విద్యుత్ ప్రేరణలకి మెదడు ఎలా స్పందిస్తుంది అన్న విషయంలో విల్డర్ పెన్ ఫీల్డ్
చేసిన అధ్యయనాలలో ఓ ముఖ్యమైన సత్యం బయటపడింది. మెదడులో క్రియల విస్తరణ ఎలా ఉంటుందో
తెలిపే అతి ముఖ్యమైన సత్యమది. మెదడులో ప్రత్యేక ప్రాంతాలు ప్రత్యేక శారీరక క్రియలని
నిర్వర్తిస్తున్నాయని పెన్ ఫీల్డ్ గుర్తించాడు.
ఉదాహరణకి ‘కదలిక’ అనే క్రియనే తీసుకుంటే
శరీరంలో కుడి భాగాన్ని మెదడులో ఎడమ భాగం శాసిస్తుంది. అంతే కాక చేతి వేళ్లని ఒక ప్రాంతం
శాసిస్తే, మోచేతిని మరో ప్రాంతం, అలాగే పాదాన్ని మరో ప్రాంతం ఇలా వివిధ ప్రాంతాలు శరీరంలో
వివిధ భాగాలని కదిలిస్తాయి. శరీరంలో కదలిక పుట్టించే మెదడు భాగాలన్నీ పక్కపక్కనే ఉంటాయి.
ఒక కంప్యూటర్ కీబోర్డ్ మీద ఒక్కొక్క కీని నొక్కితే తదనుగుణమైన అక్షరం కంప్యూటర్ స్క్రీన్
మీద కనిపించినట్టు, మోటార్ కార్టెక్స్ లో ఒక్కొక్క ప్రాంతాన్ని విద్యుత్తుతో ప్రేరణ
ఇస్తే, తదనుగుణమైన కదలిక శరీరంలో కనిపిస్తుంది. ఆ ప్రాంతాన్నే మోటార్ కార్టెక్స్ అంటారు.
అంటే మొత్తం శరీరానికి ఒక ‘మ్యాపు’ లాంటిది ఈ మోటార్ కార్టెక్స్ లో ఇమిడి వుందన్నమాట.
ఈ మ్యాపు యొక్క ఉజ్జాయింపు చిత్రాన్ని కింద చూడవచ్చు. వాస్తవంలో మోటార్ మ్యాపులు మరింత
సంక్లిష్టంగా వుంటాయి. ఈ మ్యాపులో కొంత వైరూప్యంగా ఉన్నా, ఒక విధమైన మానవాకారం కనిపిస్తోంది.
మెదడులో వుంటూ శరీరాన్ని అదిలిస్తున్న ఈ మానవాకార మ్యాపుకి homunculus అని పేరు పెట్టారు. Homunculus
అంటే బుల్లి మానవుడు అని అర్థం. అయితే శరీరం లోని వివిధ భాగాలకి, వాటిని అదిలించే
ఈ మ్యాపు లోని తత్సంబంధమైన ప్రాంతాలకి మధ్య సమ నిష్పత్తి లేదని గుర్తించాలి. ఉదాహరణకి
మెదడులో చేతిని, పెదాలని కదిలించే ప్రాంతాలు కాస్త విశాలంగా ఉంటాయి. కాని భుజాన్ని
కదిలించే ప్రాంతం కాస్త చిన్నగా ఉంటుంది. ఈ తేడాల దృష్ట్యా, అరిటాకులంత అరచేతులతో,
సన్నని చిన్న భుజాలతో, శరీరాన్ని కదిలించే
ఈ బుల్లిమానవుణ్ణి ఈ కింద కనిపించే చిత్రంలోని చిత్రమైన బొమ్మలతో వ్యక్తం చెయ్యడం పరిపాటి.
అలాగే మెదడు పక్క భాగాల్లో, టెంపొరల్ లోబ్ కి చెందిన కొన్ని
ప్రాంతాలని ప్రేరేపించినప్పుడు ఆ వ్యక్తికి ఎప్పుడో విన్న శబ్దాలు, పాటలు వినిపించాయట.
అయితే కొన్ని ప్రత్యేక బిందువుల వద్ద ప్రేరేపించినప్పుడు మాత్రమే శబ్దాలు వినిపించాయి.
పెన్ ఫీల్డ్ మరియు అతడి సహచరుల బృందం ఆ బిందువులని అంకెలతో సూచించారు. ప్రత్యేక అంకెలు
గల బిందువుల వద్ద ప్రేరేపించినప్పుడు ప్రత్యేక శబ్దాలు వినిపించాయి. సుమారు మూడు దశకాల
కాలంలో, వెయ్యికి పైగా ఇలాంటి శస్త్రచికిత్సలు
చేసిన పెన్ ఫీల్డ్ బృందం, వాటిలో కొన్ని ఆసక్తికరమైన కేసులని విపులంగా గ్రంథస్థం చేసింది.
ఉదాహరణకి బిందువు #23 ని ప్రేరేపించినప్పుడు
ఒక వ్యక్తికి white Christmas అనే పాట వినిపించింది.
మరో పేషెంట్ కి ఎప్పుడు సీజర్ వచ్చినా ‘hush-a-bye, my baby’ అనే చర్చి పాట వినిపించేది.
అదే వ్యక్తికి టెంపొరల్ లోబ్ లో ప్రేరేపిస్తే సంగీతం వినిపించింది. మెదడుని ప్రేరేపించినప్పుడు
కొంత మంది ఏదో సంగీతం వినిపిస్తోంది అంటారు గాని, అదేంటో స్పష్టంగా చెప్పలేకపోతారు.
ఉదాహరణకి అలాంటి ‘మెదడు సంగీతం’ విన్న ఒక స్త్రీ - “అదేదో చిత్రంగా వుంది. జోలపాట కాబోలు… అప్పుడప్పుడు
రేడియోలో వస్తుంటుంది… ఏదో పిల్లల ప్రోగ్రాంలో ఈ పాట వస్తుంది అనుకుంటా” అంది. మరో పేషెంట్ విషయంలో ఆమె తల్లి, తండ్రి కలిసి ఏదో
మాట్లాడుకుంటున్నట్టు, మాటల మధ్యలో ఏవో క్రిస్మస్ కారొల్స్ పాడుకుంటున్నట్టు అనిపించింది.
మెదడు పొరల్లో గత స్మృతులు ఎలా దాగి వుంటాయో తెలిపే అద్భుత ప్రప్రథమ ప్రయోగాలివి.
ఆ విధంగా విల్డర్ పెన్ ఫీల్డ్ అధ్యయనాల వల్ల మెదడులో సమాచారం
మ్యాపుల రూపంలో ఎలా ఏర్పాటై వుందో తెలిసింది. ఆ మ్యాపులలో ప్రత్యేక భాగాలు, శరీరంలో
ప్రత్యేక భాగాలని శాసించినడం వల్ల పెన్ ఫీల్డ్ అధ్యయనాలు ప్రాంతీయతా వాదాన్నే సమర్ధిస్తున్నట్టు
అనిపించింది.
తదనంతరం, మెదడులో భాష ఎలా ఉత్పన్నం అవుతుందో తెలిపుతూ ఫ్రెంచ్ నాడీ వైద్యుడు పాల్ బ్రోకా చేసిన అధ్యయనాలు కూడా ఈ ప్రాంతీయతా వాదాన్నే సమర్థిస్తున్నట్టు అనిపించింది.
(ఇంకా వుంది)
0 comments