ఆ సమయంలో అతడు మికెల్సన్-మార్లే ప్రయోగం యొక్క సమస్యని పరిష్కరించడానికి
ప్రయత్నించడం లేదు. బహుశ అతడు ఆ ప్రయోగం గురించి వినే వుండక పోవచ్చు. వేరే కారణాల వల్ల
అతడికి కాంతి శూన్యంలో ఎప్పుడూ ఒకే వేగంతో ప్రయాణిస్తుందని అనిపించింది. కాంతి చలన
దిశ ఏదైనా, దాన్ని పుట్టించే కాంతిజనకం కదులుతున్నా లేకున్నా, కాంతి మాత్రం శూన్యంలో
ఎప్పుడూ ఒకే వేగంతో ప్రయాణిస్తుంది. ఒక విధంగా శూన్యంలో కాంతి వేగం నిరపేక్షమైనది.
కాని ఆ నిరపేక్షం అనే ప్రత్యేక హోదా కాంతికి మాత్రమే చెల్లుతుంది.
ఇక తక్కిన వస్తువుల చలనాలు సాపేక్షాలు. ఒక వస్తువు యొక్క చలనాన్ని మరో వస్తువుకి సాపేక్షంగానే
వర్ణించగలం. ఒక్క కాంతి మాత్రమే ప్రత్యేకం. ఇది మన సామాన్య లౌకిక అవగాహన (common
sense) కి విరుద్ధంగా వుంది. అందుకే మొదట్లో
చాలా మంది ఐన్ స్టయిన్ పొరబడి వుంటాడని అనుకున్నారు.
కాంతి తీరు అలా ప్రత్యేకంగా వున్నట్లయితే దానికి ఎన్నో విచిత్రమైన
పర్యవసానాలు ఉంటాయని ఐన్ స్టయిన్ గణితపరంగా నిరూపించాడు. తదనంతరం ఐన్ స్టయిన్ ఊహించిన
పర్యవసానాలన్నీ నిజమేనని ప్రయోగాలలో తెలిసింది.
1905 నుండి శాస్త్రవేత్తలు
సాపేక్ష సిద్ధాంతాన్ని పరీక్షించేదుకు గాని వేలాది వేల ప్రయోగాలు చేశారు. ప్రతీ ప్రయోగం,
ప్రతీ పరిశీలన ఐన్ స్టయిన్ సిద్ధాంతం సరైనదని సమర్ధించింది.
ఐన్ స్టయిన్ యొక్క సాపేక్ష సిద్ధాంతం ప్రసాదించిన విశ్వదర్శనం
నిజమని ఇప్పుడు వైజ్ఞానిక లోకం ఒప్పుకుంటుంది.
కాంతి ‘క్వాంటం సిద్ధాంతం’
ని అనుసరించి ప్రవర్తిస్తుందని కూడా ఐన్ స్టయిన్ నిరూపించాడు. ఈ క్వాంటం సిద్ధాంతాన్ని
మొట్టమొదట ప్రతిపాదించి రూపొందించినవాడు జర్మన్ శాస్త్రవేత్త మాక్స్ ప్లాంక్
(1858-1947). ప్లాంక్ ఈ సిద్ధాంతాన్ని 1900
లో లోకానికి పరిచయం చేశాడు. కాంతికి తరంగ లక్షణాలే కాక, కణ లక్షణాలు కూడా వున్నాయని
ఐన్ స్టయిన్ ప్రతిపాదించాడు. అందుకే ఏ మాధ్యమమూ
లేని శూన్యంలో ప్రసారం అవుతోంది అన్నాడు. దాంతో ఈథర్ అవసరం తీరిపోయింది. లేదా అది అనవసరం
అని తేలింది. మికెల్సన్-మార్లే ప్రయోగం ఎందుకు విఫలమయ్యిందో అర్థమయ్యింది.
క్వాంటం సిద్ధాంతంలో ప్లాంక్ సాధించిన కృషికి అతడికి
1918 లో
నోబెల్ బహుమతి లభించింది. అదే రంగంలో ఐన్ స్టయిన్ సాధించిన విజయాలకి అతడికి
1921 లో నోబెల్ పురస్కారం లభించింది.
ఐన్ స్టయిన్ సిద్ధాంతానికి పర్యవసానంగా మరో విషయం కూడా బయటపడింది.
ద్రవ్యరాశి గల ఏ వస్తువూ కాంతి కన్నా వేగంగా ప్రయాణించలేదని ఆ సిద్ధాంతం చెప్తుంది. అంతేకాక కాంతి కన్నా వేగంగా
ఏ సందేశాలని పంపడానికి వీల్లేదని తెలిసింది.
అంత వరకు భౌతిక శాస్త్రంలో ఉండే ఎన్నో స్థిరాంకాలలో మరో స్థిరాంకంగా
పరిగణించబడే కాంతి వేగం ఓ ప్రత్యేకమైన ప్రాముఖ్యతని
సంతరించుకుంది. అదొక విశ్వజనీనమైన వేగమితి (speed limit) గా పరిణమించింది. ఆ పరిమితిని భేదించడానికి ఎవరి
తరమూ కాదు.
అంతవరకు మానవ చరిత్రలో మనుషులు ఇంకా ఇంకా దూరాలు చూడగలిగారంటే,
సంచరించగలిగారంటే దానికి కారణం వాళ్లు ఇంకా ఇంకా ఎక్కువ వేగాలు సాధించగలగడమే. ఒకప్పుడు
మనుషులు కాలినడకన నెమ్మదిగా ప్రయాణించేవారు. మనిషి గుర్రాల పెంపకం నేర్చుకున్నాక ఆ
వేగం పెరిగింది. అలాగే ఓడలు, పెట్రోల్ వాహనాలు, విమానాలు, రాకెట్లు – ఇలా ఎన్నో విధాలుగా
వేగాన్ని పెంచుతూ పోతున్నాడు మానవుడు.
మొదట్లో మనుషులకి ఖండాలు, సముద్రాలు దాటడానికి నెలలు పట్టేది.
అది క్రమంగా వారాలకి, రోజులకి, ప్రస్తుతం గంటలకి దిగింది. మూడు రోజుల్లో చందమామని చేరుకోగలిగే స్థితికి వచ్చాడు మనిషి.
ఇలాగే మనిషి వేగాన్ని పెంచుతూ పోతే ఒక దశలో మనకి అతి దగ్గరి
తారని మూడు రోజుల్లో చేరుకోగలడా?
లేదు. అది సాధ్యం కాదు. 4.27 ఏళ్ల కన్నా తక్కువ కాలంలో మనిషి మనకి సమీపతమ తారని
చేరుకోలేడు. ఆ తారని చేరుకుని తిరిగి రావాలంటే 8.54 సంవత్సరాల కన్నా తక్కువ కాలంలో సాధ్యం కాదు.
కనుక రైజెల్ తారని చేరుకోడానికి 815 ఏళ్ల కన్నా ఎక్కువ కాలమే పడుతుంది. అలాగే ఆ తారకి
వెళ్ళి తిరిగి రావాలంటే 1630 ఏళ్ల కన్నా ఎక్కువే
పడుతుంది. ఏం చేసినా ఇంత కన్నా తక్కువ సమయంలో ప్రయాణం పూర్తి చెయ్యడం సాధ్యం కాదు.
అలాగే గెలాక్సీ కేంద్రాన్ని చేరుకోవాలంటే 25,000 ఏళ్ల కన్నా తక్కువ కాలంలో చేరుకోవడం సాధ్యం కాదు.
అలాగే ఆండ్రోమెడా గెలాక్సీ ని 2,300,000 ఏళ్ళ
కన్నా తక్కువ కాలంలో చేరలేము. అదే విధంగా అతి దగ్గరి క్వాసార్ ని
1,000,000,000 ఎళ్ళ లోపు చేరలేము.
అయితే ఒకటి. ఐన్ స్టయిన్ సిద్ధాంతం మరో విచిత్రమైన సత్యాన్ని
కూడా ప్రకటిస్తుంది. వేగం పెరుగుతున్న కొద్ది అలా వేగంగా కదులుతున్న వస్తువు మీద, లేదా
ఆ వాహనంలో కాలం నెమ్మదిస్తుంది అని చెప్తుంది. ఇక కాంతి వేగానికి సమీప వేగంలో ప్రయాణించగలిగితే
కాలం ఇంచుమించుగా స్థంబించిపోతుంది. మీరు ఇంచుమించు కాంతి వేగంతో రివ్వున మనకి అతి
దగ్గరిలో వున్న క్వాసార్ దాకా వెళ్లి అదే వేగంతో తిరిగి రాగలిగితే మీకు మాత్రం ఆ ప్రయాణం
లిప్తలో జరిగిపోయినట్టు ఉంటుంది. కాని మీరు తిరిగి వచ్చేసరికి భూమి మీద
2,000,000,000
ఏళ్ళు గడచిపోయి వుంటాయి.
ఈ కారణం చేత విశ్వం పర్యటన యొక్క తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి.
తారలని చేరాలని బయలుదేరితే మాత్రం ఇక మానవజాతికి శాశ్వతంగా వీడ్కోలు చెప్పాల్సి ఉంటుందేమో.
ఎందుకంటే కాంతి వేగంలో కనీసం పదో వంతు వేగంతో ప్రయాణించలేకపోతే, తీరా తారని చేరేసరికి
అసలు మనం ఉంటామో లేదో సందేహమే.
గెలీలియో నుండి మికెల్సన్ వరకు కాంతి వేగాన్ని కొలవడానికి
పూనుకున్న మహామహులకి వాళ్లు కొలుస్తున్నది
మనని శాశ్వతంగా ఈ సౌరమండలానికే కట్టిపడేసే కారాగారం యొక్క కటకటాలని అని తెలీదు పాపం!
(కాంతి వేగం - సమాప్తం)
ఈ పోస్ట్ టైటిల్ 'ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతం' అని వుండాలి. పొరపాటు అయ్యింది.