అప్పుడు మావయ్య
కళ్ళద్దాలు పెట్టుకుని దాన్ని కాసేపు శ్రద్ధగా చూశాడు. కాని ఆ ‘కాసేపు’ నాకో యుగంలా
తోచింది.
“అవునవును!”
ఉత్సహంగా అరిచాడు మావయ్య. “ఓ పెద్ద తిరగేసిన శంకువు కనిపిస్తోంది. సముద్రపు ఉపరితలం
నుండి పైకొస్తోంది.”
“అది కూడా మరో
సముద్రపు మృగమా?”
“కావచ్చు.”
“అయితే మనం ఇంకా
పశ్చిమంగా ప్రయాణిద్దాం. ఎందుకంటే ఇలాంటి రాకాసులతో ఎలాంటి ప్రమాదాలు వస్తాయో మనకి
బాగా తెలుసు.”
“వద్దు. సూటిగా
ముందుకే పోదాం,” అన్నాడు మావయ్య.
నేను హన్స్ తో
నా బాధ విన్నవించుకోబోయాను. తను మాత్రం నిబ్బరంగా పడవను ముందుకే పోనిస్తున్నాడు.
ఆ మృగం నుండి
ప్రస్తుతం మేం ఉన్న దూరం నుండి… అంటే సుమారు పన్నెండు కోసుల దూరం నుండి… చూస్తున్నా
కూడా దాని తల మీద రంధ్రాల లోంచి పైకి ఎగజిమ్మబడుతున్న నీటి ధారలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటే
ఆ జంతువు నిజంగా చాలా పెద్దదై వుండాలి. బుద్ధి వున్న వాడైతే పలాయనం చిత్తగిస్తాడు.
కాని ఇంతవరకు మేమైతే అలాంటి బుద్ధిని ప్రదర్శించలేదు.
అలా బుద్ధి లేకుండా
నెమ్మదిగా ముందుకు సాగిపోయాం! ముందుకు సాగుతున్న కొద్ది ఆ నీటి ధారలు మరింత పెద్దవి
అవుతున్నాయి. అంత ఎత్తుకి, అంత మొత్తంలో నీటిని
ఎగజిమ్ముతోందంటే ఆ రాకాసి ఎంత పెద్దది అయ్యుండాలో?
రాత్రి ఎనిమిది
అయ్యేసరికి ఆ నీటి ధారలకి రెండు కోసుల దురానికి వచ్చేశాం. గుట్టలతో, మిట్టలతో మసక చీకటిలో
సముద్రం మీద చిన్న పాటి దీవిలా విస్తరించిందా మృగం. అది మా భ్రమా,భయమా? దాని వెడల్పు
రెండు వేల గజాలు ఉంటుందేమో. కూవియే, బ్లూమెన్ బాక్ లాంటి పండితులకి కూడా తెలీని ఇలాంటి
సిటేసియన్ జాతి జీవం ఏమై ఉంటుంది? నిశిరాతిర్లో నిద్దరోతున్నట్టు నిశ్చేష్టంగా వుందది.
కెరటాలు దాని అంచులని లయబద్ధంగా తాకుతున్నాయి. సుమారు ఐదొందల అడుగుల ఎత్తుకి లేస్తున్న
ఆ నీటిధార హోరుమని వర్షంలా కిందకి పడుతోంది. తుఫాను బాటలో తారట్లాడే వెర్రి వాళ్లలా,
రోజుకి నూరు తిమింగలాలని హాం ఫట్ చేసినా తృప్తి లేని ఆ సముద్ర రాక్షసి సమక్షంలో నించున్నాం.
నాకైతే వొంట్లో
వొణుకు పుడుతోంది. ఇక లాభంలేదు. ప్రొఫెసరు మీద యుద్ధం ప్రకటించి ఈ ఉన్మాదాన్ని ఆపాల్సిందే.
అంతలో హన్స్
ఉన్నట్లుండి లేచి నించుని ఆ మృగం కేసి వేలితో చూపిస్తూ,
“హోమ్” అని అరిచాడు.
“ద్వీపం!” అని
అరిచాడు మావయ్య.
“ఇది ద్వీపం
ఏంటి నా మొహం” బిత్తరపోతూ అన్నాను.
“అవును అది నిజంగా
ద్వీపమే,” అన్నాడు మావయ్య పగలబడి నవ్వుతూ.
“మరి ఆ నీటి
ధారలేంటి?”
“అదో గీసరు, వేణ్ణీటి బుగ్గ. ఐస్లాండ్ లో వున్న గీసర్ల
లాంటిదే ఇదీను.”
ద్వీపాన్ని చూసి
సముద్రపు రాకాసి అని భ్రమపడ్డ నా మూర్ఖత్వానికి నన్ను నేనే తిట్టుకున్నాను. ఇప్పుడు
వాస్తవం స్పష్టంగా కనిపిస్తోంది.
(ఇంకా వుంది)
గమనిక - ఈ సీరియల్ మొదటి నుండీ అనుసరిస్తున్న వారికి తెలిసి వుంటుంది. కాని కొత్తవారికి తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఇది జూల్స్ వెర్న్ రాసిన 'జర్నీ టు ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్' అనే నవలకి అనువాదం.
Great attempt
I feel Movie is not designed as it is on novel .
గత వారం రోజులనుంచీ ఏకధాటిగా చదివి, ఈరోజునకు కలవ గలిగాను.ఇకనుంచీ తదుపరి ఆర్టికల్ కోసం నిరీక్షించాలి.వర్ణించనలవికాని,అవ్యక్తానందభరితుడనైతిని.నడక,శైలి,వర్ణన మరియు సృజనాత్మకత అనితరసాధ్యం అనేటట్లు ఉన్నాయి.ఓ శాస్త్రవేత్త ,భాషాకోవిదుడైతే ఎలా ఉంటుందో మీ బ్లాగును చదివితే తెలుస్తుంది.
ఇంతకన్నా , ఎలా నా భావాన్ని వ్యక్తీకరించాలో తెలియడంలేదు. హ్యాట్సాఫ్..
మనఃపూర్వక ధన్యవాదాలు... ఇక నుండి కాస్త తరచుగా రాయడానికి ప్రయత్నిస్తాను.