ఆ మర్నాడు అంటే
గురువారం, ఆగస్టు 27 వ తారీఖు, మా పాతాళ యాత్రలో
ఓ మరపురాని దినం. దాన్ని తలచుకున్నప్పుడల్లా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒళ్లు జలదరిస్తుంది.
ఆ క్షణం నుండి ఇక వివేచన, వివేకం, ప్రతిభ, నైపుణ్యం వంటి పదాలకి అర్థం లేకుండా పోయింది.
ఎందుకంటే ఆ క్షణం నుండి విధి చేతిలో ఆటబొమ్మలం. విధి అనే ప్రవాహంలో కొట్టుకుపోయే ఎండుటాకులం.
ఉదయం ఆరు గంటలకల్లా
లేచి, తయారై పన్లోకి దిగాం. మా దారికి అడ్డుగా వున్న బండని బద్దలుకొట్టే పన్లోకి దిగాం.
వత్తిని వెలిగించే
సువర్ణావకాశం నాకిమ్మని వేడుకున్నాను. వత్తిని వెలిగించగానే వేగంగా మా తెప్పనెక్కి
ఆ ప్రాంతం నుండి వీలైనంత దూరంగా జరిగిపోవాలని ఉద్దేశం. ఎందుకంటే ఆ విస్ఫోటంలో దారికి అడ్డుగా వున్న బండ మాత్రమే
బద్దలవుతుందన్న నమ్మకం ఏమీ లేదు.
వత్తి పది నిముషాల
పాటు కాలిన తరువాతే మందుపాతరకి నిప్పు అంటుకునేలా ఏర్పాటు చేశాం. తెప్పరిల్లి తప్పని
చేరుకోడానికి ఆ మాత్రం సమయం చాలు.
మావయ్య, హన్స్
అప్పటికే తెప్ప ఎక్కి కూర్చున్నారు. ఒక లాంతరు పట్టుకుని నేను వత్తిని సమీపించాను.
మావయ్య వాచీ
చేతిలో పట్టుకుని “రెడీయేనా?” అని అరిచాడు.
“ఆc!” అని బదులుగా అరిచాను.
వత్తిని అంటించి
అది చిటపటలాడుతుంటే నేను తెప్ప దిక్కుగా పరుగు అందుకున్నాను.
నేను ఎక్కగానే
తెప్ప కదిలింది. నూట ఇరవై అడుగుల దూరం నీట్లోకి ప్రవేశించింది.
“మరో ఐదు నిముషాలు,”
అన్నాడు మావయ్య.
“రెండు… ఒకటి…
పగిలిపో పాషాణమా!” గట్టిగా అరిచాడు మావయ్య.
ఆ క్షణం ఏం జరిగిందో
కాసేపు అర్థం కాలేదు. విస్ఫోటం జరిగిన చప్పుడు పెద్దగా వినిపించినట్టులేదు. పెద్ద పెద్ద
బండలతో కూర్చబడ్డ విశాలమైన గోడలా అంత ఎత్తున వున్న ఆ నిర్మాణం మా
కళ్ళ ఎదుట తెర తెగ పడ్డట్టు నేల జారింది. తీరం మీద నేల చీలి లోతు తెలియని ఓ నల్లని
మహాబిలం మా ఎదుట తెరుచుకుంది. సముద్రం ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచి ఆ తెరుచుకున్న నేల
నోట్లోకి ప్రవహించసాగింది. ఆ నీటి చెరియకి అంచున ప్రమాదకరంగా వేలాడుతున్న మా బుల్లి
తెప్ప ఇక విధి లేకుండా నిస్సహాయంగా ఆ మహాబిలం లోకి దూసుకుపోసాగింది.
ముగ్గురం బల్లుల
లాగా ఆ తెప్ప మీద కింద అతుక్కుపోయాం. కళ్లు మూసి తెరిచే లోగా కన్ను మిన్ను కానరాని
అగాధంలో పడి ఎటో కొట్టుకుపోతున్నాం. మావయ్య ఏదో అడగాలని అరిచాను. కాని చెవులు చిల్లులు
పడే ఆ ప్రళయ భీకర ఘోషలో నా మాట నాకు వినిపించడమే కష్టంగా వుంది.
అలాంటి పరిస్థితుల్లో
కూడా నా మెదడులో ఆలోచనలు వేగంగా పరుగులు పెడుతున్నాయి. ఏం జరిగిందో మెరుపులా మనసులో
మెదిలింది.
0 comments