ఆ క్షణం నన్ను
మా మావయ్య పూనినట్టు ఉన్నాడు. మనసు లోతుల్లోంచి తన్నుకొస్తున్న మాటల్ని గడగడా వెళ్లగక్కేశాను.
ఆ క్షణం గతాన్ని నా మనసు లోంచి పూర్తిగా తుడిచిపెట్టేశాను.
ఏ ప్రపంచపు లోతుల్లోనైతే మేమిలా తడుముకుంటూ, తొట్రుబడుతూ కొట్టుమిట్టాడుతున్నామో, ఆ
ప్రపంచం యొక్క ఉపరితలం మీద వుండే విషయాలు – నగరాలు, నగాలు, నదులు మొదలైన వేవీ ఆ క్షణం
గుర్తుకు రాలేదు. మనసంతా భవిష్యత్తు మీదే వుంది. మేం ఛేదించగోరుతున్న పాతాళరహస్యాల
మీదే వుంది. మా దారికి అడ్డుగా దాపురించిన ఈ మొండి బండ మీదే వుంది.
“ఈ గొడ్డళ్ళు
పట్టుకుని పన్లోకి దిగుదాం పద మరి,” అన్నాడు మావయ్య.
“గొడ్డళ్ళతో పనెలా అవుతుంది మావయ్యా,” తల అడ్డుగా ఊపుతూ అన్నాను.
“పోనీ పలుగులు
వాడితే.”
“అయినా కూడా
చాలా సేపు పడుతుంది.”
“మరైతే ఎలా?”
“ఏవుంది? మందు
పాతర వుందిగా? ఈ బండని పిండి చెయ్యొచ్చు.”
“అవును. మందు
పాతరకి లొంగనంత పెద్ద బండేం కాదు.”
“పద హన్స్! ఇది
నీకే సాధ్యం,” హన్స్ ని ఉత్తేజపరుస్తూ అన్నాడు మావయ్య.
అంతవరకు మా తెప్ప
వద్ద కావలి కాస్తున్న హన్స్ చేత్తో గునపంతో, కాస్త మందు పాతరతో మా వద్దకి వచ్చాడు.
బండ కింద ఓ లోతైన కన్నం చేసి అందులో మందు పాతర దట్టించాడు.
“ఇది చాలేమో
కదా?” అడిగాను.
“అవును చాలనుకుంటా,”
ఒప్పుకుంటూ అన్నాడు మావయ్య.
అర్థరాత్రి కల్లా
మా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మందుపాతర లోంచి ఓ పొడవాటి వత్తి పైకి వచ్చేలా ఏర్పాటు అయ్యింది.
ఆ వత్తిని అంటిస్తే చాలు పని పూర్తవుతుంది.
“ఇక మిగతా పని
రేపు చేద్దాం,” అన్నాడు మావయ్య.
ఇక విధిలేక మరో
ఆరు గంటలు ఎదురు చూడడానికే సిద్ధపడ్డాను.
(ఇంకా వుంది)
(నలభయ్యవ అధ్యాయం
సమాప్తం)
0 comments