శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

(ఈ వ్యాసం ఇటీవలే మాలిక పత్రికలో ప్రచురించబడింది.)
http://magazine.maalika.org/2012/10/02/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%82%e0%b0%aa%e0%b0%be%e0%b0%9c%e0%b1%80%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8b%e0%b0%a7%e0%b0%a8%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%85%e0%b0%97%e0%b1%8d/




స్త్రీ స్వాతంత్ర్యం అంతంత మాత్రంగానే ఉన్న యుగంలో, ఇంకా ఇరవైలు దాటని ఓ చక్కని బ్రిటిష్ యువతి, ఒంటరిగా ఆఫ్రికా అడవుల్లో సంచరిస్తూ, చింపాజీల ప్రవర్తన గురించి లోతుగా అధ్యయనాలు చేస్తూ, చింపాజీలకి, మనిషికి మధ్య ఉన్న పరిణామాత్మక సాన్నిహిత్యాన్ని అర్థం చేసుకుని, ఆ రంగంలో అగ్రగామి అయిన శాస్త్రవేత్తగా ఎదిగింది. ఆ యువతి పేరే జేన్ గుడాల్.

1934 లో లండన్ లో పుట్టిన జేన్ కి చిన్నప్పట్నుంచి జంతువులంటే మహా ఇష్టం ఉండేది. జంతువులతో ఆడుకుంటున్నట్టు, మాట్లాడుతున్నట్టు కలలు కనేది. ‘టార్జాన్,’ ‘డాక్టర్ డూలిటిల్’ (ఈ మనుషుల డాక్టరు మనుషుల కన్నా జంతువులకే ఎక్కువగా చికిత్స చేస్తూ ఉంటాడు) వంటి పిల్లల పుస్తకాలు చిన్నతనంలో ఈమెకి ఎంతో స్ఫూర్తి నిచ్చేవి. అందరిలాగానే ‘పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్’ అవ్వమన కుండా తన తల్లి ‘వాన్నే’ కూతుర్ని తనకి నచ్చిన దారిలోనే ముందుకి సాగమని ప్రోత్సహించేది. “నీకు ఏం కావాలంటే అది అవ్వు. నువ్వు ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో బాగా పైకొస్తావని నాకు తెలుసు,” అనేది ఆ తల్లి.

ఇరవై రెండేళ్ల వయసులో జేన్ కి తన జీవితాన్ని మార్చేసే ఓ గొప్ప అవకాశం దొరికింది. ఓ లండన్ ఫిల్మ్ స్టూడియో తో పాటు ఆఫ్రికాకి వెళ్లే అవకాశం దక్కింది. అయితే ప్రయాణానికి కావలసిన ఖర్చులు కూడా తన వద్ద లేవు. వెంటనే ఓ హోటల్ లో వెయిట్రెస్ గా పనిలోకి దిగి, రాత్రనక పగలనక పని చేసి నాలుగు డబ్బులు వెనకేసింది. తగినంత ధనం పోగవగానే ప్రయాణానికి సిద్ధం అయ్యింది.

ఆ ప్రయాణం 1957 లో మొదలయ్యింది. ముందుగా ఆఫ్రికాలోని మొంబాసా లో దిగింది. మొంబాసాలో ‘లూయీ లీకీ’ అనే పేరుమోసిన పురావస్తు శాస్త్రవేత్త ఉండేవాడు. జేన్ ఆయన్ని కలుసుకుని తన ఆశయాల గురించి విన్నవించుకుంది. జేన్ లోని ఉత్సాహం, శక్తి, జంతువుల పట్ల ఆమెకి సహజంగా ఉండే ప్రేమ మొదలైన లక్షణాలు ఆయన్ని అకట్టుకున్నాయి. వెంటనే తనకి అసిస్టెంటుగా పనిచేసే ఉద్యోగం ఇచ్చాడు. టాంజానియాలో ఓ చెరువు సమీపంలో ఉండే చింపాజీలని అధ్యయనం చేసే పనిలో ఆమెని పాల్గొనమన్నాడు. చింపాజీల జీవన రహస్యాలు అర్థమైతే మనిషి యొక్క పరిణామ గతం గురించి ఎన్నో రహస్యాలు తెలుస్తాయని ఆయన ఆలోచన.

ఈ అధ్యయనాలు 1960 లో మొదలయ్యాయి. ఆ రోజుల్లో జేన్ తల్లి కూడా కూతురుతో పాటు పర్యటించేది. యవ్వనంలో ఉన్న స్త్రీ ఆఫ్రికా అడవుల్లో ఒక్కర్తీ పర్యటించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. కనుక కూతురితో పాటు ఈ పర్యటనలు ఆ తల్లికి తప్పలేదు. మొదటి రెండు వారాలు జేన్ కి కలిగిన అనుభవాలు కాస్త నిరుత్సాహ పరిచాయి. తనని అంత దూరంలో చూడగానే చింపాజీలు పరుగు అందుకునేవి. పోనీ తను చూసినంత మేరకు కూడా చింపాజీల ప్రవర్తనలో తనకి విశేషంగా ఏమీ కనిపించలేదు. వచ్చిన పని విఫలమయ్యింది అన్న బాధ మనసులో దొలిచేస్తుండగా అనుకోకుండా ఓ సంఘటన జరిగింది.

చింపాంజీలు శాకాహారులు అని అంతవరకు జేన్ అనుకునేది. కాని ఒకరోజు ఓ విచిత్రమైన సంఘట కనిపించింది. ఓ చింపాజీ ఓ చెదల పుట్ట పక్క కూర్చుని ఓ పొడవాటి పుల్లని పుట్టలోకి దూర్చి దాంతో చెదలు “పట్టి” తింటోంది. పుల్లని ఓ పనిముట్టుగా వాడి, దాంతో ఆ పురుగులని “వేటాడి” తినడం తనకి ఆశ్చర్యంగా అనిపించింది. గిట్టలు, కొమ్ములు, ముక్కులు, పంజాలు మొదలైన దేహాంగాలని కాకుండా మరో వస్తువుని పనిముట్టుగా వాడి ఆహారాన్ని సేకరించడం జంతులోకంలో అరుదైన విషయం. ఆ రోజుల్లో పెద్దగా తెలియని విషయం. పనిముట్లు వాడే దశ ఆదిమానవుడి పరిణామ క్రమంలో ఓ ముఖ్యమైన మలుపుగా చెప్పుకుంటాం. అలాంటి పనిముట్ల వినియోగం ఈ జంతువులలో కనిపించడం విశేషం.

చింపాజీలలో ఈ పనిముట్ల వినియోగం గురించి ప్రొఫెసర్ లీకీ కి వివరంగా ఉత్తరం రాసింది. ఆయన సంతోషం పట్టలేకపోయాడు. “ దీంతో ‘పనిముట్టు’, ‘మనిషి’ మొదలైన పదాలకి కొత్త నిర్వచనాలు ఇవ్వాలి, లేదా చింపాజీలు మనిషితో సమానమని ఒప్పుకోవాలి,” అంటూ ఆయన ఉత్సాహంగా జవాబు రాశాడు.

తరువాత జేన్ ధ్యాస చింపాజీలలో సాంఘిక జీవనం మీదకి మళ్లింది. మనుషులలో లాగానే చింపాజీలలో కూడా విస్తృతమైన సాంఘిక పారంపర్యం ఉంటుంది. ‘నువ్వెక్కువా? నేనెక్కువా?” అన్న భేటీ మగ చింపాజీల మధ్య తరచు వస్తుంటుంది. బలప్రదర్శనతో మగ చింపాజీలు ఇతర చింపాజీల మీద తమ ఆధిక్యతని చూపించుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఆ బలాబలాల పోటీ గెలిచిన మగ చింపాజీని ‘ఆల్ఫా మేల్’ (మొదటి మగాడు!) అంటారు. అతడే ముఠా నాయకుడు అవుతాడు. అయితే అంతకన్నా బలమైన చింపాజీ రంగప్రవేశం చేసినప్పుడు, ఇంద్రపదవి లాగా ఈ పదవి చేతులు మారిపోతుంటుంది!


చింపాజీలు సాధు జంతువులు ససేమిరా కాదని తెలుసుకుని జేన్ నిర్ఘాంపోయింది. చింపాజీ ముఠాల మధ్య కొట్లాటలు తరచు జరుగుతుంటాయి. ఒక “ముఠా నాయకుడు” తన ముఠాతో సహా వెళ్లి శత్రు ముఠా మీద యుద్ధం ప్రకటిస్తాడు.


ఆ యుద్ధంలో బలమైన చింపాజీలు బలం తక్కువైన చింపాజీలని తీవ్రంగా గాయపరచి, ఆ గాయలతోనే ప్రాణాలు వొదిలే స్థితికి తెస్తాయి. మనుషుల్లో ‘గ్యాంగ్ వార్’ లకి ఈ కలహాలకి పెద్దగా తేడా ఉన్నట్టు లేదు.

జేన్ చేసిన ఈ ప్రప్రథమ అధ్యయనాలన్నీ చక్కని ఫోటోలతో సహా ఆ రోజుల్లోనే ‘నేషనల్ జ్యాగ్రఫీ’ పత్రికలో అచ్చయ్యాయి. ఆ ఫోటోలు తీసిన హ్యూగో వాన్ లావిక్ ని ఆమె తరువాత వివాహం చేసుకుంది. ఇద్దరి కృషి ఫలితంగా అక్కడ “గోంబే స్ట్రీమ్ రీసెర్చ్ సెంటర్” అనే గొప్ప పరిశోధనా కేంద్రం వెలసింది. కొన్ని దశాబ్దాలుగా ఈ కేంద్రం చింపాంజీల పరిశోధనలో ప్రపంచంలో అగ్రస్థాయిలో నిలిచింది. కేంద్రంలో సిబ్బంది పెరిగారు. చింపాంజీల జీవన విధానంలో ఎన్నో అంశాలని ఈ బృందం క్రమబద్ధంగా అధ్యయనం చేస్తూ వచ్చింది. ఇరవై అయిదేళ్ల పాటు ఆమె చేసిన పరిశోధనలు 1986 లో “గోంబే చింపాజీస్ – పాటర్న్స్ ఆఫ్ బిహేవియర్” (గోంబే చింపాంజీలు – వాటి ప్రవర్తనలో విశేషాలు) అనే పుస్తకంగా వెలుడ్డాయి. జేన్ గుడాల్ కృషి నుండి స్ఫూర్తి పొందిన ఎంతో మంది శాస్త్రవేత్తలు చింపాంజీల మీద పరిశోధనలు చేసి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. జేన్ గుడాల్ చేసిన వైజ్ఞానిక కృషికి గుర్తింపుగా ఎన్నో జంతు జాతుల, వృక్ష జాతుల పేర్లలో ఆమె పేరు కలిపారు. ఆమె సుదీర్ఘ వైజ్ఞానిక జీవితంలో ఆమె పొందిన అవార్డులు కోకొల్లలు. స్త్రీలు వైజ్ఞానిక రంగాల్లో కేవలం రాణించడమే కాదు, తలచుకుంటే వారి వారి రంగాల్లో ప్రపంచంలోనే అగ్రగాములుగా ఉండగలరని జేన్ గుడాల్ నిదర్శనం మనకి స్పష్టం చేస్తోంది.


References:

http://en.wikipedia.org/wiki/Jane_Goodall http://www.janegoodall.org/

5 comments

  1. anrd Says:
  2. ఓ చింపాజీ ఓ చెదల పుట్ట పక్క కూర్చుని ఓ పొడవాటి పుల్లని పుట్టలోకి దూర్చి దాంతో చెదలు “పట్టి” తింటోంది. పుల్లని ఓ పనిముట్టుగా వాడి, దాంతో ఆ పురుగులని “వేటాడి” తినడం తనకి ఆశ్చర్యంగా అనిపించింది. గిట్టలు, కొమ్ములు, ముక్కులు, పంజాలు మొదలైన దేహాంగాలని కాకుండా మరో వస్తువుని పనిముట్టుగా వాడి ఆహారాన్ని సేకరించడం జంతులోకంలో అరుదైన విషయం. ఆ రోజుల్లో పెద్దగా తెలియని విషయం. పనిముట్లు వాడే దశ ఆదిమానవుడి పరిణామ క్రమంలో ఓ ముఖ్యమైన మలుపుగా చెప్పుకుంటాం. అలాంటి పనిముట్ల వినియోగం ఈ జంతువులలో కనిపించడం విశేషం.

    చింపాజీలలో ఈ పనిముట్ల వినియోగం గురించి ప్రొఫెసర్ లీకీ కి వివరంగా ఉత్తరం రాసింది. ఆయన సంతోషం పట్టలేకపోయాడు. “ దీంతో ‘పనిముట్టు’, ‘మనిషి’ మొదలైన పదాలకి కొత్త నిర్వచనాలు ఇవ్వాలి, లేదా చింపాజీలు మనిషితో సమానమని ఒప్పుకోవాలి,” అంటూ ఆయన ఉత్సాహంగా జవాబు రాశాడు.
    ..................................

    పై విషయాలను చదివిన తరువాత నాకు కొన్ని సందేహాలు వచ్చాయండి.

    * పక్షులు కూడా పుల్లలను సేకరించి ఇల్లు ( గూడు ) కట్టుకుంటాయి కదా !
    ( మనుషులు రాళ్ళను సేకరించి ఇల్లు కట్టుకున్నట్లుగా. .)

    * చీమల్లో కూడా మనుషులకు ఉన్నట్లే కాలనీలు కూడా ఉంటాయట.
    వాటిలో రాణీ చీమలు, శ్రామిక చీమలు......ఇలాంటి వ్యవస్థ ఉంటుందట.

    * నీటి కోసం కూజాలో రాళ్ళు వేసి నీటిని పైకి తెప్పించి త్రాగిన కాకి కధ మనకు తెలుసు.
    ఒక కాకి , బిందెలో రాళ్ళు వేసి నీళ్ళు త్రాగటాన్ని తాము చూసామని ఈ మధ్య వార్తాపత్రికల్లో చదివానండి.

    * ఆరుబయట ఉండే కొళాయిలను కాకులు తమ ముక్కులతో తిప్పి నీరు త్రాగటానికి ప్రయత్నించటాన్ని నేను కూడా చూశాను.

    *నాకు వచ్చిన ఆలోచనలను చెప్పాలనిపించి వ్రాసాను. దయచేసి అపార్ధం చేసుకోవద్దండి.

     
  3. anrd గారు,
    మీ ప్రశ్నలు బావున్నాయి.

    పైన జేన్ గుడాల్ గమనించిన విషయం చింపాజీలు 'పనిముట్ల'ని వాడడం గురించి.


    ఒక వస్తువుని మరో వస్తువు మీద ప్రభావాన్ని చూపడానికి ఓ ఉపకరణంలా వాడడాన్ని 'పనిముట్ల వినియోగం' (tool use)అంటారు. జంతువులలో కనిపిస్తుంది కాని అది అరుదు. జంతువులలో కాస్త తెలివిగా కనిపించిన ప్రతీ ప్రవర్తన ఈ 'పనిముట్ల వినియోగం' కిందకి రాదు.

    మనకి కొంచెం కొవ్వు కనుక జంతువులకి తెలివి లేదనుకుంటాం గాని జంతువులతో చేసిన కొన్ని కొన్ని ప్రయోగాలు చూస్తే మనుషులు తల ఎక్కడపెట్టుకోవాలో తెలీని పరిస్థితి వస్తుంది!

    * పక్షులు కూడా పుల్లలను సేకరించి ఇల్లు ( గూడు ) కట్టుకుంటాయి కదా !
    ( మనుషులు రాళ్ళను సేకరించి ఇల్లు కట్టుకున్నట్లుగా. .)
    - ఇది 'పనిముట్ల వినియోగం' కిందికి వస్తుందో రాదో చెప్పడం కష్టంగా వుంది.


    * చీమల్లో కూడా మనుషులకు ఉన్నట్లే కాలనీలు కూడా ఉంటాయట.
    వాటిలో రాణీ చీమలు, శ్రామిక చీమలు......ఇలాంటి వ్యవస్థ ఉంటుందట.
    - ఇది తెలివైన ప్రవర్తనే కాని 'పనిముట్ల వినియోగం' కాదు.

    * నీటి కోసం కూజాలో రాళ్ళు వేసి నీటిని పైకి తెప్పించి త్రాగిన కాకి కధ మనకు తెలుసు.
    ఒక కాకి , బిందెలో రాళ్ళు వేసి నీళ్ళు త్రాగటాన్ని తాము చూసామని ఈ మధ్య వార్తాపత్రికల్లో చదివానండి.
    -ఇది కచ్చితంగా 'పనిముట్ల వినియోగమే.' ఎందుకంటే నీళ్ల కోసం రాళ్లని పనిముట్లుగా వాడుతున్నాయి. దీన్ని ఎక్కడైనా శాస్త్రీయంగా వర్ణించారేమో తెలీదు.


    * ఆరుబయట ఉండే కొళాయిలను కాకులు తమ ముక్కులతో తిప్పి నీరు త్రాగటానికి ప్రయత్నించటాన్ని నేను కూడా చూశాను.
    ఇక్కడ కొళాయికి, నీటి ప్రవాహానికి మధ్య 'కార్యకారణ' సంబంధాన్ని తెలుసుకున్నాయి కాకులు. ఇది 'పనిముట్టు వినియోగం' కిందకి వస్తుందో రాదో తెలీదు.

    *నాకు వచ్చిన ఆలోచనలను చెప్పాలనిపించి వ్రాసాను. దయచేసి అపార్ధం చేసుకోవద్దండి.

    -ఒక చిన్న వివరణ ఇచ్చుకోవాలి.
    సరదాగా సైన్స్ విషయాలని పంచుకోవడం, సైన్స్ సందేహాలని ఒకరినొకరు అడిగి తెలుసుకోవడం ఈ బ్లాగ్ లక్ష్యం.
    నిజాయితీగా ప్రశ్నలు అడగడం తప్పు కాదు, అందులో తప్పుపట్టవలసింది లేదు. నాకు తెలిస్తే చెప్తాను, లేదంటే తెలీదని చెప్తాను. అయినా అసలు సైన్స్ లో నాకు తెలిసింది చాలా తక్కువ. ఐనా ఈ బ్లాగ్ లో సమాధానాలు నేనే చెప్పాలని నియమం లేదు. బ్లాగర్లలో ఎవరైనా తెలిసినవాళ్లు చెప్పొచ్చు.

    సైన్స్ లో అహంకారాలకి, వ్యక్తిత్వాలకి స్థానం లేదు. అందుకే 'అపార్థం చేసుకోవడాలు', 'పుసుక్కున ఫీలయి పోవడాలు' మొదలైనవి ఇక్కడ నిషిద్ధం ;-)

     
  4. మీ సమాధానం గొప్పగా వుంది, సార్.

     
  5. anrd Says:

  6. సర్ ! నన్ను అపార్ధం చేసుకోనందుకు కృతజ్ఞతలండి.

    మీరు చెప్పినట్లు , పక్షులు గూళ్ళను కట్టడం ....'పనిముట్ల వినియోగం' కిందికి వస్తుందో రాదో... అని నాకు సందేహం వచ్చిందండి.
    అయితే , ఇల్లు కట్టే పని జరిగింది కదా ! అనుకున్నాను.

    చిన్నప్పుడు మా తాతగారి ఊరు వెళ్ళినప్పుడు చెట్లకు వ్రేలాడే పక్షుల గూళ్ళు చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉండేది. ఆ గూళ్ళు ఎంతో అద్భుతంగా ఉంటాయి.

    ఒక కాకి రాళ్ళను కూజాలో వేసి నీళ్ళు త్రాగటం గురించి , వార్తాపత్రికలో బొమ్మను కూడా వేసినట్లు గుర్తుందండి. అయితే, నేను ఆ పత్రికను భద్రపరచలేదు.

    ఈ విషయాల గురించి మరిన్ని వివరాల కోసం నెట్ లో చూస్తే కొన్ని వివరాలున్నాయి. నేను ఈ లింక్ లో చూసానండి.......Tool use by animals - Wikipedia,

     
  7. anrd Says:
  8. This comment has been removed by the author.  

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts