శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

అన్య ప్రజ్ఞతో ప్రథమ సమాగమం

Posted by V Srinivasa Chakravarthy Sunday, June 15, 2014
ట్రాన్స్‍పోర్టర్ ని పై నుండి కింద పడేయగానే అందులో ప్రయాణిస్తున్న ఎల్లీకి తానో సొరంగంలో పడిపోయిన అనుభూతి కలుగుతుంది. ఆ సొరంగంలో తను జర్రున జారుతూ ప్రచండ వేగంతో కదులుతున్నట్టు అనిపిస్తుంది. మెలికలు తిరుగుతూ అంతరిక్షంలో విస్తరించి వున్న ఆ సొరంగం ఎటు పోతోందో, తనను ఎటు తీసుకుపోతోందో అర్థం కాదు. తనకు కలుగుతున్న అనుభూతులని తన మౌత్ పీస్ లో చెప్తూ రికార్డ్ చేసుకోడానికి ప్రయత్నిస్తుంది.


అలా ఎన్ని నిముషాలు, గంటలు ప్రయాణించిందో తెలియదు. ఉన్నట్టుండి ఒక చోట ఉక్కిరిబిక్కిరి చేసే ఆ చలనం ఆగిపోతుంది. తను ఎక్కడో అంతరిక్షంలో తేలుతున్నట్టు అనిపిస్తుంది. ఎదుట కనిపించిన దృశ్యానికి తనకి నోట మాటరాదు. ఆ అందాన్ని చూడడానికి రెండు కళ్లు చాలవు. ఎదుట ఓ ప్రకాశవంతమైన గెలాక్సీ! మామూలుగా టెలిస్కోప్ ల నుండి సుదూర గెలాక్సీలని పరిశీలించి వాటి ఆకారాలని అందంగా చిత్రీకరిస్తారు. కాని ఇక్కడ తను కళ్లార ఓ అద్భుతమైన ‘స్పైరల్ గెలాక్సీ’ ని చూడగలుగుతోంది. అలాంటి  అనుభూతి పొందిన మొదటి మనిషి తనే. ‘అబ్బ! ఇంత అందాన్ని వర్ణించడానికి నాకే గాని కవిత్వం వస్తే ఎంత బావుంటుంది!’  అనుకుంటుంది మనసులో. మరు క్షణం మళ్ళీ ఆ ఉధృతమైన చలనం మొదలవుతుంది. సొరంగంలో ఎటో కొట్టుకుపోవడం మొదలెడుతుంది.

మళ్ళీ ఓ సారి ప్రయాణం ఒక చోట ఆగుతుంది. కింద చూస్తే ఏదో గ్రహం యొక్క ఉపరితలం మీద బోలెడు సన్నని కాంతులు కనిపిస్తాయి. అదేదో నగరం కాబోలు అనుకుంటుంది. నాగరికతకి చిహ్నం… అలా అనుకునేంతలో మళ్ళీ ప్రయాణం కొనసాగుతుంది.

అలా ఎంతో సేపు ప్రచండ వేగంతో దిక్కు తెన్ను తెలియకుండా ఆ సొరంగంలో  ప్రయాణిస్తుంది. మళ్లీ ఉన్నట్లుండి ఒక చోట చలనం ఆగుతుంది. ఆ కుదుపుకి అంతవరకు నిద్రలో జోగుతున్న తను ఉలిక్కిపడి లేస్తుంది. ఆ క్షణం తను చీకటి ఆకాశంలో నిశ్చలంగా ఒక చోట నిలిచి వుంటుంది. కింద కొంత దూరంలో ఏదో గ్రహం యొక్క ఉపరితలం లాంటిది కనిపిస్తుంది. మెల్లగా ఏదో శక్తి తనని మోస్తున్నట్టు కిందకి దిగుతుంది లేదా దింపబడుతుంది.

అదో సముద్ర తీరంలా వుంటుంది. దూరంగా అంతా చీకటి గా వున్నా సముద్ర తీరం మాత్రం ఏదో చిత్రమైన కాంతితో ప్రకాశిస్తుంటుంది. ఆకాశంలో దూరంలో సన్నని కాంతితో ఇద్దరు సూర్యుళ్లు ప్రకాశిస్తుంటారు. నల్లని తెర మీద వజ్రాలు పొదిగినట్టు పైన తారలు తీక్షణమైన కాంతితో మెరిసిపోతుంటాయి. ఒక విధమైన అలౌకిక సౌందర్యం ఆ ప్రాంతం అంతటా పొటమరిస్తుంటుంది.

కాసేపు ఆ పరిసరాలని తేరిపార చూశాక ఎందుకో ఆ ప్రదేశం కాస్త అవాస్తవికంగా తోస్తుంది ఎల్లీ కి. చేయి చాచి చూస్తుంది. ఆ చేయి దేనికో తగిలి చుట్టూ ఉండే దృశ్యం రాయి విసిరిన నీట్లోని ప్రతిబింబం చెదిరిపోయినట్టుగా విచిత్రంగా చెదిరిపోవడం కనిపిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది తనకి. తను చూస్తున్న పరిసరాలు యదార్థం కాదు. అదొక కృతక యదార్థం (virtual reality).

అంతలో అల్లంత దూరంలో తీరం మీద నడుచుకు వస్తూ ఓ ఆకారం కనిపిస్తుంది. ముందు అలుక్కుపోయినట్టుగా, మసక మసకగా వున్న ఆ ఆకారం దగ్గర అవుతున్న కొద్ది మరింత స్పష్టం అవుతూ వస్తుంది. ఆ ఆకారం దగ్గరికి వచ్చాక అదెవరో చూసి అదిరిపోతుంది! అది మరెవరో కాదు. తన తండ్రి! ఎప్పుడో తన చిన్న తనంలో చనిపోయిన తండ్రి!


వెంటనే ఏదో ఆలోచన వచ్చి ఆ వ్యక్తిని తాకి చూస్తుంది. ఇందాక పరిసరాల లాగానే ఆ ఆకారం కూడా చెదిరిపోవడం కనిపిస్తుంది. తన తండ్రి ని పోలిన ఆ ఆకారం కూడా నిజం కాదు!

ఎల్లీ మనసు నిండా కోటి ప్రశ్నలు వున్నాయి. ఏంటి ఇదంతా? అసలు ఎవరు మీరు?  ఆ సందేశం ఎందుకు పంపారు? మా చేత ఈ యాత్ర చెయ్యించడంలో మీ ఉద్దేశం ఏంటి?
ఆ తండ్రి లాంటి ఆకారం చెప్పుకొస్తుంది.

“మీ దగ్గర్నుండి సందేశం (జర్మన్ ఒలింపిక్స్ సందర్భంలో హిట్లర్ టీవీ ఉపన్యాసం) అందగానే మీ ఉన్కి గురించి తెలిసింది. మా ఉన్కిని తెలపడం కోసం దాన్ని రికార్డ్ చేసి తిరిగి మీకు పంపాము. దాంతో పాటు ఈ యాత్ర చెయ్యడానికి కావలసిన సమాచారం పంపాం.”
ఎల్లీ ఆ సొరంగాల గురించి అడుగుతుంది. “అవన్నీ మీరే నిర్మించారా?”
“లేదు. అవి ఎప్పట్నుంచో వున్నాయి. మేం వాటిని కనుక్కుని వాటిని వాడుకుంటూ వుంటాము.”
“ఈ పరిసరాలు, ఇవన్నీ కృతకం కదా. ఇవేవీ నిజం కావుగా?”
“అవును. నీతో సంభాషించడం కొసం, నీకు మరింత అనువుగా ఉండడం కొసం ఇలా చేశాం. ఈ తీరం, ఈ చెట్లు, నేను – ఇవేవీ నిజం కావు. ఇవన్నీ ఓ  కృతక యదార్థం లో మేం చేసిన సృజన మాత్రమే.”
“మరి మా నాన్నగారి గురించి మీ కెలా తెలుసు?”
“నువ్వు ట్రాన్స్‍పోర్టర్ లో ప్రయాణిస్తున్నప్పుడు నీ మెదడులోని స్మృతులని మేం డౌన్ లోడ్ చేసుకున్నాం. ఆ విధంగా నువ్వు మాట్లాడే భాష గురీంచి, నీ అయిన వాళ్ల గురించి, నువ్వు చిన్నప్పుడు పెరిగిన పరిసరాల గురించి తెలుసుకున్నాం. కనుక ఆ రీతిలో నీతో సంభాషణ జరపాలని నిశ్చయించాం. ఎందుకంటే మేం మేముగా నీ ముందుకు వస్తే నువ్వు ఇబ్బంది పడతావు. మా భాషలో నీతో మాట్లాడితే నువ్వు అర్థం చేసుకోలేవు. కనుక మరో గత్యంతరం కనిపించలేదు మాకు.”

ఎల్లీ కాసేపు ఏమీ మాట్లాడదు. జరుగుతున్న అనుభవాలని జీర్ణం చేసుకోడానికి తనకి కష్టంగా వుంది. పైగా ఇన్నేళ్ళ తరువాత తనకి అత్యంత ప్రియమైన తండ్రి ఇలా తనకి తారసపడడం… ఆ వ్యక్తి నిజం కాదని తెలిసినా, అదో యాంత్రికమైన కల్పన అని తెలిసినా, తనలో భావావేశం కట్టలు తెంచుకుంటుంది.

ఇంతలో ఆ తండ్రి లాంటి ఆకారం వీడ్కోలు చెప్తుంది. ఇక తిరుగు ప్రయాణానికి వేళయ్యింది అంటుంది.
కాని ఎల్లీ వెంటనే వెళ్లిపోవడానికి సిద్ధంగా లేదు. ఇంకా ఎన్నో సందేహాలు. వాటన్నిటికీ సమాధానాలు రాబట్టాలి. బోలెడంత కొత్త పరిజ్ఞానంతో తిరిగి వెళ్లాలి. తనని నమ్మి ఇంత వ్యయప్రయాసలతో కూడుకున్న యాత్ర మీద తనని పంపినందుకు మానవాళికి న్యాయం చెయ్యాలి.

“ప్రగతి ఎప్పుడూ చిన్న చిన్న అడుగులతోనే సాధ్యం అవుతుంది,” అంటుందా ఆకారం. “ఈ సారికి ఇంతకు మించి సాధ్యం  కాదు.”
“మళ్లీ ఎప్పుడు?” అడుగుతుంది ఎల్లీ.
“ఏమో చెప్పలేను,” అంటాడు చిరునవ్వు నవ్వుతూ ఆ వ్యక్తి వీడ్కోలు చెప్తాడు.
చుట్టూ పరిసరాలు క్రమంగా ఓ కలలాగా కరిగిపోవడం మొదలెడతాయి. తారలు ధూళిలా రాలి పడిపోతుంటాయి. గాలిలో ఊగుతున్న తాళ వృక్షాలు చీకట్లో నీశ్శబ్దంగా కరిగిపోతుంటాయి.
తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
(ఇంకా వుంది)



2 comments

  1. Anonymous Says:
  2. ఒక విధమైన అలౌకిక సౌందర్యం ఆ ప్రాంతం అంతటా పొటమరిస్తుంటుంది.
    తెలుగులోనికి మీరు చేస్తున్న అనువాదం అనితర సాధ్యంగా అనిపిస్తున్నది గురూజీ!.
    చాలా చాలా బాగున్నది.మీరు వాడుతున్న భాష,చిన్న చిన్న వర్ణనలు అహో!,అద్భుతః !

     
  3. Thank you anonymous garu!

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts