదు. దాంతో తనకి న్యాయంగా ఇవ్వాల్సిన ఎమ్.బి.బి.ఎస్. డిగ్రీకి బదులు మరింత తక్కువదైన ఎల్.ఎమ్.ఎస్. డిగ్రీ మాత్రం ఇచ్చారు.
దాంతో ఒళ్లు మండిన సుబ్బారావు పాశ్చాత్య వైద్య వ్యవస్థ మీదే ధ్వజం ఎత్తాడు. పాశ్చాత్యపద్ధతిలో ప్రాక్టీసు చెయ్యకుండా పోయి మద్రాస్ ఆయుర్వేదం కాలేజిలో అనాటమీ లెక్చరరుగా చేరాడు.
ఆ కాలంలోనే అమెరికా నుండి వచ్చిన ఓ డాక్టరు, సుబ్బారావుకి పరిచయం అయ్యాడు. పైచదువులకి అమెరికా వెళ్లమని సలహా ఇచ్చాడు ఆ డాక్టరు. మామగారు ఇచ్చింది కొంత, శ్రేయోభిలాషులు ఇచ్చింది కొంత కూడేసుకుని, మూడేళ్లలో తిరిగొస్తానని ఇంకా ఇరవై కూడా దాటని తన కుర్ర భార్యకి మాటిచ్చి, అమెరికాకి బయలుదేరాడు. కాని దురదృష్టవశాత్తు ఆమె మళ్లీ ఎప్పుడూ తన భర్తని చూడలేదు.
1923 అక్టోబర్ 26 నాడు జేబులో 100 డాలర్లతో బాస్టన్ నగరంలో దిగాడు సుబ్బారావు. స్కాలర్షిప్ సంపాదించడానికి తన ఎల్.ఎమ్.ఎస్. సటిఫికేట్ సరిపోలేదు. ఆ దుర్భరమైన తొలి దశలలో సుబ్బారావు ప్రొఫెసర్ అయిన డా. రిచర్డ్ స్ట్రాంగ్ తనకి ఎన్నో విధాలుగా సహాయం చేశాడు. తీరిక వేళల్లో ఆస్పత్రిలో చిన్నా చితకా పనులు చేసుకూంటూ ఎలాగో బతుకు వెళ్లబుచ్చాడు.
చివరికి హార్వర్డ్ మెడికల్ స్కూల్ నుండి ట్రాపికల్ మెడిసిన్ లో డిప్లొమా సాధించాడు. డా. క్రయస్ ఫిస్క్ అనే శాస్త్రవేత్తకి చెందిన బయోకెమిస్ట్రీ లాబరేటరీలో చేరాడు. అక్కడ పని చేసిన రోజుల్లోనే రక్తంలోను, మూత్రంలోను ఫాస్ఫరస్ శాతాన్ని అంచనా వెయ్యడానికి ఓ కొత్త పద్ధతి కనిపెట్టాడు. ఇదే ఫిస్క్-సుబ్బారావ్ పద్ధతిగా పేరు పొందింది. బయోకెమిస్త్రీ విద్యార్థులు ఇప్పటికీ ఈ పద్ధతి గురించి చదువుకుంటారు. ఇటివలి కాలంలో థైరాయిడ్ సమస్యలని, మూత్ర వ్యవస్థకి చెందిన రికెట్స్ (renal rickets) ని కనిపెట్టడానికి ఇదో ముఖ్యమైన ఆయుధంగా పరిణమించింది.
(సశేషం...)
అంటార్కిటికా ఖండంతో భారతీయుల సావాసానికి నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది. 1971-73 ప్రాంతాల్లో సోవియెట్ పర్యటనా బృందాలలో భాగంగా డా. పరం జిత్ సింగ్ సేహ్రా మొదలైన భారతీయులు అంటార్కిటికాని సందర్శించిన మొట్టమొదటి భారతీయులు అయ్యారు.
1982 లో ఎస్.క్యు. కాసిమ్ నేతృత్వంలో అంటార్కిటికాని దర్శించిన మొట్టమొదటి భారతీయ పర్యటనా బృందం అయ్యింది. 21 మంది సిబ్బంది కలిగిన ఈ బృందం ఓ పది రోజుల పాటు ఆ ఖండంలో వివిధ ప్రాంతాలని చూసి వచ్చింది.
అంటార్కిటికాని సందర్శించిన మొట్టమొదటి భారతీయ మహిళ కన్వల్ వికూ. 19 వ భారతీయ అంటార్కిటికా పర్యటనా బృందంలో భాగంగా వెళ్లిన ఈ మహిళ 15 నెలల పాటు ఆ ఖండం మీద గడిపింది.
అంతర్జాతీయ అంటార్కిటిక్ ఒప్పందంలో ఇండియా భాగస్వామి అయ్యాక మన అంటార్కిటికా ఉద్యమం మరింత ఊపందుకుంది.
దక్షిణ గంగోత్రి:
1983 లో దక్షిణ గంగోత్రి అన్న పేరుతో మొట్టమొదటి భారతీయ అంటార్కిటికా పరిశోధనా కేంద్రం స్థాపించబడింది. అయితే 1989 లో విపరీతంగా మంచు పడి ఈ కేంద్రం మంచులో కప్పబడి పోవడంతో దాన్ని విడిచిపెట్టడం జరిగింది.
మైత్రి:
అప్పటికే రెండవ భారతీయ పరిశోధనా కేంద్రం అక్కడ పనిచెయ్యడం మొదలెట్టింది. దీని పేరు మైత్రి. షిర్మాకర్ ఒయాసిస్ అనే మంచులేని శిలాప్రాంతం మీద ఈ కేంద్రం నిర్మించబడింది. దక్షిణ గంగోత్రికి 90 కిమీల దూరంలో నిర్మించబడ్డ ఈ కొత్త కేంద్రంలో ఏడాది పొడవునా సిబ్బంది ఉంటారు. ఈ కేంద్రం చుట్టూ ’ప్రియదర్శిని’ అన్న పేరు గల ఓ మంచినీటి సరస్సుని ఇండియా నిర్మించింది.
భారతి: మూడవ కేంద్రం:
లార్స్మన్ హిల్ సమీపంలో మూడవ పరిశోధనా కేంద్రాన్ని నిర్మించడానికి పథకాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో సర్వేలు పూర్తయ్యాయి. 2012 లో ఈ కొత్త కేంద్రం పనిచెయ్యడం మొదలెడుతుందని ఆశిస్తున్నారు. ఈ కేంద్రం నిర్మాణం పూర్తయితే, అంటార్కిటికా మీద ఒకటి కన్నా ఎక్కువ పరిశోధనా కేంద్రాలు గల బహుకొద్ది దేశాలలో ఇండియా ఒకటవుతుంది. ఈ కేంద్రం పేరు ’భారతి.’
అంటార్కిటికా మీద ఇండియా స్థాపించిన పరిశోధనా కేంద్రాలకి ఎన్నో వైజ్ఞానిక లక్ష్యాలు ఉన్నాయి.
- మంచు-నీరు మధ్య జరిగే పరస్పర చర్యలని, పృథ్వీవాతావరణం మీద ఆ చర్యల ప్రభావాన్ని అర్థం చేసుకోవడం.
- ప్రాచీన పర్యావరణాన్ని, ప్రాచీన వాతావరణాన్ని అర్థం చేసుకోవడం
- అంటార్కిటిక్ పర్యావరణ అధ్యయనం
- భౌగోళిక పరిణామ క్రమం మీద అధ్యయనాలు మొ||
Reference:
http://en.wikipedia.org/wiki/Indian_Antarctic_Program
1920 లో సెర్బియాకి చెందిన మిలుటిన్ మిలాంకోవిచ్ అనే భౌతిక శాస్త్రవేత్త ఈ సమస్య గురించి ఓ కొత్త కోణంలో ఆలోచించాడు. భూమికి సూర్యుడికి మధ్య సంబంధంలో వచ్చే మార్పుల వల్ల వాతావరణంలో ఈ పరిణామాలు కలుగుతున్నాయన్నాడు. భూమి యొక్క అక్షంలో కొంచెం వాలు ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే ఆ వాలు స్థిరంగా ఉండక చాలా నెమ్మదిగా మారుతూ ఉంటుంది. అలాగే దాని ‘సూర్యసమీప బిందువు’ (perihelion, భూమి తన కక్ష్యలో సూర్యుడికి అతిసన్నిహితంగా వచ్చే బిందువు) కూడా సూర్యుడికి ఎప్పుడూ ఒకే దూరంలో ఉండదు. ఈ రెండు కారణాల కలయిక వల్ల సూర్యుడి నుండి భూమి గ్రహించే వేడిమి లో మార్పులు వచ్చి, భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత చక్రికంగా పెరిగి తగ్గే అవకాశం ఉందంటాడు మిలాంకోవిచ్. అలాంటి ఆవృత్తి 40,000 ఏళ్ల కాలం ఉంటుంది అంటాడు. ఆ వ్యవధిలో వరుసగా ’మహా వసంతం,’ ’మహా గ్రీష్మం’, ’మహా శరత్తు’, ’మహా శీతాకాలం’ వస్తాయంటాడు. పగడపు గుట్టలు (coral reefs), సముద్రపులోతుల్లో జరిపిన తవ్వకాల నుండి తీసిన అవక్షేపాల ఆరుర్దాయాన్ని నిర్ణయించిన మీదట, గతంలో ఉష్ణోగ్రతలో అలాంటి చక్రికమైన మార్పులు ఉండేవని ఋజువులు కనిపిస్తున్నాయి.
కాని నిజానికి ’మహా గ్రీష్మానికి’, ’మహా శీతాకాలానికి’ మధ్య తేడా అంత ఎక్కువేం కాదు. మిలాంకోవిచ్ సిద్ధాంతం ప్రకారం ఉష్ణొగ్రత దీర్ఘకాలం నెమ్మదిగా తగ్గాకనే ’మహా శీతాకాలం’ లో ఉండే ఉష్ణోగ్రత కన్నా తక్కువై, హిమ యుగం అరంభం అవుతుంది. మిలియన్ సంవత్సరాల క్రితం ఉత్తర గోళార్థంలో హిమయుగం అలాగే ఆరంభం అయ్యింది. మిలాంకోవిచ్ సిద్ధాంతం ప్రకారం మనం ప్రస్తుతం ఉన్నది ఒక ’మహా గ్రీష్మం.’ మరో పది వేల ఏళ్ల తరువాత మరో ’మహా శీతాకాలం’ లోకి అడుగుపెడతాం.
మిలాంకోవిచ్ సిద్ధాంతం భౌగోళిక శాస్త్రవేత్తల సంఘంలో కలకలం రేకెత్తించింది. ఎందుకంటే ఆ సిద్ధాంతం ప్రకారం ఉత్తర, దక్షిణ గోళార్థాలలో వచ్చిన హిమయుగాలు వేరు వేరు కాలాలలో వచ్చి ఉండాలి. కాని అందుకు బలమైన సాక్ష్యాలేవీ దొరకలేదు. ఇటివలి కాలంలో మరికొన్ని సిద్ధాంతాలు కూడా ప్రతిపాదించబడ్డాయి. సూర్యుడి నుండి వెలువడే తాపంలో చక్రికమైన ఆటుపోట్లు ఉంటాయని, వాతావరణంలోని కార్బన్ డయాక్సయిడ్ వల్ల కాక అగ్నిపర్వతాల నుండి వెలువడే బూడిదే హరితగృహ ప్రభావానికి కారణమని - ఇలా ఎన్నో సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. ఇదిలా ఉండగా లామాంట్ భౌగోళిక వేధశాలకి చెందిన మారిస్ ఎవింగ్ తన సహోద్యోగి విలియమ్ డాన్ తో కలిసి ఓ చక్కని సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఎవింగ్, డాన్ ల ప్రతిపాదన ప్రకారం ఉత్తర గోళార్థంలో వచ్చిన హిమయుగాల పరంపరకి కారణం ఉత్తర ధృవం వద్ద ఉన్న భౌతిక పరిస్థితులే. ఆర్కిటిక్ సముద్రానికి నలుదిక్కులా భూమి ఉంది. హిమ యుగాలకి పూర్వం వెచ్చని యుగాలలో ఈ సముద్రంలో నిండుగా నిరు ఉండేది. ఆ జలాల మీదుగా వీచే గాలులు దక్షిణంగా సాగి కెనడా, సైబీరియా ప్రాంతాల్లో మంచు కురిపించేవి. నేల మీద హిమానీనదాలు వృద్ధి చెందుతున్నప్పుడు భూమి సూర్యుడ నుండి మరింత తక్కువ వేడిమిని గ్రహించుకునేది. ఎందుకంటే ఆ దశలో భూమిని కప్పిన తెల్లని మంచుపొర, తుఫాను వాతావరణంతో కూడుకున్న మబ్బు పొర ల వల్ల సూర్య కాంతిలో అధిక భాగం భూమి నుండి పరావర్తనం చెంది తిరిగి అంతరిక్షంలోకి ప్రసరించేది. ఆ కారణం చేత భూమి మీద సగటు ఉష్ణోగ్రత తగ్గడం ఆరంభించింది. ఆ పరిణామం అలాగే కొనసాగడం వల్ల ఆర్కిటిక్ సముద్రం గడ్డ కట్టుకుపోయింది. కనుక గడ్డ కట్టిన సముద్రం మీదుగా వీచే గాలులు ఎక్కువ తేమని మోసుకుపోలేకపోయేవి. గాలిలో తేమ తక్కువైతే మంచు తక్కువగా కురుస్తుంది. దాంతో మునుపటి ఒరవడి తిరగబడింది. శీతాకాలంలో మంచు కురియడం తగ్గింద కనుక, ఎండాకాలంలో మంచు కరిగే ప్రక్రియదే పైచేయి అయ్యింది. హిమానీనదాలు వెనక్కు తగ్గి భూమి మళ్లి వెచ్చబడి, ఆర్కిటిక్ సముద్రం మళ్లీ జలపూర్ణం అయ్యింది. ఆ విధంగా యుగచక్రం మళ్లీ మొదలై, హిమానీనదాల పెంపు మొదలయ్యింది.
ఆర్కిటిక్ సముద్రం గడ్డకట్టడం వల్ల కాక, కరగడం వల్ల హిమయుగం ఆరంభం కావడం విడ్డురంగా అనిపిస్తుంది. కాని ఈ సిద్ధాంతం సమంజసంగానే ఉందని భౌగోళిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని వల్ల ఎన్నో విషయాలకి తీరైన వివరణ దొరుకుతోంది. కాని ఈ సిద్ధాంతంతో ఒక చిక్కేంటంటే మిలియన్ సంవత్సరాల వరకు అసలు బొత్తిగా హిమయుగాలు లేకపోవడానికి కారణం ఏంటో ఇది చెప్పలేకపోతోంది. కాని ఎవింగ్-డాన్ లు దీనికి కూడా ఒక జవాబు చెప్తున్నారు. హిమయుగాల ఆవిర్భవానికి ముందు ఉండే సుదీర్ఘమైన వెచ్చని యుగంలో ఉత్తర ధృవం పసిఫిక్ మహాసముద్రంలో ఉండేది అంటారు. కనుక ఆ దశలో కురిసిన మంచులో అధిక భాగం సముద్రంలోనే పడేది. కనుక హిమానీనదాలు ఏర్పడే అవకాశం తక్కువగా ఉండేది.
అయితే ఉత్తర ధృవానికి ఎప్పుడూ ఒక చిన్న చలనం ఉంటుంది. 435 రోజుల కొకసారి 30 అడుగుల వ్యాసం ఉన్న వృత్తాకారంలో అది తిరుగుతుంటుంది. ఈ విషయం మొట్టమొదట అమెరికన్ ఖగోళవేత్త సెత్ కార్లో షాండ్లర్ గమనించాడు. 1900 నుండి ఆ ధృవం ఓ ముప్పై అడుగులు గ్రీన్లాండ్ వైపుగా జరిగింది. కాని భూకంపాల వల్లనో, భూగర్భంలో ద్రవ్యరాశి కదలికల వల్లనో జరిగే అలాంటి ధృవచలనాలు పైన చెప్పుకుంటున్న బృహత్తర వాతావరణ పరిణామాలకి కారణం కాలేవు.
ఎవింగ్-డాన్ సిద్ధాంతం నిజం కావాలంటే ధృవాల స్థానంలో సమూలమైన మార్పులు రావాలి. ఖండాల కదలికల వల్ల అలాంటి మార్పులు వస్తాయని ఆశించవచ్చు. ఖండాల ఫలకాలలో కదలికల వల్ల ఉత్తర ధృవం కొన్ని సార్లు నేల మీద, కొన్ని సార్లు సముద్రంలోను ఉండే అవకాశం ఉంది. కాని ఈ భావన నిజం కావాలంటే ఫలకాల కదలికల గురించిన సమాచారాన్ని, పైన చెప్పుకుంటున్న వాతావరణ మార్పులకి సంబంధించిన సమాచారంతో పొల్చి సరిచూసుకోవాలి.
హిమయుగాలకి కారణం ఏమైనా ప్రస్తుత దశలో మాత్రం మానవుడే తన బాధ్యతారహిత చర్యలతో వాతావరణాన్ని మారుస్తున్నాడు. ప్రస్తుత మానవ నాగరికత వాతావరణంలో కార్బన్ డయాక్సయిడ్ నింపుతున్న తీరును, వేగాన్ని చూస్తుంటే ఇకపై హిమయుగాలు రావేమో నంటాడు అమెరికాకి చెందిన గిల్బర్ట్ ఎన్. ప్లాస్ అనే భౌతిక శాస్త్రవేత్త. ఒక వంద మిలియన్ చిమ్నీలు నిత్యం కార్బన్ డయాక్సయిడ్ ని గాల్లోకి వెళ్లగక్కుతున్నాయి. ఆ విధంగా ఏటా 6 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సయిడ్ గాల్లో కలుస్తోంది. అగ్నిపర్వతాలు వెలువరించే కార్బన్ డయాక్సయిడ్ కి ఇది 200 రెట్లు ఎక్కువ. ప్లాస్ అంచనాల ప్రకారం 1900 నుండి 2000 కి మధ్య గాల్లో కార్బన్ డయాక్సయిడ్ ఇంచుమించు 20% పెరిగింది. ఇలాంటి వృద్ధి వల్ల భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత శతాబ్దానికి 1.1 oC పెరిగే అవకాశం ఉంది. ఇరవయ్యవ శతాబ్దపు మొదటి భాగంలో సగటు ఉష్ణోగ్రత నిజంగానే ఆ వేగంలో పెరిగింది. ఈ తాపనం ఇలాగే కొనసాగితే మరో ఒకటి రెండు శతాబ్దాలలో ఖండాంతర హిమానీనదాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది.
Retreating Patagonian ice fields in Argentina
IGY కాలంలో జరిగిన అధ్యయనాల ప్రకారం హిమానీనదాలు ఇంచుమించు ప్రతీ చోట నిజంగానే వెనక్కు పోతున్నాయని తెలుస్తోంది. ఉదాహరణకి హిమాయలయకి చెందిన ఓ పెద్ద హిమానీనదం 1935 కి 1959 కి మధ్య ఇంచుమించు 700 అడుగులు వెనక్కు పోయింది. మరి కొన్నయితే 1000 -2000 అడుగుల వరకు కూడా వెనక్కి పోయాయి. అతిశీతల జలాశయాలకి అలవాటు పడ్డ చేపలు ఉత్తర దిశగా వలసపోతున్నాయి. వెచ్చని వాతావరణంలో పెరిగే చెట్లు కూడా అలాంటి ఒరవడినే ప్రదర్శిస్తున్నాయి. ఏటేటా సముద్ర మట్టం పెరుగుతోంది. హిమానీదాలు కరుగుతున్నాయి అనడానికి ఇది మరో సంకేతం.
అయితే 1940 ల నుండి ఉష్ణోగ్రతలో పెరుగుదల చాలా స్వల్పంగా నెమ్మదించినట్టు కనిపిస్తోంది. దీనికి కారణం వాతావరనంలో పెరుగుతున్న దుమ్ము, ధూళి కావచ్చు. గాల్లో దుమ్ము సూర్యరశ్మి నేలని చేరకుండా కొంతవరకు గొడుకు పడుతుంది. మానవ చర్యలకి ఫలితాలైన రెండు రకాల వాతావరణ కాలుష్యాలు - దుమ్ము, కార్బన్ డయాక్సయిడ్ లు – ఒక దాంతో ఒకటి పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ పోటీలో ఏ ఒరవడిది పై చేయి అవుతుంది అన్న దాని బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంది.
Reference: (for the series of articles on Polar ice caps and earth's atmosphere)
Isaac Asimov, Everyman's guide to Science, vol 1.
హిమ యుగాలకి సంబంధించిన మొదటి ప్రశ్న ’అవి ఎలా వచ్చాయి?’ అన్న ప్రశ్న. మంచు ఆ విధంగా మళ్లీ మళ్లీ పురోగమించి, తిరోగమించడానికి కారణం ఏంటి? హిమావరణం జరిగిన దశలు అంత క్లుప్తంగా ఎందుకు ఉన్నాయి? (గత 100 మిలియన్ సంవత్సరాలలో ఇటీవలి కాలంలో ఉన్న హిమయుగం కేవలం 1 మిలియన్ సంవత్సరాలే ఉంది).
ఓ కొత్త హిమయుగానికి శ్రీకారం చుట్టాలన్నా తెర దించాలన్నా ఉష్ణోగ్రతలో కాస్తంత మార్పు వస్తే చాలు. ఉష్ణోగ్రత కాస్త తగ్గితే చాలు, ఎండాకాలంలో కరిగే మంచు కన్నా శీతాకాలంలో పడే మంచు కాస్తంత ఎక్కువై భూమి మీద మంచు పోగవడం మొదలెడుతుంది. అలాగే ఉష్ణోగ్రత కాస్తంత పెరిగితే చాలు, శీతాకాలంలో పడే మంచు కన్నా ఎండాకాలంలో కరిగే మంచు ఎక్కువై, సముద్రాలలో నీరు పెరుగుతూ వస్తుంది. భూమి మీద సగటు వార్షిక ఉష్ణోగ్రత 3.5 oC తగ్గితే చాలు, ధృవాల వద్ద హిమానీనదాలు విశృంఖలంగా పెరడం ఆరంభిస్తాయి. భూమి మీద సగటు వార్షిక ఉష్ణోగ్రత 3.5 oC పెరిగితే చాలు, అంటార్కిటికా, గ్రీన్లాండ్ లలో పేరుకుని ఉన్న మంచు కరిగి కొద్ది శతాబ్దాలలోనే ఆ ప్రాంతాలు ఒక్క మంచు తునక కూడా లేని ఎండు నేలలుగా మారతాయి.
భూమి మీద ఉష్ణోగ్రతలో అలాంటి మార్పులు గతంలో ఎన్నో సార్లు జరిగాయి. పురాతన కాలంలో భూమి మీద ఉష్ణోగ్రతలని కచ్చితంగా కొలవడానికి ఓ అద్భుతమైన పద్ధతి కనిపెట్టారు. జాకబ్ బిగెలైసెన్ అనే అమెరికన్ రసాయన శాస్త్రవేత్త హెచ్.సి. యూరీ అనే మరో రసాయన శాస్త్రవేత్తతో కలిసి ఈ పద్ధతిని 1947 లో రూపొందించాడు. వివిధ సంయోగాలలో (compounds) లో సామాన్య ఆక్సిజన్ (ఆక్సిజన్ 16) కి, ఆక్సిజన్ ఐసోటోప్ (ఆక్సిజన్ 18) కి మధ్య నిష్పత్తి ఉష్ణోగ్రత బట్టి మారుతుందని ఈ శాస్త్రవేత్తలు గమనించారు. కనుక ఓ సముద్రపు జీవానికి చెందిన శిలాజంలో ఆక్సిజన్ 16 కి ఆక్సిజన్ 18 కి మధ్య నిష్పత్తిని బట్టి ఆ కాలంలోసముద్ర జలాలలో ఉష్ణోగ్రతని అంచనా వేయొచ్చు. 1950 కల్లా యూరే బృందం ఈ పద్ధతిని ఎంతగా అభివృద్ధి పరిచింది అంటే, దాని సహాయంతో మిలియన్ల సంవత్సరాల పూర్వానికి చెందిన ఓ శిలాజం లోని గవ్వ పొరలని విశ్లేషించి, ఆ విశ్లేషణ బట్టి ఆ జంతువు ఎండాకాలంలో పుట్టిందని, కేవలం నాలుగేళ్లే జీవించిందని, తిరిగి వసంతంలో చనిపోయిందని, దాని జాతకచక్రం వివరంగా వర్ణించగలిగేవారు.
ఆ విధంగా శిలాజాల బట్టి ఉశ్ణోగ్రత చెప్పే ఈ “థర్మామీటర్” చెప్పిన సాక్ష్యం ప్రకారం 100 మిలియన్ సంవత్సరాల క్రితం ధరావ్యాప్తంగా సముద్రాల సగటు ఉష్ణోగ్రత 70 oF. ఓ 10 మిలియన్ సంవత్సరాల తరువాత అది నెమ్మదిగా 61 oF కి దిగింది. తరువాత మరో 10 మిలియన్ సంవత్సరాలకి మళ్లీ ఉష్ణోగ్రత 70 oF కి పెరిగింది. అప్పట్నుంచి సముద్రపు ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఆ తరుగదలకి కారణం ఏంటో గాని డైనోసార్లు అంతరించిపోవడానికి కారణం కూడా అదే. (డైనోసార్లు వెచ్చని వాతావరణానికి అలవాటు పడ్డ జంతువులు.) బయట ఉష్ణోగ్రతలో మార్పులకి తట్టుకుని, అంతరంగ ఉష్ణోగ్రతని స్థిరంగా నిలుపుకోగల వెచ్చటి రక్తం గల పక్షులు, స్తన్యజీవులు మాత్రమే ఈ తక్కువ ఉష్ణోగ్రతలకి కొంతవరకు తట్టుకోగలిగాయి.
యూరే బృందం కనిపెట్టిన పద్ధతిని ఉపయోగించి సేజర్ ఎమిలియానీ అనే శాస్త్రవేత్త ఫోరామినోఫెరా (foraminofera) అనే జాతికి చెందిన సముద్ర చరాల గవ్వలని అధ్యయనం చేశాడు. సముద్రపు నేలలో తవ్వకాలలో వెలికి తీయబడ్డ గవ్వలివి. ఈ అధ్యయనాల బట్టి 30 మిలియన్ సంవత్సరాల క్రితం సముద్రపు ఉష్ణోగ్రత 50 oF వద్ద ఉండేదని, 20 మిలియన్ సంవత్సరాల క్రితం 43 oF వద్ద ఉండేదని, ప్రస్తుతం 35 oF వద్ద ఉందని తేటెల్లం అవుతోంది.
ఉష్ణోగ్రతలో ఈ దీర్ఘకాలికి మార్పులకి కారణం ఏమిటి? ఒక ముఖ్యమైన కారణం ’హరితగృహ ప్రభావం’ (greenhouse effect) కావచ్చు.వాతావరణంలోని కార్బన్ డయాక్సయిడ్ పరారుణ కిరణాలని (infrared radiation) ని గాఢంగా పీల్చుకుంటుంది. కనుక వాతావరణంలో పెద్ద మొత్తాల్లో కార్బన్ డయాక్సయిడ్ ఉంటే దాని వల్ల కిరణాలలోని శక్తి వేడి రూపంలో వాతావరణంలోనే ఉండిపోతుంది. ఈ కారణం చేత వాతావరణంలోని వేడి పెరిగి ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. ఇందుకు భిన్నంగా వాతావరణంలోని కార్బన్ డయాక్సయిడ్ స్థాయి పడుతుంటే భూమి క్రమంగా చల్లబడుతుంది.
ప్రస్తుతం గాల్లో ఉన్న కార్బన్ డయాక్సయిడ్ స్థాయి రెండింతలు అయినట్లయితే (0.003% నుండి 0.06% కి) ఆ కారణం చేత భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత మూడు డిగ్రీలు పెరిగి, ఖండాంతర హిమానీనదాలు వేగంగా, పూర్తిగా కరగిపోతాయి. అలాగే కార్బన్ డయాక్సయిడ్ స్థాయి ప్రస్తుత స్థాయిలో సగం అయితే, హిమానీనదాలు మరింత విస్తరించి న్యూ యార్క్ నగరపు ముంగిట్లోకి ప్రవహిస్తాయి!
అగ్నిపర్వతాలు పెద్ద మొత్తాల్లో కార్బన్ డయాక్సయిడ్ ని వాతావరణంలోకి వెలువరిస్తాయి. రాళ్లు కార్బన్ డయాక్సయిడ్ ని పీల్చుకుని సున్నంగా మారుతాయి. వాతావరణంలో దీర్ఘకాలిక మార్పులు తేగల రెండు ప్రక్రియలు మనకిక్కడ కనిపిస్తున్నాయి. అగ్నిపర్వతాల చర్యలు అసాధారణంగా పెరిగి పెద్ద ఎత్తున వాతావరణం లోకి కార్బన్ డయాక్సయిడ్ ప్రవేశించడం జరిగితే, దాంతో ధరాతాపనం ఆరంభం అవుతుంది. అందుకు భిన్నంగా పెద్ద ఎత్తున పర్వతజననం జరిగితే, కొత్త రాయి గాలితో సంపర్కాన్ని పొందితే, ఆ రాయి వాతావరణంలోని కార్బన్ డయాక్సయిడ్ తో చర్య జరిపడం వల్ల, వాతావరణంలో కార్బన్ డయాక్సయిడ్ స్థాయి తగ్గి, ఉష్ణోగ్రత పడవచ్చు. సుమారు 80 మిలియన్ సంవత్సరాల క్రితం మెసొజాయిక్ యుగానికి (సరీసృపాల యుగం) అంతంలో భూమి ఉష్ణోగ్రత క్రమంగా తగ్గడానికి ఇదే కారణం.
కాని గత ఒక మిలియన్ సంవత్సరాలలోనే నాలుగు సార్లు హిమయుగాలు వచ్చి పోవడానికి కారణం ఏమిటి? కేవలం కొన్ని పదుల వేల సంవత్సరాల ఎడంలో మంచు కరగడం, తిరిగి మంచు ఏర్పడడం మళ్లీ మళ్లీ జరగడానికి కారణం ఏమిటి?
(to be continued...)