“అవును ఏక్సెల్.
నువ్వు చెప్పింది నిజం. అంతా మన మంచికే. మన అదృష్టం బాగుండి నేలకి సమాంతరంగా సాగే ఆ
సముద్రాన్ని వొదిలిపెట్టాం. దాని కారణంగా మన గమ్యంతో సంబంధం లేకుండా ఇంతకాలం ఎటో ప్రయాణిస్తూ
వచ్చాం. కాని ఇప్పట్నించి కిందకి, ఇంకా ఇంకా కిందకి, చొచ్చుకుపోతాం. నీకు తెలుసా? భూమి
కేంద్రం నుండి ఇప్పుడు మనం కేవలం 1500 కోసుల
దూరంలో వున్నాం.”
“అంతేనా?” అరిచాన్నేను. “అదసలు ఒక విషయమే కాదు. పద అయితే బయల్దేరుదాం.”
మా మతిమాలిన
మాటలు ఇలా సాగుతుండగా ఇంతలో వేటగాడు ఎదురు పడ్డాడు. ప్రయాణానికి సన్నాహాలు పూర్తయ్యాయి.
మా సామగ్రి అంతా పడవ మీదకి ఎత్తించాం. తెర చాప ఎగిరింది. కేప్ సాక్నుస్సేం దిశగా పడవని
నడిపాడు హన్స్.
లోతు లేని నీటి
మీద ప్రయాణిస్తున్నప్పుడు గాలి ఎంత బలంగా వీస్తోంది అన్న విషయానికి పెద్దగా ప్రాముఖ్యత
ఉండదు. కొన్ని ప్రదేశాల్లో ఇనుపు మొనలు అమర్చిన కట్టెలతో పడవని ముందుకు తోయాల్సి వచ్చింది.
కొన్ని చోట్ల నీట్లో మునిగిన రాళ్లని తప్పించుకుంటూ ముందుకి సాగాల్సి వచ్చింది. అలా
ఓ మూడు గంటలు ప్రయాణించాక, మేం చేరుకోగోరిన ప్రదేశాన్ని చేరుకున్నాం. నేను తీరం మీదకి దూకాను.
మామయ్య, వేటగాడు కూడా వెంటే దిగారు. మా ముందున్న ప్రయాణాన్ని తలచుకుంటుంటే నా మనసంతా
ఉద్వేగంతో నిండిపోతోంది. మా బుల్లి పడవకి తిలోదకాలు వొదిలే సమయం వచ్చింది. తెప్పని
కాల్చేస్తే ఎలా ఉంటుందని మామయ్యని అడిగాను. కాని అందుకు మామయ్య ఒప్పుకోలేదు. తిరుగు
ప్రయాణం ఎలా వుంటుందో తెలియదుగా మరి!
“పోనీ కాస్త
తొందరగా కదులు.” నా తహతహని కప్పిపుచ్చుకోవడం కష్టంగా వుంది. “ఒక్క క్షణం కూడా వృధా
చెయ్యడానికి లేదు.”
“సరే, సరే. కాని
ముందు ఈ సొరంగం తీరు తెన్నులు ఒకసారి చూసుకోవాలి. మనకి నిచ్చెనలు అవసరం అవుతాయో లేదో
చూసుకోవాలి.”
పడవని తీరం మీదే
వొదిలేసి సొరంగం వైపు నడిచాం. మావయ్య రుమ్కోర్ఫ్ పరికరానికి (*) పని పెట్టాడు. గుహ
ముఖం మా నుండి ఇరవై గజాల దూరంలో వుంది.
(*ఇది ఒక రకమైన
‘portable lamp.’)
గుహ ద్వారం ఇంచుమించు
గుండ్రంగా వుంది. వ్యాసం ఐదు అడుగులు ఉండొచ్చు. కొండ లోతుల్లో సంభవించిన ఏదో విస్ఫోటం
వల్ల ఈ సొరంగం ఏర్పడినట్టుంది. ఆ విస్ఫోటపు పదార్థం గుహ గోడల మీద పూతలా ఏర్పడింది.
సొరంగం లోపలికి తీసుకుపోయే బాటలో పెద్దగా వాలు లేదు. కనుక సులభంగా లోపలికి ప్రవేశించాం.
కాని నాలుగు అడుగులు వేశామో లేదో మా బాటకి ఓ పెద్ద బండ అడ్డుపడింది.
“దరిద్రపు బండ!”
ఒళ్లుమండిపోయి తిట్టుకున్నాను.
దాని చుట్టు
పక్కల ఎక్కడైనా దాన్ని దాటి పోడానికి ఏవైనా సందు వుందేమోనని చూశాను. కాని ఫలితం లేకపోయింది.
దాటే మార్గం కనిపించలేదు.
నిస్పృహతో కింద
చతికిలబడ్డాను. మావయ్య నిస్సహాయంగా ఎప్పట్లాగే గుహలో ముందుకి వెనక్కి నడిచేస్తున్నాడు.
“ఈ బండ మనకే
దాపురించిందా? ఏం ఆ సాక్నుస్సేమ్ కి అడ్డుపడలేదా?” ఉక్రోషాన్ని అణుచుకుంటూ మావయ్యని
అడిగాను.
“అవున్నిజమే.
అతగాడికీ ఈ బండ అడ్డుపడి ఉండాలిగా?”
“లేదు” ఆలోచనగా అన్నాను. సాక్నుస్సేం దారికి ఈ బండ అడ్డుపడలేదు.
ఈ ప్రాంతాన్ని తరచు అతలాకుతలం చేసే ఏ అయస్కాంత తుఫాను ప్రభావం వల్లనో ఇది ఊడిపడి గుహ
ద్వారాన్ని మూసేసింది. కావాలంటే చూడు. గుహ
లోపలి కంకర గోడలలో ఏర్పడ్డ చీలికలు, పగుళ్ళు కాస్త అర్వాచీన కాలానికి చెందినట్టు
కనిపిస్తున్నాయి. ఎప్పుడో జరిగిన విస్ఫోటం వల్ల ఈ గుహ పైభాగంలోని రాళ్ళు విరిగి ఈ పెద్ద
బండ కింద పడింది. సాక్నుస్సేమ్ కి తారసపడని ఈ అవరోధాన్ని తొలగించలేకపోతే ఇక మన యాత్ర
ఇక్కడితో సమాప్తం అయినట్టే.”
(ఇంకా వుంది)
0 comments