అలా ధనసహాయం కోసం ఎల్లీ ఆశ్రయించిన సంస్థల్లో ఎస్. ఆర్. హాడెన్
ఇండస్ట్రీస్ కూడా వుంది. ఒక నిపుణుల బృందం ముందు తన ప్రాజెక్ట్ గురించి వర్ణిస్తుంది.
అది విన్న బృందం అది సైన్స్ కన్నా సైన్స్ ఫిక్షన్ లాగా వుందని పెదవి విరుస్తారు. కాని
ఎల్లీ ప్రెజెంటేషన్ ని దూరం నుండి రహస్యంగా గమనిస్తున్న సంస్థ అధినేత ఎస్. ఆర్. హాడెన్
ఆ ప్రాజెక్ట్ ని ఆమోదించి ధనం మంజూరు చేస్తాడు.
ఆ ధనంతో న్యూ మెక్సికో లోని Very Large Array (VLA) (చూడు చిత్రం) లో ని రేడియో టెలిస్కోప్ లని వాడుకోడానికి సమయం
కొనుక్కుని మరో ముగ్గురు గల బృందంతో పని మొదలుపెడుతుంది.
రేడియో సంకేతాలని పరిశీలించే ప్రయత్నంలో ఎల్లీకి ఓ చిత్రమైన
అలవాటు ఉంది. ఆ సంకేతాలని audio frequencies
కి బదిలీ చేసి వాటిని హెడ్ ఫోన్స్ తో వింటూ ఉంటుంది. (అయితే స్వతహాగా ఆ సంకేతాల
frequency మెగా హెర్జ్ లో వుంటుంది. వాటిని విశ్లేషించే పనిని మామూలుగా కంప్యూటర్లకి అప్పజెప్పేస్తారు.) అలా ఓ రోజు VLA
ప్రాంతంలో ఆరుబయట కూర్చుని ఆ సంకేతాలని వింటుండగా ఉన్నట్లుండి ఆగాగి స్ఫోటాల
(bursts) లాగా శబ్దాలు వినిపిస్తాయి. మామూలుగా విశ్వం నుండి వచ్చే సహజ రొద తో పోల్చితే
ఈ శబ్దాలు చాలా భిన్నంగా తోస్తాయి ఆ శాస్త్రవేత్తకి.
వెంటనే కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి తన బృందానికి ఆ సంకేతాలు
వస్తున్న దిశ యొక్క వివరాలు చెప్పి వెంటనే రికార్డ్ చెయ్యమని ఆదేశాలు ఇస్తుంది. ఇంకా
వివరంగా ఆ శబ్దాలని విశ్లేషిస్తుంటే ఆ శబ్దాలలో ఓ క్రమం ఉండడం కనిపిస్తుంది. మొదట ఒక
స్ఫోటం, కాసేపు అయ్యాక మరొకటి, మరి కాస్త నిశ్శబ్దం తరువాత వరుసగా రెండు, కాసేపయ్యాక
వరుసగా మూడు, తరువాత నాలుగు వదిలి అయిదు, తరువాత ఏడు, పదకొండు…
అలా ఆ సంకేతాలని విశ్లేషిస్తూ పోతే అవి ప్రధాన సంఖ్యలని (prime
numbers) ని సూచిస్తున్నాయని ఎల్లీ గుర్తిస్తుంది.
తారలలో జరిగే సహజ చర్యల లోంచి పుట్టే సంకేతాలు ప్రధాన సంఖ్యల రూపంలో ఉండడం ఇంచుమించు
అసంభవం. అలాంటి సంకేతం ఎవరో ప్రజ్ఞ గల జీవులే పంపి వుండాలి.
ఆ రేడియో సందేశాల స్రవంతిని ఇంకా ఇంకా విశ్లేషిస్తూ పోతే అందులో
ఓ తెలుపు-నలుపు టీవీ ప్రోగ్రాం రహస్యంగా ఇమడ్చబడి వున్నట్టు తెలుస్తుంది. చూడబోతే అది
1936 లో హిట్లర్ బెర్లిన్ ఒలింపిక్స్ సందర్భంగా
ఇచ్చిన ఉపన్యాసానికి సంబంధించిన ప్రోగ్రాం.
ఎల్లీ బృందానికి ముందు ఏం జరుగుతోందో అర్థం కాదు. కాస్త ఆలోచించాక
ఎల్లీ మనసులో ఒక వివరణ స్ఫురిస్తుంది. 1936
లో భూమి నుండి వెలువడ్డ టీవీ ప్రోగ్రామ్ కి చెందిన సందేశాలని ఎవరో గుర్తుపట్టి,
వాటిని రికార్డ్ చేసి, తిరిగి ప్రసారం చేశారు. ఆ సందేశాలు తిరిగి అందింది, అంటే కథా
కాలం, 1986. సందేశాలు ఆ తారని చేరుకుని తిరిగి భూమికి రావడానికి యాభై ఏళ్లు పట్టింది
అన్నమాట. అంటే ఆ తార 25 కాంతి సంవత్సరాల దూరంలో
వుందన్నమాట. సందేశాలు వస్తున్న దిశని బట్టి చూస్తే ఆ తార Vega అనే తార అని తేలుతుంది.
(ఈ తారనే భారతీయ ఖగోళ విజ్ఞానంలో ‘అభిజిత్’ అంటారు. ఈ సంగతి
కార్ల్ సాగన్ తన నవల్లో పేర్కొంటాడు.)
వేగా నుండి వచ్చే సందేశ స్రవంతిలో తవ్వగా తవ్వగా ఇంకా ఎంతో
సమాచారం బయటపడుతుంది. ఏవో విచిత్రమైన చిహ్నాలు కనిపిస్తాయి. కొన్ని పదుల వేల పేజీల
సమాచారం వుంటుంది. కొన్ని కొన్ని పేజీల అంచుల బట్టి అవి ఒక దాంతో ఒకటి ఏదో విధంగా అతుకుతాయని
అనిపిస్తుంది. కాని కచ్చితంగా ఎలా అతుకుతాయో ఎల్లీ తేల్చుకోలేక పోతుంది.
అనుకోకుండా అతి వేగంగా వచ్చిన ఈ అనుభవాలకి ఎల్లీ ఉక్కిరిబిక్కిరి
అవుతుంది. చిన్ననాటి నుండి తను అన్వేషిస్తున్న లక్ష్యం ఒక్కసారిగా ఎక్కణ్ణుంచో ఊడి
ఒళ్లో పడ్డట్టు అయ్యింది. కాని ఆ సందేశాలని డీకోడ్ చెయ్యడానికి సాధ్యం కావడం లేదు.
అలా ఆలోచిస్తూ కాస్త దిగాలుగా ఇంటికి చేరుకున్న ఎల్లీకి ఇంట్లో
తన కోసం ఓ ఫాక్స్ ఎదురు చూస్తూ వుంటుంది.
(ఇంకా వుంది)
0 comments