నాకు బాగా నచ్చిన, ఒక దశలో బాగా ప్రభావితం చేసిన సైన్స్ ఫిక్షన్
సినిమాలలో ‘కాంటాక్ట్’ ఒకటి.
రచయిత, శాస్త్రవేత్త కార్ల్ సాగన్ రాసిన ‘కాంటాక్ట్’ నవల ఆధారంగా
తీసిన సినిమా ఇది.
ప్రఖ్యాత ‘కాస్మాస్’ అనే టీవీ సీరియల్ కి కర్తగా కార్ల్ సాగన్ పేరు చాలా మంది వినే వుంటారు. ‘Broca’s brain,’ ‘Dragons
of the Eden’ మొదలైన గొప్ప పాపులర్ సైన్స్ పుస్తకాల రచయితగా కూడా చాలా మందికి సాగన్
పరిచయస్థుడే.
సైన్స్ భావాలని సమాజానికి అందజేసి, ప్రజలలో శాస్త్రీయ దృక్పథం
పెంచే దిశగా చేసిన కృషి వల్ల సాగన్ పేరు నలుగురికీ తెలిసిన మాట నిజమే అయినా, కేవలం
సైన్స్ ప్రచారకుడిగా మాత్రమే కాక కార్ల్ సాగన్ ఒక శాస్త్రవేత్తగా కూడా తనకంటూ ఒక సముచిత
స్థానాన్ని సంపాదించాడు.
ఒక దశలో కార్నెల్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేసిన
సాగన్, Search for Extraterrestrial intelligence (SETI) అనే ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం వహించాడు. భూమి మీద
కాకుండా విశ్వంలో ఇతర ప్రదేశాలలో ప్రజ్ఞగల జీవులు ఉంటారన్న నమ్మకం మీద ఆధారపడ్డ ఈ ప్రాజెక్ట్
లక్ష్యం అలాంటి జీవుల ఉన్కిని కనిపెట్టడమే. విశ్వంలో విపరీతమైన దూరాల మీదుగా జీవులు
ఒకరికొకరు సందేశాలు పంపుకోడానికి రేడియో సంకేతాలు అనువైన మాధ్యమాలు అని నమ్మినవారిలో
సాగన్ ఒకడు. ఆ నమ్మకం ఆధారంగా విశ్వంలో పలు మూలాల నుండి వచ్చే రేడియా సంకేతాలని పట్టుకుని,
అందులో ప్రజ్ఞని వెల్లడి చేసే అంశాలు ఏవైనా వున్నాయో లేదో తెలుసుకునే ఉద్దేశంతో విశ్లేషించే
ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. అయితే అలాంటి ప్రయత్నాల
వల్ల కచ్చితమైన, ఫలితాలేవీ రాలేదు.
కాని అలాంటి ప్రయత్నమే ఫలిస్తే ఎలా వుంటుంది? అన్న అవకాశానికి
మూర్తి రూపాన్నిస్తూ రాసిన నవల, తీసిన సినిమా కాంటాక్ట్.
కథానాయిక ప్రధాన పాత్రగా గల ఈ సినిమాలో ముఖ్య పాత్ర పేరు డాక్టర్
ఎలియనోర్ ఆరోవే (Dr. Eleanor Arroway). (క్లుప్తంగా ఎల్లీ అంటారు). మేటి హాలీవుడ్ తార
జోడీ ఫోస్టర్ మరెవరూ ఈ పాత్ర పోషించలేరేమో నన్నంత గొప్పగా ఈ పాత్ర పోషించిందని నాకు
అనిపించింది.
ఎల్లీ కి చిన్నప్పుడే తల్లి చనిపోతుంది. తండ్రి మళ్లీ పెళ్ళి
చేసుకోకుండా కూతురే సర్వస్వం అన్నట్టుగా కూతుర్ని పెంచుతాడు. ముఖ్యంగా చిన్నప్పట్నుంచి
కూతురిలో శాస్త్రీయ దృక్పథాన్ని జాగ్రత్తగా పోషిస్తాడు. చిన్నప్పుడు సరదాగా HAM
Radio club లో చేరుతుంది ఎల్లీ. అలా రేడియో
సంకేతల్తో తనకి తొలి పరిచయం ఏర్పడుతుంది. అలాగే దూరదర్శినిలో ఖగోళాన్ని పరిశిలించే
అలవాటు కూడా తండ్రి నుండే అబ్బుతుంది.
“చీకటి ఆకాశంలో ఇంపుగా మెరుస్తుంటుందని ఆ గ్రహానికి సౌందర్య
దేవత వీనస్ పేరు పెట్టారు. కాని ఆ గ్రహం సల్ఫురిక్ ఆసిడ్ వర్షాలతో, నిప్పులు చెరిగే
ఉష్ణోగ్రతతో పరమ భయంకరంగా ఉంటుందని విన్న మరుక్షణం నేను ఖగోళ శాస్త్రం అంటే ప్రేమలో
పడిపోయాను,” అని పెద్దయ్యాక ఒక సన్నివేశంలో
తనకి అప్పుడే పరిచయం అయిన పామర్ జాస్ తో చెప్తుంది ఎల్లీ.
తన చిన్నతనంలో జరిగిన ఓ సన్నివేశం, తన వ్యక్తిత్వంలో లోతుగా
నాటుకున్న శాస్త్రీయ దృక్పథానికి అద్దం పడుతుంది. ఒక రోజు గుండెపోటుతో తన తండ్రి ఉన్నట్లుండి
చనిపోతాడు. అర్చకుడు వచ్చి చివరి కర్మలన్నీ చేస్తాడు. తల్లి దండ్రులు లేకుండా ఒంటరిగా
మిగిలిపోయిన ఆ పాపని చూసిన ఏమనాలో తెలీక ఓదార్పుగా
ఇలా
అంటాడు – “భగవంతుడి లీలలు అన్నీ మనకి అర్థం కావు. కాని వాటిలో ఏదో మంచి వుందని అనుకుని
ఊరుకోవాలంతే.”
అది విన్న ఆ పాపకి మండిపోతుంది. నిష్టూరంగా ఓ సారి అర్చకుడి
కేసి చూసి, “నాన్నగారి (గుండెకి సంబంధించిన) మందులు కొన్ని కింద అంతస్థులో కూడా కొన్ని
ఉండుంటే సకాలంలో వాటిని అందుకోగలిగి ఉండేదాన్ని,” అంటుంది... ఇంత మాత్రం దానికి దేవుడు,
దెయ్యం అంటూ కంటికి కనిపించని విషయాల ప్రస్తావన అనవసరం అన్న ధోరణిలో!
పై చదువులు పూర్తి చేసిన ఎల్లీ రేడియా ఖగోళ శాస్త్రవేత్త అవుతుంది. విశ్వం నుండి
వచ్చే రేడియో సంకేతాలని విశ్లేషించడం ఈమె పని. కాల్టెక్ విశ్వవిద్యాలయం నుండి పీ.హెచ్.డి.
పొందిన ఈమె పోర్టో రికోలోని ‘అరెసిబో రేడియో
దూరదర్శిని (Arecibo Radio Telescope) ని వాడుకుంటూ, SETI ప్రాజెక్ట్ లో భాగంగా విశ్వసంకేతాల అధ్యయనం మొదలుపెడుతుంది.
ఎల్లీ అక్కడ పని చేసే రోజుల్లో ప్రొఫెసర్ డేవిడ్ డ్రమ్లిన్
ఆ పరిశోధనశాలని సందర్శిస్తాడు. ఇతగాడు అమెరికా అధ్యక్షుడికి ‘వైజ్ఞానిక సలహాదారు’గా
ఉంటాడు. (ఇటీవల భారత రత్న అందుకున్న మన సి.ఎన్. ఆర్. రావు గారి తరహా అన్నమాట). ఈ డ్రమ్లిన్
కి SETI వంటి కార్యక్రమాల మీద పెద్దగా నమ్మకం లేదు. కనుక SETI ప్రాజెక్ట్ కి మంజూరు అయిన సొమ్ముని రద్దు చేస్తాడు.
“ఎందుకిలా చేశార?” అని ఆ పెద్దమనిషిని నిలదీస్తే, “చూడు ఎల్లీ! ఇలాంటి పనికిమాలిని
ప్రాజెక్ట్ లు చెయ్యడం ఓ శాస్త్రవేత్తగా నీ భవిష్యత్తుకి మంచిది కాదు. నీ మంచికే చెప్తున్నాను,”
అని ఏదో సర్ది చెప్పబోతాడు. “నా బతుకు, నా ఇష్టం. మధ్యన మీ కేంటి?” అని శివంగిలా విరుచుకుపడుతుంది.
కాని నియంత లా పని చేసే డ్రమ్లిన్ తన నిర్ణయం మార్చుకోడు.
మనసుకి నచ్చిన బాటలో
జంకు గొంకు లేకుండా ముందుకి దూసుకుపోవడం తప్ప మరొకటి తెలీని ఎల్లీ, తన పరిశోధనకి కావలసిన
ధన సహాయం కోసం ప్రైవేట్ సంస్థలని ఆశ్రయిస్తుంది.
(ఇంకా వుంది)
0 comments