మేం ఉన్న చోట ఈ భూగర్భ సముద్ర తీరం ఓ చిన్న సహజ రేవులా ఏర్పడింది. ఓ అరగంట నడిచి రేవుకి అవతలి కొసని చేరుకునేసరికి అక్కడ హన్స్ పనిచేస్తూ కనిపించాడు. నాలుగు అడుగులు వేసి అతడు ఉన్న చోటికి చేరుకున్నాను. ఎదుట కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను. సగం పూర్తయిన తెప్ప మట్టిలో పడి వుంది. ఏదో చిత్రమైన కలపతో చెయ్యబడిందా తెప్ప. కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి, కొన్ని తీరైనవి, కొన్ని కొంకర్లు పోయినవి – ఇలా పెద్ద కట్టెల గుట్ట మట్టిలో పడి వుంది. వీటన్నిటిని వాడితే తెప్ప కాదు, ఓ చిన్న నౌకా దళాన్నే సిద్ధం చెయ్యొచ్చునేమో!
“మామయ్యా! ఏంటీ కలప?” అడిగాను.
“ఫిర్, పైన్, బిర్చ్ మొదలైన ఉత్తరాదికి చెందిన వృక్ష జాతికి చెందినది కావచ్చు. సముద్ర ప్రభావం వల్ల ఖనిజపూర్ణం అయ్యాయి. లిగ్నైట్ బొగ్గు లాంటిది ఇది. ఐస్లాండ్ లో ఎక్కువగా దొరుకుతుంది.”
“కాని ఇతర శిలాజ జాతి కలప లాగానే ఇది కూడా రాయిలా గట్టిగా ఉండాలిగా? మరి ఇది తేలుతుందా?” సందేహం వెలిబుచ్చాను.
“కొన్ని సార్లు జరుగుతుంది. ఈ కలప కొని సందర్భాలలో అసలు సిసలైన ఆంత్రసైట్ బొగ్గుగా మారుతుంది. కాని కొన్ని మాత్రం శిలాజ రూపాంతరీకరణ కార్యక్రమంలో మొదటి దశ లోనే ఆగిపోతాయి. ఇదుగో చూడు,” అంటూ ఓ కట్టెని తీసి నీట్లోకి విసిరాడు.
ఆ విసిరిన కట్టె ముందు నీట్లో బుడుంగున మునిగి అంతలోనే పైకి తన్నుకొచ్చి, పైకి కిందకి కాసేపు ఊగింది.
“ఇప్పుడు నమ్మకం కుదిరిందా?” మామయ్య అడిగాడు.
“నమ్మశక్యం కాకుండా ఉంది, కాని నమ్మక తప్పడం లేదు.”
మర్నాటి సాయంకాలాని కల్లా మా మార్గదర్శి నైపుణ్యం పుణ్యమా అని తెప్ప పూర్యయ్యింది. పది అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు వుంది. బలమైన త్రాళ్లతో కట్టెలన్నీ కలిపి కట్టబడ్డాయి. దాని తీరు తెన్నులు చూస్తే లీడెన్ బ్రాక్ సముద్రపు కెరటాల మీద సుస్థిరంగా ముందుకు దూసుకుపోగలదనే అనిపించింది.
(ముప్పై ఒకటవ అధ్యాయం సమాప్తం)
0 comments