అధ్యాయం 44
మధ్యధరా సముద్రపు
సుమధుర తీరంపై
నాకు మళ్లీ తెలివి
వచ్చేసరికి మా గైడు ఒక చేత్తో నా బెల్టు పట్టుకుని వున్నాడు. మరో చేత్తో మావయ్యని కాస్తున్నాడు.
నాకు తీవ్రమైన గాయాలేం తగల్లేదు గాని చర్మం బాగా చెక్కుకుపోయింది. చుట్టూ చూసుకుంటే
అగ్నిపర్వత బిలానికి కేవలం రెండు గజాల దూరంలో కొండ వాలు మీద పడి వున్నాను. కాస్త పక్కకి
జారి వుంటే మళ్లీ అగ్నిపర్వత బిలంలో పడి నామరూపాల్లేకుండా మాయపైపోయి వుండేవాణ్ణి.
“ఇంతకీ ఎక్కడ
పడ్డాం మనం?” మావయ్య చిరగ్గా అన్నాడు చుట్టూ చూస్తూ. ఆ చిరాకు ఎవరి మీద? దేని కోసం?
హాయిగా ఆ పాతాళంలో దేవుళ్ళాడక మళ్లీ ఈ భూమ్మీద పడ్డామేంటని కోపమా?
తెలీదన్నట్టు
తల అడ్డుగా ఊపాడు హన్స్.
“ఐస్లాండా?”
“నెజ్” అన్నాడు
హన్స్ నిశ్చయంగా. ఐస్లాండ్ మాత్రం కాదన్నమాట.
“ఏంటీ! ఐస్లాండ్
కాదా?” ఆశ్చర్యంగా అడిగాడు మావయ్య.
“హన్స్ పొరబడి
వుంటాడు,” నెమ్మదిగా పైకి లేచి దుమ్ము దులుపుకుంటూ అన్నాను.
మా అద్బుత, అలౌకిక
యాత్రకి ఇదో కొసమెరుపు. ఎక్కడో ఉత్తర ప్రపంచంలో, ఆకాశాన్నంటే హిమవన్నగాలచేత పరివేష్టితమైన
తెల్లని మంచు భూముల మీద ఎక్కడో పైకి తేలతాం అనుకున్నాను. కాని చర్మాన్ని కాల్చేసే వాడి
రవికిరణాల కింద వ్రేలిపోతూ ఇలా ఓ కొండ వాలు మీద దిగబడతాం అని కల్లో కూడా ఊహించలేదు.
చుట్టూ నిండి
వున్న కాంతికి కళ్లు బైర్లు క్రమ్ముతున్నాయి. ఆ వెలుగుకి అలవాటు పడి చుట్టూ ఏవుందో
అర్థం చేసుకోడానికి కొంత సమయం పట్టింది. నాకైతే మేం చేరుకున్నది కచ్చితంగా స్పిట్జ్‍బెర్గెన్
దీవేనని అనిపిస్తోంది.
నా ఆలోచనలని
చెదరగొడుతూ మావయ్య అన్నాడు –
“ఇది ఐస్లాండ్
లాగా అనిపించడం లేదు.”
“పోనీ ఇది యాన్
మాయెన్ దీవి అయ్యుంటుందా?” అడిగాన్నేను.
“అది కూడా కాదు,”
మావయ్య బదులిచ్చాడు. “ఇదసలు ఉత్తర ప్రాంతంలో వుండే కొండే కాదు. ఇక్కడ మంచు శిఖరాలు
లేవు. ఏయ్ ఏక్సెల్, అటు చూడు!”
మా నెత్తి మీద
ఐదొందల అడుగున పైన అగ్నిపర్వతం యొక్క నోటి అంచు కనిపిస్తోంది. అందులోంచి పది పదిహేను
నిముషాల కొకసారి అగ్నిధారలు ఎగసెగసి పడుతున్నాయి. అగ్నిపర్వతం నోట్లోంచి రగిలే లావా
ద్రవం అంత ఎత్తుకి ఎగజిమ్మబడుతోంది. కొండ వాలు మీదుగా అగ్నిద్రవపు సెలయేళ్లు ప్రవహిస్తున్నాయి.
కాని కొండ దిగువన అంతవరకు కనిపించని పచ్చని చెట్ల గుబుళ్ళు కనిపించాయి. ఆలివ్, అత్తిపండు,
ద్రాక్ష మొదలైన చెట్ల ఆనవాళ్లు స్పష్టంగా తెలుస్తున్నాయి.
ఇది ససేమిరా
ఆర్కిటిక్ మాత్రం కాదు.
ఈ పచ్చని పరిసరాల
కావల విశాల, వీనీల జలాశయమేదో కనిపించింది. కేవలం కొద్దిపాటి కోసుల మేరలో ఆ జలాశయం కొండని
కౌగిలిస్తోంది. కాస్త తూర్పు దిశగా చూస్తే ఓ ముద్దులొలికే చిన్నారి రేవు ఏదో కనిపిస్తోంది.
చిత్రమైన నిర్మాణం గల ఓడలేవో పడి లేచే కెరటాల
మీద అక్కడ ఊయలలాడుతున్నాయి. అల్లంత దూరంలో ఎన్నో చిట్టి చిట్టి ద్వీపాలు విశాలమైన నీలి
నీటి మైదానం మీద చుక్కల్లా మెరిసిపోతున్నాయి. కాస్త పశ్చిమంగా చూస్తే ఏవో సుదూర తీరాలు
నింగి నేల కలిసేచోట మసక వెలుగులో లీలగా గోచరిస్తున్నాయి. ఇంకా దూరాన వున్న మరో తీరం
మీద ఓ గంభీరమైన హిమవన్నగం మేఘమండలాన్ని ఛేదిస్తోంది. ఉత్తరంగా అనంతంగా విస్తరించిన
మహార్ణవం మీద మహోగ్ర భాను కిరణాలు పడగా నీటిపై
ఓ అద్భుత రశ్మి రహదారి ఏర్పడింది. ఆ దారిని
కోసుకుంటూ అప్పుడప్పుడు ఓ ఓడ తెల్లని రెపరెపలాడే తెరచాపల ప్రోద్బలానికి ఠీవిగా నీటి
దారుల వెంట ముందుకు సాగిపోతోంది.
పాతాళ లోకపు
చీకటి కూపాల్లో ఇంతకాలం కొట్టుమిట్టాడిన మేము ఇలాంటి దృశ్యం చూడడానికి కళ్ళు కాయలు
కాచి వున్నాము.
0 comments