శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

పాతాళ ప్రయాణం ముగిసింది

Posted by శ్రీనివాస చక్రవర్తి Wednesday, June 25, 2014
“అరె! పిల్లాడు,” ఎగిరి గంతేస్తూ అరిచాను. “మరో మనిషి!”

చూడడానికి ఎవరో పేద పిల్లాడిలా వున్నాడు. చింకి బట్టలు వేసుకున్నాడు. ముఖం కాస్త దీనంగా వుంది… మాలాగ. మమ్మల్ని చూసి దొంగలు అనుకున్నాడో ఏమో. కాస్త భయపడుతున్నట్టు వున్నాడు.
అంతలో హన్స్ వేగంగా ముందుకి రెండు అడుగులేసి ఆ పిల్లవాణ్ణి రెక్క పట్టుకుని మావద్దకి లాక్కొచ్చాడు.
మావయ్య ఆ పిల్లవాడితో అనునయిస్తున్నట్టుగా మాట్లాడుతూ శుద్ధమైన జర్మన్ లో ఇలా అడిగాడు –
Was heiszt diesen Berg, mein Knablein? Sage mir geschwind!"
(ఈ కొండ పేరేంటి నేస్తం? తొందరగా చెప్పు.”)
పిల్లాడు నోరు మెదపలేదు.
“అంటే మనం వున్నది జర్మనీ కాదన్న మాట,” మావయ్య మాకేసి చూసి అన్నాడు.
ఈ సారి మళ్ళీ అదే ప్రశ్న ఇంగ్లీష్ లో అడిగాడు. మళ్లీ అదే మౌనం.
“మూగవాడేమో పాపం,” అన్నాడు ప్రొఫెసర్ పెదవి విరుస్తూ. ఆయన గార్కి బోలెడు భాషలు తెలుసని కాస్త ఇది మరి. ఈ సారి పాపం ఫ్రెంచ్ లో అడిగి చూశాడు.
"Comment appellet-on cette montagne, mon enfant?"

మళ్ళీ అదే నిశ్శబ్దం.
“ఈ సారి ఇటాలియన్ లో అడిగి చూద్దాం.” అంటూ ఇలా అడిగాడు,
“Dove noi siamo?”
“కాస్త చెప్పవూ? ఇప్పుడు మనం ఎక్కడున్నాం?” నేను కూడా ఆత్రంగా అడిగాను.
అయినా సమాధానం లేదు.
“ఏరా? సమాధానం చెప్తవా లేదా?” ఈ సారి చెవి మెలిపెడుతూ  ఇటాలియన్ లోనే మరో మాండలికంలో అడిగాడు మావయ్య,
"Come si noma questa isola?"
స్ట్రోంబోలీ!” ఈ సారి ఠక్కున సమాధానం చెప్పాడు పాపం ఆ పల్లె పిల్లవాడు. మావయ్య తేరుకునేంతలో ఆయన చేతుల్లోంచి జారుకుని అల్లంత దూరంలోని ఆలివ్ చెట్ల వెనుక దాక్కున్నాడు.
స్ట్రోంబోలీ! మేం అసలు కల్లో కూడా ఊహించని విషయం. మేం ఇప్పుడు వున్నది మధ్యధరా సముద్రపు నడిబొడ్డులో. ఎయోలియన్ ద్వీపమాలికలో ఇదొక దీవి అన్నమాట. ఈ ద్వీపమాలికకి ప్రాచీన కాలంలో స్ట్రాంగైల్ అని పేరు. (దీని ఆధునిక పేరు సాంటోరినీ ద్వీపమాలిక – అనువాదకుడు). గ్రీకు పురాణం ప్రకారం ఎయోలస్ అనే వీరుడు ఇక్కడే గాలిని, తుఫానుని గొలుసులతో కట్టేసి, తరువాత బుద్ధి పుట్టినప్పుడు వొదిలేశాడు. అదుగో, దూరాన తూర్పున కనిపిస్తున్న నీలి కొండలే కాలాబ్రియా కొండలు. ఇంకా అల్లంత దూరాన మబ్బులకి మాటేస్తున్న బృహన్నగమే ఎట్నా.
“స్ట్రోంబోలీ! స్ట్రోంబోలీ!” పలవరిస్తున్నట్టుగా నాలో నేనే అనుకున్నాను.
నాతో పాటు మావయ్య, హన్స్ కూడా ఆ దివ్యనామాన్నే కాసేపు ఆనందంగా జపించారు.
మా యాత్ర సమాప్తమయ్యింది. ఒక అగ్నిపర్వతం లోంచి భూగర్భం లోకి దూరి, ఆ స్నెఫెల్ పర్వతం నుండి, ఆ మోడువారిన మంచు భూమి నుండి, ఇంచుమించు రెండు వేల మైళ్ల దూరంలో వున్న మరో జ్వాలాముఖి నోట్లోంచి ఊడి పడ్డాం. ఎన్నో యాదృచ్ఛిక సంఘటనల ఫలితంగా భువి మీద వెలసిన ఈ దివసీమలో వచ్చి పడ్డాం. మరణ తుల్యమైన ఆ భయంకర శీతల లోకం నుండి ఈ అతిసుందరమైన ఇటలీ దేశాన్ని చేరుకున్నాం!
ముగ్గురం ‘ఫల’హారం చేసి, చల్లని నీరు కడుపార తాగి త్వరగా స్ట్రోంబోలీ రేవు చేరుకున్నాం. ఇక్కడికి మేం ఎందుకొచ్చాం, ఎలాగొచ్చాం మొదలైన రహస్యాలన్నీ ఎవరితోనూ పంచుకోదలచుకోలేదు. పడవ మునక వల్ల ఇలా ఒడ్డుకు కొట్టుకొచ్చిన అభాగ్యులం అని పరిచయం చేసుకున్నాం.
దారి పొడుగునా మావయ్య ఏదో సణుగుతూనే వున్నాడు. “మరి ఆ దిక్సూచి! ఏంటి మరి అలా చెప్పింది. అదేమో ఉత్తరానికి చూపించింది. మనమేమో ఇలా దక్షిణానికి వచ్చి చేరాం…”

“నేనో కారణం చెప్పనా,” కాస్త అసహనంగా అన్నాను. “దానికి జబ్బు చేసుంటుంది. ఇప్పుడదంతా ఎందుకు మావయ్యా?”

“అదేంటి ఆలాగంటావు? యోహానియమ్ లో ఆచార్య పీఠాన్ని అలంకరించిన నా బోటి వాడు ఓ మామూలు ఖగోళ రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోవడమా? ఎంత పరాభవం? ఎంత పరాభవం?”
చింకి బట్టలతో, నడుం చుట్టూ ఓ వికారమైన బెల్టుతో, పక్షులు చూసి జడుసుకునే లాంటి ఆకారంతో, ముక్కు కొస మీద ప్రమాదకంగా వేలాడే కళ్లద్దాలతో ప్రతిభ ఉట్టీపడే జర్మను ఖనిజశాస్త్ర ప్రొఫెసర్ మా మావయ్యలో మళ్లీ మూర్తీభవించాడు.
 ఓ గంట తరువాత ముగ్గురం సాన్ విన్సెంజో రేవుని చేరుకున్నాం. హన్స్  కి రావలసిన పదమూడు వారాల జీతభత్యాలు ముట్టాయి. ముగ్గురం ఘాటుగా కరచాలనాలు చేసుకున్నాం.
నాకైతే ఇక ఏడుపు ఒక్కటే తక్కువ. మావయ్య గొంతు కూడా గాద్గదికమయ్యింది.
 ఎప్పుడూ స్నెఫెల్ పర్వతంలా అస్మితంగా ఉండే ఆ వేటగాడి ముఖంలో కూడా ఆ క్షణం ఓ చక్కని చిరునవ్వు ఉషోదయంలా వెల్లివిరిసింది.

(సమాప్తం)


 (పాతాళానికి ప్రయాణం నవల నేటితో సమాప్తం)
0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email