“అవును. సందేహమే
లేదు,” మావయ్య అన్నాడు తన కళ్ళద్దాల్లోంచి నన్ను అదో రకంగా చూస్తూ. భూమి ఉపరితలాన్ని
చేరుకోడానికి ఇంతకన్నా అనువైన మార్గమే కనిపించడం లేదు.”
మావయ్య మాటల
గురించి కాసేపు శ్రద్ధగా అలోచించాను. ఆలోచించి చూస్తే ఆయన చెప్పేది నిజమే ననిపిస్తోంది.
విప్లవాత్మకమైన, అవాస్తవికమైన ఉపాయాలు ఆయన బుర్రలో పుట్టడం ఇది మొదటి సారి కాదు. ఎందుకో
మరి ఈ సారి మాత్రం అయన చెప్పేది నిజం అవుతుందని అనిపిస్తొంది. వింటి నుండి బాణంలా అగ్నిపర్వతం
నడి బొడ్డు లోంచ మేము, మా తెప్ప ఆకాశంలోకి వెళ్ళగక్కబడబోతాం అన్నమాట!
కాలం గడుస్తున్న
కొద్ది మా ఆరోహణ కొనసాగుతూనే వుంది. మా చుట్టూ శబ్దాలు ఇంకా ఇంకా తీవ్రతరం అవుతున్నాయే
తప్ప సద్దుమణిగా సూచనలు కనిపించడం లేదు. మర్త్య ఘడియ అనుకున్నది మా జీవితాల్లోనే ఓ
అమృత ఘడియ కాబోతోందన్న ఆశాభావం మనసంతా అక్రమించుకుంది.
సలసల కాగే నీటి
కెరటం మా తెప్పని ఆగకుండా పైపైకి తీసుకుపోతోంది. ఏదో అగ్నిపర్వతం లోని సొరంగ మార్గంలో
మేము ఎలాగో చిక్కుకున్నాం. మమ్మల్ని అది వాంతి చేసుకునే శుభతరుణం కోసం బిక్కుబిక్కు
మంటూ ఎదురుచూస్తున్నాం.
కేప్ సాక్నుస్సేం
నుండీ కొన్ని వందల కోసులు ఉత్తరంగా కదిలి వచ్చినట్టు వున్నాం. మళ్ళీ ఐస్లాండ్ కిందకి
వచ్చామేమో మరి తెలీదు. హెక్లా మొదలుకొని ఏడు నగరాజాల్లో ఏది మమ్మల్ని వెళ్లగక్కనుందో
తెలియడం లేదు. మరి కాస్త పశ్చిమంగా మరో ఐదొందల కోసుల వ్యాసార్థంలో, అమెరికా ఖండం యొక్క ఉత్తర-తూర్పు కొసలో, ప్రస్తుత అక్షాంశానికి సమాంతరం
అక్షాంశంలో అంత తెలియని కొన్ని అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇక తూర్పు దిశగా చూస్తే
80 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో ఎస్క్ అనబడే మరో
అగ్నిపర్వతం వుంది. యాన్ మాయెన్ దీవి మీద వున్న ఈ అగ్నిపర్వతం (ఆధునిక నార్వే లోని)
స్పిట్జ్‍బెర్గెన్ దీవికి ఎంతో దూరంలో లేదు.
ఆ అగ్నిపర్వతాలలో కొన్నిటి బిలాలు ఎంత విశాలంగ వుంటాయంటే, ఒక్క బుల్లి తెప్ప కాదు గదా,
ఇలాంటి తెప్పలు కుప్పలు తెప్పలుగా ఆ పర్వతాలు అవలీలగా వెళ్లగక్కగలవు!
పాతాళంలోంచి
భూలోకానికి మమ్మల్ని తీసుకుపోయే ఆ నిర్గమ ద్వారం ఇంతకీ ఏ అగ్నిపర్వతంలో వుందో తెలుసుకోవాలని
మాత్రం చాలా ఆత్రంగా వుంది.
ఉదయం అవుతున్న
కొద్ది మా ఆరోహణా వేగం మరింత పుంజుకుంది. వేడిమి కూడా తగ్గకపోగా మరింత హెచ్చయ్యింది.
మమ్మల్ని పైకి తోస్తున్న శక్తి ఎలాంటిదో నెమ్మదిగా అవగతం కాసాగింది. వాతావరణ పీడనానికి
కొన్ని వందల రెట్లు అధిక పీడనం ప్రచండ వేగంతో మమ్మల్ని పైకి నెట్టుకుపోతోంది.
పైకి పోతున్న
కొద్ది వికారమైన కాంతులు మా చుట్టూ గోడల మీద తారాడడం కనిపించింది. అక్కడక్కడ గోడల లోని
నోళ్ళు భుగభుగమని పొగలు కక్కుతున్నాయి. అగ్నికీలలు గంగవెర్రులెత్తి నాట్యం చేసున్నాయి.
“అమ్మో! చూడు
మావయ్యా!” భయంగా మంటల్ని మావయ్యకి చూపించాను.
“అదేం ఫరవాలేదులే,”
మావయ్య ఎపట్లాగే నింపాదిగా అన్నాడు. అవన్నీ గంధకిక ధూమాలు. అగ్నిపర్వతాలలో అతి సహజాలు.”
“కాని అవి మనని
పూర్తిగా కబళిస్తాయేమో.”
“అలాగేం చెయ్యవు.”
“ఉక్కిరిబిక్కిరై
ఊపిరాడక పోతామేమో.”
“అలాగేం కాదంటున్నానా!”
“అలా ఎలా చెప్పగలవు?”
“మనం ప్రయాణ్నిస్తున్న
సొరంగ మార్గం క్రమంగా విశాలమవుతోంది. కనుక పొగలు మనని ఉక్కిరిబిక్కిరి చెయ్యవు. అంతగా
అయితే సకాలంలో ఈ తెప్పని వొదిలేసి ఏ బిలం లోనో దూరి తలదాచుకుందాం.”
“కాని మరి ఈ
వేణ్ణీళ్ళ మాటేమిటి?”
“ఇక నీళ్ళు లేవు
ఏక్సెల్. కావాలంటే చూడు. మన కింద వున్నది ఇప్పుడు లావా చూర్ణం మాత్రమే. ఉపరితలం వద్దకి
మనని మోసుకుపోతున్నది అదే.”
మా తెప్పని మోసి
పట్టుకున్న చూర్ణం లాంటి పదార్థం ఏంటో గాని కుతకుతలాడుతోంది. ఉష్ణోగ్రత 150 వరకు ఉంటుందేమో. నాకైతే చర్మం కాలిపోతోంది. పైకి
వేగంగా కదులున్నాం గనుక సరిపోయింది గాని లేకుంటే
ఈ పాటికి ఉడికిపోయేవాళ్లం.
సుమారు ఉదయం 8 గంటలకి
తెప్ప కదలడం ఆగిపోయింది.
“ఏంటి? విస్ఫోటం
ఆగిపోయిందా?” ఆదుర్దాగా అడిగాను.
“అబ్బ! నువ్వు
ఊరికే కంగారు పడతావు ఏక్సెల్. ఈ నిశ్చల స్థితి ఎంతో సేపు ఉండదని అనిపిస్తోంది. ఇప్పటికి
ఐదు నిముషాలు గడిచాయి. మరో రెండు నిముషాల్లో మళ్లీ కదులుతాం చూడు.”
మావయ్య చెప్పినట్టే
కాసేపట్లో తెప్ప మళ్లీ దాని ఆరోహణ కొనసాగించింది. అలా గజిబిజి గతిలో మరో పది నిముషాలు
పైకి కదిలి మళ్లీ ఆగిపోయింది. అలా ఆగాగి కదిలే కార్యక్రమం ఎన్ని సార్లు జరిగిందో గుర్తులేదు.
అయితే కదిలిన
ప్రతీ సారి ఇంకా ఇంకా బలంగా మా తెప్ప పైకి నెట్టబడుతోంది. అలా జరిగిన ప్రతి సారి ఆ
దెబ్బకి నా గుండె ఆగినంత పనయ్యేది. ఇలాంటి సమయంలో ఆ ఆర్కిటిక్ అతిశీతల తలాల మీదనో హాయిగా
చేరగిలబడితే ఎంత బావుంటుందో? హిమావృతమైన తెల్లని తిన్నెలని ఊహించుకుంటూ ఎటో కలలలో తేలిపోయాను.
కాని ఇంతలో హన్స్ నన్ను జబ్బ పట్టుకుని పక్కకి ఈడ్చకపోయి వుంటే నా తల ఓ రాతి చూరుకి
తగిలి పగిలి వుండేది.
ఆ తరువాత కొన్నిగంటల
పాటు ఏం జరిగిందో అంతా గందరగోళంగా వుంది. ఆ సన్నివేశానికి చెందిన జ్ఞాపకాలన్నీ అస్తవ్యస్తంగా
వున్నాయి. ఎడతెగని విస్ఫోటాలతో మా పరిసరాలు అతలాకుతలం అవుతున్నాయి. చెవులు చిల్లులు
పడేలాంటి చప్పుళ్లతో నేపథ్యం మారుమ్రోగిపోతోంది. ఉవ్వెత్తున ఎగసిపడే అగ్నికీలలు సొరంగం
మొత్తాన్ని కబళిస్తున్నట్టున్నాయి.
ఏ శక్తి మా తెప్పని
ఆఖరి తాపు తన్నిందో తెలీదు గాని, తెప్పతో పాటు దాన్నే నమ్ముకున్న మేం ముగ్గరమూ ఫిరంగి
లోంచి దూసుకొచ్చే గుండులా ఆ అగ్నిపర్వత ముఖం లోంచి గాల్లోకి దూసుకుపోయాము.
(నలభై మూడవ అధ్యాయం సమాప్తం)
0 comments