పాతాళ లోకపు
చీకటి కూపాల్లో ఇంతకాలం కొట్టుమిట్టాడిన మేము ఇలాంటి దృశ్యం చూడడానికి కళ్ళు కాయలు
కాచి వున్నాము.
“ఎక్కడున్నాం
మనం? అసలెక్కడ ఇదంతా?” పరధ్యానంగా గొణుగుతున్నట్టుగా అడిగాను.
హన్స్ కేసి తిరిగి
చూశాను, ఏవంటాడా అని. నిర్లక్ష్యంగా కళ్ళు మూసుకుని పడుకుని వున్నాడు.
మావయ్య మాత్రం
ఆశ్చర్యంగా కళ్ళింత చేసుకుని పరిసరాలని చూస్తున్నాడు.
“ఈ పర్వతం పేరు
ఏవైనా కావచ్చు. కాని ఇక్కడ చాలా వేడిగా వుంది. పర్వతంలో విస్ఫోటాలు ఇంకా కొనసాగుతూనే
వున్నాయి. ఇంతా శ్రమ పడి అగ్నిపర్వతం లోంచి బయట పడ్డాక ఏ బెడ్డో నెత్తిన పడి పోవడంలో
అర్థం లేదు. కనుక వీలైనంత వేగంగా ఈ ప్రదేశం నుండి తప్పుకుంటే మంచిది. పైగా నాలుక పిడచకట్టుకు
పోతోంది. కడుపులో అగ్నిపర్వతాలు పేలుతున్నాయి,” మావయ్య తన తీర్మానం వెల్లడి చేశాడు.
చూడబోతే మావయ్య
ఇక్కడే కూర్చుని ఈ ప్రకృతి ఆస్వాదించే స్థితిలో లేడు. నేనైతే తిండి తిప్పలు లేకుండా
మరో రెండు గంటలైనా ఇక్కడే కూర్చుని ఈ దృశ్యాన్ని కన్నార్పకుండా చూసేయగలను. కాని ఏం
చేస్తాం? నలుగురితో నారాయణ…
మేం వున్న పర్వతం
వాలు అంత తక్కువేం లేదు. కిందకి దిగడానికి నానా తిప్పలూ పడ్డాం. కొన్ని చోట్ల బూడిద
దిబ్బల మీద జర్రున జారాం. మరి కొన్ని చోట్ల జ్వాలామయ సర్పాల్లా నెమ్మదిగా మాకు అల్లంత
దూరంలో పాకుతూ ముందుకు పోయే లావా సెలయేళ్లని ఒడుపుగా తప్పించుకుంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని
ముందుకి సాగిపోయాం. దారి పొడవునా మరి నేనైతా ఏవో తలా తోకా లేని ప్రశ్నలతో మా నేస్తాలు
ఇద్దరినీ తెగ వేధించానట. తరువాత తెలిసింది.
వాళ్ల దగ్గర్నుండి
తృప్తికరమైన సమాధానాలు రాకపోయే సరికి ఇక నేనే చెప్పేశాను.
“మనం వున్నది
ఆశియాలో. ఇండియా తీరం మీద వున్నాం. లేదా మలయా దీవుల మీద ఎక్కడో వుండి వుంటాం. అదీ గాక
పోతే పసిఫిక్ మహా సముద్రం నడిబొడ్డులో వుండే చిట్టి పొట్టి దీవుల మీద ఎక్కడైనా వున్నామేమో.”
నా ఊహలు అదుపు తప్పాయి. “మనం భూమి కేంద్రం
వరకు పోయి, అవతలి పక్క, అంటే అవతలి ధృవం వద్ద బయటికి వచ్చామనుకుంటా.”
“మరి దిక్సూచి
మాటేవిటి?” మావయ్య నింపాదిగా అడిగాడు.
“అవును కదూ!”
గుర్తు తెచ్చుకుంటూ అన్నాను. “దిక్సూచి ఏదో చెప్పింది నిజమే. దాని ప్రకారం మనం ఉత్తరంగా
వెళ్లాం.”
“మరి అది చెప్పింది
అబద్ధం అంటావా?” మావయ్య అడిగాడు.
“ససేమిరా కాదు.
పాపం అదెందుకు అబద్ధం చెప్తుందీ?”
“పోనీ ఇది ఉత్తర
ధృవం అంటావా?”
“ఇది ధృవం అని
మాత్రం అనను. దీనికి ధృవానికి ఉండాల్సిన లక్షణాలేవీ లేవు.”
ఎంత ఆలోచించినా
ఎక్కడున్నామో పట్టుపడడం లేదు. ఏం అనలేక ఇక నోరు మూసుకున్నాను.
మేం అలా నడుస్తూ
ముందుకి సాగిపోతుంటే ఒక చోట ఓ పచ్చని పరిసరాలలోకి ప్రవేశీంచాం. అందులోకి ప్రవేశించగానే
నా ఆకాలి, దాహం ఒకే సారి లోపలి నుండి తన్నుకొచ్చాయి. చుట్టూ ఆలివ్, దానిమ్మ, ద్రాక్ష
మొదలైన చెట్లు నోరూరిస్తున్నాయి. కోసుకోమని, దోచుకోమని ఆహ్వానిస్తున్నాయి. మేం అదే
చేశాం. ద్రాక్ష గుత్తుల్ని కోసుకుని మెత్తగా నోట్లోకి తోసుకుని ఆరగిస్తుంటే … పాతాళ
లోకం లోంచి సూటిగా స్వర్గ లోకం లోకి వచ్చినట్టు అనిపించింది! అల్లంత దూరంలో స్వచ్ఛమైన
నీరు నీట్లోంచి ఉబుకుతోంది. ఆత్రంగా వెళ్లి అక్కడ ముఖం, కాళ్లు, చేతులు కడుక్కున్నాం.
అలా మాకు చేతనైన
మేరకు ఏవో ఐహిక సుఖాలు అనుభవిస్తుంటే అంతలో ఆలివ్ చెట్ల మాటు నుండి ఓ చిన్న పిల్లవాడు
బయటికి వచ్చాడు.
0 comments