కాలువల ద్వారా వివిధ ప్రాంతాలకి చెందిన నీటి మట్టాల మధ్య సమతౌల్యాన్ని సాధించొచ్చన్న ఆలోచన బ్రిటిష్ వారి నుండి మనం నేర్చుకున్నదా, లేక అంతకు ముందే మన దేశంలో ఉందా?
బ్రిటిష్ వారు రాక ముందే మన దేశంలో ‘గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ’ (chain tank system) ఉండేది. అలాంటి వ్యవస్థ ఒకటి దక్షిణ భారతంలో వుండేది.
తంజావూరికి చెందిన కల్ ఆనై
‘కల్ ఆనై’ అంటే తమిళంలో ‘రాతి ఆనకట్ట’. (కల్ అంటే రాయి). దీన్ని తంజావూరులో కవేరి నది మీదుగా క్రీ.శ. 100 లో కరికాల చోళుడు అనే రాజు నిర్మించాడు.
కావేరి నదికి సమాంతరంగా మరో కాలువ కూడా నిర్మించబడింది. దీని పేరు కొల్లిడం. (అంటే ‘అదనపు జలాలని నిలుపుకోగల జలాశయం’ అని అర్థం). నది పోటెక్కినప్పుడు, కట్టలు తెంచుకునే పరిస్థితి ఏర్పడినప్పుడు, అదనపు జలాలని ఓ సన్నని మార్గం ద్వారా ఈ పక్కగా వున్న కాలువ లోకి మళ్ళిస్తారు. అక్కడి నుండి మరి రెండు ఆనకట్టలని దాటుకుని నీరు దరిదాపుల్లో ఉండే గ్రామాలలోని చెరువులలోకి చేరుతుంది.
కొన్ని శతాబ్దాల తరువాత మరి కొందరు చోళ రాజులు తంజావూరు ప్రాంతం అంతా మరిన్ని కాలువలు నిర్మించారు. ఆ విధంగా ఆ ప్రాంతానికి చెందిన జలాన్ని సమంగా పంచగలిగారు.
చోళుల కృషి నుండి పాఠాలు నేర్చుకున్న పల్లవ రాజులు తదనంతరం క్రీశ 400 - 900 మధ్య మరింత విస్తారమైన ‘జల జాల వ్యవస్థ’ని నిర్మించారు. ఆ వ్యవస్థ యొక్క నిర్మాణం, తీరుతెన్నులు ఇలా ఉంటాయి.
కర్నాటక ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులని పరిశీలిస్తే, పశ్చిమాన సహ్యాద్రి పర్వతాలు ఉంటాయి. ఆ కొండల వెనుక (సముద్రానికి అవతల పక్క) ఉన్నదే కర్నాటక ప్రాంతం. అక్కణ్ణుంచి తూర్పున బంగాళా ఖాతం వరకు కూడా నేలలో చిన్న వాలు ఉంటుంది. ఈ వాలును గుర్తించిన మన పూర్వీకులు వివిధ గ్రామాలని కలుపుతూ గొలుసుకట్టుగా చెరువులు, కాలువలు నిర్మించారు. చెరువులు అన్నీ నిండాకనే అదనపు నీరు సముద్రంలోకి ప్రవహిస్తుంది.
పల్లవ రాజులు 500 ఏళ్ల పాటు ఈ విస్తారమైన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థని నిర్మించారు.
ఈ చెరువుల నిర్మాణంలో మరో విశేషం కూడా ఉంది.
కాలువలోని నీరు చెరువులోకి ప్రవహించే ద్వారం వద్ద ‘ఏరి’ అనబడే ఒక నిర్మాణం ఉంటుంది. నేలలోంచి చిన్న రాతి స్తంభాలు పైకి పొడుచుకు వచ్చినట్టు ఉంటాయి. వర్షాకాలానికి కొంచెం ముందు ఈ రాతి స్తంభాల మీదుగా, బురదతో ఓ గోడ కడతారు. సుమారు రెండు మీటర్లు ఎత్తు ఉండే ఆ గోడకి, ఆ రాతి స్తంభాలు స్థిరత్వాన్ని ఇస్తాయి. వర్షాలు పడ్డప్పుడు ఈ గోడ ఉండడం వల్ల, చెరువులో మరింత ఎక్కువ నీరు నిలుస్తుంది. ఒక వారం రోజులు అలాగే ఉంచి తరువాత ఆ బురద గోడని కోలదోస్తారు. చెరువులో నిండిన నీరు ఎత్తు తగ్గిన ద్వారం గుండా దిగువన ఉన్న కాలువ లోకి ప్రవహిస్తుంది.
ఈ ‘ఏరి’ గోడల వల్ల ఓ చక్కని ప్రయోజనం ఉంది. నీటి మట్టం పెరగడం వల్ల అడుగున నీటి పీడనం పెరుగుతుంది. అందువల్ల చుట్టూ ఉన్న నేలలో నీరు మరింతగా ఇంకుతుంది. ఇరుగు పొరుగు ప్రాంతాలలోని బావులు కూడా నిండుతాయి. ఇది జరిగాక గోడని కూలదోసి, చెరువులోని నీటిని దిగువ ప్రాంతాలకి వొదులుతారు.
బ్రిటిష్ కాలం నాటి మడ్రాస్ ప్రెసిడెన్సీలో మూడు లక్షల గొలుసుకట్టు చెరువులు ఉండేవని అంచనా. ఈ చెరువులని కలిపే కాలువల మొత్తం పొడవు భూమి చుట్టుకొలత కన్నా ఎక్కువని బ్రిటిష్ అధికారులు అంచనా వేశారని చెప్తారు.
అయితే కాలానుగతంగా ఈ గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ నాశనం అయిపోయింది. విశృంఖల నగరీకరణ వల్ల, అనధికార గృహనిర్మాణం వల్ల ఎన్నో చెరువులు మాయమై పోయాయి. కాలువలు పూడుకుపోయాయి. ఇంత అద్భుతమైన వ్యవస్థ నాశనం కావడం వల్ల ఈ ప్రాంతంలో మళ్లీ కరువులు, వరదలు విలయతాండవం చేయడం మొదలెట్టాయి.
గొలుసుకట్టు చెరువులని పోలిన వ్యవస్థే మరొకటి ఉత్తర భారతంలో కూడా కనిపిస్తుంది.
(ఇంకా వుంది)
very good article sir... we need to stick to the basics first than the expensive solutions.....
అవును నాగ్ గారు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది.
ssssssssss..This Technology is ancient Indians..